.
ఎస్. జానకి వెళ్లిపోయారు… భారతదేశ సినిమా గాయనీమణుల్లో అత్యంత ప్రతిభావంతమైన గాయనీమణి ఎస్. జానకి! ఆమె వెళ్లిపోయారు… అయ్యో… అయ్యో… అయ్యయ్యో…
ప్రత్యేకమైన గాయని ఎస్. జానకి. ఆమెకు ఉన్న ప్రతిభ మన దేశంలో మఱో చలనచిత్ర గాయనికి లేదు. ప్రతిభ పరంగా భారతదేశ చలనచిత్ర నేపథ్య గాయనీమణుల్లో అందఱికన్నా మిన్న ఎస్. జానకి.
Ads
స్వర సమంతో (తాళ సమం కాదు) పాడతారు. సంగతులు వెయ్యడంలో సమతౌల్యం (balance) పాటిస్తారు. సంగతుల్ని blur చెయ్యకుండా వెయ్యడంలో ఆమె దిట్ట. ఈ విషయాల్లో జానకి సుశీలకన్నా మేలైన గాయని.
కన్నడం, తమిళ్ష్, మలయాళం సినిమాల్లో ఆమె పలు అద్భుతాలను పాడారు. ముఖ్యంగా ఆమె మలయాళం ఉచ్చారణ చాల గొప్పగా ఉంటుంది. తెలుగులో కన్నా ఇతర భాషల్లోనే ఆమె గొప్పగా పాడారు. కన్నడంలో ఎల్. వైద్యనాథన్ సంగీతంలో “శివ, శివ యన్నద…” అంటూ ఆమె పాడిన పాట దేశంలోని మరే గాయని పాడలేరు. ఆ పాట లింక్:
తెలుగులో నర్తనశాల సినిమాలో పాడిన “నరవరా ఓ కురువరా…” పాటను soprano లో పాడారు. ఆ స్థాయిలో balanceతో పాడడం ఆమె గొప్ప తనానికి అభివ్యక్తి. ఆమె తమిళ్ష్ లో పాడిన “సింగార వేలనే దేవా…” (తెలుగులో “నీ లీల పాడేద దేవా…”) మఱో గాయని పాడలేనిది.
Mood singing ఆమె ప్రత్యేకత. ఆమె పాడిన “నీలి మేఘాలలో…” పాటను ఘంటసాల కూడా పాడారు. ఆమె పాడిందే గొప్పగా ఉంటుంది.
ముఖ్యంగా ఇళైయరాజా జానకి గాత్ర ధర్మానికి , గాత్ర సంపదకు, ప్రతిభకు అనువుగా ఎన్నో అద్భుతాలను సృష్టించారు. జానకిలోని ప్రత్యేకమైన ప్రజ్ఞకు, పరిమాణానికి పట్టంకట్టారు; ప్రాశస్త్యాన్ని కలిగించారు. ఎస్. జానకితో ఇళైయరాజా పాటకు ఎంతో వైవిధ్యాన్ని, సమృద్ధిని, పరిపుష్టిని సాధించారు. ఈ పరిణామం సుశీలతో సాధ్యమయ్యేది కాదు.
నిజానికి ఎమ్.ఎస్. విశ్వనాద(థ)న్ తొలి దశలోనే ఆమెతో ఎన్నో గొప్ప పాటలు తమిళ్ష్‌లో పాడించారు. ఆలయమణి (తెలుగులో గుడిగంటలు) సినిమాలో “తూక్కమ్ ఉన్ కణ్గళై…” (తెలుగులో “నీ కనుదోయిని నిద్దురనై…”) పాటా, పోలీస్ కారన్ మగళ్ (తెలుగులో కానిస్టేబుల్ కూతురు) సినిమాలో “ఇన్ద మన్ఱత్తిల్ ఓడివరుమ్…” (తెలుగులో “చిగురాకుల ఊయలలో…”) పాటా ఎమ్.ఎస్. విశ్వనాథన్ సంగీతంలో గజల్ ఫణితిలో జానకి గొప్పగా పాడారు.
ఆ పాటల లింక్స్:
తమిళ్ష్‌లో శంకర్-గణేశ్ గజల్ లాగా చేసిన “మేగమే మేగమే…” అని పాలైవనచ్ చోలై సినిమాలో వాణీ జయరాం చేత పాడించారు. ఆ సినిమా మంచుపల్లకి పేరుతో తెలుగులో రీమేక్ అయినప్పుడు “మేఘమా దేహమా…” అంటూ జానకి ఆ పాటను పాడారు. జానకి పాడిందే మేలుగా ఉంటుంది. స్వరసమం, balance, mood ల పరంగా వాణీ జయరాంకన్నా జానకి గానం గొప్పగా ఉంటుంది.
తెలుగులో పీ. సుశీల పాడిన “జోరు మీదున్నావు తుమ్మెదా…” పాట తమిళ్లో “వైగై కరైయినిల్ ఒరు పఱవై…” అంటూ జానకి పాడిందే మేలుగా ఉంటుంది. ఈ పాట సందర్భంలో కూడా స్వరసమం, balance, mood, expression పరంగా జానకి గానం మేలుగా ఉంటుంది. ఆ పాట లింక్:
జానకి intonation మఱో గాయనిలో లేదు. Expression పరంగా జానకి గానం ఉదాత్తమైంది. ఎంతో ప్రతిభావంతమైన, ఎంతో గొప్ప గాయని ఎస్. జానకి.
ఎస్. పీ. బాలసుబ్రహ్మణ్యం తాను జానకి వల్ల ప్రభావితుణ్ణైనట్టుగా బహిరంగంగా చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న సినిమా సంగీతం, ఉర్దూ గజల్ సంగీతం, కర్ణాటక సంగీతం, హిందూస్థానీ, ఇంగ్లిష్ సంగీతంపై విశేషమైన పరిశీలన, అవగాహన ఉన్న పీ.బీ. శ్రీనివాస్ తనకు జానకి గానమంటే ప్రత్యేకమైన అభిమానం అని ఈ వ్యాస రచయితతో పలుసార్లు చెప్పారు. జానకి గానంపై తనకున్న గౌరవాన్ని గాయని చిత్ర విశేషంగా చెబుతారు.
జానకి గానం గొప్పతనం తెలుగుకు పూర్తిగా, సరిగ్గా అవగతం కాలేదు, ఇతర భాషల్లోలా తెలుగులో జానకి రాణించలేదు. తెలుగు, తమిళ్ష్ సినిమా గానంలో పీ. సుశీల స్థానం ఎలాంటిదో కన్నడం, మలయాళం సినిమాల్లో ఎస్. జానకి స్థానం అలాంటిది.
1969లో జానకి పీ.బీ. శ్రీనివాస్ తో కలిసి ఒక ఇంగ్లిష్ పాట పాడారు. యువ గాయనీగాయకులపై జానకి ప్రభావం స్పష్టంగా తెలుస్తూనే ఉంటుంది. ప్రత్యేకమైన ప్రతిభతో, ప్రత్యేకమైన శైలితో జానకి ఒక ప్రత్యేకమైన గాయని.
రోచిష్మాన్
9444012279
Share this Article