Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Saving Syndrome..! ఇదొక జబ్బు… పొదుపు చేసీ, చేసీ… ఆరిపోవడం…!!

May 19, 2026 by M S R

.

“స్విచ్ ఫెయిల్యూర్!” — సంపాదన గురికుదిరింది… కానీ, సుఖపడడమే మర్చిపోయాం! నిన్న రాత్రి మా వీధి చివర ఉండే గౌడ్ గారు (నిజానికి ఆయన పేరు ఏదైనా కావచ్చు… మీ నాన్న, మా బాబాయ్, లేదా పక్కింటి రిటైర్డ్ మేనేజర్ కావచ్చు) ఉక్కపోత భరించలేక, చెమటలు కక్కుతూ నిద్రలేచాడు. మే నెల మండుటెండలు… గదిలో బ్రాండెడ్ ఏసీ ఉంది. రిమోట్ పక్కనే ఉంది. కానీ, ఆయన కేవలం ఒక గంట మాత్రమే ఏసీ నడిపి కట్టేశాడు. కారణం అడిగితే — “కరెంట్ బిల్లు దండగ కదా బాబూ!” అని నవ్వేశాడు.

ఇదేనండీ ఈ తరం భారతీయ రిటైర్డ్ వ్యక్తుల అసలు సిసలైన కథ. బ్యాంకు ఖాతాల్లో చూస్తే కోట్లు ఉంటాయి… కానీ, ఇంట్లో ఏసీ వేసుకోవడానికి గుండె చాలదు. ఆస్తుల్లో వీరు మహారాజులు, కానీ జీవనశైలిలో మాత్రం ఇప్పటికీ పేదవాళ్లే. ఫైనాన్షియల్ సైకాలజీలో దీనినే “స్విచ్ ఫెయిల్యూర్” (డబ్బున్నా ఖర్చు చేయలేని మానసిక స్థితి) అంటారు…

Ads

ఆ ‘సేవింగ్’ స్విచ్ తుప్పుపట్టిపోయింది!

గౌడ్ లాంటి వాళ్ల చిన్నతనం ఎలా గడిచిందో ఒక్కసారి గుర్తుచేసుకోండి. రేషన్ కార్డు కోసం క్యూలు, ల్యాండ్‌లైన్ ఫోన్ కోసం ఏళ్ల తరబడి నిరీక్షణ, ఒక బజాజ్ చేతక్ స్కూటర్ కోసం ఐదేళ్ల వెయిటింగ్ లిస్ట్… ఇదీ వారి ప్రపంచం. అలాంటి కొరతల దేశంలో పెరిగిన వారికి ‘ఉద్యోగ భద్రత, పొదుపు’ అనేవి కేవలం అలవాట్లు కావు, జీవిత పోరాటంలో మనుగడ సాగించడానికి వాడిన ఆయుధాలు.

నాలుగు దశాబ్దాల పాటు ఒకే చొక్కాను కాలర్ అరిగేదాకా వేసుకున్నారు. ఆటో చార్జ్ మిగిల్చేందుకు కిలోమీటర్ల కొద్దీ నడిచారు. పిల్లల చదువులు, పెళ్లిళ్ల కోసం తమ సుఖాలను త్యాగం చేశారు.

ఫలితం? 68 ఏళ్ల వయసులో ఈరోజు ఆయనకు అప్పుల్లేని ఇల్లుంది, ₹3 కోట్లకు పైగా ఎఫ్‌డీలు, మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. ఆర్థికంగా ఆయన విజేత!

కానీ, 40 ఏళ్లుగా మెదడులో గట్టిగా ఆన్ చేసి ఉన్న ఆ “పొదుపు” (Save) అనే స్విచ్, ఇప్పుడు రిటైర్ అయ్యాక “ఖర్చు చేయి” (Spend) అని చెప్తున్నా మారడం లేదు. అది అక్కడే జామ్ అయిపోయింది!


మన కళ్లముందే కనిపిస్తున్న కొన్ని ‘లక్షణాలు’… మన చుట్టూ ఉన్న పెద్దవాళ్లలో ఈ స్విచ్ ఫెయిల్యూర్ ఎలా కనిపిస్తుందో తెలుసా?

