Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కొన్ని పుస్తకాలు బయటికి రావు ! ఏ పార్టీ ప్రభుత్వమూ మినహాయింపు కాదు !!

September 12, 2026 by M S R

.

ఒక మత ఘర్షణపై వచ్చిన గ్రాఫిక్ పుస్తకం చివరకు ‘మ్యాప్‌లో తప్పులున్నాయి’ అనే సమస్యగా మారింది. దేశ మాజీ కాంగ్రెస్ అధ్యక్షురాలి ఆత్మకథ ‘ఫ్యాక్ట్ చెకింగ్’ సమస్యగా మారింది. రెండింటినీ ప్రచురించాల్సిన ప్రచురణ సంస్థ వెనక్కి తగ్గింది.

అప్పుడు మనం “ఏం బ్లాక్ చేస్తున్నారు?” అని అడగడం కంటే… “బ్లాక్ చేయడాన్ని సాధారణ వ్యవహారంగా మార్చింది ఎవరు?” అని అడగాల్సిన పరిస్థితి వచ్చిందా? 2026లో కేవలం కొన్ని వారాల వ్యవధిలోనే పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా రెండు కీలక పుస్తకాల విషయంలో వెనక్కి తగ్గింది.

Ads

మొదటిది.. 2013లో ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ముజఫర్‌నగర్ మత ఘర్షణలపై ప్రపంచ ప్రఖ్యాత గ్రాఫిక్ జర్నలిస్టు జో సాకో రూపొందించిన ‘ది వన్స్ అండ్ ఫ్యూచర్ రయట్’… రెండోది.. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆత్మకథ ‘బిలోంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’.

రెండు సందర్భాల్లోనూ పెంగ్విన్ ఇండియా ఇచ్చిన వివరణలు చాలా మర్యాదగా ఉన్నాయి. చాలా ప్రొఫెషనల్‌గా ఉన్నాయి. కానీ… రాజకీయ నేపథ్యం మాత్రం కనిపించలేదు.

అసలు కథ అక్కడే ఉందేమో! మొదట జో సాకో పుస్తకం… ముజఫర్‌నగర్ అల్లర్లపై జో సాకో రూపొందించిన పుస్తకం అంతర్జాతీయంగా 2025లోనే ప్రచురితమైంది. ఆయనకు అంతర్జాతీయ ప్రచురణకర్తలు ఉన్నారు. పుస్తకాన్ని ఫ్యాక్ట్ చెక్ చేశారు. కానీ భారత్‌లోకి వచ్చేసరికి కథ మారిపోయింది.

పెంగ్విన్ ఇండియా చెప్పిన కారణం.. మ్యాప్‌లలో కొన్ని తప్పులు, ఇంకా పరిష్కరించాల్సిన కొన్ని ‘కంటెంట్ ప్రశ్నలు’. వింటే చాలా సాధారణమైన ఎడిటోరియల్ ప్రక్రియలా అనిపిస్తుంది. కానీ సాకో చెప్పిన వివరాలు మాత్రం మరో కథ చెబుతున్నాయి.

తాను ఇంటర్వ్యూ చేసిన వ్యక్తుల వ్యాఖ్యలను మార్చాలని, ముఖ్యంగా ఒక ప్రముఖ వ్యక్తి వ్యాఖ్యలను “వాటి తీవ్రత తగ్గించేలా” మార్చాలని ప్రచురణ సంస్థ కోరిందని సాకో వెల్లడించాడు. అంతేకాదు.. అనేక రకాల వెరిఫికేషన్ ఫారాలు, సమ్మతి పత్రాలు కూడా అడిగారని ఆయన చెప్పాడు. ఇవి సాధారణంగా అంతర్జాతీయంగా తన పుస్తకాలకు ఎదురైన ప్రక్రియ కంటే చాలా ఎక్కువగా ఉన్నాయని సాకో అభిప్రాయపడ్డాడు.

సాకో ఆ మార్పులకు అంగీకరించలేదు. పుస్తకం భారత్‌లో వెలువడలేదు. ముజఫర్‌నగర్ అల్లర్లలో 60 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 40 వేల మంది నిరాశ్రయులయ్యారు. అలాంటి ఘటనపై తన కథనాన్ని భారత్‌లో పంపిణీ చేయడం ప్రచురణ సంస్థకు “ఇబ్బందికరంగా ఉండొచ్చు” అని సాకో వ్యాఖ్యానించాడు.

