.
1000 ఇంజెక్షన్లు… 5 ఐవీఎఫ్ ప్రయత్నాలు… చివరకు వినిపించిన “అమ్మ” పిలుపు… కొన్ని విజయాలను సంఖ్యలతో కొలవలేం. కొన్ని కలలకు ధర ఉండదు. అలాంటి కలల్లో ఒకటి… ‘అమ్మ’ అని పిలిపించుకోవడం… అమ్మతనం విలువేమిటో అమ్మ కాలేనివాళ్లకే ఎక్కువ తెలుసు… కష్టమ్మీద అమ్మ అయినవాళ్లకు అందులోని తీపి మరిన్నిరెట్లు ఎక్కువ…
ప్రతి మహిళ జీవితాన్ని మాతృత్వంతోనే నిర్వచించాల్సిన అవసరం లేకపోయినా, తల్లిగా మారాలని హృదయపూర్వకంగా కోరుకునే మహిళలకు ఆ ప్రయాణం భావోద్వేగాలతో నిండినదే. ఆ కల నెరవేరకపోతే కలిగే బాధను మాటల్లో చెప్పడం కష్టం.
Ads
బాలీవుడ్ నటి తేజస్విని కొల్హాపురి కథ అలాంటిదే. ఎనిమిదేళ్ల వివాహ జీవితంలో సంతానం కోసం ఆమె చేసిన పోరాటం ఇప్పుడు వేలాది మంది మహిళల మనసులను తాకుతోంది.
ఒకటి కాదు… రెండు కాదు… ఏకంగా ఐదు సార్లు ఐవీఎఫ్ చికిత్స. చికిత్సలో భాగంగా వెయ్యికి పైగా హార్మోన్ ఇంజెక్షన్లు. రెండు సార్లు గర్భస్రావం. ప్రతి విఫల ప్రయత్నం తర్వాత మళ్లీ ఆశను కూడగట్టుకోవడం… మళ్లీ ఆసుపత్రి గడప తొక్కడం… మళ్లీ అదే పరీక్షలు… అదే నిరీక్షణ… అదే ఆవేదన.
“ప్రతి ఫెయిల్యూర్‌తో ఆశలు కూలిపోతాయి. ముఖ్యంగా మిస్‌క్యారేజ్ తర్వాత పూర్తిగా మనసు విరిగిపోయింది. అయినా ఆశను వదల్లేదు,” అని ఆమె చెప్పిన మాటలు కేవలం ఒక నటి అనుభవం కాదు… సంతానం కోసం పోరాడుతున్న లక్షలాది దంపతుల మనసులోని మాట.
చికిత్సల ప్రభావంతో తన శరీరాకృతి పూర్తిగా మారిపోయిందని, శారీరకంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని ఆమె చెబుతోంది. “బయటికి నేను మారిపోయాను. కానీ లోపల మాత్రం మరింత బలంగా తయారయ్యాను” అన్న ఆమె మాటల్లో ఒక మహిళ ధైర్యం కనిపిస్తుంది.
ఎట్టకేలకు ఐదో ఐవీఎఫ్ ప్రయత్నం విజయవంతమైంది. ఆమె ఒడిలో బిడ్డ చేరింది. ఎన్నో కన్నీళ్ల తర్వాత ఆమె జీవితంలో “అమ్మ” అనే పిలుపు వినిపించింది.
ఈ సందర్భంగా యువతులకు ఆమె చేసిన సూచన కూడా ఆలోచింపజేసేదే. సాధ్యమైనంత వరకు 35 ఏళ్లలోపే సంతానం, కుటుంబ విస్తరణ గురించి ఆలోచిస్తే మంచిదని, తాను ఆలస్యంగా నిర్ణయం తీసుకోవడం వల్ల మరింత కఠినమైన ప్రయాణం చేయాల్సి వచ్చిందని చెప్పింది.
ఇలాంటి కథలు మాతృత్వపు గొప్పతనం చెప్పడానికో… సంతానలేమితో పోరాడుతున్న మహిళలను చిన్నచూపు చూడటానికో కాదు… తల్లులు కావాలని చేసే ప్రయత్నాలు, ప్రయాసల వెనుక ఎంతటి మానసిక, శారీరక వేదన దాగి ఉంటుందో గుర్తు చేయడానికి కూడా అవసరం.
ఎందుకంటే కొందరికి బిడ్డ పుట్టడం ఒక సహజ ప్రక్రియ అయితే… మరికొందరికి అది వెయ్యి సూదుల నొప్పి దాటిన తర్వాత లభించే ఒక అద్భుతం… #TejaswiniKolhapure #actresses #UntoldStories #bollywood #TollywoodUpdates #entertainmentnews #entertainment #tollywood
Share this Article