Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పెద్ది… నటుడిగా రాంచరణ్‌‌కు పేరొస్తుంది… నిర్మాతకు డబ్బులొస్తాయి…

June 4, 2026 by M S R

.

రాంచరణ్‌కు పేరొస్తుంది… నిర్మాతకు డబ్బులొస్తాయి… కానీ “పెద్ది” నిజంగా ఎలా ఉంది? … క్లైమాక్స్‌లో షాకింగ్ నిర్ణయాలు ప్రేక్షకులకు కనెక్టయితే సూపర్ హిట్, లేదంటే కమర్షియల్‌‌గా పాస్..! చాన్నాళ్లుగా నిర్మాణంలో ఉన్న సినిమా ఇది. భారీ బడ్జెట్, భారీ అంచనాలు. ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాలు కూడా లేకపోవడంతో “పెద్ది”పై సహజంగానే హైప్ ఏర్పడింది. రాంచరణ్ డిఫరెంట్ లుక్స్, ట్రైలర్లు, ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని మరింత పెంచాయి. మరి అంత హైప్ మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన “పెద్ది” నిజంగా ఎలా ఉంది?

ముందుగా ఒక విషయం చెప్పాలి. రాంచరణ్ కష్టం తెర మీద ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. తన బాడీ లాంగ్వేజ్ నుంచి మేకప్ వరకు, ఒక బలమైన రెజ్లర్‌లా కనిపించేందుకు చేసిన శారీరక మార్పుల వరకు ప్రతి ఫ్రేమ్‌లోనూ ఆ శ్రమ కనిపిస్తుంది. దీనికి చివరి భాగంలో చూపించిన భావోద్వేగ నటన కూడా తోడవడంతో, నటుడిగా మరో మెట్టు ఎక్కినట్టు అనిపిస్తాడు. బాక్సాఫీస్ వద్ద సినిమా ఎంత సాధిస్తుందనేది పక్కన పెడితే, రాంచరణ్‌కు మాత్రం ఈ సినిమా మంచి మార్కులే తెస్తుంది.

Ads

“పెద్ది” కథ నిర్లక్ష్యానికి గురైన ఒక గ్రామం చుట్టూ తిరుగుతుంది. కనీస అవసరాల కోసం కూడా పోరాడుతున్న ఆ గ్రామ ప్రజల జీవితాలను మార్చగల ఒక చిన్న రైల్వే స్టాప్ కోసం వారు చేసే పోరాటం, ఆ లక్ష్యాన్ని సాధించేందుకు పెద్ది చేసే త్యాగాలే కథకు మూలం.

సినిమాకు మరో ఆకర్షణ జాన్వీ కపూర్ అవుతుందని భావించారు. కానీ తెరపై ఆమె పాత్ర పెద్దగా ప్రభావం చూపదు. నిజానికి ఈ కథకు, కథ నడిచే వాతావరణానికి ఆమె సరైన ఎంపిక కాదేమో అనిపిస్తుంది. ఆమె ట్రాక్ వల్లే ఫస్ట్ హాఫ్‌లో చాలా భాగం రక్తికట్టకుండా పోయింది.

దర్శకుడు బుచ్చిబాబు మొదట్లో గ్రామం, అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను బలంగానే పరిచయం చేస్తాడు. అయితే ఆ తరువాత సినిమా ఇంటర్వెల్ వరకు చాలా వరకు సుపరిచితమైన మాస్ మసాలా ఫార్ములాలోనే సాగుతుంది. హీరో ఎంట్రీ, హీరోయిన్ ట్రాక్, పాటలు, ఫైట్లు, క్రికెట్ మ్యాచ్‌లు… అన్నీ కమర్షియల్ మూసలోనే కనిపిస్తాయి.

సమస్య ఫార్ములాలో కాదు, దాన్ని చూపించిన విధానంలో ఉంది. ఫస్ట్ హాఫ్ పెద్దగా జోష్ ఇవ్వదు. కథలో అనేక పాత్రలు కనిపించినా, అవి ప్రేక్షకుడిపై గానీ, కథపై గానీ పెద్దగా ప్రభావం చూపవు. అయితే జగపతిబాబు పాత్ర మాత్రం గుర్తుండిపోతుంది.

పెద్ది

 

ఇంటర్వెల్ సన్నివేశం పెద్ద సర్‌ప్రైజ్ ఇవ్వకపోయినా, రెండో భాగంపై ఆసక్తిని పెంచుతుంది. కానీ సెకండాఫ్ ప్రారంభంలో కూడా మొదటి భాగంలోని బలహీనతలు కొనసాగుతాయి. పెద్ది జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన తర్వాత వచ్చే ప్రత్యేక గీతం కూడా కథను ముందుకు తీసుకెళ్లడం కంటే, మళ్లీ పాత కమర్షియల్ ట్రాక్‌లోకి తీసుకెళ్లినట్టే అనిపిస్తుంది.

అయితే చివరి 40-45 నిమిషాల్లో సినిమా పూర్తిగా ఊపందుకుంటుంది. ఇదే “పెద్ది” అసలైన బలం. ఢిల్లీకి పెద్ది ప్రయాణం, పోటీల్లో అతని పోరాటం, ముఖ్యంగా తన గ్రామం కోసం అతను తీసుకునే సంచలన నిర్ణయం కథకు భావోద్వేగ బలాన్ని ఇస్తాయి. చివరి అరగంటలో రచన, సంభాషణలు మరింత నిజాయితీగా, ప్రభావవంతంగా అనిపిస్తాయి. ముఖ్యంగా క్లైమాక్స్, చివరి సీన్ ప్రేక్షకులకు సంతృప్తిని మిగులుస్తాయి.

సినిమాలో దివ్యేందు, శివరాజ్‌కుమార్ వంటి ప్రముఖ నటులు ఉన్నప్పటికీ, వారి పాత్రలు ఆశించిన స్థాయిలో మెరవవు. ముఖ్యంగా దివ్యేందు పాత్ర పూర్తిగా వృథా అయిన భావన కలుగుతుంది.

సంగీత దర్శకుడు ఎ.ఆర్. రెహమాన్ పాటలు వినడానికి, తెరపై చూడడానికి బాగానే ఉన్నాయి. అనంత శ్రీరామ్ రాసిన ఒక పాటపై ఇప్పటికే వివాదం, విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ పాట మినహా మిగిలిన సంగీతం సినిమాకు ఉపయోగపడింది. నేపథ్య సంగీతం కూడా కీలకమైన భావోద్వేగ సన్నివేశాల్లో బాగా పనిచేసింది.

peddi

మొత్తంగా చూస్తే “పెద్ది”కి అతిపెద్ద బలం రాంచరణ్, అలాగే చివరి 40 నిమిషాల కథనం. ఫస్ట్ హాఫ్ పేలవంగా ఉండటం, జాన్వీ కపూర్ ట్రాక్, భావోద్వేగ బలం లేని క్రికెట్ మ్యాచ్‌లు, ఎక్కువ నిడివి సినిమాకు మైనస్‌లుగా నిలిచాయి.

అయితే సినిమాకు మరో పెద్ద ప్లస్ పాయింట్ కూడా ఉంది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద పెద్ద సినిమాల పోటీ లేదు. దీంతో ప్రేక్షకులకు అందుబాటులో ఉన్న ప్రధాన ఆప్షన్‌గా “పెద్ది” మారే అవకాశం ఉంది. గొప్ప సినిమా కాకపోయినా, ఉన్న వాటిలో మెరుగైన ఎంపికగా నిలబడుతుంది.

అందుకే తుది తీర్పు ఒకటే… “పెద్ది” రాంచరణ్ కెరీర్‌లో గుర్తుండిపోయే పాత్ర కావచ్చు. సినిమా అద్భుతం కాకపోవచ్చు. కథాగమనంలో పలు చోట్ల లాజిక్ మిస్… కానీ రాంచరణ్‌కు పేరును, నిర్మాతకు డబ్బును తీసుకొచ్చేంత బలం ఇందులో ఉంది…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘తెలుగు మందు’ సీసా ‘అందుబాటు’ సైజుల్లో… ఖజానాకు మరింత కిక్కు…
  • పెద్ది… నటుడిగా రాంచరణ్‌‌కు పేరొస్తుంది… నిర్మాతకు డబ్బులొస్తాయి…
  • బెంగాల్ షిండే..! ఎవరు ఈ రితాబ్రత బెనర్జీ..? ఇంట్రస్టింగ్ కేరక్టర్..!!
  • తులం బంగారమూ అమ్మలేదు… రిజర్వ్ బ్యాంకు స్పష్టీకరణ…
  • తప్పో ఒప్పో… మాస్టారిని ఆరాధించటం… చివర్లో ప్రేక్షకుల చేత కంట తడి…
  • ‘మావోడి ధర్మ నిర్మూలన వ్యాఖ్యల్ని క్షమించి, వాడిని కాపాడు తల్లీ…’
  • లక్ష కోట్ల బంగారం అమ్మేశాడా మోదీ..! బ్లూమ్‌బర్గ్ కథనం- వార్తలు…
  • కళ్లు పొడిచే LED కాంతి..! రాత్రి ప్రయాణం ప్రాణాంతకమేనా..?
  • కాలం ఎవరినీ క్షమించదు… ఒక మమత పతనం, ఒక గుణపాఠం!
  • ఏ వర్ణం ఎవడబ్బ సొత్తు..? తమిళనాట ఓ ‘రంగు రాద్ధాంతం’..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions