.
జూరాల ప్రాజెక్టుకు పొట్టేత్తిన వరద.. నారాయణపూర్ డాం నుంచి జూరాలకు పై 6000 క్యూసెక్కుల నీళ్లు రాక. తెచ్చుకున్న గేట్లు . వర్షాకాలం సీజన్లో మొదటిసారిగా తెచ్చుకున్న గేట్లు. జూరాల ప్రాజెక్టు పది గేట్లు తెరిచి దిగువ ప్రాంతానికి వదిలిన అధికారులు… పరవలు తొక్కుకుంటూ శ్రీశైలం డ్యాంకు పరుగులు తీస్తున్న కుష్ణమ్మ…
.
.
.
.
.
ఇదీ ఒక వాట్సప్ వార్త… ప్రజెంట్ జర్నలిజం (?) స్టాండర్డ్స్ ప్రకారం మరీ తప్పుపట్టలేమేమో గానీ… ఓసారి ఇది చదువుకో బాబూ… పొట్టేత్తిన కాదు, పోటెత్తిన… తెచ్చుకున్న కాదు, తెరుచుకున్న… పరవలు, పరువాలు కాదు, పరవళ్లు… కుష్ణమ్మ కాదు, కృష్ణమ్మ… డాం కాదు, డ్యాం… ఇదుగో ఇలా రాయి…
.
- ‘‘జూరాల ప్రాజెక్టుకు పోటెత్తిన వరద.. నారాయణపూర్ డ్యాం నుంచి జూరాలకు 6000 క్యూసెక్కుల నీళ్లు రాకడ. తెరుచుకున్న గేట్లు .. వర్షాకాలం సీజన్లో మొదటిసారిగా తెరుచుకున్న గేట్లు .. జూరాల ప్రాజెక్టు పది గేట్లు తెరిచి దిగువ ప్రాంతానికి వదిలిన అధికారులు… పరవళ్లు తొక్కుకుంటూ శ్రీశైలం డ్యాంకు పరుగులు తీస్తున్న కృష్ణమ్మ…’’
.
ఐనా ఆరు వేల క్యూసెక్కులు అంటేనే పోటెత్తడం ఏమిట్రా తండ్రీ… అంటే రోజుకు జస్ట్ ఒక టీఎంసీ దాదాపుగా..!! ఉత్త నామమాత్రం ఇన్‌ఫ్లో అది… జస్ట్, నథింగ్…
.
వాడెవడో మెయిన్ స్ట్రీమ్ మీడియా వాడే రాసేశాడు నిస్సిగ్గుగా ఈరోజు… ‘ప్రాజెక్టులకు జలకళ’ అని… ఎక్కడ్రా నాయనా..? శ్రీశైలం, ఎల్లంపల్లి, తుంగభద్ర, శ్రీరాంసాగర్, నాగార్జునసాగర్, పులిచింతల ఎట్సెట్రా అన్నీ ఖాళీయే… సరిగ్గా నిరుడు ఇదే టైమ్‌కు అవన్నీ పొంగి పొర్లుతున్నాయి, స్పిల్ వేల మీదుగా..!!
.
నిరుడు ఇదేరోజున శ్రీశైలం రాత్రి ఫోటో కావాలంటే ఇదుగో… కిలోమీటర్ల కొద్దీ ఘాట్ రోడ్డు మీద వాహనాలు బారులు బారులు… ఎందుకో తెలుసా? శ్రీశైలం నిండితే అన్ని తెలుగు ప్రాంతాల కడుపులూ నిండుతాయి కాబట్టి!! సాగునీరు, తాగునీరు, కరెంటు అన్నింటికీ అదే ఆధారం కాబట్టి!!
Ads

.
.
ఇంకెవడో రాస్తాడు, ఇంకా శ్రీశైలంలో పవర్ జనరేషన్ స్టార్ట్ కాలేదు అని… మీకు ఓ పేద్ద దండంరా బాబూ, ఈ పాలకులకు గుర్తుచేయకండి, ఎడాపెడా పవర్ జనరేట్ చేసి, వదిలేసినా దిగువకు వదిలేస్తారు… పాలన సోయి ఉంటే కదా… శ్రీశైలం నీళ్లు గనుక కాపాడుకోలేకపోతే… హైదరాబాద్ విశ్వనగరం సహా వేల గ్రామాలు గొంతెండి చావడమే…
- ఎందుకంటే… కరెంటును జనరేట్ చేయొచ్చు, కానీ నీళ్లను జనరేట్ చేయలేం… మరీ ఈ ఎల్‌నినో దుర్దినాల్లో..!!
తెలంగాణ ప్రభుత్వమా బహుపరాక్… చంద్రబాబు ప్రభుత్వం ఎడాపెడా వాడేయగలదు శ్రీశైలం నీటిని! కృష్ణా బోర్డు, కేంద్ర జలశక్తి, చివరకు టెలిమెట్రీ మీటర్లు కూడా ఆ ప్రభుత్వం చెప్పినట్టే వింటాయి… అసలే పోతిరెడ్డిపాడు పొక్క తెలంగాణ ప్రయోజనాలకే పెద్ద బొక్క కాబట్టి..!! ప్రస్తుతం నారాయణపూర్ నుంచి 6 వేల క్యూసెక్కులు కాదు, దాదాపు లక్ష క్యూసెక్కులు వదులుతున్నారు… అదంతా ఒడిసిపట్టి, శ్రీశైలం నింపాకే, మిగతా సంగతి… అదీ ముందు జాగ్రత్త..!!
Share this Article