.
“సినీ పరిశ్రమలో వారసత్వం తలుపు మాత్రమే తెరుస్తుంది… కానీ ఆ తలుపు దాటి ఎంత దూరం వెళ్లాలో నిర్ణయించేది ప్రేక్షకులే. వాళ్ల యాక్సెప్టెన్సే కీలకం… చాలామంది వారసులు వచ్చారు, పోయారు, కొందరే నిలబడ్డారు…
ఘట్టమనేని కుటుంబంలాంటి గొప్ప వారసత్వం ఉన్నా, ప్రేక్షకులు హీరోగా అంగీకరించకపోతే నిలబడటం ఎంత కష్టమో కృష్ణ కొడుకు రమేష్ బాబు ఉదాహరణగా నిలిచాడు… కృష్ణ ఎంతగా ప్రయత్నించినా, స్టార్ హీరోగా ఆయనను నిలబెట్టలేకపోయాడు… కానీ అదే కుటుంబం నుంచి వచ్చిన మహేష్ బాబు మాత్రం తన ప్రతిభతో ప్రేక్షకుల మనసులు గెలిచి సూపర్‌స్టార్‌గా ఎదిగాడు…”
Ads
ఆ కుటుంబం నుంచి వచ్చిన మరో వారసుడు జైకృష్ణ సినిమా శ్రీనివాస మంగాపురం రిలీజైంది… మస్తు ప్రమోషన్లు నిర్వహించారు… అశ్వినీదత్ సమర్పణ… అజయ్ భూపతి దర్శకత్వం… అన్నీ బాగున్నాయి కానీ… ఫలితం..? బాగా నిరాశాజనకం!!
‘శ్రీనివాస మంగాపురం’- పాత ప్రేమకథకు కొత్త ప్యాకింగ్… కానీ మ్యాజిక్ మిస్సింగ్!
శ్రీను (జై కృష్ణ ఘట్టమనేని), మంగా (రాషా తడాని) ప్రేమలో పడతారు. అయితే గతంలో ఇద్దరి మధ్య అనుబంధం ఉన్నప్పటికీ, మంగా శ్రీనును ఎందుకు గుర్తుపట్టలేకపోతుంది? వారి గతంలో ఏం జరిగింది? చివరికి ఇద్దరూ ఎలా కలుసుకున్నారు? అనే అంశాల చుట్టూనే సినిమా సాగుతుంది.
జై కృష్ణకు ఇది తొలి సినిమా. తెరపై కనిపించే ఆత్మవిశ్వాసం, చేసిన ప్రిపరేషన్ కనిపిస్తాయి. కానీ నటుడిగా ఇంకా చాలా చాలా మెరుగుపడాల్సి ఉంది. ముఖ్యంగా హావభావాలు, డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రెజెన్స్‌లో అనుభవలేమి స్పష్టంగా కనిపిస్తుంది. అయితే భవిష్యత్తులో మంచి నటుడిగా ఎదగాలంటే చాలా కృషి, సాధన అవసరం…
రాషా తడాని అందంగా కనిపించింది. పాత్ర కోరినంతవరకే నటించింది. కానీ ప్రేక్షకులు గుర్తుంచుకునేలా నిలిచిపోయే సన్నివేశం ఆమెకు దక్కలేదు.
దర్శకుడు అజయ్ భూపతికి ఏమైంది?
సినిమా మొదటి కొన్ని నిమిషాలు ఆసక్తిని రేకెత్తిస్తాయి. కానీ ఆ తర్వాత పూర్తిగా పాత ఫార్ములాలోకి జారిపోతుంది.
హీరో హీరోయిన్ను చూడటం… పాట.
మాట్లాడటం… మరో పాట.
ప్రేమలో పడటం… డ్యూయెట్.
మధ్యలో రెండు ఫైట్లు.
ఇదే ఫస్ట్ హాఫ్. పదేళ్ల క్రితమే పాతబడిపోయిన కథనాన్ని మళ్లీ చూస్తున్న భావన కలుగుతుంది.
సాంకేతికంగా మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్న అజయ్ భూపతి మార్క్ ఈ సినిమాలో దాదాపు కనిపించదు. ఇంటర్వెల్‌కు ముందు వాసుకి పాత్ర ఎంట్రీ, హీరో ఫ్లాష్‌బ్యాక్‌కు సంబంధించిన కొన్ని సన్నివేశాలు మాత్రమే కొంత ఆసక్తి కలిగిస్తాయి.
సెకండాఫ్ కూడా అదే పరిస్థితి. హీరోయిన్ చెప్పే ఫ్లాష్‌బ్యాక్, బోర్ కొట్టించే ప్రేమకథ, ఎన్నో సినిమాల్లో చూసిన విలన్ ట్రాక్, ముందే ఊహించగలిగే క్లైమాక్స్… ఇలా సినిమా కొత్తదనం లేకుండానే ముగుస్తుంది.
మోహన్ బాబును కూడా వాడుకోలేకపోయారు
సినిమాలో మోహన్ బాబులాంటి సీనియర్, పరిణతి చెందిన నటుడు ఉన్నా, తనకు గుర్తుండిపోయే ఒక్క సన్నివేశం కూడా ఇవ్వలేదు. ఇది పెద్ద మైనస్. అసలు మోహన్ బాబు బయటి సినిమాలకు ఇలాంటి పాత్ర అంగీకరించడమే విశేషం, కానీ ఫలితం దక్కలేదు.
బ్రహ్మాజీ, నరేష్లతో చేసిన కామెడీ ట్రాక్ కూడా పెద్దగా నవ్వించదు. అజయ్ సహా మిగిలిన నటీనటులు తమ పాత్రల మేరకు నటించినా, బలహీనమైన రచన వల్ల ఎవరికీ గుర్తింపు దక్కదు.
జి.వి. ప్రకాశ్ సంగీతం ఈ సినిమాకు పెద్ద ప్లస్ కాలేకపోయింది. పాటలు వినిపించవు, గుర్తుండవు. నేపథ్య సంగీతం కొన్ని చోట్ల బాగానే ఉన్నా, హీరో లాంచ్ మూవీకి అవసరమైన బలమైన మ్యూజికల్ ఇంపాక్ట్ మాత్రం లేదు.
మైనస్ పాయింట్స్ …
- పూర్తిగా పాతబడిపోయిన కథనం
- కొత్తదనం లేని ప్రేమకథ
- ముందే ఊహించగలిగే స్క్రీన్‌ప్లే
- బలహీనమైన సెకండాఫ్
- మోహన్ బాబును సరిగా వినియోగించకపోవడం
- గుర్తుండిపోయే పాటలు లేకపోవడం
చివరి మాట: “కొత్త హీరోను పరిచయం చేసింది… కానీ కొత్త అనుభూతిని మాత్రం ఇవ్వలేకపోయింది.”
Share this Article