Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సుకన్య..! పరువుకై 30 ఏళ్ల సఫల పోరాటం… మీడియాకు ఓ పాఠం..!!

June 8, 2026 by M S R

.

సుకన్య… తెలుగు వారికి కూడా తెలిసిన నటి… టీవీలు, సినిమాల్లో నటన, నాట్యగత్తె, గాయకురాలు, గీత రచయిత, కంపోజర్, డబ్బింగ్ ఆర్టిస్ట్… ఐతే కాస్త లిటిగెంట్ మనస్తత్వం అంటారు మరి… గతంలో డైరెక్టర్ శంకర్‌తో గొడవ ప్రముఖంగా వినిపించేది…

కెరీర్‌లో వెలుగుతున్నప్పుడే ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌ను పెళ్లిచేసుకుంది, అమెరికా వెళ్లిపోయింది… తరువాత ఏడాదికే విభేదాలు… గృహ హింస కేసు పెట్టింది, వాపస్ వచ్చేసింది… విడాకులు తీసుకుంది… ఇదీ ఆమె నేపథ్యం… ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చింది ఆమె పేరు… ఎందుకు..?

Ads

ఎందుకంటే..? ఆమె ఓ కేసులో, అదీ బలమైన ఓ మీడియా గ్రూపు మీద గెలిచింది కాబట్టి… వివరాల్లోకి వెళ్తే… 1996… తమిళ టెలివిజన్ ప్రపంచాన్ని కుదిపేసే ఓ ఇంటర్వ్యూ ప్రసారమైంది… అది అప్పటి కరుడుగట్టిన గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ ఇచ్చిన ఆ ఇంటర్వ్యూ… అందులో సుకన్యపై వ్యక్తిగత ఆరోపణలు ప్రసారమయ్యాయి…

ఎవరో ప్రముఖ రాజకీయ నాయకుడి కొడుకుతో ఆమెకు అక్రమ సంబంధం ఉందనేది ప్రసారాంశం… విస్తృతమైన ఇంటర్వ్యూలో అదొక చిన్న అంశం… ఆ ఆరోపణలు అబద్ధమనీ, అది అలాగే ప్రసారం చేసి తనను మానసికంగా దెబ్బతీశారనీ, తన పరువును నష్టపరిచారని సుకన్య వెంటనే అభ్యంతరం వ్యక్తం చేసింది…

మొత్తం 9 గంటల ఇంటర్వ్యూ… అందులో 5 గంటల ఫీడ్ కట్ చేశారు… మిగతా 4 గంటలను రోజుకు అరగంట చొప్పున 8 రోజుల సీరియల్ ప్రసారం చేశారు… సన్ టీవీ నెట్‌వర్క్‌పై పరువు నష్టం కేసు పెట్టింది… బహుశా మూడు దశాబ్దాలపాటు ఆ కేసులో పోరాడాల్సి వస్తుందని ఆమె కూడా అనుకోలేదేమో..,. దిగువ కోర్టు సన్ టీవీ చేసింది తప్పేనని తేల్చేసి 10 లక్షల పరిహారం ఆ నటికి చెల్లించాలని 2015 లో తీర్పు చెప్పింది… అదసలే సన్ టీవీ కదా… హైకోర్టుకు వెళ్లింది…

వీరప్పన్ చెప్పింది యథాతథంగా ప్రసారం చేశామని సన్‌ టీవీ, అందులో పరువు నష్టం తాలూకు అంశాలు ఉంటే ఎడిట్ చేయాల్సిన బాధ్యత టీవీకి ఉంది కదాని సుకన్య తాలూకు లాయర్లు… ఏళ్లకేళ్లు కేసు నడిచింది… ఎవరూ తగ్గలేదు… సన్‌టీవీ వెనుక డీఎంకే, పలు భాషల్లో చానెళ్లు… సాధనసంపత్తి ఉన్న కుటుంబం… ఆఫ్టరాల్ ఒక నటి, పరిహారం కడితే నామోషీ అనుకుంది…

ఆమె కూడా తగ్గలేదు… పోరాడుతూనే ఉంది… 30 ఏళ్లు, మూడు దశాబ్దాలు… మన కోర్టుల కథ తెలిసిందే కదా… నిన్న హైకోర్టు తీర్పు చెప్పింది… ఈ కేసులో దిగువ కోర్టు ఇచ్చిన తీర్పు కరెక్టే, ఆ 10 లక్షలు కట్టేయండి అని తేల్చేసింది… ఇక్కడ 10 లక్షలు అనేది సమస్య కాదు, ఆమె ఇన్నేళ్లలో అంతకుమించి ఎంతో సొమ్ము లాయర్లకు కట్టి ఉంటుంది…

రెండు అంశాలు… ఈ తీర్పుకు పట్టిన కాలం… పోయిన ఆమె పరువు… ఎప్పుడూ చెప్పుకునేదే కదా… సకాల న్యాయం న్యాయమే కాదు… న్యాయం జరగడమే కాదు, అది సకాలంలో జరగాలి, జరిగినట్టు కనిపించాలి అని… మరి ఈ కేసులో ఆలస్యం మాట..?

