.
ఒక్క పదం… అవును, ఒకే ఒక ఈ తెలంగాణ పదం… తెలంగాణ సామాజిక, సాంస్కృతిక, కుటుంబ జీవనానికి సంబంధించిన ఒక పదం… అది ఇడుపు కాయితం… రెండున్నర జిల్లాల భాష నుంచి, నాలుగున్నర జిల్లాల ఆధిపత్య పోకడల నుంచి, ఆంధ్రా పెత్తందారీ ధోరణుల నుంచి బయటపడి, విముక్తి పొంది… పన్నెండేళ్ల క్రితమే వాళ్లకు విడాకులు ఇచ్చేసింది తెలంగాణ…
ఆ పెత్తందారీ పార్టీలు కూడా తెలంగాణలో దుకాణాలు మూసేసుకున్నాయి ఎప్పుడో… ఐనా బతికేది తెలంగాణలోనే! కానీ ఇప్పటికీ ఆ బుర్రల్లో పురుగులు మెసులుతూనే ఉన్నాయి… అందులో ప్రథముడు చంద్రబాబు, ద్వితీయుడు తన సహచరుడు పవన్ కల్యాణ్… ఇంకా తెలంగాణ మీద స్వారీ చేసి, ఇంకా ఆ పాత దోపిడీనే కొనసాగించాలనేదే ఇద్దరి ఉద్దేశం…
Ads
రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, ఈ అధికారం ఎన్నాళ్లులే అనుకున్నవాళ్ల నోళ్లు మూసేస్తూ, తన స్థిరమైన ప్రభుత్వం ఇంకా బలాన్ని పెంచుకుంటున్న తీరుతో రెండు క్యాంపులకు కన్నెర్ర… అంటే, ఉడుకుమోతుతనం… సహించలేనితనం… అందుకే తెలంగాణ బీజేపీ పక్కా తెలంగాణ ద్వేషి పవన్ కల్యాణ్‌ను నెత్తిన మోస్తూ, తనను ముందుబెట్టి కదులుతోంది. ఆ దిష్టి వ్యాఖ్యల నటుడికి బాసటగా నిలుస్తోంది. వీళ్ల వెనుక నడవటానికి చంద్రబాబు కూటమి రూపంలో రెడీ…
రేవంత్ రెడ్డిని ఏదో అనడానికి, వ్యతిరేకించడానికి, ప్రాపగాండా చేయటానికి సరైన కారణాలు దొరక్క… బీఆర్ఎస్ క్యాంపు ఉడుక్కుంటోంది… అందుకే మాటిమాటికీ చంద్రబాబు గురువు- రేవంత్ శిష్యుడు అనే ఓ భ్రమాత్మక వాదనతో బురద జల్లే పనిలోపడింది… జనం థూత్కరిస్తున్నా సరే, అదే పోకడ… అదొక డొల్ల ప్రచారం… ఇప్పుడు ఆ క్యాంపుకి పవన్ కల్యాణ్ ఆత్రం ఓ ఆయుధంలా దొరికింది…
నేరుగా ఒక పార్టీగా ముందుకు రాకుండా… తెర వెనుక ఉండి తమ సోషల్ మీడియా, శుష్క మేధోగణం ద్వారా వ్యతిరేకిస్తూ… తెలంగాణలో మళ్లీ అస్థిత్వ సెంటిమెంట్ రాజేసే ప్రయత్నం చేస్తోంది. దాంతోనైనా పార్టీ బలం పెరుగుతుందనే ఓ శుష్క భావన. మొన్న కవి నందిని సిధారెడ్డి ఎక్కడో రౌండ్ టేబుల్ భేటీ పెట్టేసి ఏదేదో మాట్లాడాడు. తన ప్రసంగంలో వందసార్లు అస్థిత్వం పదాన్ని వల్లెవేశాడు…
తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ తీసేసి, పక్కా తెలంగాణ వ్యవసాయిక, జీవన ప్రతీక జొన్న కర్రను పెడితే, సగటు తెలంగాణ మహిళను చిత్రించడం కూడా అస్థిత్వ ప్రమాదమేనట… ఈయన కవి…? అసలు ఆంధ్రా తెలుగునే అసలు తెలుగుగా కేసీయార్ ప్రపంచ తెలుగు మహాసభల్ని నిర్వహించడంతో… ఉద్యమకాలం నాటి ‘మన యాస- మన బతుకు’ అనే నినాదాన్ని బొందపెట్టిన ఘనులు… ఈ సిధారెడ్డే ఆ సభలకు నేతృత్వం.
పక్కా తెలంగాణ ద్వేషుల్ని అధికారంలోకి తీసుకుని, వలసవాదులకు వత్తాసుగా కేసీయార్ బతికినన్ని రోజులూ వీళ్లెవరికీ తెలంగాణ అస్థిత్వానికి ప్రమాదం కనిపించలేదు పాపం… తామే ఎన్టీయార్ విగ్రహాల్ని పెట్టాలనుకున్నది ఆ పార్టీ, కానీ రేవంత్ రెడ్డి అదే విగ్రహం పెడితే మాత్రం అస్థిత్వానికి ప్రమాదం అంటాడు సిధారెడ్డి… ఇలా బోలెడు… నయా దేశ్‌ముఖ్ కేసీయార్ పెత్తనం, నియంతృత్వంతో పర్లేదుట… ఇప్పుడు రాష్ట్రాన్ని పాలించేవాళ్లు తెలంగాణ మట్టి బిడ్డలు కాదా సిధారెడ్డీ? తెలంగాణ ఇచ్చిన పార్టీ ప్రతినిధులు కాదా సిధారెడ్డీ? వీళ్లేమైనా బీహార్ నుంచి విజయనగరం మీదుగా వలసవచ్చిన దొరలా..?
తాజాగా ఎవరో ఇద్దరు మూర్ఖులు ఓ తెలంగాణ చలనచిత్రం తాలూకు టైటిల్ ‘ఇడుపు కాయితం’ అనే పదాన్ని గేలిచూస్తూ సోషల్ పోస్టులు పెట్టారు. మామూలుగా ఎవడో ఏదో రాస్తాడు, ఇంకెవడో కౌంటర్ ఇస్తాడు. అదొక సోషల్ ఉన్మాదం. కానీ అందులోకి బీఆర్ఎస్ మేధావులు దూరి, ఇంకా ఇంకా గోకే ప్రయత్నం చేస్తున్నారా..? ఇప్పుడు అదే సందేహం ప్రబలుతోంది…
రేప్పొద్దున బీజేపీ కూటమి ప్లస్ బీఆర్ఎస్ కలిసి కాంగ్రెస్‌తో ఎన్నికల్లో పోరాడే సిట్యుయేషన్ వస్తుందేమో అనే భావనతో బీఆర్ఎస్ ఒక పార్టీగా ఇవన్నీ ఖండించదు, కానీ గులాబీ రాజకీయేతరులు రంగంలోకి దిగుతారు… ఇప్పుడు ఈ ఇడుపు కాయితం వివాదం సమసిపోకుండా, తెలంగాణ సెంటిమెంట్‌ను మళ్లీ మండించే విఫల ప్రయత్నం జరుగుతోందా..?
ఇక్కడే రేవంత్ రెడ్డి ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాల్సిన తరుణం… ఆ పిచ్చి కూతలతో సామాజిక, ప్రాంతీయ విద్వేషాల్ని రెచ్చగొట్టే రాతలకు, కూతలకు దిగిన వాళ్లను అదుపు చేయాలి, ఇలాంటి పెడధోరణులు మరింత విస్తరించకుండా అడ్డుకట్ట వేయాలి… లేకపోతే బీఆర్ఎస్ క్యాంపు ప్లస్ బీజేపీ క్యాంపు ఇందులో మరింత పెట్రోల్ పోస్తూ ఎగదోసే ప్రమాదముంది… అందుకే ఈరోజుకూ ఇడుపు కాయితం మండుతూనే ఉంది..!!
చివరగా… తెలంగాణ ఎవడి జాగీరూ కాదు… ఓ పార్టీ జాగీర్, ఓ నియంత జాగీర్, జమీ అసలే కాదు… తెలంగాణలోని ప్రతి భూమి పుత్రుడిదీ… అది ఏ పార్టీ అయినా సరే… ఏ నాయకుడైనా సరే, కార్యకర్త అయినా సరే… వాళ్లెవరూ కాకపోయినా ఇక్కడ పుట్టిన ఏ భూమిపుత్రుడైనా సరే..!! పవన్ కల్యాణ్, చంద్రబాబుల యాక్టివిటీని, దన్నుగా నిలిచే బీజేపీ కార్యాచరణపై ఓ కన్ను ఖచ్చితంగా అవసరం..!!
Share this Article