.
నిజమే, గతంలో చంద్రబాబుకు పెద్దగా ఈ వాస్తు, ప్రత్యేక పూజల మీద పెద్ద గురి గానీ, ఆసక్తి గానీ ఉండేవి కావు, ఉండేవేమో కానీ బయటికి కనిపించేవి కావు… తను గొప్ప ఆస్తికుడూ కాదు, అలాగని నాస్తికుడూ కాదు… కానీ క్రమేపీ చాలా మార్పులు వచ్చాయి, కనిపిస్తున్నాయి… గతంలో ఎన్టీఆర్‌కు మాత్రం నమ్మకాలు ఎక్కువే, ప్రత్యేకించి బి.వి.మోహన్‌రెడ్డి అయితే తన వ్యక్తిగత జ్యోతిష్కుడిగా వ్యవహరించేవాడు…
తరువాత చంద్రబాబు హయాంలో కూడా తను టీడీపీలో నాయకుడే, కానీ చంద్రబాబు అవి పెద్దగా పట్టించుకునేవాడు కాదు… తను ఏది చూసినా పొలిటికల్ మైలేజీ, ఫాయిదా ఏముంటాయనే చూస్తాడు ఎక్కువగా… అలాంటిది ఇప్పుడు ఓ ఆస్థాన పండితుడు తనను నియంత్రిస్తున్నాడా..? ఇదేం మార్పు..? జమీన్ రైతులో ఓ ఇంట్రస్టింగ్ ఆర్టికల్… ఇలా…
Ads
ఆస్థాన వాస్తు పండితుడి అతిశయం- నేను ముహూర్తం పెట్టకుండా మంత్రివర్గ విస్తరణా?
చంద్రబాబు నాయుడు నాస్తికుడు కాదు కానీ, అంధ భక్తుడు కాడు. వాస్తు వంటి పట్టింపులు వుండేవి కావు. తన పేరుతో దేవాలయాలలో పూజలు చేయిస్తామని వచ్చే నాయకులకు తన గోత్రం చెప్పడానికి కూడా ఇష్టపడే వాడు కాడు. నేనిక్కడ కూర్చుని వుంటే, అక్కడ నువ్వు పూజించే దేముడు నాకు మేలు చేస్తాడా అనేవాడు.
ఒక్క తిరుమల వెంకన్న సేవ మాత్రమే నిష్టగా నిర్వహించడం ఆయనకు అలవాటు. ఈ నలభై ఏళ్ల ప్రజా జీవితంలో చంద్రబాబు ఒక స్వామీజీకి మొక్కినట్లు కానీ, ఒక వాస్తు పండితుడు చెప్పాడని గోడలు కూల్చిన సందర్భం కానీ లేవు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయినట్లు కన్పిస్తున్నది.
వయస్సు ప్రభావమో లేక కుటుంబ ఒత్తిళ్ల ఫలితమో కానీ, తన కుర్చీ గదిలో ఏ మూల వేసుకోవాలో, తానే దిక్కుకు తిరిగి మాట్లాడాలో కూడా వాస్తు పండితులు చెప్పనిదే చేయడం లేదట. ముఖ్యమంత్రి కార్యాలయంలో కూడా ఈ వాస్తు మార్పులు చాలానే జరిగినట్లున్నాయి. మరొక ప్రక్క యాగాలు, హోమాలు నిర్వహించడం చంద్రబాబు ఇంట్లో ఒక నిత్యాగ్నిహోత్రంవలె నడిచిపోతున్నది.
ఈ మార్పులన్నిటికీ సూత్రధారి – జయరామిరెడ్డి అనే వాస్తు పండితుడు. ఆయన మార్టేరు ప్రాంతవాసి అట. మూడు నాలుగేళ్ల క్రితం ఆయనకు చంద్రబాబుతో సంపర్కం కుదిరినట్లు తెలుస్తున్నది. ఎన్నికలకు ముందు నుంచే ఆయన ప్రభావం తెలుగుదేశం పార్టీ మీద కన్పిస్తూ వచ్చింది. ఉండవల్లిలో చంద్రబాబు నాయుడు నిర్మిస్తున్న ఐదెకరాల సువిశాల రాజభవనం రూపశిల్పి కూడా జయరామిరెడ్డేనని చెప్తున్నారు.
