.
ప్లీజ్ పోసాని… నువ్వు ఆ రాజకీయాల్లోనే ఉండు, ఏపీ పాలిటిక్స్ వెగటు ధోరణులకు అక్కడే సెట్ అవుతావు… మళ్లీ ఎందుకు సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చావు..? నీ వింత విన్యాసాలు రాజకీయాలకే సూటబుల్, ఇక సినిమాల్లో వర్కవుట్ కావు… ప్లీజ్ పోసాని, కరుణించి దయతో ప్రేక్షకుల్ని వదిలెయ్…
ఆపరేషన్ అరుణారెడ్డి చూశాక ఇదే అప్పీల్ చేయాలనిపిస్తుంది… ఒకప్పుడు భిన్నమైన రైటింగ్, యాక్టింగ్‌తో కాస్త ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపాడు… అప్పట్లో మెంటల్ కృష్ణ అనే సినిమాలో ఓ మెంటల్ పాత్ర చేసి, చీరె కూడా కట్టిన తను ఇప్పుడు ఇందులోనూ అదే… అప్పుడేమో గానీ ఇప్పుడైతే సరిగ్గా మెంటల్ కృష్ణే…
Ads
ఎందుకంటే… తనే ఎడిటర్, తనే రైటర్, తనే యాక్టర్, తనే డైరెక్టర్… ఇప్పుడెవరొస్తారు తనతో సినిమా చేయడానికి..? సో, తనే నిర్మాత… పోనీ, ఏమైనా ఇంప్రెసివ్ సినిమా ఇచ్చాడా..? మరీ ఈటీవీ, జెమిని సీరియళ్లను మించి నాసిరకం ప్రొడక్ట్ జనం మీదకు వదిలాడు…
జర్నలిజాన్ని, రాజకీయాల్ని కలగలిపి ఏదేదో వింత కథను ప్రజెంట్ చేయబోయాడు… లీడ్ రోల్ చేసిన తను ఓ మంత్రి కొడుకు గోపాలం, జల్సారాయుడు, అరుణారెడ్డి అనే పాత్ర జర్నలిస్టు… స్టింగ్ ఆపరేషన్ చేసి మంత్రి తప్పులు, అవినీతిని బయటపెడుతూ ఉంటుంది… (స్టింగ్ కాలం పోయి చాలాకాలమైంది పోసానీ, ఇంకా ఏ కాలంలో ఉన్నావు..?)
సో, మంత్రి పదవి ఊస్టింగ్, గోపాలం మదర్ కొత్త మంత్రి… నా మంత్రి పదవి ఊడగొడతావా నీ అంతు చూస్తామని కసి పెంచుకుంటుంది మంత్రి కుటుంబం ఆ జర్నలిస్టుపై… ట్రాప్ చేస్తారు, ఈ గోపాలంతో పెళ్లి చేస్తారు… (అన్నీ తెలిసీ ఆమె ఎలా ఒప్పుకుంది అనడక్కండి, పురుగులు పట్టిపోతారు)
కొన్నాళ్లకు జర్నలిస్టుకు చుక్కలు చూపించడం స్టార్ట్… ఆమె వేరే వ్యక్తులతో గడిపిందని, తనని మోసం చేసిందని గోపాలం ఆరోపిస్తాడు. విడాకులకు సిద్ధమవుతాడు. అంతేకాదు ఆమెపై హత్యాయత్నం కూడా చేస్తాడు. కానీ ఆమె ఎట్టకేలకు బతుకుతుంది. అప్పుడే తను ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది.
ఈ కేసు కాస్తా కోర్ట్ కి వెళ్తుంది, అక్కడా గోపాలం షాక్ ఇస్తాడు. తాను అసలు మగాడినే కాదని కోర్టుకి చెబుతాడు. అంతేకాదు మెడికల్ టెస్టుల్లోనూ అదే తేలుతుంది. ఇంతలో గోపాలం తండ్రి మరో షాక్ ఇస్తాడు ఆమెకు. అరుణారెడ్డిలో పెరిగే బిడ్డకి తనే తండ్రిని అని చెబుతాడు. వాళ్ల అమ్మ కూడా అదే చెబుతుంది. (అబ్బో, ఏం రోత కథ రాశావయ్యా పోసానీ?)
ఓ టీవీ సీరియల్ చూస్తున్నట్టు స్లోగా… ఏమాత్రం సహజత్వం లేని సన్నివేశాలు… కృతకం… ఒక్కటంటే ఒక్క సీన్ పండలేదు… పోసాని తన స్టయిల్‌లో తను ఏదో చేసుకుంటూ పోయాడు తప్ప మిగతా నటులకు నటనలో బేసిక్స్ తెలుసానేది డౌటే…
ప్రొడక్షన్ పూర్, మేకింగ్ క్వాలిటీ పూర్, రైటింగ్ పూర్… మ్యూజిక్ పూర్, డైరెక్షన్ పూర్… అన్నింటికీ మించి ఎడిటింగ్ మరీ పూర్… ఏదో పిచ్చి కథ, నేను వదిలాను, చూడండి, మీ ఖర్మ అన్నట్టుగా పోసాని వ్యవహరించాడు… అవును, నిజమే… ఎవరో అన్నట్టు… సినిమా తీసేవాడికి చూసేవాడు లోకువ!!
Share this Article