.
Subramanyam Dogiparthi …. ఏయన్నార్- క్రాంతికుమార్- మీనా కాంబినేషన్లో వచ్చిన మరో దృశ్య శ్రవణ కావ్యం . ఓ క్లాసిక్ 1993 సంక్రాంతికి వచ్చిన ఈ రాజేశ్వరి కళ్యాణం సినిమా . కమర్షియల్ గా సక్సెస్ కాకపోయినా గొప్ప క్లాసిక్ ఈ సినిమా .
సప్తపది సినిమాలో విశ్వనాధ్ ఇష్టం లేని పెళ్లి చేసుకున్న ఓ సాంప్రదాయ కుటుంబంలోని యువతికి తానిష్టపడిన యువకుడితో పునర్వివాహం జరిపించి ఓ నిశ్శబ్ద విప్లవ సినిమాను అందించారు . ఈ సినిమాలో క్రాంతికుమార్ మరో నిశ్శబ్ద విప్లవ కథను అందించారు .
Ads
హీరోయిన్ రాజేశ్వరి (మీనా) సవతి తల్లి భవాని (జయచిత్ర) తాగుబోతయిన తన తమ్ముడుతో (శ్రీకాంత్) బాల్య వివాహం జరిపిస్తుంది . తండ్రి జమీందార్ రాయుడు గారు (గుమ్మడి) నెట్టివేయటంతో శ్రీకాంత్ చనిపోతాడు .
రాజేశ్వరి బాల్యంలోనే విధవ అవుతుంది .
ఆ విషయం తెలియకుండానే పెరిగిన రాజేశ్వరి ఆ ఊరికి వెటర్నరీ డాక్టరుగా వచ్చిన శంకరాన్ని (సురేష్) ప్రేమిస్తుంది . సవతి తల్లికి ఈ ప్రేమ రుచించదు . ఆమెను , ఊరి జనాన్ని ఎదిరించి సీతమ్మ తల్లి మెడలోని మంగళసూత్రాన్ని శంకరం చేత రాజేశ్వరి మెడలో కట్టించి ఊరి బహిష్కరణకు గురవుతారు . అలా ఓ నిశ్శబ్ద విప్లవ సినిమా .
క్రాంతికుమార్ చాలా కళాత్మకంగా కధను నేసారు . హాలీవుడ్ సినిమా అయిన On Golden Pond స్ఫూర్తితో మన తెలుగు సినిమా కధను నేసారని అంటారు . ఇంగ్లీషులో ఆ సినిమాకు ఆస్కార్ అవార్డులు కూడా వచ్చాయట .
క్రాంతికుమార్ ఆ హృద్య కధకు గోదావరి లంకను నేపధ్యంగా తీసుకుని ఇంకా అందంగా తీర్చిదిద్దారు . ఫొటోగ్రఫీ డైరెక్టర్ కె యస్ హరిని గోదావరి అందాలను అంత అందంగా చూపినందుకు అభినందించాలి .
కధ ఏంటంటే గ్రామంలో పాఠాలు చెప్పి రిటైరయిన ఏయన్నార్ అందరికీ గౌరవనీయులయిన మాస్టారు . సినిమా అంతా మాస్టారనే పిలవబడతారు . ఆయన పేరేంటో కూడా తెలియదు మనకు . ఆయన భార్య వాణిశ్రీ . ఆమె సంగీతం మాస్టారిణి . ఊరి జమీందారు కూతురు మీనా ఆమెకు శిష్యురాలు . వారిద్దరి బిడ్డ లాగా ఆదరించబడుతూ ఉంటుంది .
గ్రామానికి వెటర్నరీ డాక్టరుగా వచ్చిన సురేష్ మాస్టారి గారింట్లోనే ఉంటాడు . సురేష్ , మీనా పెళ్లి మీనా సవతి తల్లి అభీష్టానికి భిన్నంగా జరిపిస్తారు . ఆ కక్షతో సవతి తల్లి గర్భవతిగా ఉన్న మీనా మీద , సురేష్ మీద తన మనుషుల చేత దాడి చేయిస్తుంది . ఆ దాడిలో బిడ్డను కని మీనా చనిపోతుంది . సురేష్ ని కొట్టి గోదావరిలో పడేస్తారు .
ఆ బిడ్డను పిల్లలు లేని వృధ్ధ జంట తమ బిడ్డగా సాకుతుంటారు . దత్తత తీసుకునే సమయానికి సురేష్ రావటం , ఫ్లాష్ బేక్ లో ఆ బిడ్డకు జరిగిన కధంతా చెప్పటం , మీనా స్మృతులతో అక్కడ ఉండలేని సురేష్ తన బిడ్డతో వెళ్ళిపోతాడు . వృధ్ధ జంట ఇద్దరే మిగిలిపోవటంతో సినిమా ముగుస్తుంది .
సీతారామయ్య గారి మనమరాలు సినిమాలాగా ఆర్ద్రతతో కూడిన సినిమా . కీరవాణి అద్భుతమైన బేక్ గ్రౌండ్ మ్యూజిక్కుని అందించారు . క్లైమాక్సులో కర్కశులకు కూడా కళ్ళు చెమ్మగిల్లాల్సిందే . అంత గొప్ప BGM ని అందించారు .
ప్రేమనగర్ , దసరా బుల్లోడు వంటి వీర రొమాంటిక్ సినిమల్లో మెగా జంటగా తెలుగునాడుని ఒక ఊపు ఊపిన ఏయన్నార్- వాణిశ్రీ జంట వయసుడిగిన జంటగా పోటాపోటీగా నటించారు . ఏయన్నార్ మరో సీతారామయ్యగా నటిస్తే వాణిశ్రీ నటనలో మరో జీవనజ్యోతి , కన్నవారి కలలు సినిమాలలో వాణిశ్రీ కనిపిస్తుంది .
ఇంక మీనా . సవతి తల్లి పెట్టే కష్టాలను మరచిపోయేందుకు బయట అల్లరి పిల్లగా హుషారుగా ఉరందరికీ ఇష్టురాలు అవుతుంది . అల్లరి పిల్లగా , గొప్ప ప్రేయసిగా మీనా తినేసింది . ఈ ముగ్గురి తర్వాత చెప్పుకోవలసిన సేడిస్ట్ సవతి తల్లి పాత్రలో జయచిత్ర . చాలా గొప్పగా నటించింది . ఇతర పాత్రల్లో గుమ్మడి , శ్రీకాంత్ , బ్రహ్మానందం , బాబూమోహన్ , పాకీజా , బేబీ శ్రేష్ట తదితరులు నటించారు .
కీరవాణి సంగీత దర్శకత్వంలో వేటూరి వారి పాటలన్నీ చాలా బాగుంటాయి . బాలసుబ్రమణ్యం , చిత్ర ప్రాణం పోసారు . శ్రీగణపతిని సేవింపరావే అనే హరికధ వింటుంటే మొదట్లో వాగ్దానం సినిమాలో రేలంగి హరికధ గుర్తుకొస్తుంది . సినిమాలో ఈ హరికధ కీలకమయినది .
సీతారాముల కళ్యాణం హరికధ . మధ్యలో సీతమ్మ తల్లి మెడ లోనుంచి మంగళసూత్రాన్ని తీసుకుని మాస్టారు పెళ్లి జరిపించేస్తారు . సవతి తల్లి తన మనుషుల్ని పురిగొల్పితే ఊళ్ళోని ఆడవాళ్లు మాస్టారికి అండగా నిలబడతారు . గొప్ప సీన్ .
సినిమా ప్రారంభంలోనే ఎందరో మహానుభావులు అందరికీ వందనములు పాటను వేటూరి వారు బాగా రీమిక్స్ చేసారు . అందమైన చిత్రీకరణ . మరో చక్కని పాట ఓడను జరిపే ముచ్చట కనరే వనితలార నేడు అంటూ సాగే పాట మొదట వాణిశ్రీ మీద ప్రారంభమయి మీనా , సురేష్ మీద డ్యూయెట్ గా సాగుతుంది . అందమైన వాటర్ ఫాల్స్ లొకేషన్లో చిత్రీకరించబడింది .
మరో శ్రావ్యమైన డ్యూయెట్ నింగి నేల పొద్దుల్లో నీకూ నాకూ ముద్దంట సురేష్ , మీనా మీద ఉంటుంది . మీనా మీద చుక్క చుక్కా అంటూ సాగే పాట అల్లరి అల్లరిగా సాగుతుంది . కపిలేశ్వరపురం , ధవళేశ్వరం ప్రాంతాలలో ఔట్ డోర్ షూటింగ్ జరుపుకున్న ఈ దృశ్య శ్రవణ కావ్యం average/just above average సినిమా గానో మిగిలిపోవటం కించిత్ బాధాకరమే .
వికీపీడియాలో ఉన్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు ఏడు నంది అవార్డులు వచ్చాయి . ఉత్తమ నటిగా మీనా , ఉత్తమ రెండవ చిత్రంగా , ఉత్తమ సహాయ నటిగా జయచిత్రకు , ఉత్తమ గేయ రచయితగా వేటూరికి , ఉత్తమ గాయనిగా చిత్రకు , ఉత్తమ సంగీత దర్శకునిగా కీరవాణికి , ఉత్తమ కాస్ట్యూమ్స్ డిజైనరుగా సాయికి అవార్డులు వచ్చాయి . ఈ సమాచారం ఎంతవరకు కరెక్టో నాకు ఐడియా లేదు .
నటుడు మురళీమోహన్ సంస్థ జయభేరి వారు నిర్మించిన ఈ సినిమా యూట్యూబులో ఉంది . ఇంతకుముందు చూసి ఉండకపోతే తప్పక చూడండి . రస హృదయులకు చాలా బాగా నచ్చుతుంది .
- ఇక్కడ మరో చిన్న అబ్జర్వేషన్… సీతారామయ్యగారి మనవరాలు, ఈ రాజేశ్వరి కల్యాణం కథలు వేర్వేరు… కానీ సీతారామయ్య గారి మనవరాలు ప్రభావం ఖచ్చితంగా ఈ సినిమాపై ఉంది… అదే క్రాంతికుమార్, అదే మీనా, అదే అక్కినేని ముసలి గెటప్… కాకపోతే హట్టంగడి ప్లేసులో ది గ్రేట్ వాణిశ్రీ… కాకపోతే సీతారామయ్య గారి మనవరాలు సూపర్ బ్లాక్ బస్టర్ కావడానికి కారణం డైలాగులు, పాటలు, క్రైమ్ ఛాయల్లేకుండా కేవలం ఉద్వేగాలకు మాత్రమే చాన్స్ ఇవ్వడం… అలాగని రాజేశ్వరి కల్యాణం తక్కువ అని కాదు, దేని క్రెడిట్ దానిదే…
Share this Article