.
అప్పుడెప్పుడో వచ్చిన ప్రేమఖైదీ సినిమా గుర్తుందా..? అందులో మాలశ్రీ కథానాయిక… చాలా తెలుగు సినిమాలు చేసింది కూడా… ఇప్పుడేం చేస్తోంది..? కన్నడ చిత్రసీమలో తిరుగులేని ‘యాక్షన్ క్వీన్’గా, ‘కనసిన రాణి’ (కలల రాణి)గా వెలిగిన మాలశ్రీ జీవితం కూడా ఒక సినిమా కథే… ఎన్నో కష్టాలు, వ్యక్తిగత విషాదాలు ఎదురైనా… వాటన్నింటినీ తట్టుకుని నిలబడింది… ఓసారి ఆమె కథలోకి వెళ్దాం…
యాక్షన్ క్వీన్ మాలశ్రీ: కన్నీళ్లను దాటి… కూతురిని గెలిపించి… సినిమా తెరపై రౌడీలను రక్తం వచ్చేలా కొడుతూ థియేటర్లలో ఈలలు వేయించిన ‘లేడీ బాస్’ ఆమె. కానీ, నిజ జీవితం ఆమెపై అంతకంటే పెద్ద దెబ్బలే తీసింది. ఒకే ఏడాది 20 సినిమాలు చేసి రికార్డు సృష్టించిన ఆమె… జీవితం ఇచ్చిన కష్టాలను ఒంటరిగా ఎదుర్కొని, ఈరోజు ఒక తల్లిగా గెలిచి నిలిచింది…
Ads
బాల్యం నుంచే మొదలైన పోరాటం… మాలశ్రీ జీవితంలో పోరాటం పుట్టుకతోనే మొదలైంది. ఆమె కడుపులో ఉండగానే తల్లిదండ్రులు విడిపోవడంతో పెద్దమ్మ, పెద్దనాన్నల పెంపకంలో పెరిగింది… నాలుగు నెలల వయసులోనే ‘మహానటి’ సావిత్రి చిత్రంలో బాలనటిగా కెమెరా ముందుకు వచ్చిన ఆమె, ఆ తర్వాత శ్రీదుర్గ అనే పేరుతో దాదాపు 35 సినిమాల్లో బాలనటిగా నటించింది… తెలుగులో నాగార్జున ‘చినబాబు’, వెంకటేష్ ‘వారసుడొచ్చాడు’ వంటి చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా మెప్పించింది….
తెలుగు ప్రేక్షకులను మురిపించిన ‘నీలిమ’ … 1989లో కన్నడ చిత్రం ‘నంజుండి కళ్యాణ’తో కేవలం 15 ఏళ్ల వయసులోనే హీరోయిన్‌గా మారి సంచలన విజయం అందుకుంది. కన్నడనాట స్టార్ డమ్ వస్తున్న తరుణంలోనే, 1990లో తెలుగులో వచ్చిన ‘ప్రేమ ఖైదీ’ సినిమా మాలశ్రీ కెరీర్‌ను మలుపు తిప్పింది. హరీష్ హీరోగా వచ్చిన ఈ చిత్రంలో ‘నీలిమ’గా ఆమె పండించిన నటన, అమాయకత్వం తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసాయి. ఆ సినిమా ఘనవిజయం సాధించడంతో టాలీవుడ్‌లో ఆమె మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయారు.
ఆ తర్వాత సుమన్ సరసన ఆమె చేసిన కాంబినేషన్ టాలీవుడ్‌లో ఒక క్రేజీ హిట్టు కాంబినేషన్‌గా నిలిచింది. ఒకే ఏడాది 14 తెలుగు సినిమాల్లో నటించి ఇక్కడి స్టార్ హీరోలందరికీ మోస్ట్ లక్కీ హీరోయిన్‌గా మారింది. బాలకృష్ణతో ‘బావ బావమరిది’, వెంకటేష్‌తో ‘సాహసవీరుడు సాగరకన్య’ లాంటి ఘనవిజయాలు మాలశ్రీని తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలబెట్టాయి.
జీవితాన్ని ముంచేసిన వరుస విషాదాలు … సినిమాల్లో విజయాల శిఖరాగ్రాన ఉన్నప్పుడే ఆమె జీవితంలో మొదటి విషాదం ఎదురైంది. తనతో కలిసి నటించిన నటుడు సునీల్‌ను ఆమె ప్రేమించింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకుంటున్న తరుణంలో, 1994లో హైదరాబాద్‌లో జరిగిన ఘోర కారు ప్రమాదంలో సునీల్ కన్నుమూశాడు. ఆ ప్రమాదంలో మాలశ్రీ ప్రాణాలతో బయటపడినా, మనసు నిండా కోలుకోలేని గాయమైంది.
ఆ బాధ నుంచి కోలుకుని, కన్నడ చిత్రసీమలో కోట్లాది మందికి ఆరాధ్య దైవంగా, విజయశాంతి తరహాలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. ఆ సమయంలోనే ప్రముఖ కన్నడ నిర్మాత రాముతో పరిచయం ప్రేమగా మారి, ఇద్దరూ వివాహం చేసుకున్నారు. ఇద్దరు పిల్లలతో వారి సంసార జీవితం సాఫీగా సాగుతున్న సమయంలో.. 2021 ఏప్రిల్‌లో కరోనా మహమ్మారి రూపంలో మరో విషాదం ఆమెను తాకింది. భర్త రాము అకాల మరణంతో మాలశ్రీ ఒక్కసారిగా ఒంటరిదైపోయింది.

కూతురే ప్రపంచంగా.. సరికొత్త ప్రయాణం! … భర్త మరణం ఆమెను కుంగదీసినా, తన పిల్లల భవిష్యత్తు కోసం ఆమె కన్నీళ్లను తుడుచుకుని ధైర్యంగా నిలబడింది. నటిగా తన వారసత్వాన్ని అందిపుచ్చుకున్న కుమార్తె ఆరాధన రామ్ (అనన్య)ను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసే బాధ్యతను భుజాన వేసుకుంది. తల్లిగా, ఒక గైడ్‌గా ఆరాధనకు నటన, డాన్స్ వంటి అంశాల్లో శిక్షణ ఇప్పించి వెన్నంటి నిలిచింది.
ఆమె కష్టానికి ప్రతిఫలంగా.. ఆరాధన 2023లో కన్నడ స్టార్ హీరో దర్శన్ సరసన ‘కాటేరా’ (Kaatera) చిత్రంతో డ్రీమ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్ సాధించడమే కాకుండా, ఆరాధనకు ఉత్తమ తొలిచిత్ర నటిగా ప్రతిష్టాత్మక సైమా (SIIMA) అవార్డును తెచ్చిపెట్టింది. కూతురు స్టేజ్ ఎక్కి అవార్డు అందుకుంటుంటే ఆ తల్లి కళ్లలో ఆనందబాష్పాలు.
నేటి తరం సరికొత్త సంచలనం …. ఆరాధన ప్రస్తుతం తన రెండవ చిత్రంగా కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర సరసన ‘నెక్స్ట్ లెవెల్’ (Next Level) అనే భారీ పాన్-ఇండియా చిత్రంలో నటిస్తోంది. మరోవైపు మాలశ్రీ కూడా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తూ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా బిజీ అవుతోంది… సినిమా స్క్రీన్‌పైనే కాదు, విధి ఎదురుతిరిగిన ప్రతిసారీ ఎదురొడ్డి పోరాడిన నిజ జీవిత ‘యాక్షన్ క్వీన్’ మాలశ్రీ.

Share this Article