Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆ బుజ్జి ఉడుత కథ పెద్దదే – పర్ణశాల నుంచి రామేశ్వరం దాకా…

June 22, 2026 by Rishi

.

కథ చెప్పడంలో యండమూరి ప్రసిద్ధహస్తుడు… ఇది ఓసారి చదవండి, తను పబ్లిక్ డొమయిన్‌లో షేర్ చేసుకున్నదే… బాగుంది.. కథల్ని పిల్లలకు ఎలా చెప్పాలో ఓ పాఠం…



వేసవి సెలవుల్లో లక్ష్మి చిన్ననాటి స్నేహితురాలు సక్కూబాయి పిల్లలతో వచ్చింది. లక్ష్మి చెప్పే కథలు ఆమె పిల్లలకి కూడా అలవాటు అయ్యాయి. వారు కాస్త మారటం తల్లి గమనించింది. ఆ రాత్రి కథ వినటానికి పిల్లలు పక్క మీద చేరారు.

Ads

“రిమోట్ కోసం మా పెద్దోడు చిన్నోడిని కొడతాడు. చిన్నోడు అమాయకుడు” అంది సక్కూబాయి.

“అమ్మా. అమాయకత్వం అంటే గుర్తొచ్చింది. ఈ రోజు మా మాస్టారు ‘అమాయకత్వానికి మించిన వరం మరొకటి లేదు. అజ్ఞానం, దౌర్జన్యం మాత్రం సహించకూడదు’ అన్నారు. తేడా ఏమిటమ్మా?” అడిగారు.

“మీ మాస్టారు ఎవరో గాని ఆయనకి పాదాభివందనం చేయాలి. పిల్లలకు పాఠాలతో పాటు లోకజ్ఞానం కూడా చెబుతున్నారు” అని మెచ్చుకుంది లక్ష్మి.

 

“ఓ చిన్న పాప సబ్బు బుడగలతో ఆడుకుంటూ ఆనంది౦చటం అమాయకత్వం..! జూదంలో డబ్బులొస్తాయని ఆడి మొత్తం పోగొట్టుకోవటం అజ్ఞానం. కావలసిన ద ాని కోసం, బలహీనుల మీద బలప్రయోగం దౌర్జన్యం” అన్నది.

సక్కూబాయి పెద్దకొడుకు సిగ్గుతో తల వ౦చుకున్నాడు.

“అమాయకత్వం, స్వార్థం మీద మాకు కథ చెప్పమ్మా” అని అడిగారు పిల్లలు.

“ఒక అడవిలో ఒక ఉడుత ఉండేది. దాని పేరు బుజ్జి. దానికి రేగిపళ్ళు అంటే చాలా ఇష్టం. సీతాఫలాలు కూడా…” అన్నది లక్ష్మి. నలుగురు పిల్లలూ ఆసక్తిగా వింటున్నారు.

“ఒక రోజు ముగ్గురు మనుష్యులు అడవి చదును చేసి కర్రలతో గుడిసె వేసుకోవటం చెట్టు కొమ్మ మీద నుంచి చూసింది. హడావుడిగా వెళ్లి తల్లితో, “అమ్మా మన అడవిలోకి ఎవరో వచ్చారు” అంది.

“గిరిజనం అడివికి రావడం అలవాటే కదమ్మా. దాంట్లో ఆశ్చర్యం ఏముంది” అన్నది తల్లి.

“కాదమ్మా. వాళ్ళు ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నారు” అన్నది బుజ్జి. ఆశ్చర్యపోయిన తల్లి పొదల్లోంచి బయటకు వచ్చి చూసింది. బుజ్జి చెప్పింది నిజమే. ఇద్దరు మొగవాళ్ళు ఇంటి చుట్టూ వెదురు కర్రలతో దడి కట్టారు; ఆమె మొక్కలు వేసింది. వర్షాలు పడగానే చిన్న తోట తయారయింది.

వాళ్లు ముగ్గురూ బుజ్జికి భలే నచ్చేశారు. ముఖ్యంగా మాలక్ష్మి. ఆమె ఎప్పుడూ నవ్వుతూనే ఉంటుంది.

తల్లి కూడా ‘వాళ్లు మంచివాళ్ళ లాగానే ఉన్నారు’ అంది. ఆవిడకి మాలక్ష్మి మొగుడు బాగా నచ్చాడు. “ఎంత బావున్నాడే. చూడటానికి కళ్ళు సరిపోవట్లేదు” అంది. నాన్నకి మాత్రం రెండో కుర్రాడు బాగా నచ్చేశాడు.

సమయం దొరికితే చాలు, అక్కడికి వెళ్లి చూడటమే బుజ్జికి దినచర్య అయిపోయింది. ఒక రోజు చూరు సందుల్లోంచి ఆమె పూజ చేసుకుంటూ కనపడింది. పవిత్రతతో కూడిన ఆ మొహంలో ప్రశాంతత చూస్తూంటే, తెలియని పూజ్య భావం కలిగింది. అంతలో ఆమె అకస్మాత్తుగా కళ్ళు విప్పే సరికి కంగారు పడింది.

ఆమె బుజ్జిని చూసి నవ్వి, పక్కన పళ్ళెంలో ఉన్న పండు తీసి ‘ఇందా’ అన్నట్టు చేయి సాచింది.

బుజ్జి కాస్త భయ పడింది కానీ, ధైర్యం తెచ్చుకొని వెళ్లి తన బుజ్జి చేతుల్తో దాన్ని అందుకుంది. ఆ రోజు నుంచీ అది ప్రతి రోజూ రావడం… ఈమె ఏదో పండు ఇవ్వటం… అలా ఇద్దరూ మంచి స్నేహితులు అయిపోయారు.

ఒక రోజు కొమ్మ చివర బుజ్జి ఉసిరి కాయ కొరుకుతూ ఉండగా క్రింద గొడవ వినిపించింది. భార్యా భర్తలేమో అని కంగారు పడి పై నుంచి చూస్తే… వాళ్ళు కాదు. తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది. అసలా దంపతులు సరదాకైనా దెబ్బలాడుకునే వారిలా కనిపించ లేదు. తన అనుమానానికి తనకే సిగ్గేసింది.

కింద మాలక్ష్మి మరిది ఎవరో స్త్రీతో గొడవ పడుతున్నాడు. ఆవిడని చూస్తే బుజ్జికి మంచి అభిప్రాయం కలగలేదు. మళ్లీ చెట్లలోకి వెళ్ళి పోయింది. ఈ గొడవ ఇక్కడ ఆగినట్టూ లేదు. కొన్నాళ్ళకి అడవిలో ఎక్కడో దూరం నుంచి మళ్ళీ పెద్ద కేక వినబడి, పొదల్లోంచి గబ గబా వచ్చి చూసింది. మగవాళ్ళు ఇద్దరూ పర్ణశాలలో లేరు. దూరపు అరుపు విని మరిది వెళ్లినట్టున్నాడు. ‘భవతీ భిక్షాందేహి’ అన్న మాట వినబడింది…”.

…అప్పటి వరకు కథ విన్న కూతుళ్ళు “నువ్వు చెపుతోంది రామాయణం కదమ్మా” అని అడిగారు. తల్లి నవ్వి “అవునమ్మా అదే. కానీ అందులో ఉడుత కథ” అంటూ కొనసాగించింది.

“గీత దాటి నువ్వే బయటికి రామ్మా” అంటున్నాడు అతను. అవతలి వాడు రాక్షసుడు అని తెలుస్తోంది. ఆమె గీత దాటబోతుంటే ‘వద్దు వద్దు’ అని చెప్పాలనుకుంది కానీ, దానికి మాటలు రావు కదా. ఎలా చెప్పాలో తెలియలేదు. చూస్తుండగానే వాడామెని బలవంతంగా ఎత్తుకొని మేఘాల్లోకి వెళ్లి పోయాడు.

కింద పరిగెత్తడం ప్రారంభించింది. తల్లికి కూడా చెప్పలేదు. మహాలక్ష్మి అంటే అంత ప్రేమ..! అలా చాలా సేపు పరిగెత్తిన తర్వాత దానికి ఒక పెద్ద పక్షి కనబడింది. దాని రెక్కలు విరిగి ఉన్నాయి. “సీతామాలక్ష్మిని రావణాసురుడు దక్షిణ౦ వైపు తీసుకువెళ్ళాడు’’ అని చెప్పి, ఆమె ఆకాశం నుంచి వదిలిన ఆభరణ౦ చూపించింది.

మొదటి రోజు తను ఆమె నుదుటన చూసిన పాపిడి బిళ్ళ అది. మళ్ళీ పరిగెత్తింది. మేఘాల్లో రథం మాయమైంది. ఒక వేళ వాడు దొరికినా తనేమి చెయ్యగలదో తనకే తెలీదు. అయినా రోజుల తరబడి పరిగెత్తి౦ది. అమ్మా నాన్నా భయపడతారేమో అని కూడా ఆలోచించకుండా అలా ఎన్ని రోజులు పరుగెట్టిందో తెలీదు.

అంతలో పెద్ద సముద్రం కనపడింది. అక్కడ వానరులు వారధి కడుతున్నారు. బుజ్జికి చాలా ఆశ్చర్య౦ వేసింది. దగ్గరగా వెళ్ళింది. వాళ్ళ మాటల బట్టి తను చూసిన కపట బిచ్చగాడు రావణాసురుడని అర్థమయింది.

అంతలో “ఎవరు నువ్వు” అని వెనుక నుంచి ఒక్కసారిగా వినబడిన మాటలకి ఉలిక్కిపడి తల ఎత్తి చూసింది. నిలువెత్తు వానరుడు నిలబడి ఉన్నాడు. కాస్త భయపడినా, “నా పేరు బుజ్జి” అన్నది ధైర్యంగా.

“నా పేరు హనుమంతుడు” అన్నాడు. దాని కళ్ళలో సంశయం గమనించి, త్రికాల జ్ఞాని కాబట్టి అతడికి ఉడుత కథ అర్థమై, చూపు ఇంకా ఆ ఇద్దరు యువకుల మీదే ఉండటంతో, “వారెవరో తెలియకుండానే ఇంత దూరం వచ్చావా? ఆ నీల మేఘశ్యాముడు శ్రీరామచంద్రుడు” అన్నాడు. బుజ్జి దిగ్భ్రాంతి చెందింది.
ఇంతకాలం తన పొదల పొరుగువాడు- అరవిందదళాక్షుడు, అఖండ ధర్మ రక్షకుడు, అరివర్గ వినాశకుడు, శ్రీరామచంద్రుడని తెలిసి చేతులు ఎత్తి నమస్కరించింది.

“ఆ పక్కనున్న సోదరుడు లక్ష్మణుడు” అన్నాడు. ఆ రోజు లక్ష్మణుడితో సంభాషించింది అసుర స్త్రీ అనీ, అడవిలో తను విన్న అరుపు ‘హా లక్ష్మణా’ అనీ గ్రహించింది. సీతామాలక్ష్మి లక్ష్మణ రేఖ దాటగానే, తన కళ్ళ ముందే బ్రాహ్మణ వేషం నుంచి భయంకర రాక్షసరూపం దాల్చిన ఆ అసురాధముడి స్వార్థం తెలిసింది.

అతడిని చంపటం కోసం, రాముడు యుద్ధానికి బయలు దేరాడని హనుమంతుడు చెప్పగా చిన్ని బుజ్జి ఆనందం చెలియలికట్ట దాటింది. వారధికై వానరులు సముద్రంలో వేస్తున్న రాళ్ళని సముద్రుడు వినమ్రుడై పైకి తేలుస్తున్నాడు. తన స్నేహితురాలు తొందరగా వెనక్కి రావాలని బుజ్జి కూడా చిట్టి చిట్టి చేతులతో చిన్న చిన్న రాళ్ళని సముద్రంలో వేయడం ప్రారంభించింది.

ఆ దృశ్యాన్ని వానరులు ముచ్చటగా చూశారు. అసలెప్పుడూ నవ్వని జాంబవంతుడు కూడా మందహాసం చేశాడు.

అంతలో శ్రీరాముడు అక్కడికి వచ్చాడు. ఆ చిన్ని సాయానికి కన్ను సజలం కాగా, వెన్ను మీద మృదువుగా నిమిరాడు. ఆ మూడు వేళ్ళ కొసల నుంచి జాలువారిన దయా కారుణ్య పారావారం, ఆ జీవిపై జారి, దానిని భూమ్మీద జీవుల్లో కెల్లా అత్యంత సౌందర్యవ౦తమైన దానిగా మలిచింది.

ఆశించకుండా సేవ చేసిన ప్రేమ ఆ ఉడుతది. దయ తాకిన చోట దివ్యత్వం పుట్టిందనటానికి సాక్ష్యంగా, ఆ బుజ్జి ఉడుత వెన్ను మీద మెరిసిన రేఖలు భగవంతుని ఆశీర్వాదపు ముద్రలు..! ఆ క్షణం వరకూ పొట్టిగా, పీలగా ఉన్న ఆ జీవి- రాముని స్పర్శతో కేవలం రూపంలోనే కాదు. ఆత్మలో, స్పూర్తిలో, సేవలో ఒక ప్రత్యేక సౌందర్యం సంతరించుకుని పావనమైన ప్రాణిగా నిలిచిపోయింది.

రావణాసురుడిది స్వార్థం , దౌర్జన్యం. బుజ్జిది ప్రేమ, అమాయకత్వం. అదే తేడా” అన్నది.

సక్కూబాయి పెద్ద కొడుకు కళ్ళు తడి అయ్యాయి. అప్రయత్నంగా తమ్ముడి భుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గరకు తీసుకున్నాడు.

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఆ బుజ్జి ఉడుత కథ పెద్దదే – పర్ణశాల నుంచి రామేశ్వరం దాకా…
  • ప్రకాష్ రాజ్‌కు కోర్టు సమన్లు..! ఈసారి కేసు మల్టిపుల్ ఓటరు కార్డులు..!!
  • వరుస ఫ్లాపులతో అమితాబ్ కెరీర్ ఇక క్లోజ్ అనుకునే దశలో ..!
  • మా నాన్నను నిజంగానే చాలా అడగాలనుకున్నాను…
  • అదే పాట – అదే సిరివెన్నెల- భానుమతి పాడితే నో – తనే పాడుకుంటే నంది
  • రష్మిక Vs సమంత…! పోలికే అనవసరం… 2 సినిమాలు వేరు- 2 బతుకులు వేరు…
  • ఒక తల్లి, ఒక కొడుకు – మారుపేర్లు, మారిపోయే ఊర్లు… ఎందుకిలా..?
  • అందం అంటే ఏమిటి..? ప్రామాణికాలు, కొలమానాలు ఏమున్నాయి..?
  • వేల విదేశీ డెబిట్ కార్డులు – అమెరికా ఎన్‌జీఓ దేశద్రోహ కుట్ర
  • మామా ఏక్ పెగ్‌లా – నో స్కాచ్ – ఇండియన్ విస్కీ కిక్కే వేరప్పా..!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions