.
Subramanyam Dogiparthi …. దసరా బుల్లోడు సినిమాలో చేసిన అన్యాయాన్ని వి బి రాజేంద్రప్రసాద్ ఈ బంగారు బుల్లోడు సినిమాలో సరిదిద్దుకున్నాడు . ఆ సినిమాలో ఇద్దరు హీరోయిన్లలో ఒకరయిన అమాయకురాలు చంద్రకళను లేపేసాడు . ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు రమ్యకృష్ణ , రవీనా టాండన్ చక్కగా ఇద్దరూ పాల గ్లాసులతో శోభనపు గదిలోకి ఎంటరయిపోయి సినిమాను సుఖాంతం చేసారు నిర్మాత వి బి రాజేంద్రప్రసాద్ , దర్శకుడు రవిరాజా పినిశెట్టి , కధా రచయిత పద్మకుమార్ .
సినిమాలో చాలా మలుపులు ఉంటాయి . తీవ్రవాదులు పిల్లల్ని కిడ్నాప్ చేసిన రాణా తన తమ్ముడిని వదలాలని షరతు పెడతాడు . మారకంలో పిల్లల్ని విడిపించుకున్నాక రాణా తమ్ముడిని పోలీసులు చంపేసిన తర్వాత రాణా కావాలనే పోలీసులకు లొంగిపోతాడు .
Ads
జైల్లో ఉండే పోలీసు ఆఫీసర్ బెనర్జీని , అతని భార్యను , కొడుకును చంపిస్తాడు . మన దేశంలో జైళ్ళల్లో ఉంటూ బయట మర్డర్లు అద్భుతంగా చేయిస్తారు కదా ! అతని బారి నుండి బెనర్జీ చెల్లెలు రవీనా టాండన్‌ని రక్షించటానికి రాణా స్వంత గ్రామం అయిన ఆనాటి తూర్పు గోదావరి జిల్లా లోని పూడిపల్లికి చేరి హీరో బాలకృష్ణ తల్లి అన్నపూర్ణమ్మ ఆశ్రయం తీసుకుంటారు .
ఆ గ్రామంలోనే ఉండే హీరో మరదలు రమ్యకృష్ణ తన బావ మీద ఏ ఆడపిల్ల గాలి తగలకుండా కాపలా కాసుకుంటూ ఉంటుంది . ఇద్దరు హీరోయిన్ల మధ్య లవ్ వార్ ప్రారంభమై హీరో బాలకృష్ణ రవీనా టాండన్ మెళ్ళో బలవంతంగా తాళి కట్టేస్తాడు . ఆ తర్వాత కధ మలుపులు , కుదుపులు తిరిగాక క్లైమాక్సులో మరో పోలీస్ ఆఫీసర్ శరత్ సక్సేనా విలన్ అవతారం ఎత్తి ఆ గ్రామానికి వస్తాడు .
వచ్చి రవీనా టాండన్ కు రక్షణగా వచ్చిన ఆఫీసర్ శ్రీవిద్యను , ఇతర పోలీసులను చంపేసి శరత్ సక్సేనా రవీనా టాండన్‌ని కిడ్నాప్ చేయటం , అతన్ని హీరో లేపేయటం , ఉరిశిక్ష తప్పించుకొని వచ్చిన మరో విలన్ దేవరాజుని కూడా లేపేయటం , ఇద్దరు హీరోయిన్లు పాల గ్లాసులతో ఎంటరవటంతో సినిమా సుఖాంతం అవుతుంది .
1+2 సినిమా . బాలకృష్ణకు , రమ్యకృష్ణకు రొటీన్ పాత్రలే . రవీనా టాండన్ కి మొదటి సినిమా . ముగ్గురూ రొమాంటిగ్గా అదరగొట్టేసారు . ఆ తర్వాత చక్కగా నటించింది అన్నపూర్ణమ్మ . రావుగోపాలరావు ఉన్నా వానపాము పాత్రే . ఇతర పాత్రల్లో అనిత , అల్లు రామలింగయ్య , మాస్టర్ బాలాదిత్య , రామాయణంలో పిడకల వేట పాత్రల్లో బ్రహ్మానందం , బాబూమోహన్ , దేవరాజ్ , దేవన్ తదితరులు నటించారు .
రాజ్ కోటి సంగీత దర్శకత్వంలో సినిమాలో పాటలన్నీ వీర హిట్టే . బహుశా మొదటి వానపాట ఆత్మబలం సినిమాలో వి బి రాజేంద్రప్రసాద్ గారే పెట్టారేమో . చిటపట చినుకులు పడుతూ ఉంటే . అలాంటి వానపాట ఈ సినిమాలో కూడా ఉంది . స్వాతిలో ముత్యమంత ముద్దుగా అంటూ సాగుతుంది రవీనా టాండన్ , బాలకృష్ణల మీద .
వారిద్దరి మీద మరో డ్యూయెట్ ఎన్నెట్లో చాపేసి ఎన్నిచ్చి కూచుంటా కూడా బాగుంటుంది . రమ్యకృష్ణ , బాలకృష్ణల మీద రెండు డ్యూయెట్లు . గుడివాడ గుమ్మరో ఘుమఘుమాగుందిరో గుంటూరు గుంటడు యమయమాగున్నడు ; మనసు ఆగదు వయసు తగ్గదు అంటూ సాగుతాయి . రెండూ స్పీడుగానే ఉంటాయి .
1+2 మీద కూడా ఓ పాట . తధిగిణతోం తధిగిణతోం బాలయ్యో ఇటు రావయ్యో నా చూపే శృంగారం అంటూ హుషారిస్తుంది . పాటల్ని వేటూరి , భువనచంద్ర వ్రాయగా బాలసుబ్రమణ్యం , చిత్ర , మనో , శైలజ , మిన్ మిని శ్రావ్యంగా పాడి హిట్ చేసారు . శివ సుబ్రమణ్యం , డి కె యస్ బాబు , తారలు డాన్సుల్ని బాగా కంపోజ్ చేసారు .
స్క్రీన్ ప్లేని , డైలాగులను సత్యమూర్తి అందించారు . దర్శకత్వం వహించిన రవిరాజా పినిశెట్టి పాటల్ని అందంగా చిత్రీకరించారు . గోదావరి అందాలను కూడా బాగా చూపారు .
బాలకృష్ణ నటించిన మరో హిట్ సినిమా నిప్పురవ్వ కూడా ఈ సినిమాతో పాటే 1993 సెప్టెంబర్ మూడో తేదీన విడుదలయి రెండూ వంద రోజులు ఆడటం విశేషం . తెలుగులో సక్సెస్ అయిన ఈ బంగారు బుల్లోడు హిందీలోకి డబ్బింగ్ అయింది . ఏక్ అనారీ దో ఖిలాడీ టైటిలుతో . ఈ బంగారు బుల్లోడు యూట్యూబులో ఉంది . Excellent romantic entertainer .
Share this Article