Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

25 ఏళ్లు- 25 వేలు- వెయ్యి కిలోమీటర్లు… ఇంట్రస్టింగు ‘రుణబంధం’!

July 11, 2026 by M S R

.

పాతికేళ్ల నిరీక్షణకు తెర.. వెయ్యి కిలోమీటర్లు దాటి వచ్చి తీర్చిన ‘రుణబంధం’! ఇదీ నిన్న కనిపించిన వార్తల్లో నచ్చింది… ఇలాంటివి సొసైటీలో పాజిటివిటీని నింపుతాయి… నీడల్నే నమ్మలేకపోతున్న రోజుల్లో మనుషుల నడుమ నమ్మకాల్ని బలపరచడానిక ఇలాంటివి దోహదపడతాయి…

నేటి కాలంలో చిన్న చిన్న విషయాలకే సంబంధాలు తెంచుకుంటున్న మనుషులను చూస్తుంటాం. ఇచ్చిన అప్పు తిరిగి అడిగితేనే బంధాలు బెడిసికొట్టే ఈ రోజుల్లో, పాతికేళ్ల కిందట తీసుకున్న అప్పును తీర్చడం కోసం ఏకంగా వెయ్యి కిలోమీటర్లు ప్రయాణించి వచ్చాడొక వ్యక్తి. స్నేహానికి, నమ్మకానికి ఈ ఘటన నిలువుటద్దంగా నిలిచింది.

Ads

కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా మరీ ఓ చిన్న సింగిల్ కాలమ్‌కు పరిమితం చేసింది… ప్రస్తుత పాత్రికేయ ప్రాధాన్యతలు మరో విషాద కోణం… ఆ వార్త ఏమిటో వివరంగా చెప్పుకుందాం…

కేరళలోని పాలక్కాడ్ ప్రాంతానికి చెందిన మహ్మద్ ఇస్మాయిల్, జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన ఎడ్ల లచ్చన్న పాతికేళ్ల క్రితం సౌదీ అరేబియాలోని ఒకే కంపెనీలో పని చేసేవారు. ఆ పరిచయం వారి మధ్య గాఢమైన స్నేహాన్ని పెంచింది.

ఆ సమయంలో ఇస్మాయిల్ అనారోగ్యం పాలవగా, లచ్చన్న ఆర్థికంగా అండగా నిలిచి కొంత డబ్బు అప్పుగా ఇచ్చాడు. తిరిగి భారత్ చేరుకున్నాక డబ్బు చెల్లిస్తానని ఇస్మాయిల్ మాట ఇచ్చాడు. కానీ, అనివార్య కారణాలు, కాలగమనంలో ఇద్దరి మధ్య దూరం పెరిగింది. దశాబ్దాలు గడిచినా, లచ్చన్న అడగకపోయినా.. ఇస్మాయిల్ మనసులో ఆ అప్పు భారమై అలాగే ఉండిపోయింది.

గూగుల్ మ్యాప్స్ సాయంతో…
లచ్చన్న అడ్రస్ తెలియదు, ఫోన్ నంబర్ లేదు. కానీ, మనసులో ఆ రుణభారం ఇస్మాయిల్ నిద్రపోనివ్వలేదు. “లచ్చన్న సొంతూరు ధర్మపురి” అన్న ఒక్క జ్ఞాపకంతో ఇస్మాయిల్ తన సుదీర్ఘ ప్రయాణాన్ని, అన్వేషణను మొదలుపెట్టాడు. కేరళ నుంచి సుమారు వెయ్యి కిలోమీటర్లు దాటి, చివరకు ధర్మపురి చేరుకున్నాడు. స్థానికుల సాయంతో అడిగి మరీ గురువారం మధ్యాహ్నం లచ్చన్న ఇంటికి చేరుకున్నాడు.

ఆప్యాయతతో కూడిన పలకరింపు
ఇస్మాయిల్ అప్పు తీర్చడానికి ఇంత దూరం వచ్చారని చెప్పగానే లచ్చన్న కుటుంబసభ్యులు మొదట ఆశ్చర్యపోయారు. ఆ సమయంలో లచ్చన్న గల్ఫ్‌లో ఉండటంతో ఫోన్ ద్వారా ఇద్దరూ మాట్లాడుకున్నారు. అప్పు ఇచ్చిన విషయం లచ్చన్నకు దాదాపు గుర్తులేదు, కానీ తన పాత మిత్రుడి గొంతు వినగానే ఆయన ఆనందానికి అవధులు లేవు.

“ఇన్నేళ్లుగా నా మనసులో ఉన్న ఒక పెద్ద భారమైన రుణాన్ని ఇవాళ తొలగించుకున్నాను” అని చెబుతూ ఇస్మాయిల్ భావోద్వేగానికి గురయ్యాడు. లచ్చన్న కుటుంబీకులకు రూ. 25 వేల నగదును అందజేశాడు.

విలువైన పాఠం
డబ్బుకంటే మనిషి ఇచ్చే మాట, విలువలకు ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తులు ఇప్పటికీ ఉన్నారని ఈ ఘటన చాటిచెప్పింది. స్నేహానికి, ఇచ్చిన మాటకు కట్టుబడే ఇస్మాయిల్ నిజాయితీ స్థానికులను సైతం కదిలించింది. ఒక సాధారణ అప్పు తీర్చుకునే ఘటన, మానవీయ విలువలు ఎంత గొప్పవో మరోసారి ప్రపంచానికి గుర్తు చేసింది.

ఇక్కడ 25 వేలు అనేది ఎక్కువా, తక్కువా అనేది కాదు… ఇన్నేళ్ల తరువాత, ఇంత దూరం వచ్చి, పాత అప్పును చెల్లించిన ఇస్మాయిల్ స్వచ్ఛతత్వం అభినందనీయం! ఎక్కడి పాలక్కాడ్- ఎక్కడి ధర్మపురి!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • 25 ఏళ్లు- 25 వేలు- వెయ్యి కిలోమీటర్లు… ఇంట్రస్టింగు ‘రుణబంధం’!
  • ఒక మనిషి భౌతికంగా మాయమైపోయి, మరోచోట ప్రత్యక్షం కాగలడా?
  • నాగదుర్గ తొలి సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులు యాక్సెప్ట్ చేసినట్టేనా?
  • అద్భుతం… 158 ఏళ్ల తర్వాత మళ్ళీ కనిపించిన అరుదైన పుష్పం!!
  • అదే వృద్ధ అక్కినేని- అదే మీనా- అదే క్రాంతికుమార్… కానీ రిజల్ట్..?!
  • సౌదీలో నేను సేఫ్ అనుకున్నాడు! చివరకు UAPA లో బుక్కయ్యాడు!!
  • కెరీర్ మొదట్లో చిరంజీవి దస్తూరీ తెలుసా మీకు..? ఇదుగో ఓ లేఖ!!
  • I, No Body – ఓ కొత్త స్టోరీ లైన్ – కథ చెప్పడంలోనే కాస్త తడబాటు!!
  • నాగార్జున కుటుంబంలో ఏం జరుగుతోంది? సోదరుల నడుమ పొరపొచ్చాలు?
  • యుద్ధ మేఘాల కింద సముద్రంలో!- ‘పాంచ్‌ సాహెబ్‌’ హిఫా సలీమ్ ధైర్యగాథ!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions