.
అందరికీ నచ్చేలా ఓ జాతీయ క్రికెట్ జట్టు కూర్పు ఎవడి వల్లా కాదు. అది రియాలిటీ. వాడినెందుకు తీసుకోలేదు, వీడినెందుకు తీసుకున్నారు దగ్గర నుంచి ఏరియా, కేస్ట్, లాంగ్వేజ్, రెలిజియన్ లెక్కలు కూడా ప్రస్తావిస్తూ, ఈ సోషల్ మీడియా కాలంలో వంద విశ్లేషణలు వినిపిస్తాయి…
సెలెక్టర్ల మీద రకరకాల రాగద్వేషాలు పనిచేస్తాయి. సహజం, ఇది ఇండియా… ఉన్న పరిమితుల్లో అన్ని రకాల ఒత్తిళ్లను తట్టుకుని ఓ మంచి జట్టును కూర్చడం పెద్ద టాస్క్. అది వైభవ్ సూర్యవంశీకి బౌలింగ్ చేయడమంత చాలా పెద్ద టాస్క్…
Ads
ఐతే… భారత్– ఇంగ్లాండ్ మధ్య జరగనున్న మూడు మ్యాచ్‌ల ODI సిరీస్‌కు భారత సెలెక్టర్లు జట్టును ప్రకటించారు కదా… నాకెందుకో బ్యాలెన్స్‌డ్ కూర్పు అనిపించింది… సీనియర్లున్నారు, జూనియర్లున్నారు, వచ్చే వరల్డ్ కప్ దృష్టిలో పెట్టుకున్నట్టు కనిపిస్తోంది కూడా…
ఈ జట్టులో స్టార్ ఆటగాళ్లు Virat Kohli, Jasprit Bumrah, ఆల్‌రౌండర్ Axar Patel తిరిగి చేరడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అఫ్‌కోర్స్, యువ ఓపెనర్ Yashasvi Jaiswalను జట్టులో నుంచి తప్పించడం చర్చనీయాంశంగా మారింది.
కోహ్లీ, బుమ్రా రీఎంట్రీతో బలపడిన జట్టు …. ఆఫ్ఘానిస్తాన్ సిరీస్‌కు హామ్‌స్ట్రింగ్ గాయం కారణంగా దూరమైన విరాట్ కోహ్లీ, ఇప్పుడు ఇంగ్లాండ్ ODI సిరీస్‌కు ఎంపికయ్యాడు. అయితే అతని ఫిట్‌నెస్‌పై ఇంకా పూర్తి క్లారిటీ రాలేదు. జూలై 14 నుంచి ప్రారంభమయ్యే ఈ సిరీస్‌కు ముందు ఆయనకు ఫిట్‌నెస్ క్లియరెన్స్ తప్పనిసరి అని సెలెక్షన్ కమిటీ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. రాసి పెట్టుకొండి, రోహిత్ ఆడతాడో లేదో తెలియదు గానీ కోహ్లీ మాత్రం వచ్చే వరల్డ్ కప్ ఆడతాడు.
ఇక భారత బౌలింగ్ అస్త్రం జస్ప్రీత్ బుమ్రా కూడా జట్టులోకి తిరిగి వచ్చాడు. 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత ఆయన మళ్లీ ODI క్రికెట్ ఆడలేదు. ఇప్పుడు అతని రీఎంట్రీతో భారత పేస్ దళం మరింత బలంగా మారనుంది. అది ఇంగ్లండ్ జట్టు, బీసీసీఐ తేలికగా తీసుకోలేదు, అది అఫ్ఘనిస్థాన్ జట్టు కాదు, కాబట్టి సీనియారిటీని, ప్రతిభను పరిగణనలోకి తీసుకుంది…
ఆఫ్ఘానిస్తాన్ సిరీస్‌లో కోహ్లీ స్థానంలో ఆడిన యశస్వి జైస్వాల్ అద్భుతంగా రాణించాడు. మూడు ODIల్లో రెండవ శతకం సాధించి, చివరి మ్యాచ్‌లో 110 పరుగులతో అజేయంగా నిలిచాడు. అయితే ఇంత మంచి ప్రదర్శన చేసినప్పటికీ అతన్ని ఈ సిరీస్‌కు ఎంపిక చేయకపోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. కానీ అలా లెక్కేస్తే చాలామందిని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది, అందరినీ సెలెక్ట్ చేయలేరు కదా!
ఈ జట్టులో మరో ముఖ్య మార్పు యువ ఆటగాళ్లపై ప్రభావం చూపింది. అంతర్జాతీయ అరంగేట్రం చేసిన హర్ష్ దుబే, ప్రిన్స్ యాదవ్‌లను కూడా జట్టు నుంచి తప్పించారు. వారి స్థానాల్లో అనుభవం ఉన్న ఆటగాళ్లకు ప్రాధాన్యం ఇచ్చినట్లు కనిపిస్తోంది. తప్పదు, పోరాడేది ఇంగ్లండ్ జట్టుతో మరి…
జూనియర్లను ఇగ్నోర్ చేయలేదు… శుభమన్ గిల్ కెప్టెన్, శ్రేయాస్ అయ్యర్ వైస్ కెప్టెన్… తెలివైన నిర్ణయం. కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ భీకరమైన ఫామ్‌లో ఉన్నారు. వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, నితీశ్ కుమార్ రెడ్డి బ్యాటింగు చేయగలరు, బౌలింగూ చేయగలరు. ప్రత్యేకించి మంచి ఫీల్డర్లు.
బౌలింగులో కూడా బీసీసీఐ ఎంపిక ఆసక్తికరం… బుమ్రాను వదిలేస్తే… వర్తమానంలో రాణిస్తున్న కుల్దీప్ యాదవ్, ప్రసిధ్ కృష్ణ, హర్షిత్ రాణా, గుర్నూర్ బ్రార్ ఎంపియ్యారు… పదే పదే వైడ్స్ వేసి ధారాళంగా పరుగులిచ్చే అర్షదీప్ సింగ్‌ను ఎందుకు ఎంపిక చేశారనే ఒక్క ప్రశ్న మినహా మిగతా జట్టు కూర్పు మాత్రం సమంజసంగానే కనిపిస్తోంది..!
Share this Article