ఈ ఇంటి నిర్మాణం ముగిసి, గృహ ప్రవేశం జరిగిన తర్వాత చంద్రబాబుకి, శత్రువు అనేవాడు మిగలడని హామీ ఇచ్చాడట జయరామిరెడ్డి. దాని అర్ధం శత్రువులు అంతమై పోతారనా లేక ఆయన అజాత శత్రువుగా మారుతాడనా అన్నది మనకు తెలియదు. నెల్లూరులో జరపతలపెట్టిన మహానాడు ఏర్పాట్లకు కూడా ముందు వచ్చాడు జయరామిరెడ్డి. ఆయన ముహుర్తబలం పని చేయలేదో లేక మోడీ పట్ల వున్న భయభక్తులు అధికం కావడం వల్లనో కానీ, అసలా మహానాడే రద్దయి పోయింది.
చంద్రబాబు నాయుడుతో పాటుగా ఆయన కుటుంబ సభ్యులందరితో జయరామిరెడ్డి పెంచుకొన్న సాన్నిహిత్యం పార్టీలోని వారందరికీ తెలిసిపోయింది. అందువల్ల ఆయన కన్పిస్తే, ఎంతటివాడైనా వినయంగా తల వంచి దండం పెట్టక తప్పడం లేదు.
ఈ నేపథ్యంలో ఒక మంత్రిపదవి ఆశావహుడు ఇటీవల ఆయన్ను కలిసి, తన పేరు సిఫార్సు చేయమని కోరాడట. ఈ నెలలోనే విస్తరణ జరిగిపోబోతున్నది కాబట్టి, వీలైనంత త్వరగా సిఫార్సు చీటీ దయచేయమని కోరాడట ఆ ఆశావహడు. దానికాయన చెప్పిన సమాధానం విని, యావత్ తెలుగుదేశం పార్టీ నిరుత్తరంగా మారిపోతున్నదిప్పుడు.
“నేను ముహూర్తం పెట్టకుండా మంత్రివర్గ విస్తరణ ఎట్లా జరుగుతుంది, నేను చెప్తే తప్ప చంద్రబాబు ఇంట్లో నుంచి బయట కాలు కూడా పెట్టడు కాబట్టి నేను గ్రీన్ సిగ్నల్ ఇచ్చేవరకు మంత్రివర్గ విస్తరణ జరిగే ప్రశక్తే లేదు, నువ్వు ధీమాగా వుండమని ధైర్యం చెప్పి పంపాడట ఆ వాస్తు పండితుడు.
సంజయ్ గాంధీ వద్ద ధీరేంద్ర బ్రహ్మచారి, పివి.నరసింహారావు వద్ద చంద్రస్వామి వలె చంద్రబాబు దగ్గర జయరామిరెడ్డి పలుకుబడి దేదీప్యమానంగా వెలుగొందుతున్నదని పార్టీ వర్గాల భోగట్టా. తను సీఎం కాగానే జోసెఫ్ విజయ్ తన వ్యక్తిగత జ్యోతిష్కుడిని సలహాదారుగా ప్రభుత్వంలోకి తీసుకున్న సంగతి గుర్తుంది కదా... ఎవరూ అతీతులు కారు!!
- ఇంతకుముందు చంద్రబాబు నాయుడు వ్యక్తిగత లేదా రాజకీయ నిర్ణయాల కోసం జ్యోతిష్యపరమైన సలహాలు తీసుకునే నిపుణులలో శ్రీనివాస గార్గెయ పేరు అప్పుడప్పుడూ వినిపించేది… అదీ ఇక్కడ ప్రస్తావనార్హం!!
Share this Article