సన్ టీవీ ఆమె అభ్యంతరం చెప్పిన వెంటనే ఓ సంతాప ప్రకటన ప్రసారం చేసి ఉంటే..? కోర్టు బయట సెటిల్ చేసుకుని ఉంటే… కథ ఇక్కడిదాకా వచ్చేది కాదేమో… ఏమో, ఆమె ఆ కేసు విత్ డ్రా చేసుకునేదేమో… ఎందుకంటే, అది అంత బలమైన మీడియా గ్రూపు… తమిళ వినోదరంగంలో అత్యంత పట్టున్న గ్రూపు…

కానీ అహానికి పోయింది… నామర్దా అనుకుంది… ఆమె కేసు పెట్టగానే ఏదో చిన్న తమిళ మ్యాగజైన్‌లో చిన్న సారీ ప్రకటన వేయించింది… దాంతో లీగల్‌గా తప్పించుకున్నట్టే అనుకుంది… హైకోర్టు అది కూడా ప్రస్తావించి, నీ చానెల్‌లో అభ్యంతరకర కంటెంట్ ప్రసారం చేసి, అందులో సారీ చెప్పకుండా, ఏదో మ్యాగజైన్‌లో ప్రకటన ఇవ్వడం కూడా దురుద్దేశాన్నే బయటపెడుతున్నట్టుగా ఉందని వ్యాఖ్యానించింది…

ఎస్, సన్ టీవీ పట్టుదలకు పోయింది… ఆఫ్టరాల్ ఒక నటి అనుకుంది… కానీ ఈ మొండి కేరక్టరేమో ఎన్నేళ్లయినా సరే, పోరాడతాను అనుకుంది… పరువు నష్టం కేసుల్లో డబ్బు కంటే ప్రతిష్ఠ ముఖ్యం… రూ.10 లక్షల పరిహారం చిన్నదో పెద్దదో… కానీ అది చెల్లిస్తే సన్ టీవీ తప్పు చేసినట్టు ఒప్పుకున్నట్టే అవుతుంది… అందుకని ఇంకా పైకోర్టుకు వెళ్తుందేమో… ఏమో, ఇంకా ఓపిక ఉంది, ఆమె కూడా పోరాడుతుందేమో…

ఇక్కడ చూడాల్సింది మీడియా నైతికతను, వృత్తిపరమైన బాధ్యతను… ఎవడో ఏదో కూస్తే దాన్ని యథాతథంగా ప్రసారం చేశామని చెబితే కుదరదు… పత్రికల్లో ప్రచురించే ప్రతి అక్షరానికీ, టీవీల్లో ప్రసారమయ్యే ప్రతి బిట్‌కు మీడియా సంస్థ బాధ్యత వహించాల్సిందే… సుకన్య కేసు చెబుతున్న పాఠమిదే…

ఆమె కోల్పోయిన పరువు, పోరాడిన కాలం, తీర్పులో జాప్యం పరిగణనలోకి తీసుకుని చూస్తే… సుకన్యకు న్యాయం దక్కినట్టేనా..? సమాధానం లేని ఓ చిక్కు ప్రశ్న..!! 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అబ్ ఆయేగా మజా ..! జార్ఖండ్ బరిలో సాయిరెడ్డి, పరిమళ్ అంబానీ..!!
  • సుకన్య..! పరువుకై 30 ఏళ్ల సఫల పోరాటం… మీడియాకు ఓ పాఠం..!!
  • …. అందుకే రేవంత్ రెడ్డి ప్రత్యర్థుల అంచనాలకు అందడు..!!
  • గ్రేట్ నికోబార్… దేశరక్షణ అవసరమే… కానీ ఏ మూల్యానికి..? (రెండో పార్ట్)…
  • గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు… రుతుపవనాల తీరునూ దెబ్బ తీయబోతోందా…
  • నో, నో… అన్నా మలై బుద్దిలేని బొద్దింక కాదు… తన రూటే సపరేట్…
  • ఇష్టసఖి త్రిష కాదు… తిరుచ్చి నుంచి బహుశా రాఘవ లారెన్స్…!
  • ప్రొఫెషనల్ ఆందోళనకారుల మ్యాపింగ్… ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ యాక్షన్…
  • జగమంత హాస్పిటల్ మాది… ఐసీయూ జీవితం మాది…
  • Konkona Sen … అమ్మతనానికి పెళ్లితే పనేంటి..? ప్రేమకు వయస్సుతో పనేంటి..?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions