Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

భారతీయ వెండి తెరపై సంస్కృతం పలికించిన దర్శకుడు..!

July 14, 2026 by M S R

.

Mohan Goteti …. వెండితెరపై సంస్కృతం పలికించిన దర్శకుడు!
తెలుగు సినిమా..
తమిళ సినిమా..
మలయాళ సినిమా..
హిందీ సినిమా..
ఆంగ్ల సినిమా..
ఇలా ప్రస్తుతం వాడుకలో వున్న భాషలలో సినిమాలు నిర్మించడం మామూలే..
అయితే, 1983లో తొలిసారిగా సంస్కృత భాషలో ఒక సినిమా వచ్చి సంచలనమైంది.
అదే ‘ఆది శంకరాచార్య’!

అసలు ఇప్పుడు ఎవరికీ వాడుక భాష కాని ఈ సంస్కృతంలో సినిమా నిర్మించడం ఏమిటి?
అసలు ఈ చిత్రాన్ని ఎవరైనా చూస్తారా అనిపించింది.
అంతటి సాహసం చేసింది ప్రఖ్యాత కన్నడ దర్శకుడు జి.వి. అయ్యర్.. ఆయనకు అండగా నిలిచి ఈ చిత్రాన్ని నిర్మించింది నేషనల్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్!

Ads

సహజత్వం కోసం ఆదిశంకరులు ఏ ఏ ప్రదేశాలలో నడయాడారో ఆయా ప్రదేశాలకు వెళ్లి మరీ షూటింగ్ చేశారు. ఒక విధంగా చెప్పాలంటే, కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు షూటింగ్ చేశారనే అనొచ్చు.
శంకరుల జన్మస్థలమైన కేరళలోని కాలడి, తర్వాత శృంగేరి, కాశీ, కశ్మీర్, కేదార్ నాథ్ వంటి ప్రదేశాలలో చిత్రీకరణ చేశారు.

ఎన్.ఎఫ్.డి.సి నిర్మించిన చిత్రం కాబట్టి పరిమిత బడ్జెట్టులో షూటింగ్ చేయాల్సి వచ్చింది.
దాంతో చిత్రం యూనిట్ అంతా కలిసి ఒక బస్సు అద్దెకు తీసుకుని, అందులోనే ఆయా ప్రాంతాలకు ఎనిమిది నెలల పాటు ప్రయాణిస్తూ.. ఏభై రోజుల పాటు ఎన్నో ప్రయాసల కోర్చి షూటింగ్ చేశారు.
ఆ ఏడాది ఆ చిత్రానికి నాలుగు జాతీయ అవార్డులు వచ్చాయి..
పలు అంతర్జాతీయ చిత్రోత్సవాలలో ఆ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు.
అయితే, ఇక్కడ మాత్రం ప్రేక్షకులని అది ఆకట్టుకోలేకపోయింది…

మనకి మాస్ మసాలా చిత్రాలు కావాలి..
అలాంటి సరంజామా ఉంటేనే సినిమా చూస్తాం.. ఏం చేస్తాం?.. మన అభిరుచి అది!
అయినా అయ్యర్ వెనుకంజవేయలేదు..
సంస్కృతాన్ని వదిలేయలేదు..
‘ఇది నా భారతీయ ప్రాచీన భాష.. నా నరనరాల్లోనూ రక్తంలో ఇది ప్రవహిస్తోంది’ అనుకుని గర్వంగా రొమ్ము విరిచాడు.

ఆయనే 1993లో మళ్లీ సంస్కృతంలోనే ‘భగవద్గీత’ చిత్రాన్ని రూపొందించారు.. ఈసారి ప్రముఖ నిర్మాత టి.సుబ్బరామిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకు వచ్చారు!
దీనికీ ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డు వచ్చింది.
దీనినీ మన జనం చూడలేదు.. మన టేస్ట్ వేరు కదా!

1997లో అనుకుంటా.. అప్పుడు తాను దర్శకత్వం వహిస్తున్న ‘స్వామి వివేకానంద’ సినిమా షూటింగ్ కోసం అయ్యర్ హైదరాబాదుకు వచ్చారు.
ఆ రోజు రామానాయుడు స్టూడియోలో షూటింగ్ జరుగుతోందని తెలిసి, నేను, మా ఫొటోగ్రాఫర్ కె.ఎల్.కుమారస్వామి కలిసి స్టూడియోకి వెళ్లాం.
ముందుగా మాకు ఫ్లోర్ బయట ఆ సినిమా నిర్మాత, పారిశ్రామికవేత్త అయిన టి.సుబ్బరామిరెడ్డి ఎదురయ్యారు.
“షాట్ గ్యాప్ లో అయ్యర్ ని పరిచయం చేస్తాను వుండండి” అన్నారు సుబ్బరామిరెడ్డి.

