.
“నేను జాత్యహంకారిని కాదు.. నా భార్య సగం భారతీయురాలు.. నా కొడుకుకు భారతీయ శాస్త్రవేత్త పేరు పెట్టా!” – ఎలాన్ మస్క్
ప్రపంచంలోకెల్లా అత్యంత ధనవంతుడు, సాహస వ్యాపారి, టెస్లా-స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉండడు. ఉండలేడు! సోషల్ మీడియాలో చేసే పోస్టులు, వలసలపై ఆయన అభిప్రాయాలు, రాజకీయ వ్యాఖ్యలు తరచూ విమర్శలకు దారితీస్తుంటాయి. ముఖ్యంగా కొంతకాలంగా ఆయనపై “జాత్యహంకారి”, “అత్యంత మితవాద భావజాలాన్ని ప్రోత్సహిస్తున్నాడు” అనే ఆరోపణలు తరచూ వినిపిస్తున్నాయి.
Ads
అయితే తాజాగా ది ఎకనమిస్ట్ ఎడిటర్-ఇన్-చీఫ్ జానీ మింటన్ బెడోస్‌కు ఇచ్చిన విస్తృత ఇంటర్వ్యూలో మస్క్ ఆ ఆరోపణలకు తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు. అందులో భారతీయులకు ఆసక్తికరమైన అంశాలూ ఉన్నాయి…
“నా జీవితమే సమాధానం”… తాను జాత్యహంకారి కాదని చెప్పడానికి మస్క్ తన వ్యక్తిగత జీవితాన్నే ఉదాహరణగా చూపించాడు. “నా భాగస్వామి శివోన్ జిలిస్ సగం భారతీయురాలు. ఆమెతో నాకు నలుగురు పిల్లలు ఉన్నారు. వారిలో ఒకరికి ప్రముఖ భారతీయ భౌతిక శాస్త్రవేత్త పేరు పెట్టాను. నేను జాత్యహంకారినని ఎలా అంటారు?” అని ప్రశ్నించాడు. ఇక్కడ ఆయన ప్రస్తావించింది తన కుమారుడు స్ట్రైడర్ శేఖర్ గురించి.
‘శేఖర్’ వెనుక భారతీయ నోబెల్ విజేత … ఈ ఏడాది ప్రారంభంలోనే మస్క్ తన కుమారుడి పేరు వెనుక కథను వెల్లడించాడు. “స్ట్రైడర్” అనే పేరు లార్డ్ ఆఫ్ ది రింగ్స్‌లోని అరగోర్న్ పాత్రకు చెందిన పేరు. అయితే “శేఖర్” మాత్రం భారతీయ- అమెరికన్ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త, 1983 నోబెల్ బహుమతి గ్రహీత సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ గౌరవార్థం పెట్టిన పేరని తెలిపాడు.
ప్రపంచ విజ్ఞాన చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన భారతీయ శాస్త్రవేత్తకు తన కుమారుడి పేరు ద్వారా గౌరవం తెలిపానని మస్క్ చెప్పడం భారతీయుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.
“నా కంపెనీల్లో అన్ని జాతుల వాళ్లు ఉన్నారు”… తన కంపెనీల్లో కూడా ఎలాంటి జాతి వివక్ష లేదని మస్క్ స్పష్టం చేశాడు. “మా సంస్థల్లో అన్ని జాతులకు చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు ఉన్నారు. అక్కడ జాత్యహంకారం ఉందని నేను అనుకోను” అని వ్యాఖ్యానించాడు.
ముస్లింలపై వ్యతిరేకత ఉందా? … ఇంటర్వ్యూలో అత్యంత ఆసక్తికరమైన ప్రశ్న ఇదే. వలసలపై మస్క్ చేస్తున్న వ్యాఖ్యలు ముస్లింల వ్యతిరేక భావజాలాన్ని ప్రతిబింబిస్తున్నాయా? అని ప్రశ్నించగా, ఆయన నేరుగా అవునో కాదో చెప్పలేదు. “ఒక దేశానికి వచ్చేవాళ్లు అక్కడి విలువలకు పూర్తిగా విరుద్ధమైన ఆలోచనలతో వస్తే నేను దాన్ని వ్యతిరేకిస్తాను” అని చెప్పాడు.
