Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అక్కడ నేను ఇంకా బతికే ఉంటాను – మనిషిగా కాదు, ఒక విత్తనంగా!

June 25, 2026 by M S R

.

Raghu Mandaati …. కొన్ని జ్ఞాపకాలు పాత ఫోటోల్లాంటివి. కాలం వాటి మీద దుమ్ము పేరుస్తుంది గానీ, ఒకసారి మనసు వాటిని తుడిచి చూస్తే మళ్లీ ఆ రోజుల రంగులు, వాసనలు, నవ్వులు, మనుషులు అన్నీ యథాతథంగా కళ్ల ముందు నిలబడిపోతాయి. కొన్ని జ్ఞాపకాలు కేవలం గుర్తులు కావు… అవి మనలో ఇప్పటికీ బతికే ఒక చిన్న ప్రపంచం. ఆ ప్రపంచంలోకి మళ్లీ అడుగుపెడితే మన వయసు తగ్గిపోతుంది, మనసు మళ్లీ మట్టిలో ఆడుకున్న పసిపిల్లగా మారిపోతుంది.

చిన్నప్పుడు నా మిత్రురాలు శ్రావ్య, కంకణం కట్టుకున్నట్టు జీవితంలోని ప్రతి ముఖ్య సంఘటనకి ఉదాహరణకు మా గ్రూపులో ఎవరిదైనా పుట్టిన రోజు వస్తే ఆ రోజు మాకు చిన్న చిన్న మూటలు చేతికిచ్చేది. మూట తెరిచి చూస్తే చింత గింజలు, సీతాఫలాల గింజలు, మామిడి పిక్కలు తీసేసిన జీడీ పలుకులు, కమలం పండు విత్తనం పై పొట్టు తీసేసిన పలుకులు, సపోటా గింజలు, వేప విత్తనాలు ఇలా రకరకాల కలెక్షన్లు ఆ మూటల్లో దాగేవి.

Ads

ఆ మూటలు కేవలం గింజల సంచులు కాదు. ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే అవి భవిష్యత్తును మోసుకెళ్లే చిన్న చిన్న కలల సంచులు. ఒక చిన్నారి చేతిలో ప్రకృతి రాసిన ఉత్తరాల్లా ఉండేవి. ప్రతి గింజలో ఒక చెట్టు దాగి ఉండేది. ప్రతి చెట్టులో ఒక నీడ దాగి ఉండేది. ప్రతి నీడలో ఒక జీవితం దాగి ఉండేది.

ఇవ్వడమే కాకుండా అందరం కట్ట గట్టుకుని, భద్రకాళి చెరువు గట్టు మీదకు, పద్మాక్షమ్మ గుట్టకు, బెస్త వాడకి ఆనుకొని ఉన్న రెండు చెట్ల గుట్టకు, లేదా నయీమ్ నగర్ దాటి రామారం భీమవరం వైపుకు, ములుగు రోడ్డు దాటి పెద్దమ్మగడ్డ వైపుకు అలా ఎక్కడ కాళీ ప్రదేశం ఉంటుందో అక్కడికి వెళ్లి దారి వెంబడి చింత గింజల్ని నాటకుండా ఊరికే అలా దారికి ఇటువైపు అటు వైపు రెండు గింజల చొప్పున విసిరేసుకుంటు వెళ్ళేవాళ్ళం, ఇక గుట్టల మీద సీతాఫలాల పోటీ పడి విసిరేవాళ్ళం.

ఆ రోజులు ఇప్పటికీ గుర్తున్నాయి. మధ్యాహ్నపు ఎండ కొంచెం తగ్గి సాయంత్రం వెలుగు బంగారు రంగు పులుముకునే వేళ. భద్రకాళి చెరువు నీళ్లు ఆకాశాన్ని అద్దంలా మోస్తూ ఉండేవి. గుట్టల మీద గాలి అల్లరి పిల్లాడిలా పరుగులు తీస్తూ ఉండేది. దూరంగా గేదెల గంటల శబ్దం వినిపించేది. ఎక్కడో ఒక చోట కాకి అరుపు, ఇంకెక్కడో చిలుకల కిలకిలరావాలు. మేమంతా ప్రపంచాన్ని మార్చేస్తున్నామన్న అమాయక నమ్మకంతో గుప్పెడు గుప్పెడు విత్తనాలు విసురుకుంటూ నవ్వుల మధ్య పరుగులు పెట్టేవాళ్ళం.