కాసేపటికి షాట్ గ్యాప్ రావడంతో.. అయ్యర్ ఫ్లోర్ బయటకు వచ్చారు.
ఆయనని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాం..
తెల్లటి గడ్డం.. పంచె.. లాల్చీలో చాలా సాదాసీదాగా వున్నారు..
మీరు నమ్మండి.. కాళ్లకి చెప్పులు కూడా లేవు..
అసలు ఆయనని సినిమా డైరెక్టర్ అంటే ఎవరూ నమ్మరు..
ఎందుకంటే, మన సినిమా డైరెక్టర్ల వేషభాషలు ఎలా ఉంటాయో తెలిసిందే కదా!

ఓ సాధుపుంగవుడిలా.. ఓ మహర్షిలా కాంతితో ఓ మెరుపుతో కనిపిస్తున్నారు అయ్యర్.
అప్రయత్నంగానే చేతులు జోడించి నమస్కరించాం.. ఆయన కూడా రెండు చేతులతోటీ నమస్కరించారు.
సుబ్బరామిరెడ్డి మాకు పరిచయం చేయగానే.. “రండి కూర్చుని మాట్లాడుకుందాం” అన్నారు ఇంగ్లిష్ లో.
కాసేపు ఆయన్నే చూస్తూ ఉండిపోయాను..

ఆదిశంకరాచార్య, భగవద్గీత చిత్రాలతో మన ప్రాచీన భాష సంస్కృతానికి, హైందవానికి పెద్ద పీట వేసి.. ప్రపంచ సినిమా ముందు భారతీయ సినిమా విశిష్టతను చాటి చెప్పిన దిగ్గజ దర్శకుడు ఎంత నిరాడంబరంగా.. వినయంగా వున్నాడు?
కన్నడ కంఠీరవగా ప్రేక్షకుల హృదయాలలో చెరిగిపోని ముద్రను వేసిన డాక్టర్ రాజ్ కుమార్ గారిని కథానాయకుడిగానూ.. ప్రముఖ కన్నడ నటుడు నరసింహరాజుని హాస్యనటుడిగానూ ‘బేదర కన్నప్ప’ సినిమా ద్వారా పరిచయం చేసిన దిగ్గజ దర్శకుడాయన.

“ఆది శంకరాచార్య చిత్రాన్ని ఎందుకు సంస్కృతంలో రూపొందించారు?” అంటే “ఆ చిత్రాన్ని ఆ భాషలోనే తీయాలి” అన్నారు అయ్యర్.
ఓ క్షణం తర్వాత మళ్లీ తనే చెబుతూ, “అద్వైత వేదాంత సిద్ధాంత కర్త ఆదిశంకరులు చెప్పినవన్నీ సంస్కృతంలోనే వున్నాయి. వారి ఫిలాసఫీని సంస్కృతంలో చెబితేనే దానికి న్యాయం చేకూరుతుంది. ఆ నిండుదనం ఆ భాష వల్లే వస్తుంది” అని చెప్పారు.

అన్నట్టు… అయ్యర్ దర్శకుడు మాత్రమే కాదు.. నటుడు, రచయిత కూడా..
తన ఎనిమిదవ ఏటనే నాటక సమాజంలో చేరి బాల నటుడిగా స్టేజిపై కనిపించారు.
ఆ తర్వాత సినిమా రంగాన్ని ఎంచుకుని రచయితగా, దర్శకుడిగా కొనసాగారు.
‘కన్నడ చిత్ర భీష్మ’గా పేరుతెచ్చుకున్న అయ్యర్ మొదట్లో పలు కమర్షియల్ చిత్రాలు కూడా తీశారు.