అంతేకాదు… “అత్యాచారాలు, హత్యలు, పాశ్చాత్య సమాజం అంగీకరించిన చట్టాలకు విరుద్ధమైన నియమాలను రుద్దడాన్ని నేను వ్యతిరేకిస్తాను. కానీ మీడియా నా మాటలను తప్పుగా చూపిస్తోంది” అని ఆరోపించాడు.
బ్రిటన్‌పై కూడా ప్రశ్నలు … బ్రిటన్‌పై సోషల్ మీడియాలో తరచూ విమర్శలు చేసే మస్క్‌ను ఈ అంశంపైనా ప్రశ్నించారు. అయితే అధికారిక గణాంకాలు, తాను అక్కడ నివసించిన అనుభవం మస్క్ చెప్పే మాటలకు పూర్తిగా భిన్నంగా ఉన్నాయని ఇంటర్వ్యూవర్ అభిప్రాయపడటంతో ఆ అంశంపై కూడా చర్చ జరిగింది.
ఏఐని ఇక ఎవరూ ఆపలేరు! … రాజకీయాల తర్వాత మస్క్ మళ్లీ తనకు అత్యంత ఇష్టమైన అంశమైన కృత్రిమ మేధ (AI) గురించి మాట్లాడాడు. గతంలో ఏఐ మానవాళికి ప్రమాదమని హెచ్చరించిన ఆయన, ఇప్పుడు మాత్రం తన ఆలోచన కొంత మారిందని చెప్పాడు.
“ప్రమాదం లేదని చెప్పను. ప్రమాదం ఉంది. కానీ ఇప్పుడు నేను ఆశావాదిగా ఆలోచిస్తున్నాను. అత్యంత సాధ్యమైన ఫలితం… ప్రపంచానికి అపారమైన సంపద, అవకాశాలు రావడమే” అని అన్నాడు.
అంతేకాదు… “ఏఐ, రోబోటిక్స్ అభివృద్ధిని ఇప్పుడు ఎవరూ ఆపలేరు. ప్రభుత్వం అయినా, కంపెనీ అయినా, వ్యక్తి అయినా ఈ వేగానికి బ్రేకులు వేయడం అసాధ్యం. నేనే ఆపాలని అనుకున్నా కూడా ఆపలేను” అని స్పష్టం చేశాడు.
.
ఎలాన్ మస్క్ గురించి ప్రపంచవ్యాప్తంగా అభిప్రాయాలు రెండుగా విడిపోతుంటాయి. కొందరికి ఆయన విజనరీ, మరికొందరికి వివాదాల కేంద్రం. అయితే ఈ ఇంటర్వ్యూలో భారతదేశాన్ని ప్రస్తావిస్తూ తన కుటుంబం, తన కుమారుడి పేరు వెనుక భారతీయ శాస్త్రవేత్తకు నివాళి ఉందని చెప్పడం మాత్రం భారతీయుల దృష్టిని ఆకర్షించే అంశం. అదే సమయంలో వలసలు, పాశ్చాత్య విలువలు, ఏఐ భవిష్యత్తుపై ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసే అవకాశముంది.
మస్క్ భార్య శివోన్ జిలిస్… ఆమె తల్లి శార్దా… భారతదేశంలోని పంజాబ్‌కు చెందిన ఆమె ఎక్స్‌చేంజ్ విద్యార్థినిగా కెనడాకు వెళ్లింది… అక్కడే కెనడియన్ రిచర్డ్ జిలిస్‌ను వివాహం చేసుకుంది… వారి కుమార్తె శివోన్… ఆమె కెనడాలో జన్మించింది… శార్దా తన కూతురికి శివోన్ అనే హిందూ పేరే పెట్టుకుంది… ఇదీ మస్క్ భార్య మూలాల పరిచయం…
Share this Article