అప్పట్లో మా హనుమకొండ గుట్టలన్ని కోతులే పరిపాలించేవి. వాటికి తిండి కరువైన ప్రతిసారి మా ఇంటి పైకప్పుల మీద నుండి ఇంటి ఆరుబయట ఉన్న వాకిట్లో దాడులకు దిగేవి. శ్రావ్య పట్టుబట్టి పండ్ల విత్తనాలన్ని గుట్టల మీదకు తీసుకెళ్లి మాతో విసరమనేది. వాటికి తిండికి లోటు ఉండకుండా ఉండాలంటే మనం వాటికి తిండి పెట్టగలగాలి అనేది.

  • ఆ మాటలో ఎంత పెద్ద తత్వముందో ఇప్పుడు అర్థమవుతుంది. మనిషి ప్రకృతిని ప్రేమించడం అంటే చెట్టు కింద ఫోటో దిగడం కాదు. పక్షికి గూడు ఉండాలని కోరుకోవడం. కోతికి ఆకలి వేయకూడదని ఆలోచించడం. మన తర్వాత కూడా ఈ భూమి జీవంతో నిండిపోవాలని ఆశించడం.

భూమిలో నాటితేనే కదా మొక్క మొలిచేది అంటే నువ్వు విత్తు విసురు ప్రకృతి తన పని తాను చేసుకుంటుంది గుట్టల మీద ఒక జల్లు వాన కురిస్తే చాలు ఒక పెద్ద వనమే మోలుచుకుంటుంది.
అని తను చెప్పినప్పుడు మేము దాన్ని ఆటగా తీసుకున్నాం. కానీ ఇప్పుడు ఆలోచిస్తే అది ఒక విశ్వసత్యం.
మనిషి చేయాల్సింది సృష్టించడం కాదు…
సృష్టికి సహకరించడం.

మనిషి పువ్వును పుట్టించలేడు…
కానీ విత్తనాన్ని నేలకి చేరవేయగలడు.
మనిషి వానను కురిపించలేడు…
కానీ వాన కోసం ఎదురుచూసే నేలను కాపాడగలడు.
మనిషి అడవిని నిర్మించలేడు…
కానీ అడవికి మొదటి విత్తనాన్ని విసరగలడు.
నిజమే కదా అడవిని మనం కాదు కదా సృష్టించింది.

అడవి ఎప్పుడూ ఒక చెట్టుతో మొదలవుతుంది.
ఒక చెట్టు ఒక విత్తనంతో మొదలవుతుంది.
ఒక విత్తనం ఎవరో ఒకరి విశ్వాసంతో మొదలవుతుంది.
ఇప్పుడున్న పరిస్థితిలో మనం కేవలం విత్తనాన్ని ఆ చోటికి చేరిస్తే చాలు అనేది తన సిద్ధాంతం.

తాను అంటించిన ఈ విత్తనాల వ్యాధి అంటువ్యాధిలా వ్యాపించి బస్తాలకొద్ది రకరకాల గింజల్ని, దోస్తులమందరం పోగు చేసేవాళ్ళం.
ఆ రోజుల్ని గుర్తు చేసుకుంటే అనిపిస్తుంది…
ప్రపంచానికి నిజంగా అవసరమయ్యే అంటువ్యాధులు ఇవే కావచ్చు.

దయ అంటుకోవాలి.
ప్రేమ అంటుకోవాలి.
చెట్టు నాటాలనే కోరిక అంటుకోవాలి.
ప్రకృతిని కాపాడాలనే బాధ్యత అంటుకోవాలి.

నేను సైతం బచ్చలి, బీరకాయ, సొరకాయ, టమాటో, కాకరకాయతో పాటు కొన్ని పూల మొక్కల విత్తనాలని కొనుక్కొచ్చి వాకింగ్ పేరుతో మా ఇంటి చుట్టు పక్కల వీధుల్లో ఇంటి ముందు కనిపించిన మట్టి గడుల్లో కుండీల్లో అలా విసిరేసుకుంటు వెళ్ళా.. అంతే కాదు తిన్న మామిడి పిక్కల్ని ఎండ పెట్టి జీడిపలుకు బయటికి తీసి తోచిన చోటల్లా రోజుకోకటి చొప్పున నాటుకుంటు వెళ్ళా.

ఆ రోజుల్లో ఉదయాలు కూడా వేరేగా ఉండేవి. తెల్లవారుజామున తడి నేల వాసన గాలిలో కలిసిపోయి ఉండేది. రాత్రి కురిసిన మంచుబిందువులు గడ్డి ఆకుల మీద చిన్న ముత్యాల్లా మెరిసేవి. పిట్టలు కొత్తరోజు కోసం ప్రార్థన చేస్తున్నట్టు కిలకిలలతో మేల్కొలిపేవి. నేను మాత్రం చేతిలో విత్తనాలతో నిశ్శబ్దంగా నడుస్తూ ఉండేవాడిని.

ఎక్కడో ఒక ఖాళీ మట్టి ఉన్న చోటు కనిపిస్తే చాలు… అది నాకు ఒక భవిష్యత్తు లా కనిపించేది.
అంతే రెండు మూడు జల్లులకి విసిరేసిన విత్తనాలతో పాటు మామిడి మొక్కలు కూడా జీవం పోసుకోవడం చూసి పసిపాపను దోసిల్లోకి తీసుకున్నంత ఆనందం ఈ మనసుకి.
ఆ చిన్న పచ్చని రెండు ఆకులు మట్టిని చీల్చుకుని బయటకు వచ్చిన క్షణం ఇప్పటికీ నా కళ్లలో నిలిచిపోయింది. అది కేవలం ఒక మొక్క పుట్టుక కాదు. ఒక నమ్మకం మొలకెత్తిన క్షణం. మనం చేసిన చిన్న పని కూడా ఈ విశ్వంలో ఎక్కడో ఒక చోట జీవంగా మారుతుందని తెలిసిన క్షణం.

వెనక్కి తిరిగి చూస్తే…
మేము చెట్లు నాటలేదు.
ఆశని నాటాం.
మేము గింజలు విసరలేదు.
భవిష్యత్తుని విసిరాం.
మేము ప్రకృతికి సహాయం చేయలేదు.
ప్రకృతి మమ్మల్ని మనుషులుగా మలచుకుంది.
ఈరోజు ఆ గుట్టల మీద ఎక్కడైనా ఒక చెట్టు నిలబడి ఉంటే…
దాని కొమ్మలపై ఒక పిట్ట పాట పాడుతూ ఉంటే…
దాని నీడలో ఒక ప్రయాణికుడు కాసేపు సేదతీరుతూ ఉంటే…
అక్కడ ఎక్కడో మా బాల్యం ఇంకా బతికే ఉంది.
గాలిలో ఎగిరిపోయిన ఒక చిన్న విత్తనంలా…
కాలం దాటినా మాయంకాని ఒక అందమైన జ్ఞాపకంలా…
మనసు లోతుల్లో ఇప్పటికీ పచ్చగా నిలిచిపోయి ఉంది.

కొన్నిసార్లు నేను ఆలోచిస్తుంటాను…
మనం విసిరిన ఆ గింజల్లో ఎన్ని మొలిచాయో తెలియదు.
ఎన్ని చెట్లయ్యాయో తెలియదు.
ఎన్ని ఎండిపోయాయో కూడా తెలియదు.
కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా తెలుసు…
ఆ గింజలు నేలలో మొలిచాయో లేదో తెలియదు గానీ,
మాలో మాత్రం ఖచ్చితంగా మొలిచాయి.

ఒక విత్తనం చెట్టుగా మారడానికి సంవత్సరాలు పడతాయి.
కానీ ఒక ఆలోచన మనిషిగా మారడానికి ఒక్క క్షణమే చాలు.
ఆ రోజు శ్రావ్య మా చేతుల్లో పెట్టింది గింజలు కాదు…
ఒక దృక్పథం.
ప్రకృతిని వినియోగించుకోవడం కాదు,
ప్రకృతితో సహజీవనం చేయడం అనే దృక్పథం.

ఇప్పుడు ప్రపంచం చాలా మారిపోయింది.
మేము పరుగెత్తిన ఆ గుట్టల మీద ఇప్పుడు రోడ్లు వచ్చి ఉండొచ్చు, లేదా గుళ్ళు, విల్లాలు మొలవచ్చు…
మేము విత్తనాలు విసిరిన దారుల మీద ఇప్పుడు కాంక్రీట్ పరుచుకుని ఉండొచ్చు.
మేము చెట్ల గురించి కలలు కన్న ప్రదేశాల్లో ఇప్పుడు పెద్ద పెద్ద భవనాలు నిలబడి ఉండొచ్చు.
అభివృద్ధి తప్పు కాదు.
కానీ ఒక ప్రశ్న మాత్రం నన్ను తరచూ వెంటాడుతుంది…

మనిషి ఎదుగుతున్నాడా?
లేక కేవలం నిర్మాణాలు మాత్రమే ఎదుగుతున్నాయా?
ఎందుకంటే…
ఎత్తైన భవనాలు నిర్మించడం నాగరికత కాదు.
ఆ భవనం కిటికీకి ఒక పిచ్చుక వచ్చి వాలగలగడం నాగరికత.
విశాలమైన రోడ్లు వేయడం ప్రగతి కాదు.
ఆ రోడ్డు పక్కన ఒక చెట్టు బతికి ఉండగలగడం ప్రగతి.
సాంకేతికత పెరగడం విజ్ఞానం కాదు.
ఆ విజ్ఞానం జీవాన్ని కాపాడగలగడం నిజమైన విజ్ఞానం.

మనం ఈరోజు కృత్రిమ మేధస్సు గురించి మాట్లాడుతున్నాం.
మార్స్ మీద కాలనీలు కట్టాలని కలలు కంటున్నాం.
సముద్ర గర్భాల్లో నగరాలు నిర్మించాలని ప్రణాళికలు వేస్తున్నాం.
కానీ…
భూమి మీద ఒక విత్తనం ఎలా మొలుస్తుందో అనే అద్భుతాన్ని ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నాం.
ఒక చిన్న విత్తనం…
దానికి కాళ్లు లేవు.
చేతులు లేవు.
కళ్ళు లేవు.
అయినా అది ఎక్కడ పైకి ఎదగాలో తెలుసుకుంటుంది.
ఎక్కడ వేర్లు పాతాలో తెలుసుకుంటుంది.
ఎంత లోతుగా భూమిని ఆలింగనం చేసుకోవాలో తెలుసుకుంటుంది.

మనిషి విశ్వాన్ని జయించాలని చూస్తున్నాడు.
కానీ ఒక విత్తనం మాత్రం మనిషికి ప్రతిరోజూ ఒకే పాఠం చెబుతోంది…
“ఎదగాలంటే ముందుగా లోతుకు వెళ్లాలి.”
అందుకేనేమో…
వేర్లు లేని ఎదుగుదల ఎంత ఎత్తుకెళ్లినా ప్రమాదకరమే.

ఆలోచనలు వేర్లు కోల్పోతే సమాజం ఎండిపోతుంది.
సంబంధాలు వేర్లు కోల్పోతే కుటుంబాలు ఎండిపోతాయి.
మనిషి ప్రకృతితో ఉన్న బంధం వేర్లు కోల్పోతే నాగరికతలే ఎండిపోతాయి.
భవిష్యత్తు గురించి ఆలోచించినప్పుడల్లా ఒక విచిత్రమైన దృశ్యం నా కళ్ల ముందు కనిపిస్తుంది.
ఇంకో యాభై సంవత్సరాల తర్వాత…
బహుశా నేను ఉండకపోవచ్చు.
శ్రావ్య ఉండకపోవచ్చు.
మా బాల్య స్నేహితుల్లో చాలామంది ఉండకపోవచ్చు.
కానీ…

ఏదో ఒక ఉదయం ఒక చిన్న పిల్లవాడు ఆ గుట్ట మీద నడుస్తూ ఉండొచ్చు.
వాన తడిసిన నేల వాసనని ఆస్వాదిస్తూ…
పిట్టల అరుపులు వింటూ…
ఒక పెద్ద చెట్టు నీడలో నిలబడి ఉండొచ్చు.
ఆ చెట్టు కొమ్మల మీద గాలి పాత పాటలు పాడుతూ ఉండొచ్చు.
అతనికి తెలియదు…
ఆ చెట్టు కథ.
అతనికి తెలియదు…
ఎప్పుడో కొన్ని దశాబ్దాల క్రితం
కొంతమంది అల్లరి పిల్లలు తమ పిచ్చి నమ్మకంతో
గుప్పెడు గింజలు పట్టుకుని
నవ్వుకుంటూ ఈ దారిలో నడిచారని.
అతనికి తెలియదు…
ఆ చెట్టు నీడలో నిలబడే హక్కు కోసం
ఎవరో ముందే ఒక కల విసిరారని.
అదే కదా జీవితంలోని అతి పెద్ద అందం.
మనకు తెలియని వాళ్ల కోసం జీవించడం.
మనల్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకోని వాళ్ల కోసం ఒక మంచి పని చేయడం.
ఫలితం మనకు రాకపోయినా…
నీడ ఎవరికో దక్కేలా జీవించడం.

చివరికి…
మనిషి చనిపోయాక మిగిలేది అతని పేరు కాదు.
అతను నిర్మించిన భవనాలు కూడా కాదు.
అతను సంపాదించిన డబ్బు కూడా కాదు.
ఎవరికీ తెలియకుండా
ఈ భూమికి తిరిగి ఇచ్చిన ప్రేమ మాత్రమే.

అందుకే ఇప్పుడు అనిపిస్తుంది…
ప్రపంచాన్ని మార్చడానికి పెద్ద విప్లవాలు అవసరం లేదు.
ఒక విత్తనం చాలు.
ఎందుకంటే…
ప్రతి అడవి ఒక విత్తనంతో మొదలవుతుంది.
ప్రతి నది ఒక చినుకుతో మొదలవుతుంది.
ప్రతి యుగం ఒక ఆలోచనతో మొదలవుతుంది.
ప్రతి అమరత్వం ఒక నిస్వార్థమైన పనితో మొదలవుతుంది.

మరి ఒకరోజు…
నేను మళ్లీ ఆ గుట్టల మీదుగా వెళ్తాను.
అక్కడ ఒక చెట్టు కనిపిస్తే…
దాని కాండాన్ని మెల్లిగా తాకి అడుగుతాను…
“నువ్వేనా అప్పట్లో మేము విసిరిన ఆ గింజ?”
అప్పుడు గాలి ఒక్కసారిగా ఆకులను కదిలిస్తూ నవ్వుతుంది.
ఆ నవ్వులో నాకు ఒక సమాధానం వినిపిస్తుంది…
“నువ్వు విసిరింది గింజ కాదు రఘూ…
కాలాన్ని దాటి బతికే ఒక ఆశ”

అప్పుడు అర్థమవుతుంది…
మనిషి నిజంగా చనిపోయేది శరీరం ఆగినప్పుడు కాదు.
తన వల్ల భూమి మీద కొత్త జీవం పుట్టడం ఆగిపోయినప్పుడు.
అందుకే…

ఒకరోజు నా పేరు మరచిపోవచ్చు.
నా ఫోటోలు మసకబారిపోవచ్చు.
నా కథలు కూడా కాలగర్భంలో కలిసిపోవచ్చు.
కానీ…
ఎక్కడో ఒక చెట్టు ఇంకా పూస్తూ ఉంటే,
ఎక్కడో ఒక పక్షి ఇంకా గూడు కడుతూ ఉంటే,
ఎక్కడో ఒక చిన్నారి ఇంకా ఆ నీడలో నవ్వుతూ ఉంటే…
అక్కడ నేను ఇంకా బతికే ఉంటాను.
మనిషిగా కాదు.
ఒక విత్తనంగా.
.
.
రఘు మందాటి

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సాయిబాబా శివస్వరూపుడా? ఇది సనాతన సమర్థనీయమేనా?
  • సాయిబాబాకు ఆనం పొర్లుదండాలు దేనికి? వణికిపోవడం దేనికి?
  • సాయిబాబా గుడి సర్వమత వేదికా? చాదర్‌ఘాట్ కేసు ఏమంటోంది?
  • అక్కడ నేను ఇంకా బతికే ఉంటాను – మనిషిగా కాదు, ఒక విత్తనంగా!
  • Emoji Mathematics – చాటుమాటు చాట్ మూటల మాటలు
  • సాహసి CM విజయ్! బెరుకు లేదు- పెరియార్ భావజాలానికి తిరస్కృతి
  • తుంగభద్రపై ముగ్గురు ముఖ్యమంత్రులతో కేంద్రం కీలక భేటీ
  • బహుళ ప్రశంసల బడ్డీ మదర్ ! – ఎవరు ఈ IAS లక్ష్మీ ప్రియ?
  • పాలకుడు చుక్కలు చూపిస్తే… SBI ఐతేనేం? ఎందుకు దిగిరాదు?
  • ఇళయరాజాతో ఏదో తేడా కొట్టింది! వంశీ హార్మోనియం అందుకున్నాడు!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions