.
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత కొన్ని వారాలుగా నగరంలో కోవిడ్-19, స్వైన్ ఫ్లూ (హెచ్1ఎన్1), ఇన్‌ఫ్లుయెంజా వంటి ప్రమాదకర శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో ముంబైలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు రోగుల రాకతో నిండిపోతున్నాయి….. ఇదీ నిన్న కనిపించిన వార్త
నిజానికి ఒకప్పుడు ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా (కోవిడ్) మెల్లిమెల్లిగా స్వైన్ ఫ్లూ, ఇన్‌ఫ్లుయెంజా వ్యాధుల్లాగే మారిపోయింది, అదెప్పుడూ పూర్తిగా నిర్మూలించబడదు. మనిషికి దాంతో సహజీవనం తప్పదు. ఐతే కోవిడ్ మన ప్రపంచాన్ని కకావికలం చేస్తున్నప్పుడు కార్పొరేట్, ప్రైవేటు వైద్యం ఎంత దోపిడీకి పాల్పడిందో అందరికీ గుర్తుంది.
Ads
నానారకాల ఖరీదైన మందులతో మనుషుల ఒళ్లు, ఇల్లు గుల్ల. కానీ ఆరోజుల్లో కొందరు వైద్యులే తమ వైద్య పరిజ్ఞానంతో, తమ వృత్తికి సార్థకత చేకూరుస్తూ, ప్రయోగాలు చేస్తూ, అనేక మందిని తక్కువ ఖర్చుతో, హాస్పిటళ్లపాలు గాకుండా కాపాడారు. అందులో ఒకరు కాకినాడకు చెందిన ప్రజావైద్యుడు, (Infectious Diseases Consultant) డాక్టర్ యనమదల మురళీకృష్ణ.
టీబీ, ఎయిడ్స్, సాంక్రామిక వ్యాధులకు సంబంధించిన తన ప్రయోగాలు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించడం, గుర్తింపు లభించడం గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం మనం… తాజాగా ఏమిటంటే, కోవిడ్ వైద్యంలో తన సఫల ప్రయోగ ఫలితాలకు ఓ అంతర్జాతీయ జర్నల్‌లో చోటు లభించింది. ఇది విశిష్ట గుర్తింపు. (Journal of Primary Care Specialties’ తాజా సంచిక (మే–ఆగస్టు 2026)…
లక్ష్మీ వైద్యశాల వేదికగా జరిగిన ఈ అధ్యయనంలో, కోవిడ్-19 వల్ల శరీరంలో జరిగే మార్పులను (విపరీతమైన వాపు, రక్తం గడ్డకట్టడం, బాక్టీరియా ఇన్ఫెక్షన్) అరికట్టేందుకు ఆస్పిరిన్, ప్రెడ్నిసోలోన్, అజిత్రోమైసిన్ (Aspirin, Prednisolone, Azithromycin) మందులతో కూడిన ప్రత్యేక చికిత్స విధానాన్ని డాక్టర్ మురళీకృష్ణ ఏప్రిల్ 2021లో సోషల్ మీడియాలో ప్రచురించారు. ఇది తెలుగు రాష్ట్రాలలో గొప్పగా ప్రాచుర్యం పొందింది. అవే మందులను తన వద్దకు వచ్చిన పేషంట్లకు ఇచ్చి, పరిశీలించారు.
అప్పట్లో విస్తృత వినియోగంలో వున్న మెడికల్ కిట్, డాక్సీసైక్లిన్, ఐవర్‌మెక్టిన్, పారాసిటమాల్, వాడిన 60 మంది రోగులతో…, ఈ ప్రత్యేక విధానాన్ని పాటించిన మరో 60 మంది రోగుల ఫలితాలను ఈ పరిశోధనలో సరిపోల్చారు. డాక్టర్ యనమదల చికిత్సా విధానంలో రోగులు త్వరగా కోలుకున్నారని, కేవలం 1.7 శాతం మందికి మాత్రమే ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి వచ్చిందని అధ్యయనం స్పష్టం చేసింది. అదే సాధారణ చికిత్స తీసుకున్నవారిలో 13.3 శాతం మంది ఆసుపత్రి పాలయ్యారు.
అంతేకాకుండా, కోవిడ్ తర్వాత వేధించే నీరసం, పొడి దగ్గు లాంటి సమస్యలు కూడా ఈ విధానం ద్వారా గణనీయంగా తగ్గాయని డాక్టర్ మురళీకృష్ణ యనమదల ఆధారాలతో సహా అంతర్జాతీయ వైద్య సమాజానికి వివరించారు. కోవిడ్ పీడ కాలంలో డాక్టర్ యనమదల సోషల్, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల ద్వారా ప్రజలకు నమ్మకమైన, శాస్త్రీయ సమాచారాన్ని విస్తృతంగా అందించి, ప్రజల్లో భరోసా నింపారు.
భవిష్యత్తులో ఇలాంటి విపత్తులు ఎదురైనప్పుడు, ప్రాథమిక స్థాయిలో (Primary Care) వైద్యం అందించడానికి, ఆసుపత్రులపై భారం తగ్గించడానికి ఈ పరిశోధన ఒక చారిత్రక ఆధారంగా నిలుస్తుందని వైద్య నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. డాక్టర్ గారికి అభినందనలు .

Share this Article