.
భారతదేశంలో ప్రతి ఏటా కనిపిస్తూ, చిన్నా పెద్దా అందరినీ కదిలిస్తూ, దేశవ్యాప్తంగా పిల్లాపాపల కోసం టీకా కేంద్రాల ముందు క్యూ కట్టించే దృశ్యం ‘పల్స్ పోలియో’. 2014లోనే భారతదేశాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ‘పోలియో రహిత దేశం’గా ప్రకటించింది. ఆ తర్వాత ఒక్క వైల్డ్ పోలియో కేసు కూడా నమోదు కాలేదు.
ఇంతటి ఘనవిజయం సాధించినా, దశాబ్ద కాలం దాటినా ఇంకా ఈ సామూహిక టీకా కార్యక్రమాలు ఎందుకు? అసలు ఆసుపత్రుల్లో పుట్టిన ప్రతి శిశువుకూ సాధారణ టీకాలు వేయించుకుంటే సరిపోదా? ఈ ప్రశ్న ప్రతి తల్లిదండ్రుల మనసులోనూ మెదులుతూనే ఉంటుంది.
Ads
ఎందుకు తప్పడం లేదు ఈ ‘పల్స్’ పరుగు? ప్రభుత్వ వైద్య వ్యవస్థలో ప్రతి బిడ్డకు పుట్టినప్పటి నుండి టీకాలు ఇచ్చే ‘యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్’ పక్కాగా అమలులో ఉంది. అయినా, పల్స్ పోలియో అవసరం ఎందుకు ఉందంటే…
-
‘హెర్డ్ ఇమ్యూనిటీ’ (Herd Immunity)…: ఒక చిన్నారికి టీకా వేయడం వ్యక్తిగత రక్షణ అయితే, ఒకే రోజు దేశంలోని లక్షలాది మందికి చుక్కలు వేయడం ‘కమ్యూనిటీ రక్షణ’. ఇలా చేయడం వల్ల, సమాజంలోని ప్రతి బిడ్డలోనూ ఒకేసారి రోగనిరోధక శక్తి పెరిగి, వైరస్ వ్యాప్తి చెందే అవకాశమే లేకుండా పోతుంది.
-
వదిలివేయబడని వారు (Reach the Unreached)..: మన దేశంలో వలస కార్మికులు, అటవీ ప్రాంతాల్లో నివసించే గిరిజనులు, తరచుగా ఊర్లు మారే వారి పిల్లలు ప్రభుత్వ రికార్డుల్లోకి రాకపోవచ్చు. సాధారణ టీకా కేంద్రాలకు రాని ఇలాంటి పిల్లలను పల్స్ పోలియో సమయంలో ఇంటింటికీ వెళ్లే కార్యకర్తలు గుర్తిస్తారు. ఎవరూ మిగిలిపోకూడదనేదే ఈ కార్యక్రమ అసలు లక్ష్యం.
-
నిశ్శబ్ద శత్రువు – పొరుగు దేశాలు…: పోలియో వైరస్ కు సరిహద్దులు తెలియవు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల్లో ఇప్పటికీ పోలియో కేసులు వెలుగు చూస్తూనే ఉన్నాయి. సరిహద్దుల గుండా జరిగే ప్రయాణాలు, రాకపోకల ద్వారా వైరస్ మళ్ళీ మన దేశంలోకి ప్రవేశించే ప్రమాదం ఎప్పుడూ పొంచి ఉంటుంది. ఆ ఒక్క ‘రిస్క్’ కూడా తీసుకోకూడదనే ఉద్దేశంతోనే కేంద్రం అప్రమత్తంగా ఉంటోంది.
సాధారణ టీకా సరిపోదా? అనే ప్రశ్నకు సమాధానం… ఒక బిడ్డకు ఆసుపత్రిలో వేసే టీకా (Routine Immunization) అనేది ఒక ‘కవచం’ లాంటిది. కానీ, పల్స్ పోలియో అనేది ఒక ‘క్లీనింగ్ ఆపరేషన్’ వంటిది. వాతావరణంలో, నీటిలో, మురుగులో వైరస్ ఎక్కడైనా దాగి ఉంటే, సామూహిక టీకాతో దాన్ని పూర్తిగా నిర్మూలించవచ్చు. ఇది వైరస్ చైన్ ని తుంచేసే వ్యూహం.
“ప్రతి శిశువుకు టీకా వేయాలి” అనే నిబంధన ఎంత ముఖ్యమో, వైరస్ ఆనవాళ్లు ప్రపంచంలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే వరకు ఈ సామూహిక బాధ్యతను కొనసాగించడం కూడా అంతే ముఖ్యం. ఒక్క కేసు కూడా నమోదు కాని దేశంలోనే ఇంతటి నిఘా ఉందంటే, అది మన పిల్లల భవిష్యత్తు కోసం ప్రభుత్వం తీసుకుంటున్న అత్యున్నత స్థాయి భద్రతా జాగ్రత్త. గెలిచిన యుద్ధంలో విజయాన్ని కాపాడుకోవడానికి చేసే యుద్ధం ఇది. ఈ చిన్న ‘చుక్క’ చుక్కా మన దేశాన్ని పోలియో రహితంగా ఉంచే అద్భుత రక్షణ చక్రం!
ఐనా సరే, స్టిల్… డబ్ల్యూహెచ్ఓ అనుసరించే ధోరణి మీద అనుమానాలే!!
Share this Article