అంటే… మ్యాప్‌లో తప్పులు కావు, అసలు పెద్ద సమస్య ఇంకేదైనా ఉందా?

సోనియా గాంధీ పుస్తకం దగ్గర అసలు కథ బయటపడింది … సోనియా గాంధీ ‘బిలాంగింగ్’ పుస్తకాన్ని ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 10న విడుదల చేయనున్నట్లు అమెరికాకు చెందిన ఆల్ఫ్రెడ్ ఏ. నాఫ్ ప్రకటించింది. అది పెంగ్విన్ ర్యాండమ్ హౌస్‌కు చెందిన అంతర్జాతీయ ఇంప్రింట్.

కానీ ఆగస్టు 28న పెంగ్విన్ ఇండియా మాత్రం తాము ఈ పుస్తకాన్ని భారత్‌లో ప్రచురించడం లేదని ప్రకటించింది. మళ్లీ కారణం.. చట్టపరమైన, సంపాదకీయ పరమైన అంశాలు. కానీ మీడియా కథనాలు బయటకు వచ్చిన తర్వాత అసలు వివాదం ఏమిటో అర్థమైంది. పెంగ్విన్ ఇండియా లీగల్ టీమ్ కొన్ని భాగాలను తొలగించాలని కోరిందట.

అందులో ప్రధాని నరేంద్ర మోదీపై సోనియా గాంధీ వ్యక్తిగత అభిప్రాయాలు ఉన్నాయి. 2004లో ఒక ఎన్నికల సభలో మోదీ తనను ‘జెర్సీ ఆవు’గా అభివర్ణించారన్న ఆమె ప్రస్తావన ఉంది. భారత్- చైనా సంబంధాలపై ఆమె అభిప్రాయాలున్నాయి. ఆర్‌ఎస్‌ఎస్‌పై ఆమె చేసిన వ్యాఖ్యలు కూడా ఉన్నాయి.

సోనియా గాంధీ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఇది తన జీవితం. తన కథ. కాబట్టి తనకు నచ్చని విధంగా దాన్ని మార్చేందుకు తాను అంగీకరించబోనని స్పష్టం చేశారు. పెంగ్విన్ ఇండియా పుస్తకం నుంచి తప్పుకుంది. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉంది.

అంతర్జాతీయ ఎడిషన్‌లో ఆ వ్యాఖ్యలు అలాగే ఉంటాయి. అంటే… భారత్‌లో మాత్రం ఆ వ్యాఖ్యలు ఎందుకు సమస్యగా మారాయి?

‘ప్రచురణ బాధ్యత’ అనే కొత్త కవచం! రెండు సందర్భాల్లోనూ పెంగ్విన్ ఇండియా ఉపయోగించిన భాష చాలా జాగ్రత్తగా ఉంది. మ్యాప్‌లో తప్పులు. ఫ్యాక్ట్ చెకింగ్. సరైన ఆధారాలు లేవు. చట్టపరమైన పరిశీలన. కంటెంట్‌కు సంబంధించిన ప్రశ్నలు. ఇవన్నీ వినడానికి పూర్తిగా సాధారణమైన ప్రచురణ ప్రక్రియలాగే ఉంటాయి.

కానీ ఇక్కడే అసలు సమస్య ఉందని విమర్శకులు అంటున్నారు. ఎందుకంటే ఒక పుస్తకాన్ని నిశ్శబ్దంగా పక్కకు తప్పించడం కూడా “రొటీన్ ఎడిటోరియల్ ప్రాసెస్”గా మారిపోతే… దానిపై ప్రజా చర్చకు అవకాశమే ఉండదు.