అదే ప్రస్తావించి.. “ఇప్పుడు ఈ తరహా చిత్రాల వైపు ఎందుకు మళ్లారు?” అంటే చిన్నగా నవ్వి, గడ్డాన్ని సవరించుకుంటూ.. “మన మనసు ఎప్పుడూ ఒకేలా ఆలోచించదు కదండీ.. వయసుకు తగ్గట్టు ఒక్కో వయసులో ఒక్కోలా ఆలోచిస్తుంది.. నా సినిమాల నిర్మాణంలో మార్పు కూడా అలా వచ్చిందే” అన్నారు.
తర్వాత ‘స్వామి వివేకానంద’ సినిమా గురించి కూడా చాలా కబుర్లు చెప్పారు.

ఆ తర్వాతి కాలంలో ఆయన కన్నడలో ‘మధ్వాచార్య’ (ద్వైతం), తమిళంలో ‘రామానుజాచార్య’ (విశిష్టాద్వైతం) సినిమాలు, వాగ్గేయకారుడు పురందరదాసు కీర్తనల ఆధారంగా ‘శ్రీకృష్ణలీల’ పేరిట టీవీ సీరీస్ వంటివి కూడా రూపొందించి తన జన్మను సార్ధకం, తన పేరును చరితార్ధం చేసుకున్నారు.

హిందీలో రామాయణ దృశ్య కావ్యాన్ని రూపొందించాలని కలలుకని.. అందులో సంజయ్ దత్ ను రావణుడిగా చూపించాలని భావించి.. అందుకు తగ్గ ప్రణాళికను రూపొందించుకుంటున్న తరుణంలో.. 2003లో తన 87వ ఏట హఠాత్తుగా గుండెపోటుతో అయ్యర్ మరణించారు.
అన్నట్టు… యువకునిగా వున్నప్పుడు అయ్యర్ పై మహాత్మా గాంధీ ప్రభావం ఎక్కువగా వుండేది.
ఆయన సిద్ధాంతాల పట్ల ఎంతగానో ఆకర్షితులయ్యారు.
అందుకే, గాంధీ మరణాన్ని అయ్యర్ తట్టుకోలేకపోయారు.

ఆ క్షణమే ఓ నిర్ణయం తీసుకున్నారు..
అదేమిటంటే, ఇక జీవితాంతం పాదరక్షలు ధరించకూడదని!
ఆ క్షణమే వాటిని విసర్జించారు..
జీవితాంతం ఆ నిర్ణయానికి కట్టుబడివున్నారు..
అంతేకాదు, ఖాదీ వస్త్రాలే ధరించి గాంధీ పట్ల తన అభిమానాన్ని కూడా చాటుకున్నారు.

అలాంటి దర్శకుడిని భారతీయ చిత్ర సీమలో మనం ఇక చూడలేం..
ఇక ఇక్కడ మీరు చూస్తున్న ఫొటో 1997లో రామానాయుడు స్టూడియోలో అయ్యర్ ను నేను ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు మా ఫొటోగ్రాఫర్ కుమారస్వామి తీసినది!
-మోహన్ గోటేటి

సంస్కృత సినిమా
#AdiShankaracharya
#SwamiVivekananda

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • భారతీయ వెండి తెరపై సంస్కృతం పలికించిన దర్శకుడు..!
  • రావణ్ – నాకు చాలా ఇష్టం… తనను నేనెందుకు ప్రేమిస్తానంటే..!?
  • ఐబీ అధికారిపై 51 కత్తిపోట్లు – ఆప్ నేత దురాగతం – నిర్దారించిన కోర్టు
  • రేవంతుడు ఒక యోగీ కాగలడా..? షాబాద్ కిల్లర్‌కు బతికే అర్హత ఉందా?
  • జానకమ్మను తెలుగు జాతి ఓన్ చేసుకోలేదా..? ఏది నిజం? ఏది అబద్ధం?
  • తనను స్వాగతిస్తున్నవేళ – మోడీ కిందకు వంగి ఏం చేస్తున్నాడు?!
  • నాగార్జున అడగాలే గానీ… రోజా కూడా గెస్ట్ సాంగ్‌లో స్టెప్పులేయదా మరి!
  • Pure High Hypocrisy – ‘గులాబీ పులి గోళ్ల’కు నెత్తురే అంటలేదా!?
  • డీకే శివకుమార్- ఓ పాత యెజ్డి బైక్ కథ! అప్పట్లో ఆ బైక్స్ రేంజే వేరు!!
  • సచిన్, కోహ్లీ కూడా చేయలేని సెంచరీ ఫీట్- ఈమె చేసేసింది!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions