.
పూలమ్మిన, పాలమ్మిన… నాది పెద్ద సక్సెస్ స్టోరీ అంటాడు మల్లారెడ్డి… వందల ఎకరాల ల్యాండ్ బ్యాంక్ అని కూడా తనే చెబుతాడు… రియాలిటీ ఎడ్యుకేషన్, రియల్ ఎస్టేట్, పొలిటికల్ సర్కిళ్లలో అందరికీ తెలుసు… ఈమధ్య బీజేపీ వైపు చూస్తున్నాడు గానీ, పవిత్ర తీర్థం ఇచ్చే విషయంలో అంతటి మంత్రకలశం బీజేపీయే వెనుకాడుతోందట…
అంతిమంగా తన భూముల కబ్జాల సంగతి రేవంత్ రెడ్డి తేల్చాల్సిందే గానీ… ముందయితే తన కాలేజీలను ఫిక్స్ చేసే కార్యక్రమం ఏదో నడుస్తోంది… అసెంబ్లీలో రేవంత్ రెడ్డే చెప్పాడు… పూలమ్మితే, పాలమ్మితే ఇన్ని ఆస్తులు వస్తాయా..,? కాలేజీ ఖాతాలో 400 కోట్లు ఎక్కడివి..? పిల్లల నుంచి ఫీజులు తీసుకుని, మళ్లీ సర్కారు నుంచి తీసుకున్నారని చెబుతున్నాడు రేవంత్ రెడ్డి…
Ads
ఎంత తోపు వచ్చి అడిగినా సరే రూపాయి కన్సెషన్ ఇవ్వడు మల్లారెడ్డి… పేరుకు డీమ్డ్… ఫీజులు దండిగా వసూలు చేసుకునే కాలేజీలవి… అల్లాటప్పా నాసిరకం కాలేజీలేమో ఫీజు రీయింబర్స్‌మెంట్ జాబితాలో… అసలు ఎఐసీటీఈ, ఎంసీఐ పర్మిషన్ల నిగ్గుతేలిస్తే ఎంత పెద్ద దందా బయటపడుతుందో ఏమిటో… చివరకు సినిమా ప్రిరిలీజు ఫంక్షన్లకూ కాలేజీ ప్రాంగణాన్ని అద్దెకు ఇచ్చి, తన విద్యార్థులతోనే సభ జరిపే స్థాయికి ఎదిగాడు అంటే మల్లారెడ్డి స్టాండర్డ్ అర్థం చేసుకోవాలి…
ఎలాగూ గతంలో… ఒరేయ్ రేవంత్ రెడ్డీ అని పిలుస్తూ, బహిరంగంగా తొడగొట్టి ‘చూసుకుందామా నీ పెతాపమో నా పతాపమో’ అని సవాళ్లు విసిరాడు కదా, ఇప్పుడేమో మింగలేక కక్కలేక… అబ్బే, రేవంతుడు మావాడే, మా చుట్టపోడే అని కవరింగు కథలు చెప్పబోతే రేవంత్ రెడ్డి నవ్వి, దగ్గరకు కూడా రానివ్వలేదు… కానీ నిజానికి రేవంత్ రెడ్డి కేసీయార్, కేటీయార్, హరీష్ రావులపై చూపిస్తున్నట్టుగానే అంతులేని, అలవిమాలిన ఔదార్యాన్ని ప్రదర్శిస్తున్నాడు మల్లారెడ్డి మీద…

అవునూ, ఆ 400 కోెట్ల నిల్వ కథేమిటో ఈడీకి లేదా సీబీఐకి రాష్ట్ర ప్రభుత్వమే చెబితే..? అఫ్‌కోర్స్, మల్లారెడ్డి అంటే ప్రస్తుతం రాజీబేరాలు, రాయబారాల్లో ఉన్నట్టుంది కదా బీజేపీ… బహుశా దాడులు, విచారణలు గట్రా ఉండకపోవచ్చు… అసలే ఈ విద్యా దందాను జాతీయ స్థాయిలో విస్తరిస్తాడట మల్లారెడ్డి..,
‘వేల కోట్ల బకాయిలు పెట్టిపోయాడు కేసీయార్… మేమొచ్చాక ఆ బకాయిల్లో వేల కోట్లు చెల్లించాం, తీరా ఆరా తీస్తే… కేసీయార్ ఈ కాలేజీల నాణ్యత మీద విజిలెన్స్ విచారణ జరిపించాడనీ, పార్టీ ఫిరాయింపులకూ వాడుకున్నాడనీ, తమ గులాబీ కాలేజీలకే రీయింబర్స్‌మెంట్ ఇచ్చేవాడనీ తేలిందంటున్నాడు రేవంత్ రెడ్డి…
మల్లారెడ్డి, రాజేశ్వర్‌రెడ్డి తదితరులు చాలామంది గులాబీ నేతలకు కాలేజీలున్నాయి… వాటిల్లో సీట్లు, పర్మిషన్లు, వసూళ్లు, కేసీయార్ పాలనలో వాటి యవ్వారాలపై నిజంగా రేవంత్ రెడ్డి ఓ సమగ్ర విచారణకు ఆదేశిస్తే… తెలంగాణ సమాజం కళ్లు బైర్లు కమ్మే వాస్తవాలు బయటపడొచ్చునేమో..,

నిజమే, స్టాండర్డ్స్ ఉన్న కాలేజీలకే ఫీజు రీయింబర్స్‌మెంట్ బెటర్… కేవలం ఫీజుల రీయింబర్స్‌మెంట్ కోసం నడిపే నాసిరకం కాలేజీలున్నాయి… బీజేపీ త్వరపడి మల్లారెడ్డి కుటుంబానికి ఓ రాజ్యసభ, మూడు ఎమ్మెల్యే సీట్లకు ఒప్పందం కుదుర్చుకోకముందే… రేవంత్ రెడ్డి కొరడా పట్టుకుంటాడా..?
కొండా సురేఖతో కూడా ఇలాంటి సీట్ల బేరమే ఏదో నడుస్తోందట కదా… ఐనా ఇదేమైనా పాత బీజేపీయా..? ఎవరికైనా సరే పావన తీర్థం ప్రసాదించి, తమ శిబిరంలోకి ఆప్యాయంగా ఆహ్వానించగలదు… ఇది అద్వానీ బీజేపీ కాదు, ఆదానీ బీజేపీ… మరి బీఆర్ఎస్ తన క్యాంపు నుంచి ఇలాంటి నేతలు వెళ్లిపోతే ఓకే అంటుందా..?
బీఆర్ఎస్ పెద్ద తలకాయలే మోదీషా కరుణ కోసం వెంపర్లాడిపోతుంటే, కమాన్, ప్లీజ్ పొత్తు పెట్టుకుందాం, మీరేం చెప్పినా సరే, టేకిట్ ఫర్ గ్రాంట్ అని హస్తినలో ప్రయత్నాలు సాగిస్తుంటే… అంగీకరించక చేసేది ఏముంది..!! అసలే మెడలపై సీబీఐ కత్తులు వేలాడుతున్నాయి కదా!!
Share this Article