.
ఒకే మనిషి భౌతికంగా రెండు చోట్ల ఉండటం…! పోనీ, ఒక మనిషి మొత్తం అదృశ్యమైపోయి మరో ప్రపంచంలోకి వెళ్లడం..! అసలు మనిషి భౌతిక రూపం స్థూలంగా మాయమై, ఇంకెక్కడో తేలడం..! అసలు వేర్వేరు ప్రపంచాలు ఉన్నాయా..? చదువుతుంటేనే గందరగోళంగా ఉంది కదా…
విదేశాల్లో, పర్టిక్యులర్‌గా ఇంగ్లిషులో ఇలాంటి ఊహాగానాలు, కథనాలు… దానికి సంబంధించి ఫిక్షన్, ఫేక్ ఆధారాలు గట్రా కనిపిస్తుంటాయి ఎక్కువగా… ఇదీ అలాంటిదే… సరళంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను…
Ads
ఇటీవల ఇంటర్నెట్‌లో ఒక 78 ఏళ్ల వృద్ధుడి అదృశ్యం గురించి రకరకాల ఊహాగానాలు, వింత కథనాలు ప్రచారంలో ఉన్నాయి. మే 2025లో, ఆంథోనీ చావెజ్ అనే 78 ఏళ్ల రిటైర్డ్ మెకానిక్ అదృశ్యమయ్యారు. పోలీసులు ఆయన ఇంటిని పరిశీలించగా, అక్కడ ఆయన కారు, పర్స్, సిగరెట్లు, ఒక డైరీ దొరికాయి. కానీ ఆయనే కనిపించలేదు. ఈ సంఘటన సాధారణంగా మొదలైనా, తర్వాత సోషల్ మీడియాలో దీనికి వింత రంగు పులుముకుంది.
ఊహాగానాలు ఎందుకు మొదలయ్యాయి?
ఒక జర్నలిస్టు మాట్లాడుతూ, చావెజ్ గతంలో ‘క్వాంటం ఫిజిక్స్’ (అణు భౌతిక శాస్త్రం) పరిశోధనల్లో సహాయపడ్డారని, మనిషి ఒకేసారి రెండు చోట్ల ఉండటం వంటి ప్రయోగాలపై పనిచేశారని చెప్పారు. అంతే, ఇది విన్న నెటిజన్లు ఆయన ఏదో రహస్య ప్రయోగం చేసి, మరో ప్రపంచంలోకి (అదర్ డైమెన్షన్) వెళ్లిపోయి ఉంటారని కథలు అల్లేశారు.
నిజానిజాలు ఏంటి?
-
సైన్స్ ఏం చెబుతోంది?…: క్వాంటం ఫిజిక్స్‌లో ‘సూపర్ పొజిషన్’ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఇది అత్యంత చిన్న కణాలు (Particles) లేదా కంప్యూటర్ సిస్టమ్స్‌కు మాత్రమే వర్తిస్తుంది. మనుషులు అదృశ్యమవ్వడం లేదా మరో ప్రపంచంలోకి వెళ్లడం వంటివి సైన్స్‌లో ఎక్కడా లేవు. ఇవన్నీ కేవలం ఊహలు మాత్రమే.
-
ఇతర కేసులతో సంబంధం?…: చావెజ్ అదృశ్యం తర్వాత, అదే ప్రాంతంలో మరో మహిళ (మెలిస్సా కాసియాస్) మరణించడం, మరికొంతమంది శాస్త్రవేత్తలు అనుమానాస్పదంగా అదృశ్యమవ్వడం లేదా మరణించడం వంటివి జరిగాయి. వీటిని కూడా కలిపి “ఏదో రహస్య కుట్ర లేదా ప్రయోగం జరుగుతోంది” అని నెటిజన్లు ప్రచారం చేస్తున్నారు.
అధికారుల మాట ఏమిటి?
చావెజ్, మెలిస్సా కాసియాస్, ఇతర శాస్త్రవేత్తల మరణాలకు లేదా అదృశ్యానికి ఎటువంటి సంబంధం ఉందని చెప్పలేం, ఎటువంటి ఆధారాలు కూడా లేవు అని దర్యాప్తు సంస్థలు స్పష్టం చెబుతున్నాయి. వీరందరికీ ఒకరికొకరు తెలిసినట్లు కూడా ఎక్కడా రుజువులు లేవట. మరి హఠాత్తుగా ఈ అదృశ్యాలు ఏమిటి..? అదైనా తేల్చాలి కదా…
కొంతమంది ఆసక్తికరమైన కథనాల కోసం, క్లిష్టమైన సైన్స్ విషయాలను తప్పుగా అర్థం చేసుకుని లేదా వక్రీకరించి ఇలాంటి రూమర్లను సృష్టిస్తుంటారు అని చెబుతూనే… చావెజ్ కేసులో కూడా ఇప్పటికీ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు… ఏమైనా లింక్ దొరుకుతుందా అని..!! వాళ్లకూ ఏవో సందేహాలున్నాయి మరి!!
Share this Article