.
కేంద్ర ప్రభుత్వం @ ఎన్డీయే ప్రభుత్వం @ మోడీ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వాన్ని కేవలం పార్టీ కోణంలోనే మాత్రమే చూస్తోందా? తెలంగాణ కూడా తాము పరిపాలించే దేశంలోనే ఓ భాగమేననీ, తెలంగాణ అభివృద్ధి బాధ్యతలో తన పాత్ర కూడా ఉండాల్సిందేననీ విస్మరిస్తోందా? ఇవీ ప్రస్తుత ప్రశ్నలు.
హైదరాబాదులో మీటింగు పెట్టిన మోడీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పక్కన కూర్చోబెట్టుకుని, కలిసి నడుద్దాం అని పిలుపునిస్తాడు. రాజకీయాలు వేరు- రాష్ట్రం- కేంద్రం నడుమ పాలన సంబంధాలు వేరు అనే భావనతో మోడీని పెద్దన్న అని పిలుస్తాడు రేవంత్ రెడ్డి.
Ads
గత కేసీయార్ తరహా కాదు. తెలంగాణకు సంబంధించిన అనేక సమస్యల మీద ఢిల్లీ వెళ్లినప్పుడల్లా రేవంత్ రెడ్డి ప్రధానిని కలుస్తాడు, కావల్సింది అడుగుతాడు, విభిన్న శాఖల మంత్రుల వద్దకు స్వయంగా వెళ్తాడు… సమస్యల పూర్వపరాల్ని, పరిష్కారాల్ని, తన కోరికలను వివరిస్తాడు. ఇదంతా స్టేట్ అండ్ సెంటర్ పాలనలో ఓ సహజమైన పద్ధతి.
గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు (మూసీ పునరుజ్జీవంలో ఓ భాగం) 84 ఎకరాల్ని కేంద్ర రక్షణ శాఖ ‘ఈక్వల్ వ్యాల్యూ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్’ విధానం కింద ఇస్తోంది, పాజిటివ్ సైన్. కానీ మిగతా చాలా సమస్యలు పెండింగ్. దానికితోడు కొత్త సమస్యలు పైనబడుతున్నాయి.
తెలంగాణ ప్రభుత్వం మూసీ ప్రాజెక్టుకు సాయం, ఆర్ఆర్ఆర్, మెట్రో-2 విస్తరణ, ధాన్యం కొనుగోళ్లు, యూరియా కేటాయింపు, తుమ్మడిహెట్టి ఎత్తు పెంపుకి అనుమతి వంటివి కోరుతోంది. ఇందులో పీటముడి పడింది మెట్రో విస్తరణపై. కేంద్రం రకరకాల షరతులు పెడుతోంది. జైకా-ఐఆర్‌ఎఫ్‌సి నుంచి తీసుకున్న రుణాన్ని కూడా బదలాయించడం లేదు.
ఎస్క్రో అకౌంట్ సరే, మెయింటెనెన్స్, రుణచెల్లింపుల విధానం మీద అంగీకారం కుదరడం లేదని పైకి చెబుతున్నా, ఫస్ట్-సెకండ్ ఫేజుల ఉమ్మడి నిర్వహణ మీద ఏదో తకరారు నడుస్తున్నట్టుంది… కీలక ప్రాజెక్టుల విషయంలో… ఓ కేంద్ర మంత్రిగా, తెలంగాణ బిడ్డగా, ప్రత్యేకించి తన నియోజకవర్గ ఇష్యూస్ మీద ఎందుకు స్పందించడం లేదు, సహకరించడం లేదు అని రేవంత్ రెడ్డి కిషన్‌రెడ్డిని ప్రశ్నించడం మొదలెట్టాడు.
ఇది నిందారాజకీయం కాదు. కేంద్రం- రాష్ట్రం సమన్వయంతో వెతకాల్సిన సొల్యూషన్ అనేది రేవంత్ రెడ్డి భావన. అందుకే నేను ఢిల్లీలోనే ఉంటాను రెండురోజులు, అశ్విని వైష్ణవ్‌తో భేటీ ఏర్పాటు చేయండి, మీరూ రండి అని కిషన్‌రెడ్డిని అడిగాడు రేవంత్ రెడ్డి… ఇందులో తప్పు పట్టాల్సింది ఏమీ లేదు, కానీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దీన్ని వెటకారంలోకి, రాజకీయాల్లోకి తీసుకుపోయాడు.
రాహుల్‌తో భేటీ ఏర్పాటు చేయండి, మేం అడగాల్సినవి ఉన్నవి అని లేఖ రాశాడు. ఇది నెగెటివ్ ధోరణి. దీనికి ప్రతిగా పీసీసీ అధ్యక్షుడు మోదీతో భేటీ ఏర్పాటు చేయండి అని ఉల్టా అడిగాడు, ఇదీ అనవసరం. సమస్యను పొలిటిసైజ్ చేసి, పక్కదారి పట్టించడం.
కొత్తగా మరో సమస్య. రాష్ట్ర ప్రభుత్వం అమ్ముకున్న రాయదుర్గం భూములపై రాష్ట్ర లీడ్ బ్యాంక్ ఎస్బీఐ కోర్టుకెక్కడం. ఇది రేవంత్ రెడ్డికి ఆగ్రహాన్ని కలిగించింది. ఇప్పుడు ఢిల్లీ వెళ్తున్నాడు కదా, ఈ సమస్యలపై కేంద్ర మంత్రులను కలవడంతోపాటు ఎస్బీఐ తీరుపై ప్రధానికి, ఆర్థిక మంత్రిత్వ శాఖకు, ఆర్బీఐకి ఫిర్యాదులు చేయబోతున్నాడు.
సో, ఇప్పుడు వస్తున్న, బలపడుతున్న సందేహం ఏమిటంటే? రేవంత్ రెడ్డి కేంద్రం- రాష్ట్రం సత్సంబంధాలు అనే కోణంలో మాత్రమే అడుగులు వేస్తుంటే… కేంద్రం మాత్రం తెలంగాణ ప్రభుత్వాన్ని కేవలం పార్టీ కోణంలో మాత్రమే చూస్తూ సహాయ నిరాకరణ చేస్తోందా? అది వాంఛనీయమా? మరి ప్రధాని ఇచ్చిన ‘కలిసి నడుద్దాం’ అనే పిలుపుకి ఇక అర్థమేముంది? ఫెడరల్ స్పిరిట్ ఏమైనట్టు?
Share this Article