.
మన దర్శకులకు కాపీ కొట్టడం కొత్తేమీ కాదని అందరికీ తెలుసు… పాతకాలం నుంచీ ఉన్నదే… కాకపోతే అనుసరణ, అనుసృజన, స్పూర్తి వంటి పడికట్టు పదాలతో కవర్ చేసుకునేవాళ్లు, అదీ బయటపడితే…
గతం వేరు, సినిమాలకు వ్యతిరేకంగా వార్తలు వచ్చేవి కావు, కానీ ఇది టెక్నాలజీ యుగం, సోషల్ మీడియా శకం… ఏదైనా డౌట్ వస్తే నిమిషాల్లో నెట్ జల్లెడ పట్టి, ఆధారాలతో సహా ఇదీ కాపీ అని పోస్టులు పెట్టేసి, బట్టలు విప్పదీస్తున్నారు…
Ads
ఒకప్పుడు పాత సినిమాలు చూడాలంటే మళ్ళీ టీవీల్లో వచ్చే వరకు వేచి చూడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఓటిటి (OTT), యూట్యూబ్ క్లిప్స్ ద్వారా ఏ పాత సినిమానైనా క్షణాల్లో వెతికి, పక్కపక్కనే పెట్టి ‘సైడ్-బై-సైడ్’ వీడియోలుగా పోస్ట్ చేస్తున్నారు. దీనివల్ల కాపీని దాచడం దర్శకులకు ఇప్పుడు సవాలుగా మారింది.
తాజాగా లెనిక్ క్లైమాక్స్ గతంలో వచ్చిన బాలకృష్ణ సినిమా కృష్ణబాబు క్లైమాక్స్ అచ్చుగుద్దినట్టు కాపీ కొట్టిందేననీ సోషల్ మీడియా తేల్చిపారేస్తోంది… ఆ వివరాలు సంక్షిప్తంగా… (నిజానికి కాపీ అయినా చాలామంది గుర్తించలేరు, బాలకృష్ణ సినిమా పెద్దగా ఆడలేదు, ఎవరికీ గుర్తు లేదు)…
అఖిల్ అక్కినేని (Akhil Akkineni), భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) జంటగా మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం లెనిన్ (Lenin)… అక్కినేని స్వయంగా నాగార్జున నిర్మించిన ఈ చిత్రం ఎన్నో అంచనాల నడుమ జులై 10 న రిలీజ్ అయ్యింది… పర్లేదు అనే టాక్ తెచ్చుకోవడమే కాకుండా అఖిల్ కెరీర్‌ను నిలబెట్టింది…
ముఖ్యంగా లెనిన్ క్లైమాక్స్ కాస్త డిఫరెంట్… కొందరికి నచ్చింది, కొందరికి నచ్చలేదు… కానీ ఊహించని ట్విస్టు అది… ఇది 1999లో నందమూరి బాలకృష్ణ నటించిన క్రిష్ణబాబు సినిమాలోని ఒక ఐకానిక్ సీన్‌కు జిరాక్స్ కాపీ అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో కొందరు ఆధారాలతో సహా వీడియోలను వైరల్ చేస్తున్నారు…
నందమూరి బాలకృష్ణ, మీనా, రాశి హీరోహీరోయిన్లు ఆ సినిమాలో… ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం… ఒక మోస్తరుగా విజయాన్ని అందుకుంది. బాలయ్య రేంజ్ నడవలేదు… ఇక ఈ సినిమాలో ఒక ఐకానిక్ సీన్ నే లెనిన్ టీమ్ కాపీ చేశారని సినిమా లవర్స్ చెప్పుకొస్తున్నారు.
ఈ చిత్రంలో విలన్ పగతో హీరో కళ్లల్లో కారం కొట్టి, కంటిచూపు కనిపించకుండా చేస్తాడు. అదే సమయంలో హీరోయిన్ మీనా నోట్లో గుడ్డలు కుక్కి, ఆమె అరవకుండా చేసి… హీరో బాలకృష్ణ చేతికే కత్తి ఇచ్చి, కుట్రతో హీరోయిన్ను చంపేలా చేస్తాడు.
ఇక లెనిన్ ప్రీ క్లైమాక్స్‌లో కూడా ఇదే సీన్ ని వాడటం ఇప్పుడు టాలీవుడ్లో సంచలనం… విలన్ హీరో కళ్లల్లో ఒక కెమికల్ కొట్టడం, హీరోయిన్ నోట్లో గుడ్డలు చుట్టడం, చివరకు లెనిన్ చేత్తోనే భారతి ప్రాణాలు కోల్పోయేలా చేయడం.. అచ్చు గుద్దినట్లు కృష్ణబాబు సీన్‌ను దించేసినట్లు ఉండటంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
కొందరు స్ట్రెయిట్ కాపీ అని విమర్శిస్తే… మరికొందరు ఓ వింత జస్టిఫికేషన్ ఇస్తున్నారు, అదేమిటయ్యా అంటే… అప్పట్లో బాలయ్య చేసిన ఆ పవర్ఫుల్ ట్రాజిక్ ఎమోషన్‌ను దర్శకుడు నందు ఇప్పుడు అఖిల్‌తో నేటి తరం ఆడియన్స్‌కు తగ్గట్లుగా రీక్రియేట్ చేసి సక్సెస్ అయ్యాడట…
Share this Article