.
ఎహెహె… వీళ్లు స్వంత రాష్ట్రం పాలించుకుంటారట, ఒరేయ్, చీకట్లలో మగ్గిపోతారు, దెబ్బతింటారు అని సమైక్య రాక్షసులు పకపకా నవ్వారు గుర్తుందా..? పుష్కరం గడిచింది… ఎవరికి పాలన సామర్థ్యం ఉంది..? ఎవరెక్కడ ఉన్నారు? ఓసారి చెప్పుకుందాం, ఓ శాస్త్రీయ ప్రాతిపదికతో…
ఎస్, జనానికి మొహం చూపించలేక కేసీయార్ ఇంట్లోనే పడుకుని ఉన్నాడని తెలంగాణ అభివృద్ధి ఆగిపోదు… కాళేశ్వరం లేకపోయినా పంటల రికార్డు ఆగదు, కేటీయార్ ఫార్ములా వన్ మార్క్ ఆర్థిక- స్వార్థ పెత్తనం లేకపోయినా హైదరాబాద్ ఆగదు…
Ads
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరిట కనిపించిన “Telangana Rising: New Horizons, Newer Heights” ట్వీట్ రాజకీయ ప్రకటన మాత్రమే కాదు… 2025-26 అడ్వాన్స్ ఎస్టిమేట్స్ ఆధారంగా రాష్ట్ర ఆర్థిక పనితీరును హైలైట్ చేసే ప్రయత్నం కూడా… రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం, 2025-26లో తెలంగాణ తలసరి ఆదాయం రూ.4,18,931కు చేరుకుంది. గత ఏడాది రూ.3,80,031తో పోలిస్తే ఒక్క ఏడాదిలోనే రూ.38,900 పెరుగుదల (10.23%) నమోదైంది…
దేశ సగటుతో పోలిస్తే తెలంగాణ ఎక్కడ? … భారత్ సగటు తలసరి ఆదాయం ప్రస్తుతం రూ.2,19,575గా అంచనా. అంటే తెలంగాణలో ప్రతి వ్యక్తి సగటు ఆదాయం దేశ సగటుతో పోలిస్తే దాదాపు 1.9 రెట్లు ఎక్కువ. అదే సమయంలో దేశ తలసరి ఆదాయ వృద్ధి 6.9% మాత్రమే ఉండగా, తెలంగాణ 10.2% వృద్ధిని నమోదు చేసింది. రాష్ట్ర GSDP వృద్ధి కూడా 10.7% ఉండగా, జాతీయ GDP వృద్ధి 8% మాత్రమే.
దేశంలో టాప్ రాష్ట్రాల పరిస్థితి? … తలసరి ఆదాయం పరంగా పెద్ద రాష్ట్రాలను పరిశీలిస్తే..
కర్ణాటక
తెలంగాణ
తమిళనాడు
గుజరాత్
మహారాష్ట్ర
ఈ రాష్ట్రాలే ముందంజలో ఉన్నాయి. ఢిల్లీ వంటి కేంద్రపాలిత ప్రాంతాన్ని పక్కన పెడితే, తెలంగాణ ఇప్పటికీ దేశంలోని అత్యంత సంపన్న రాష్ట్రాల్లో ఒకటిగా కొనసాగుతోంది. కేసీయార్ పదేళ్లపాటు రాష్ట్రాన్ని ఎంత చిందరవందర చేసినా సరే…
కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్న క్రెడిట్ ఇదే… సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్‌లో ఈ పెరుగుదలకు కారణాలుగా..
పెట్టుబడుల ఆకర్షణ
ఉద్యోగాల సృష్టి
పాలసీ ఆధారిత పాలన
నిరంతర సమీక్షలు
వ్యవసాయం, మహిళలు, యువతపై దృష్టి
వంటి అంశాలను ప్రస్తావించారు. అలాగే “గత పదేళ్లలో ఏర్పడిన నిరాశను తొలగించి ఆశావాదాన్ని తీసుకొచ్చాం” అని కూడా పేర్కొన్నాడు…
కానీ ఇక్కడే రాజకీయ వాదన మొదలవుతుంది…
కేసీయార్‌కు మొహం లేదు చెప్పుకోవడానికి కానీ, వెంటనే కేటీయార్, హరీష్ రావు స్వరం సవరిస్తారు, నో, నో, ఇదంతా మేం వేసిన పునాదుల ఫలితమే అని క్రెడిట్ తీసుకుంటారు, క్లెయిమ్ చేసుకుంటారు… ఐటీ, ఔషధ పరిశ్రమలు, ఎగుమతులు, హైదరాబాద్ అభివృద్ధి వల్లే ఈ స్థాయి సాధ్యమైందని, ఒకే ఏడాది గణాంకాలను పూర్తిగా కొత్త ప్రభుత్వ విజయంగా చెప్పడం సరైంది కాదని మొదలెడతారు…
కానీ ఒకటి మాత్రం నిజం… తెలంగాణ తలెగరేస్తోంది… మరి పాలనలో మేం తోపులం అని చెప్పుకున్న సమైక్యవాదుల పాలనలోని ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎలా ఉంది?
ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం తెలంగాణ కంటే గణనీయంగా తక్కువగానే ఉంది. 2024-25 అంచనాల ప్రకారం ఏపీ తలసరి ఆదాయం దాదాపు రూ.3 లక్షల లోపే ఉంది. అంటే తెలంగాణతో పోలిస్తే లక్ష రూపాయలకు పైగా తేడా ఉంది. పరిశ్రమలు, ఐటీ, సేవారంగం వాటా ఎక్కువగా ఉండటం తెలంగాణకు ప్రధాన బలం కాగా, ఏపీలో వ్యవసాయం వాటా ఎక్కువగా ఉండడం, రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ వంటి భారీ ఆదాయ కేంద్రం లేకపోవడం ప్రభావం చూపుతున్న అంశాలు.
- ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి… తలసరి ఆదాయం ఎక్కువగా ఉండటం అంటే ప్రతి వ్యక్తి అంతే సంపాదిస్తున్నాడని కాదు. అది రాష్ట్ర మొత్తం ఆర్థిక ఉత్పత్తిని జనాభాతో భాగిస్తే వచ్చే సగటు మాత్రమే. అందుకే ఆదాయ అసమానతలు, నిరుద్యోగం, పేదరికం, జీవన వ్యయం వంటి అంశాలను కూడా కలిపి చూస్తేనే రాష్ట్ర ఆర్థిక ఆరోగ్యంపై పూర్తి చిత్రం కనిపిస్తుంది…
Share this Article