Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

హక్కుల బాలగోపాల్ స్మృతి… ఒక వాస్తవిక గణితం…

June 10, 2026 by M S R

.

Kandukuri Ramesh Babu …. #జయంతి
బాలగోపాల్ గారి స్మృతి… ఒక వాస్తవిక గణితం

బాలగోపాల్ గారి గురించి ఆయన యాక్టివిజం గురించి తెల్సుకుంటున్న కొద్దీ ఒక హీరోవర్షిప్ మనసును ఎంతగానో ఉత్సాహపరుస్తుంది. ఉల్లాసపరుస్తుంది. ఆయన వెడల్పైన కాలర్ గానీ, దూసుకోని వారి జుట్టు గానీ, మడిచిన చేతులు గానీ, అంతా నిజ హీరో అని మళ్లీ మళ్లీ గుర్తొచ్చి బాలగోపాల్ గారంటే అభిమానం రెట్టింపవుతుంది.

Ads

వారి ప్రతి జయంతికి, వర్ధంతికి ఆయన రిలవెన్స్ పెరుగుతున్నట్టు అనిపిస్తుంది. హీరోవర్షిప్ అన్నందు వల్ల ఇంకో మాట.. తన పనేమిటో తాను నిర్వచించుకున్నాక ఇక వేరే విషయాలేవీ తనను ప్రభావితం చేయని తెలుగు నిజ హీరోల్లో ఆయనొకరు.

కొన్ని అలవాట్లు, విలువలూ కొందరు అనుసరించాక అవి ఆదర్శంగా మారుతాయి. పౌర హక్కుల కార్యాచరణలో ఆయన నెలకొల్పిన విలువలు తరువాతి తరానికి పాఠాలుగా నిలిచాయి. కానీ, ఆయన పని తీరు ఆయనకే సొంతం. ఒకరికోసం కాకుండా తనకోసం కొన్ని విలువలు, ఆచరణ చేపట్టి ఆయన మనకు దారి చూపలేదు. తానే దిక్కుగా మారారు.

వరంగల్, హన్మకొండల్లో లేదా నాడు తెలంగాణలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజ్య హింసను ఆయన దేశానికి చెప్పాలనుకోవడంతో ఎకనమిక్ పొలిటికల్ వీక్లీ వంటి వాటిల్లో రాయాలనుకున్నప్పుడు ఇంకా సరైన అధ్యయనాలే లేనప్పుడు అతడు చొరవ తీసుకొని ప్రారంభించిన కార్యాచరణే తొలి హక్కుల వ్యాసంగం అని వరవరరావు గారు ఒక సందర్భంలో రాసినట్టు గుర్తు.

ఒక్క మాటలో స్వచ్ఛంద కార్యాచరణకు ఆయన నిజమైన నిదర్శనం. తనను తాను తీర్చిదిద్దుకున్న తీరే అందుకు ఉదాహరణ.
నిజ నిర్ధారణ అన్నది ఏకపక్షం కాకుండా ఆయన తనని తాను మలుచుకున్న తీరు, వామపక్ష లేదా సీరియస్ రాజకీయాల్లో నిజంగానే ఒక కథానాయకుడి వ్యవహారం.

ఒక మనిషి తాను అప్పటికే చేపట్టిన కార్యరంగంకన్నా మరొక కార్యరంగం వల్ల ప్రజలకు మేలని తెలిసినప్పుడు, ఆ సంగతి తనకు పూర్తిగా అవగతమైనప్పుడు, తనను తాను పౌరహక్కుల కార్యకర్తగా, తర్వాత మానవ హక్కుల కార్యకర్తగా, అలాగే న్యాయవాదిగా మలుచుకోవడం అంటే అదే నిజమైన ఎదుగుదల, వాస్తవిక గణితం అని నా నమ్మిక. అతడు నిజమైన హక్కుగా బతికిన వీరుడనీ నా విశ్వాసం.

నాకు బాగా గుర్తు. ఆయన జీవన సహచరి వసంతక్క చెప్పింది. ఒకసారి తాను జైల్లో ఉన్నప్పుడు కలవడానివి వరంగల్ వస్తుంది. కాళోజీ గారు క్రికెట్ చూస్తూ “కొంచెమాగి వెళ్తాం” అంటూ కాలయాపన చేస్తుంటారు. ములాఖత్ సమయం మించిపోతుందని ఆమె తొందర చేస్తుంది. చివరకు వెళతారు. లోపల నుంచి బాలగోపాల్ గారు బయటకు వస్తారు.

ఈవిడ అతడి దగ్గరకు వెళ్లి అతడి కేసు విషయంలో జరుగుతున్నది వివరిస్తారు. ఆయన విని తాను చెప్పవలసింది చెబుతారు. చెప్పాక పని అయిపోయింది కదా అని వెనుదిరిగి మళ్లీ జైల్ బారక్ లోకి వెళతారు. నేను ఎప్పటికీ మర్చిపోని చిత్రమైన సన్నివేశం అది.

చీకట్లోంచి వెలుతురులోకి వచ్చి, మళ్లీ ఆ చీకట్లోకి వెళతారు. నిజానికి ఆయనకు ఆ చీకట్లో ఏమీ పనిలేదు.
కానీ, ఇక్కడ పని పూర్తవగానే అక్కడ ఉంటారంతే.

అవసరం … అనవసరం.. విషయంలో బాలగోపాల్ గారు ఎంచుకున్న ప్రాధాన్యతలు చాలా విలువైనవి. అందరూ అనుసరించదగ్గవి కాదు. అందుకే వారిని హీరో అని ముందు పేర్కొన్నది ఎందుకు అంటే తాను నాయకుడు కనుక. మిగతా వాళ్ళు చాలాసార్లు అనుసరించిన వాళ్లే కనుక.

మనలాంటి వాళ్లయితే ఎంత టైం ఇస్తే అంత టైం వాడుకుంటాం. కానీ, ఆయన బాలగోపాల్.
దేనికి ఎంత టైం ఇవ్వాలో అంతే టైం ఇచ్చి వెలుతురులోకి వెళ్లిపోయినారు, మనల్ని చీకట్లోనే ఉంచి. అంతేకాదు, మన స్వచ్ఛంద కార్యాచరణ ఏమిటో మనల్నే నిర్ణయించుకోమని కూడా చెప్పకుండానే చెప్పి వెళ్లారు.

చివరికి ఆయన చివరి శ్వాస తీసుకోవడానికి ముందు కూడా ఒక చిన్న హాస్పిటల్ కి వెళ్ళినట్టు గుర్తు… ఒక సామాన్య పౌరుడిలా! తాను ఎవరు అన్నది కాకుండా ఒక మనిషిలా వెళ్లారు. ‘బతికిన మనుషులు’ అన్న ప్రయోగం చేస్తే యాక్టివిజాన్ని ఆశ్రయించి, భద్ర జీవితాన్ని కలలో కూడా ఊహించకుండా నిజంగా బతికిన అతి కొద్ది మందిలో ముఖ్యులు బాలగోపాల్ గారు అవుతారని నా భావన.

2009లో చనిపోయారు. అంటే 17 ఏళ్లు ఆయన లేని కాలం గడిచింది.

బ్రతికినంత కాలం ఆయన ‘ఆలోచన’ చేశారు. ‘పని’ చేశారు. ‘సమీక్ష’ -‘ఆత్మ విమర్శ’ అన్న మాటలు డాక్యుమెంట్లకు పరిమితమైన రోజుల్లో ఆయన తనంతట తాను ఆచరించి చూపారు. అందుకే ఆయన జీవితం గణితశాస్త్ర ప్రొఫెసర్ నుంచి, సాహిత్య విమర్శకుడి నుంచి, తెలంగాణలో మొదలైన పౌర హక్కుల కార్యచరణ నుంచి, కాశ్మీర్ లోని మానవ హక్కుల దాకా; అలాగే కోర్టు మెట్లు కూడా ఎక్కి నిజంగానే వాదించిన న్యాయవాది దాకా ; వారి జీవితం ఒక అద్భుతమైన వికాసం.

ముఖ్యంగా సంక్షుబిత కాలంలో అధ్యయనం చేయవలసినటువంటి జీవగ్రంధం బాలగోపాల్. కందుకూరి రమేష్ బాబు    (Samanyashastram Gallery)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఫాఫం విష్ణుప్రియ..! చివరకు ఆ చీప్ జబర్దస్త్ షోలోనూ సెటైర్లు..!!
  • హక్కుల బాలగోపాల్ స్మృతి… ఒక వాస్తవిక గణితం…
  • అమ్మ కుర్చీ..! శూన్య నేత్రాలు… శుష్క నిరీక్షణలు… ఇప్పటి అమ్మ…!!
  • మాయదారి సంత..! రేయ్, ఎవుర్రా మీరంతా..? యాణ్నుంచి వచ్చార్రా..!!
  • భారతీరాజా గొప్ప దర్శకుడే… కానీ కొన్ని వివాదాలు కూడా…
  • సర్కారు ఉంటేనేం, పోతేనేం… డీఎంకే లిక్కర్ వసూళ్లపై విజయ్ నజర్..!
  • తెలుగు వెండితెరపై 30 ఏళ్ల క్రితమే ‘హక్కుల కాక్రోచ్‌లు…
  • వినకుండానే నామినేషన్ రద్దా..? రిటర్నింగ్ ఆఫీసర్ చేసిన తప్పేంటంటే..?
  • నత్వానీకి, మీనాక్షికి వేర్వేరు న్యాయాలు… డబుల్ స్టాండర్డ్స్..! సీట్ చోరీ…!
  • ఆ సీఎంకు ముందే ఎలా తెలుసు..? ఇదంతా ముందస్తు ప్లానేనా..!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions