.
నేను 1992 లో ఒకరోజు తెల్లవారకముందే హైదరాబాద్ గౌలిగూడ బస్టాండ్లో బస్సు దిగితే ఒక ఫ్రెండ్ వచ్చి రిసీవ్ చేసుకుని ఎర్రమంజిల్లో నెలకు 150 రూపాయల అద్దె రూములో దించి జాగ్రత్తలు చెప్పి వెళ్ళాడు. దాదాపు 35 ఏళ్ళుగా అదే ఎర్రమంజిల్లోనే ఉంటున్నాను. హైదరాబాద్ మహాతల్లి- పొట్టచేతపట్టుకుని వచ్చే నాలాంటి లక్షలమందిని కడుపులో పెట్టుకుని కాపాడుతూనే ఉంటుంది. హైదరాబాద్ పుష్పకవిమానం- ఎంతమంది వచ్చినా…ఇంకా ఎంతో మందికి చోటు ఇస్తూ పిలుస్తూనే ఉంటుంది.
బార్ పోయింది…పెద్ద ఆసుపత్రి వచ్చింది!
Ads
ఎర్రమంజిల్లో మా ఇంటిగోడకు నిమ్స్ ఆసుపత్రి గోడ అనుకుని ఉంటుంది. మా ఇంటిగేటు దాటగానే ఏళ్లతరబడి ఒక బార్ అండ్ రెస్టారంట్ ఉండేది. తాగక ముందు బార్ కు వెళ్ళే తొందరలో, తాగాక స్పృహలేని స్థితిలో రోడ్డుమీద మా కార్లను గుద్ది వెళ్లేవారు. అది అనధికారికంగా నడిపిన బార్(నాగరికులు దీనినే బెల్ట్ బార్ అంటారేమో!) అని ఎక్సయిజ్ వారు ఆలస్యంగా తెలుసుకుని మూయించారు. హమ్మయ్య! అని ఊపిరి పీల్చుకున్నాం. ఈలోపు మా కాలనీలో ఒక ప్రయివేట్ కార్పొరేట్ ఆసుపత్రి మొలిచింది. అది ఎదిగి శాఖోపశాఖలుగా విస్తరించింది. దాని దెబ్బకు రోడ్డు మీద ఉన్న సూపర్ మార్కెట్ కూడా మూతపడి ఆసుపత్రిగా రూపాంతరం చెందింది.
ఆసుపత్రుల మధ్యలో సంతలో తప్పిపోయిన పిల్లల్లా…
ఇదివరకు కాలనీ జనం సూపర్ మార్కెట్లో సరుకులు కొనుక్కుని వెళుతుంటే చూడ్డానికి కంటికి ఇంపుగా ఉండేది. మనసుకు హాయిగా ఉండేది. మధ్యతరగతి మందహాసాలతో గాలులు పునీతమయ్యేవి. ఇప్పుడు చేతుల్లో మెడికల్ రిపోర్టులు, వీల్ చెయిర్లలో స్ట్రెచర్లలో రోగులతో, అంబులెన్సులతో, రోడ్డు కిక్కిరిసి ఉంటే పెద్దాసుపత్రి మధ్యలో సంతలో తప్పిపోయిన పిల్లల్లా ఉంది మా పరిస్థితి. ఉదయం లేచింది మొదలు పడుకునేదాకా అంబులెన్సుల సైరన్లు, నర్సుల బస్సులు, ఆసుపత్రుల వ్యవహారాలతో ఈలోకమంతా ఒక విశాలమైన ఆసుపత్రిగానే తోస్తోంది. రోగులకోసం వచ్చే కార్లకు పార్కింగ్ ప్లేస్ చాలక మా రోడ్డుమీద పెట్టి వెళ్లిపోతుంటారు- పక్కనే ఉన్న పోలీస్ అవుట్ పోస్టు సాక్షిగా. అప్పెక్కగానే మరో ఏడు నక్షత్రాల కార్పొరేట్ ఆసుపత్రి కొత్తగా మొలిచింది. “ఇదేమిటి? చూడగానే చేరిపోవాలనేలా ఇంత అందంగా ఉంది?” అని మా కాలనీలో కొందరు స్వగతంలో కాకుండా పైకే అనేశారు. అంత ఆకర్షణ ఆ ఆసుపత్రిది!
దిక్కులన్నీ ఆసుపత్రుల కొండగుర్తులే
సాధారణంగా నాలుగు దిక్కులే. మాకిప్పుడు ఎనిమిది దిక్కుల్లోనూ ఆసుపత్రులే ఉన్నాయి. మా ఇళ్ళకొచ్చేవారికి మెట్రోలో అయితే నిమ్స్ దగ్గర దిగమంటాం. ఆటోలో అయితే ఫలానా ఆసుపత్రి ముందు ఉండండి- బయటికొస్తున్నాం అని కొండగుర్తుగా కాలనీ ఆసుపత్రుల ఆనవాళ్ళే చెబుతున్నాం. బంజారా వైపు వస్తే ఫలానా ఆసుపత్రి దాటాక సిగ్నల్ దగ్గర కుడి/ఎడమకు తిరగమంటాం. ఖైరతాబాద్ నుండి వస్తే ఫలానా ఆసుపత్రి గేటు దగ్గర ఉండమంటాం.
కాలనీ అంతా మందుల షాపులే
ఈ ఆసుపత్రుల దెబ్బకు ఆ అనధికారిక బార్ ఉంటేనే బాగుండేదనిపిస్తోంది ఇప్పుడు. వాళ్లతో రాత్రిళ్లే ఇబ్బందిగా ఉండేది. వీళ్ళతో రాత్రీపగలూ ఇబ్బందే. కాలనీ నిండా పక్కపక్కనే మందుల షాపులు. పూలు, పళ్ళు కొనడానికి వెళుతున్నప్పుడు కూడా మందులు కొంటున్నట్లే ఉంది. వాట్సాప్ లో ప్రిస్క్రిప్షన్ పెట్టండి సార్- మందులు మీ ఇంటికే పంపిస్తాం- అని మొన్నొక షాపు అబ్బాయి ఆత్మీయంగా ఆఫర్ ఇచ్చాడు. పైగా…ఏమిటి సార్ ఈమధ్య రావడమే లేదు? అని నాకూ, మా ఇంట్లో ఎవరికీ రోగం రానందుకు అతను నైతికంగా చింతిస్తున్నట్లు స్పష్టంగా చెప్పేశాడు.
కథలో తుపాకిని వర్ణిస్తే…కథ అయిపోయేలోపు ఆ తుపాకిని వాడి తీరాలంటుంది కథా రచనా శాస్త్రం. అలా మా దైనందిన జీవిత కథలో కనిపించే ప్రతి అసుపత్రినీ మా కాలనీ వాడుకోవాలన్న బాధ్యతను ఫీలవుతోంది!
నిమ్స్ నిజంగానే కొండ గుర్తు
ప్రభుత్వ నిమ్స్ అంటే ఈనాటిది కాదు. నిజంగానే పంజాగుట్టకు కొండ గుర్తు. ఎన్ని లక్షలమందికి ఆరోగ్యభిక్ష పెట్టి బతికించిందో, బతికిస్తోందో, ఇంకా ఇంకా బతికిస్తుందో చెబితే మహాగ్రంథమవుతుంది. చుట్టూ వెలిసిన ప్రయివేటు ఆసుపత్రులను నిమ్స్ తో పోలిస్తే మనల్ను మనం అవమానించుకున్నట్లు. తక్కువ చేసుకున్నట్లు.
వేల కోట్ల పెట్టుబడులు
ఉద్దేశపూర్వకంగానే పేర్లు చెప్పడం లేదు. కళ్ళముందే విస్తరిస్తున్న ఆసుపత్రులను చూస్తే…స్థానిక, అంతర్జాతీయ పెట్టుబడిదారులు ఆయా ఆసుపత్రుల్లో పెడుతున్న పెట్టుబడుల్లో సున్నాలను లెక్కకడుతుంటే…భయంగా ఉంటుంది. వంద, అయిదు వందలు కాదు వెయ్యి కోట్లు, రెండువేల కోట్లు దాటి…ఇంకా…ఇంకా వేనవేల కోట్లు.
ఏ ఆసుపత్రి అయినా రోగులతో ఇసుకవేస్తే రాలనంతగా…మూడు రోగాలు, ఆరు పరీక్షలు, పన్నెండు సర్జరీలు, ఇరవై నాలుగు ఇన్సూరెన్స్ విధానాలుగా దినదినాభివృద్ధి చెందాలనే కోరుకుంటుంది కానీ…ఒక్క రోగీ రాకుండా ఈగలు తోలుకోవాలని అనుకోదు.
అన్నట్లు మా పక్కనే దశాబ్దాలుగా ఒక వెలుగు వెలిగిన మూడున్నర ఎకరాల విస్తీర్ణంలో ఉండే తాజ్ బంజారా అయిదు నక్షత్రాల హోటల్ ను రియలెస్టేట్ వ్యాపారంలోకి దిగిన ఒక ఫార్మా కంపెనీ మూడు వందల యాభై కోట్లకు కొని…హోటల్ ను కూల్చే పనిలో ఉంది. అల్ట్రా లగ్జరీ అపార్ట్ మెంట్లు కడతారట! ఆ ఫార్మా కంపెనీకి అంత డబ్బు పోగు కావడానికి మన ఒంట్లో ఉన్న/లేని రోగాలు…ఆ రోగాలకు చేస్తున్న నానా వైద్యాలే కారణమని వారికీ తెలుసు! మనకూ తెలుసు! కానీ…ఏమీ చేయలేము.ఇదొక అనుచిత ప్రాథమిక నిర్బంధ కార్పొరేట్ వైద్య వ్యాపార విద్య! అంతా మిథ్య!!
కొస మెరుపు:- రోగుల అటెండెంట్లు ఉండడానికి మా కాలనీలో తాత్కాలికంగా ఇళ్ళు అద్దెకివ్వడం ఇప్పుడు కొత్త ఆదాయ మార్గం.
ఆరోగ్యమే మహా భాగ్యం. నిజమే- ఆరోగ్యమే మహా వ్యాపార భాగ్యం. ఆ భాగ్యంలో మనం అభాగ్యులం!
“మా పెరటి జాంచెట్టు పళ్ళన్నీ కుశలం అడిగే…
మా తోట చిలకమ్మ నీ కోసం ఎదురే చూసే…”
అన్న పాట మా కాలనీ ఆకాశవాణిలో సుడులు తిరిగి…
“మా పెరటి ఆసుపత్రులు రోగం అడిగే…
మా తోట వార్డులన్నీ నీ కోసం ఎదురే చూసే…”
అని ప్రతిధ్వనిస్తోంది!
దిక్కులేనివారికి దేవుడే దిక్కు.
మాకు ఏ దిక్కుకు వెళ్లినా…ఆసుపత్రులే దిక్కూ…మొక్కూ!
“అంతము లేని ఈ భువనమంతయు పురాతన పాంథశాల…” అన్నాడు కవికోకిల దువ్వూరి రామిరెడ్డి పానశాల పద్యకావ్యంలో.
ఆయనే ఉండి ఉంటే…మమ్మల్ను చూసి-
“అంతము లేని ఈ భువనమంతయు పురాతన వైద్యశాల…” అని కూడా అని ఉండేవాడు!
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
Share this Article