ఎవరినీ నిషేధించలేదు. ఎవరూ పుస్తకాన్ని అధికారికంగా బ్యాన్ చేయలేదు. ప్రభుత్వం ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వలేదు. కానీ పుస్తకం మాత్రం బయటకు రాలేదు. ఇదే స్వీయ సెన్సార్ ప్రమాదం. ఇది కొత్తేమీ కాదు…

పెంగ్విన్ ఇండియా చరిత్రలో ఇలాంటి వివాదం ఇదే మొదటిసారి కాదు… 2014లో వెండీ డోనిగర్ రాసిన ‘ది హిందూస్: యాన్ ఆల్టర్నేటివ్ హిస్టరీ’ పుస్తకాన్ని పెంగ్విన్ ఇండియా వెనక్కి తీసుకుంది. హిందూ జాతీయవాద సంస్థ శిక్షా బచావో ఆందోళన్ దాఖలు చేసిన కేసు నేపథ్యంలో చివరకు పుస్తకాలను ఉపసంహరించుకుని, మిగిలిన కాపీలను నాశనం చేసింది.

అయితే అప్పట్లో పెంగ్విన్ కనీసం నాలుగేళ్లు కోర్టులో పోరాడింది. ఆ తర్వాతే రాజీకి వచ్చింది. అప్పుడు జరిగినది ఏంటో బహిరంగంగానే చర్చ జరిగింది. అది పుస్తకాన్ని అణచివేయడమేనని విమర్శలు వచ్చాయి. ఇప్పుడు మాత్రం పరిస్థితి మరింత సైలెంట్‌గా కనిపిస్తోంది.

పుస్తకాన్ని అడ్డుకున్నామని ఎవరూ చెప్పరు. “మా ఎడిటోరియల్ ప్రక్రియలో భాగంగానే…” అంటారు. అంతే. అసలు సెన్సార్ ఎవరు? ఇక్కడే మరో పెద్ద ప్రశ్న వస్తోంది. భారత్‌లో ప్రచురణ రంగంలో ఇప్పుడు ‘లీగల్ రీడ్’ అనే ప్రక్రియ మరింత కీలకంగా మారిందని ప్రచురణ రంగాన్ని అధ్యయనం చేసినవారు చెబుతున్నారు.

పుస్తకం బయటకు వచ్చే ముందు న్యాయ నిపుణులు ప్రతి పదాన్ని పరిశీలిస్తారు. ‘హిందుత్వ’… ‘క్రోనీ క్యాపిటలిజం’… ‘సంఘీ’… ఇలాంటి పదాలు కూడా ఎక్కడైనా సమస్య తెచ్చే అవకాశం ఉందా అని చూస్తారు. విదేశీ పరిశోధకుల రిఫరెన్సులపైనా ప్రశ్నలు వస్తాయి.

ఒక్క వ్యక్తి పుస్తకంలోని ఒక పదాన్ని మార్చమంటాడు. మరో వ్యక్తి ఒక అధ్యాయాన్ని ప్రశ్నిస్తాడు. లీగల్ టీమ్ ఇంకో భాగాన్ని తొలగించమంటుంది. చివరికి ఎవరూ పుస్తకాన్ని ‘బ్యాన్’ చేయలేదు. కానీ పుస్తకం మాత్రం మారిపోయింది. లేదంటే… పుస్తకమే బయటకు రాదు. ఇదే ప్రైవేట్ సెన్సార్‌షిప్.

ప్రభుత్వం బ్యాన్ చేయాల్సిన అవసరం లేకపోతే? ఇక్కడి నుంచే అసలు భయం మొదలవుతుంది.  ప్రభుత్వం ఒక పుస్తకాన్ని నిషేధిస్తే కనీసం ఆ నిషేధం కనిపిస్తుంది. నోటిఫికేషన్ ఉంటుంది. ఆదేశం ఉంటుంది. కోర్టులో సవాలు చేయవచ్చు. ప్రజా చర్చ జరుగుతుంది.

కానీ ఒక ప్రచురణ సంస్థ స్వయంగా వెనక్కి తగ్గితే? ఎవరిని ప్రశ్నించాలి? ఏ ఆదేశాన్ని సవాలు చేయాలి? ఎక్కడికి వెళ్లాలి? అదే సమస్య. ప్రభుత్వం పుస్తకాన్ని బ్యాన్ చేయాల్సిన అవసరం లేకుండా… మార్కెట్ ముందుగానే భయపడి పుస్తకాన్ని ఆపేస్తే?

అప్పుడు సెన్సార్ కనిపించదు. కానీ ఫలితం మాత్రం అదే. చరిత్రలో కాంగ్రెస్ కూడా మినహాయింపు కాదు. ఇది కేవలం ప్రస్తుత రాజకీయ వాతావరణానికి మాత్రమే సంబంధించిన విషయం అని చెప్పడం కూడా సరికాదు. 1988లో సల్మాన్ రష్దీ రాసిన ‘ది సాటానిక్ వెర్సెస్’ను భారత్ నిషేధించింది. అప్పట్లో దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇరాన్‌లో నిషేధం రావడానికి ముందే భారత్‌లో ఆ పుస్తకంపై చర్యలు తీసుకున్నారు.

1993లో పశ్చిమ బెంగాల్‌లో తస్లీమా నస్రీన్ రాసిన ‘లజ్జ’ను నిషేధించారు. 1975–77 ఎమర్జెన్సీ సమయంలో జరిగిన పత్రికా సెన్సార్‌షిప్ అయితే భారత ప్రజాస్వామ్య చరిత్రలోనే అత్యంత తీవ్రమైన ఉదాహరణల్లో ఒకటి. 2025 ఆగస్టులో జమ్మూ కశ్మీర్‌లో 25 పుస్తకాలపై కూడా నిషేధం విధించారు.

అంటే… పుస్తకాలపై నిషేధం ఏ ఒక్క పార్టీకి మాత్రమే చెందిన అలవాటు కాదు. కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా… అధికారంలో ఉన్నప్పుడు అసౌకర్యమైన మాటను భరించలేకపోయిన సందర్భాలు భారత చరిత్రలో ఉన్నాయి. కానీ ఇప్పుడు మారుతున్నది ఇంకో విషయం. నిషేధం బయట నుంచి రావడం కాదు. లోపలే మొదలవుతోంది.

అయినా ఆశ పూర్తిగా చావలేదు… జో సాకో పుస్తకం విషయంలో పెంగ్విన్ ఇండియా వెనక్కి తగ్గిన తర్వాత కనీసం ఆరు భారతీయ ప్రచురణ సంస్థలు ఆయనను సంప్రదించాయి. ఇప్పుడు సోనియా గాంధీ పుస్తకం విషయంలో కూడా మరో ప్రచురణ సంస్థ ముందుకొచ్చింది. సెప్టెంబర్ 4న హార్పర్‌కాలిన్స్ ఇండియా అధికారికంగా ‘బిలోంగింగ్’ ప్రచురణ హక్కులను తాము పొందినట్లు ప్రకటించింది. ముఖ్యంగా… నవంబర్ 10 విడుదల తేదీ అంటోంది. ఇది పాఠకులకు మంచి వార్త…  Cholleti

(The writer is with the Cholleti BlackRobe Chambers, Hyderabad, and writes on economy, politics and law)

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • Sigma – తమిళ సీఎం విజయ్ కొడుకు సంజయ్‌కు ఓ ఫ్లాప్ డెబ్యూ !!
  • ఆపదామపహర్తారం… ఆ ఆపదలో స్మిత్ ధైర్యం హనుమంతుడే!
  • ఏమిట్లు..? ఇంతకీ ఈ ఫ్లయింగ్ హీరో స్మిత్ మచ్చర్ మనోడేనా..?
  • ఇల్లు కూడా లేని ఓ నిరుపేద బుక్కెడు బువ్వకై స్టార్ హోటల్ కట్టుకున్నా తప్పేనా..?!
  • ఆ ఒక్కటీ తక్కువైంది షెకావత్తూ… అదే ఎమోషనల్ థ్రిల్! వెరసి ట్రబుల్!!
  • అనుకోని అనుకూలతలు – లేకపోతే మధ్యప్రాచ్యం మండిపోయేది!
  • కేటీయార్ స్టార్ హోటళ్లు ! రేవంత్ రెడ్డి చెప్పినవన్నీ అక్షరసత్యాలే !!
  • తమన్నా VVAAN – మౌత్‌టాక్ కోసం బొట్లు, ప్రసాదాల ప్రమోషన్ !!
  • చాపచుట్టేసిన శ్రీలంక- మూడు రనౌట్లు – ఆరు డకౌట్లు..!!
  • సిరిసిల్లలో నిలబడి, నిలదీసి… ఈ ‘అనుముల రుద్రారెడ్డి’ అసాధ్యుడే!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions