.
Subramanyam Dogiparthi …. మన చుట్టూ కావలసినంత మంది పేకాట పాపారావులు ఉంటారు . వాళ్ళకు ఇదే వ్యాపకం , వ్యాపారం , every thing . Professional players . పొద్దున్నే తొమ్మిది గంటలకే క్లబ్బుల్లో చేరుతారు . కొంతమంది అయితే ఇళ్ళకు కూడా వెళ్ళరు . క్లబ్బుల్లోనే టేబుల్స్ మీద పడుకొని పొద్దున్నే మళ్ళా మొదలు . ఇలాంటి పేకాట పాపారావు కధే ఈ సినిమా .
It’s a romantic comedy entertainer . నటీనటుల నటనకన్నా కధను నేసిన M.S.నారాయణను , జనార్ధన్ మహర్షిలను ; డైలాగులను వ్రాసిన తనికెళ్ళ భరణిని ; స్క్రీన్ ప్లే – దర్శకత్వం వహించిన వై నాగేశ్వరరావుని అభినందించాలి .
Ads
ఆ తర్వాత రాజ్ కోటి సంగీత దర్శకత్వాన్ని , పాటల్ని వ్రాసిన సిరివెన్నెల వారిని , జొన్నవిత్తుల వారిని , గూడూరు విశ్వనాధ శాస్త్రి గార్లను , చాలా శ్రావ్యంగా పాడిన బాలసుబ్రమణ్యం , చిత్ర , రాధికలను మెచ్చుకోవాలి . పాటల్ని దర్శకుడు చక్కగా చిత్రీకరించారు . డాన్సుల్ని బాగా కంపోజ్ చేసిన సుచిత్ర , శివ సుబ్రమణ్యం , జాన్ బాబులను ప్రత్యేకంగా అభినందించాలి . సినిమా బాగా ఆడేందుకు వీరందరూ తలా ఒక చెయ్యి వేసారు .
టూకీగా కధ ఏంటంటే ఓ ఊళ్ళో ఓ పేకాట పాపారావు . ఆ ఊళ్ళోనే ఒక లేడీ యస్సై . ఓ కిలాడీ గాడిని పట్టుకునే క్రమంలో లేడీ యస్సై పాపారావు ఒకరికి ఒకరు తారసపడి ప్రేమలో పడతారు . ఆ తర్వాత వాళ్ళ వాళ్ళ వృత్తులు తెలుసుకోకుండా పెళ్లి కూడా చేసుకుంటారు .
ఆ ఊళ్ళోనే పేకాట క్లబ్ నడిపే విలన్ లేడీ యస్సై మీద పగతో పాపారావుని శోభనం మొదటి రోజునే స్వంత భార్య చేతనే అరెస్ట్ చేయిస్తాడు . ఇద్దరూ ఒకరిని చూసి ఒకరు నిశ్చేష్టులు అవుతారు . కోపాలు తెచ్చుకుని సవాళ్లు విసురుకుంటారు .
ముప్పై రోజుల పాటు ప్రవరుడిలాగా నిగ్రహంతో ఉంటే యస్సై ఉద్యోగానికి రాజీనామా చేస్తానంటుంది . ఓడిపోతే పేకాట మానేస్తానని పాపారావు శపధం పూనుతాడు . ఇంక అక్కడ నుంచి భార్యాభర్తలు ఎత్తుకు పైఎత్తులు , పాపారావుని రిపేర్ చేయటానికి ఇంటిల్లిపాది తిప్పలు , చివరకు విలన్ని చట్టానికి అప్పచెప్పటంతో సినిమా శుభాంతం అవుతుంది . కొసమెరుపు ఏంటంటే పేకాట పాపారావు కొడుకు అన్నప్రాసన నాడు జోకర్ ముక్కని పట్టుకోవడం . బ్లడ్డు మరి…
సినిమాలో పేకాట పురాణం , పేకాట వేదాంతం , ఉచ్చ పెట్రోలు కావటం , జోకర్ ముక్కకు పాపారావు పూజ చేయటం వగైరా బాగా జొప్పించారు . పేకాటతో జీవితం గురించి చెప్పటం బాగుంటుంది . సంవత్సరంలో 52 వారాలు ఉన్నట్లు పేకలో కూడా 52 ముక్కలే ఉంటాయని ఒక్కో ముక్కకు ఒక్కో వివరణ తనికెళ్ళ భరణి బాగా వ్రాసారు .
హీరో రాజేంద్రప్రసాదుకు ఇలాంటి పాత్రలు కొట్టిన పిండే . హుషారు హుషారుగా నటించాడు . యస్సైగా ఖుష్బూ , బామ్మగా నిర్మలమ్మ , చెల్లెలుగా శాంతి (హరిత) , బావ గారిగా తనికెళ్ల భరణి , విలన్లుగా శివాజీ రాజా , కొత్త నటుడు మీసాల భాస్కర్ నటించారు .
ఈ మీసాల భాస్కర్ బాగా నటించాడు . ఇతర పాత్రల్లో ఆలీ , ఐరన్ లెగ్ శాస్త్రి , బ్రహ్మానందం , గుండు హనుమంతరావు , కిరణ్ కాదంబరి తదితరులు నటించారు .
రాజ్ కోటి సంగీత దర్శకత్వంలో పాటలన్నీ బాగుంటాయి . కొయ్ కొయ్ కొయ్ పేకాట పాపారావు అంటూ సాగే పాట క్లబ్బులో పేకాట గాళ్ళ మీద సరదాగా సాగుతుంది . చెంతకు వస్తే చెరిసగమవుతా చెక్కిలి అందిస్తా డ్యూయెట్ చాలా చాలా మెలోడియస్ గా ఉంటుంది .
అలాగే మరో రెండు డ్యూయెట్లు ప్రేమ పుట్టిందోయ్ ఏం చేయమంటావ్ , పుకారే పుకారే ఊరంతా పుకారే కూడా బాగా చిత్రీకరించబడ్డాయి . మరో హుషారయిన పాట తాయిలమిస్తా .
రాజమండ్రి ప్రాంతంలో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా యూట్యూబులో ఉంది . పూర్తి వినోదాత్మక హాస్య చిత్రం . రాజేంద్రప్రసాద్ మార్క్ సినిమా . ఇంతకుముందు చూసి ఉండకపోతే తప్పక చూడతగ్గ సరదా సరదా సినిమాయే .
Share this Article