  • ఎఫ్‌డీ వడ్డీ ఉచ్చు…: బ్యాంకులో కోట్లు ఉన్నా, కేవలం నెలకు వచ్చే వడ్డీతోనే ఇల్లు గడవాలనుకుంటారు. అసలు మొత్తాన్ని (Principal) ముట్టుకుంటే ఏదో మహాపాపం చేసినట్టు, చేజేతులా చెట్టును నరికేస్తున్నట్టు భయపడిపోతారు.

  • వైద్యానికి కూడా వెనుకంజ..: మోకాళ్లు అరిగిపోయి నడవలేకపోతున్నా, కంటికి పొరలు వచ్చినా… “ఇప్పుడేం అర్జంట్ లేదమ్మా, మేనేజ్ చేయొచ్చు” అంటూ లక్షల ఖర్చుకు భయపడి ఆపరేషన్లు వాయిదా వేసుకుంటారు.

  • కష్టాల ప్రయాణం…: జేబులో డబ్బున్నా, 70 ఏళ్ల వయసులో కూడా ఏసీ కోచ్ వద్దు అనుకుని, కిటికీ గుండా వచ్చే డస్ట్ భరిస్తూ స్లీపర్ క్లాస్‌లోనే ప్రయాణిస్తారు.

  • వారసత్వ భారం…: “ఈ డబ్బు మనకు కాదు, రేపు పిల్లలకివ్వాలి” అని తాము పస్తులుండి, ఇప్పటికే సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలతో సెటిల్ అయిన పిల్లల కోసం కోట్లు దాచిపెడతారు.


అసలు భయం: “నేను ఎక్కువ కాలం బతికేస్తే…. ఖర్చు చేయకపోవడానికి వెనుక ఒక పెద్ద సైకాలజీ ఉంది. రూపాయి విలువ పడిపోవడం వీరు కళ్లారా చూశారు. ఒకప్పుడు వంద రూపాయలు ఉంటే వారం గడిచేది, ఇప్పుడు వెయ్యి రూపాయలు పెట్టినా సంచి నిండడం లేదు.

ఈ ద్రవ్యోల్బణాన్ని చూసి వారికి ఒకటే భయం — “ఒకవేళ నేను 90 ఏళ్లు బతికితే? అప్పటికి ఈ 3 కోట్లు సరిపోతాయా? హాస్పిటల్ ఖర్చులు పెరిగిపోతే పరిస్థితి ఏంటి?”

ఈ అతి జాగ్రత్త వల్ల వారు ‘అత్యంత దారుణమైన భవిష్యత్తు’ కోసం సిద్ధపడతారు కానీ, చేతిలో ఉన్న ‘అద్భుతమైన వర్తమానాన్ని’ పూర్తిగా నలిపేసుకుంటారు.


చివరి దృశ్యం: స్మశానంలో అత్యంత ధనవంతుడు! … ఈ కథకు ముగింపు చాలా విషాదంగా ఉంటుంది. కష్టపడే వయసులో సుఖాలన్నీ వదిలేశారు. తీరా అనుభవించే వయసొచ్చేసరికి చేతిలో డబ్బుంది కానీ, అనుభవించే మనసు లేదు, శరీరం సహకరించదు.

చివరికి ఏమవుతుంది? వారు కన్నుమూసాక పెద్ద బ్యాంకు బ్యాలెన్స్‌లు, ఎప్పుడూ వేసుకోని పట్టుచీరలు, లాకర్లలో మురిగిపోయిన బంగారం, ఖాళీ ఇళ్లు మిగులుతాయి. పిల్లలు తమకు అవసరం లేకపోయినా ఆ ఆస్తిని పంచుకుంటారు. కానీ ఆ తల్లిదండ్రులు మాత్రం జీవితంలో ఏ ఆనందాన్నీ రుచి చూడకుండానే వెళ్లిపోతారు.


ఆ స్విచ్‌ను మార్చడం ఎలా?…. పెద్దలారా… మారాల్సింది మీ బ్యాంకు అకౌంట్ కాదు, మీ ఆలోచనా విధానం. ఈ చిన్న మార్పులు చేసి చూడండి…:

  1. ఒక ‘లగ్జరీ’ బకెట్ పెట్టండి…: మీ సంపాదనలో కొంత భాగాన్ని కేవలం ఎంజాయ్ చేయడానికి మాత్రమే కేటాయించండి… ఆ డబ్బును టూర్లకో, మంచి బట్టలకో, హోటల్‌కో ఖర్చు పెట్టాల్సిందే… ఖర్చు చేయకపోతే పెనాల్టీ అనుకోండి..!

  2. పిల్లల గురించిన భ్రమలు వీడండి..: మీ పిల్లలు చదువుకుని స్థిరపడ్డారు. వారికి మీ ఆస్తి కంటే, మీరు ఆరోగ్యంగా, సంతోషంగా బతకడమే పెద్ద బహుమతి…

  3. ఆరోగ్యమే మహాభాగ్యం..: మీ శరీరం కోసం ఖర్చు పెట్టడానికి అస్సలు వెనకాడకండి. మంచి బెడ్, మంచి ఏసీ, అవసరమైన వైద్యం… ఇవి విలాసాలు కావు, మీ హక్కు.


డబ్బు అనేది నిల్వ ఉంచాల్సిన వస్తువు కాదు… అది ఒక శక్తి! మీరు 40 ఏళ్ల పాటు రక్తాన్ని చెమటగా మార్చి ఆ శక్తిని కూడబెట్టారు. ఆ శక్తిని ఇప్పుడు ఆనందంగా, అనుభవాలుగా మార్చి విడుదల చేయకపోతే అది కేవలం కాగితపు ముక్కలతో సమానం.

గుర్తుంచుకోండి: మీరు జీవితాంతం కష్టపడింది ఐసీయూ (ICU) బెడ్‌పై ఉన్నప్పుడు “హాస్పిటల్‌లోనే అత్యంత ధనవంతుడైన రోగి” అనిపించుకోవడానికి కాదు!

“అందరూ బాగుండాలి… అందులో మనం ఉండాలి” అనేది ఎంత నిజమో… ఆ బాగుండడంలో “మనం కూడా సుఖపడాలి” అనేది అంతే నిజం.

ఇకనైనా ఆ స్విచ్ మార్చండి. నచ్చిన ఊరికి ఫ్లైట్ టికెట్ కొనండి. ఇంట్లో ఏసీ ఆన్ చేయండి. మనసారా నవ్వండి. ఎందుకంటే, ఈ సుఖానికి మీరు వందకు వంద శాతం అర్హులు!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • Saving Syndrome..! ఇదొక జబ్బు… పొదుపు చేసీ, చేసీ… ఆరిపోవడం…!!
  • ఇండియా కూటమి కథ… ఇక ‘బభ్రాజమానం- భజగోవిందం…’
  • కేజ్రీవాల్‌కు మరిన్ని ‘న్యాయచిక్కులు’… క్రిమినల్ కంటెంప్ట్ కేసు…
  • విజయ్ మంత్రుల్లో కీలకుడు… ఈ ‘సోషల్ షో’ చూడండి ఓసారి…
  • రంకు మొగుడు అంటే మాస్ ముతక… రంజు మొగుడు అంటే పాలిష్డ్…
  • ఇడ్లీని చక్కెరపాకంలో ముంచితే రసగుల్లా అట…! ఎవడా ఇడ్లీ ద్రోహి..?!
  • ఈ కేసులో అమ్మాయి మేజర్ కాబట్టి సరిపోయింది..!!
  • కన్నీటి అబద్ధాలకంటే… కాలర్‌ ఎగరేసే నిజాలే ఎప్పుడూ గొప్పవి!
  • సొంత ప్రధానినే ఆక్షేపిస్తే… సోయిలేని ‘పత్తాలాట మాటలు’ అంటారు..!!
  • బెంగాల్‌లో ఏం జరుగుతోంది..? మాయ రోగాలకు ‘కాయకల్ప చికిత్స’..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions