.
బూతులు పాతబడిపోయాయి, రోత పుట్టిస్తూ జనానికి కూడా నచ్చడం లేదు… ఇక ప్రధాన రాజకీయ పార్టీలు, వాటి ముఖ్యనేతలు క్రియేటివిటీకి పదును పెట్టి కొత్త కొత్త ధోరణులకు మళ్లుతున్నారు… అబ్బే, ఏపీ నాయకుల గురించి కాదు… అది అన్నింటికీ అతితం… అది రోత స్థాయి నుంచి జుగుప్స స్థాయికి చేరి, దాన్నీ దాటేసిన వెగటు పాలిటిక్స్…
తెలంగాణ పాలిటిక్స్‌లోనే ప్రధానంగా మాటల యుద్ధం జరిగేది, పరుష వ్యాఖ్యలు కూడా వినిపించేది రేవంత్ వర్సెస్ కేటీయార్, రేవంత్ వర్సెస్ హరీష్ రావుల నడుమే కదా… రేవంత్ కూడా *లాగూల్లో తొండల భాష*ను పక్కన పెట్టేసినట్టు కనిపిస్తోంది… ఫామ్‌హౌజులో మౌనంగా పడుకుండిపోయిన కేసీయార్‌ను గోకుతున్నాడు ఇక…
Ads
ఆమధ్య నీకు నువ్వే బందీ అయిపోయినవ్, ఇక నిన్ను శిక్షించేదేముంది అని దెప్పిపొడిచాడు… కేసీయార్ సైలెంట్… జనానికి మొహం ఎందుకు చూపించలేకపోతున్నావ్ అన్నాడు రేవంత్… ఐనా కేసీయార్ సైలెన్స్… ఎవరు ఏమైనా అనుకోనీ, జనజీవనంలోకి వచ్చేది లేదు, ప్రజాజీవితంలో కనిపించేదే లేదు… ఇప్పుడు తాజాగా రేవంత్ రెడ్డి మరింత పదును పెట్టాడు తన విమర్శలకు…
‘‘అరుంధతి సినిమాలో పశుపతిని బందీని చేసినట్టు తనను ఫామ్‌హౌజులో బందీని చేసేశారు ప్రజలు, ఇక ఎవరూ విడిపించలేరు, అక్కడే ఇక బందీ’’ అంటున్నాడు నిన్న రైతుభరోసా నిధుల విడుదల ప్రోగ్రాంలో… ‘‘తెలంగాణ ఏర్పడినప్పుడు 69 వేల కోట్ల అప్పులుంటే, దాన్ని 8 లక్షలకు పెంచాడు, ప్రతి రంగానికీ బకాయిలు పెట్టాడు… ( బకాయిసురుడు అనో, బకాసురుడు అనో అన్నాడు)… అవన్నీ నేను కట్టాల్సి వస్తోంది’’ అంటూ నేరుగా కేసీయార్ మీదే విసుర్లు, అదీ కొత్తకొత్తగా…
కేటీయార్ కూడా ఆమధ్య ఏదో ఇంటర్వ్యూలో చెబుతున్నాడు… కేసీయార్ మౌనాన్ని సమర్థించుకునే ప్రయాసలో… ‘‘గోడకు వేలాడే తుపాకీ కూడా మౌనంగానే ఉంటుంది, పేలితే విస్ఫోటమే’’ అని… ఈ డైలాగ్ చాన్నాళ్లుగా వాడుతూనే ఉంటాడు తను… అసలు కేసీయార్ అధికారంలో ఉన్నప్పుడు కూడా తరచూ అదృశ్యమైపోయేవాడు… రోజుల తరబడీ జాడాపత్తా కనిపించకపోయేది…
అప్పుడూ ఇదే సమర్థన… ఆయన మాటల్నే మేం చెబుతున్నాం అంటాడు… కానీ అది కన్విన్సింగ్ సమాధానం కాదని తనకూ తెలుసు… ఆయన మాటల్ని మీరెందుకు చెప్పడం, వాటిని ఆయనే జనంలోకి వచ్చి చెప్పొచ్చుగా అనే జనం ప్రశ్నలకు తన దగ్గర జవాబు లేదనీ తనకు తెలుసు…
అవును, ఏదైనా కథలో తుపాకీ ప్రస్తావన వస్తే, కథ ముగిసేలోపు అది పేలి తీరాలి అంటుంది సాహిత్యసూత్రం! అది ఉల్టా పేలి కథను ముగిస్తుంది మహేష్ బాబు అతడు సినిమాలో… తుపాకీలో పిల్లలు వదిలేసిన చెర్ర ఉల్టా దూసుకొచ్చి విలన్ మరణిస్తాడు… సో, గోడకు వేలాడే తుపాకీ – మౌనం అనే డైలాగ్ పదే పదే ఇక పనిచేయదు… కాకపోతే బూతులు, తిట్లు వదిలేసి, కాస్త నాగరిక భాషలోకి రావడం అభినందనీయం! కాదు, జన ఉపశమనం!!
ఏమాటకామాట కేటీయార్ ఏదో తోచినట్టు రేవంత్‌పై పదునుగానే విరుచుకుపడతాడు గానీ హరీష్ రావుకు అది చేతకాదు, చేతకావడం లేదు…!!
Share this Article