.
Subramanyam Dogiparthi… రూలింగ్ పార్టీ మీటింగుకు పోలీస్ పర్మిషనేంటి !? హైకోర్టు జడ్జి మనోడే ఉరిశిక్షకు బదులు లైఫేయిస్తా . లైఫ్ పడ్డోడివి ఆరేళ్ళకే బయటకొచ్చావ్ .ఇలాంటి డైలాగులు 1993 లో వచ్చిన ఈ రక్షణ సినిమా టైంకే ఉన్నాయి . నిజమే కదా ! ముప్పై ఏళ్ల తర్వాత దేశంలో పరిస్థితి మెరుగయిందా లేక ఇంకా దిగజారిందా అనేది ప్రజలే ఆలోచించుకోవాలి .
Super cop movie . నాగార్జున కెరీర్లో uncompromising Police Officer గా నటించిన సినిమా . ఇప్పుడు చూసేవాళ్ళకు 2004 లో వచ్చిన వెంకటేష్ నటించిన ఘర్షణ సినిమా గుర్తుకొస్తుంది . రక్షణ సినిమా అన్నపూర్ణ ఫిలింస్ బేనర్లో అక్కినేని వెంకట్ నిర్మించారు . కధ , స్క్రీన్ ప్లేని అక్కినేని వెంకట్, దర్శకుడు ఉప్పలపాటి నారాయణరావు సమకూర్చారు .
Ads
కధను బాగా నేసారు . ఓ ఆకు రౌడీ , అతని తమ్ముడు చేసే అరాచకాలను అడ్డుకునే ACP నాగార్జున . అతని ధాటికి తట్టుకోలేక ఆ ఆకు రౌడీ నల్ల శ్రీను రూలింగులో ఉన్న తమ పార్టీకి ప్రెసిడెంట్ అయి జనాన్ని , వ్యవస్థల్ని ఇంకా భయపెట్టేస్తుంటాడు . సాక్ష్యాధారాలతో రుజువు చేసి నల్ల శ్రీను తమ్ముడికి లైఫ్ పడేట్లు చేస్తాడు ACP .
అధికార పార్టీ అండదండలు ఉంటే జైల్లో ఉండి మర్డర్లు చేయించేవారిని కూడా సత్ప్రవర్తన కారణంగా విడుదల అవుతుంటారు . చూస్తున్నాంగా డేరా బాబాని . పోక్సో కేసుల్లో కూడా బెయిల్స్ వస్తుంటాయి . వాడు బయటకొచ్చి జనాన్ని లేపేస్తుంటాడు .
సినిమాలో కూడా నల్ల శ్రీను తమ్ముడు చిన్నా సత్ప్రవర్తనకు ఉబ్బితబ్బిబ్బై విడుదల చేస్తారు . విడుదలయి వచ్చి నాగార్జున కుటుంబాన్ని చిందరవందర చేస్తారు . మిత్రుడు నాజర్ని చంపేస్తారు . కూతురిని కిడ్నాప్ చేస్తారు . నాగార్జున పెట్రేగి చిన్నాని చంపి నల్ల శ్రీనుని చట్టానికి అప్పచెపుతారు .
సినిమాలో నక్సలైట్ల పేరుతో తమ వర్గం MLA లను తానే కిడ్నాప్ చేయిస్తాడు నల్ల శ్రీను . అతని చెర నుండి MLA లను రక్షిస్తానికి పోలీసులు కౌంటర్ ప్లానింగ్ చేయటం , అది వర్కవుట్ కాకపోవటం , చిన్నా నలుగురు MLA లను చంపటం , ఇద్దరు MLA లు పారిపోయి పోలీసులకు వాస్తవాలు చెప్పటం ఆరోజుల్లో ప్రేక్షకులకు బాగానే నచ్చాయి .
పోలీసులు తాము కేసుల్లో ఇరికించాలి అని అనుకుంటే చాలా విన్యాసాలు చేస్తారు . లేని సాక్ష్యాలను సృష్టించగలరు . ఉన్న వాటిని లేపేయగలరు . అవినీతి పోలీసులు , వికృత రాజకీయులు చేతులు కలిపితే అగ్నికి వాయువు తోడయినట్లే . చూస్తున్నాంగా .
ముందుగా మెచ్చుకోవలసింది నాగార్జుననే . ఏంగ్రీ , డ్యూటీ మైండెడ్ పోలీస్ ఆఫీసరుగా బాగా నటించాడు . రొమాంటిక్ సీన్లలో తన మన్మధావతారాన్ని ఆవిష్కరించారు . తర్వాత అదరగొట్టింది అన్నాతమ్ముళ్ళుగా నటించిన కోట శ్రీనివాసరావు , సలీం గౌస్ . కోట శ్రీనివాసరావు అప్పటికే ఇలాంటి పాత్రల్లో పండిపోయాడు . అతని తమ్ముడు చిన్నాగా నటించిన సలీం గౌస్ చాలా వికృతంగా భయంకరంగా నటించాడు .

నాగార్జున జంటగా శోభన పాటల్లో తన నృత్య పటిమతో ప్రేక్షకులను అలరించింది . అతిధి పాత్రలో ఒకే ఒక్క పాటలో డాన్సించింది రోజా . నాగార్జున మిత్రుడిగా సంయమనం పాటించే పోలీస్ ఆఫీసరుగా నాజర్ , నానమ్మగా నిర్మలమ్మ , నల్ల శ్రీను PA గా బ్రహ్మానందం , ఇతర పాత్రల్లో బాలయ్య , చిన్నా , జె డి చక్రవర్తి , బెనర్జీ , అనంత్ , సిల్క్ స్మిత , దేవదాస్ కనకాల ప్రభృతులు నటించారు .
కీరవాణి సంగీత దర్శకత్వంలో వేటూరి , సిరివెన్నెల , కీరవాణిలు వ్రాసిన పాటల్ని బాలసుబ్రమణ్యం , చిత్ర , కీరవాణి , మాల్గాడి శుభ శ్రావ్యంగా పాడారు . నాగార్జున , సిల్క్ స్మితల పై సాగే నీకు నాకు ఉన్న లింకు ఈడనో చెప్పలేను ఆడనో చెప్పలేను ఏడనో చెప్పలేను పాటను మాల్గాడి శుభ బ్రహ్మాండంగా పాడింది . సిల్క్ స్మిత అదరగొట్టేసింది .
అలాగే ఒక్క పాటలో మాత్రమే కనిపించే రోజాతో నాగార్జున డాన్స్ పాట ఘల్లుమంది బాసూ గలాసు త్రిల్లుమంది డోసు పటాసు చాలా హుషారుగా ఉంటుంది . నాగార్జున , శోభనల మీద మూడు డ్యూయెట్లు బాగా చిత్రీకరించబడ్డాయి . గుప్పు గుప్పు గుప్పుమన్నదంట , కన్నెపాపా అందుకో , ఏ జన్మలో ఈ సంబంధము ఏ రాగమో ఈ సంగీతము చాలా బాగా వచ్చాయి . డాన్సుల్ని ప్రభుదేవా బాగా కంపోజ్ చేసారు .
తెలుగులో బాగానే ఆడిన ఈ రక్షణ సినిమా తమిళ , బెంగాలీ భాషల్లోకి డబ్ చేయబడింది . సినిమా యూట్యూబులో ఉంది . ఇంతకుముందు చూడనివారు తప్పక చూడవచ్చు . It’s an action cum romantic entertainer .
Share this Article