.
ఫార్ములా రేస్… ఈ నిర్వహణలోనే కేటీయార్ మీద ఆరోపణలు, కేసులు… ఇన్నాళ్లూ కేవలం ముందస్తు అనుమతి లేకుండా నిధుల చెల్లింపు జరిగిందని మాత్రమే బీఆర్ఎస్ క్యాంపు చెబుతూ, తుప్సాస్ కేసు, లొట్టపీసు కేసు అని వెక్కిరింతలకూ దిగింది తెలుసు కదా… అది జస్ట్, కవరింగ్, అసలు కథ వేరు…
కేటీయార్ కూడా ‘‘ఇది రాజకీయ ప్రేరితమైన కేసు, నిజానికి ఫార్ములా రేస్‌తో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మస్తు పెరిగింది… 49 దేశాల్లో నగరం పేరు మారుమోగి,, అంతర్జాతీయ చిత్రపటంలో హైదరాబాద్ చేరింది, 700 కోట్ల మేరకు పెరిగిన బ్రాండ్ ఇమేజ్, మస్తు పెట్టుబడుల అవకాశాలు పెరుగుతాయి’’ అని కదా చెప్పుకొచ్చాడు… ఏదేదో విఫల సమర్థన…
Ads
- కానీ లొట్టపీసు కాదు, పొట్టలు నింపుకున్న కేసు… అనకొండ కేసు… ఇందులో అనుమతుల్లేకుండా డబ్బుల చెల్లింపు అనేది చిన్న విషయం… అంతకుమించి క్విడ్ ప్రోకో (నీకు అది- నాకు ఇది), ఆర్థిక అవకతవకల యవ్వారాలు బాగానే ఉన్నాయని ఏసీబీ తన చార్జి షీటులో తేల్చింది… ఈ రేస్ ద్వారా బీఆర్ఎస్ ఎడాపెడా కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లు పొందింది…
అసలు ఈ కుంభకోణం ఎలా జరిగిందో, ఎవరికేం దక్కిందో ఏసీబీ వివరంగానే చెప్పింది… సరళమైన భాషలో ఓసారి చెప్పుకుందాం… As per ACB Charge Sheet …
1. కుట్రకు బీజం (డిసెంబర్ 2021 – ఏప్రిల్ 2022)
-
ప్రతిపాదన…: కేటీఆర్ ఆహ్వానం మేరకు 2021 డిసెంబరులో టీ-హబ్ లో ఒక సమావేశం జరిగింది…. అంతర్జాతీయ క్రీడా సలహాదారు గోవాడ కిరణ్ మల్లేశ్వర్ రావు ఈ రేసును హైదరాబాద్‌లో నిర్వహిస్తే భారీగా ఆదాయం వస్తుందని నమ్మించాడు…
-
ప్రమోటర్ మార్పు…: గ్రీన్కో గ్రూప్‌నకు చెందిన ‘ఏస్ నెక్స్ట్ జెన్’ సంస్థను పదేళ్ల పాటు ఈ రేసుకు ప్రమోటర్‌గా ఎంపిక చేయాలని నిర్ణయించారు…
-
డీల్ కుదిరిందిలా…: నిర్వాహక సంస్థ (FEO) తో చర్చలు జరిపి ప్రమోటర్ ఫీజును 15 మిలియన్ పౌండ్ల నుంచి 9 మిలియన్ పౌండ్లకు తగ్గిస్తామని కిరణ్ తెలిపాడు… దీనికి ప్రతిఫలంగా భారాస పార్టీకి ఎలక్టోరల్ బాండ్ల రూపంలో భారీగా విరాళాలు ఇవ్వాలని షరతు పెట్టారు….
2. ఎలక్టోరల్ బాండ్ల దందా (క్విడ్ ప్రోకో)
-
అధికారిక ఒప్పందం కుదరకముందే గ్రీన్కో అనుబంధ సంస్థల ద్వారా బీఆర్ఎస్ పార్టీకి నిధులు చేరాయి…
-
గ్రీన్కో డైరెక్టర్ అనిల్ కుమార్ తన ఆధ్వర్యంలో నడుస్తున్న 26 వేర్వేరు కంపెనీల ద్వారా ఒక్కో కంపెనీతో రూ.కోటి నుంచి రూ.2 కోట్ల చొప్పున ఎలక్టోరల్ బాండ్లు కొనిపించారు…
-
ఈ కంపెనీలన్నీ హైదరాబాద్ హైటెక్ సిటీలో ఒకే చిరునామాతో పనిచేస్తుండటం, ఒకే ఈ-మెయిల్ వాడటం లాంటి అంశాలను బట్టి ఇవన్నీ అనిల్ కుమార్ నియంత్రణలోనే ఉన్నట్లు ఏసీబీ నిర్ధారించింది… ఇలా మొత్తం రూ.44 కోట్లు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో బీఆర్ఎస్కు ముట్టాయి…
3. నిబంధనలకు విరుద్ధంగా హెచ్ఎండీఏ నిధుల మళ్లింపు
-
కేటీఆర్ ఆదేశాల మేరకు ఎలాంటి అధికారిక అనుమతులు లేకుండానే అప్పటి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ ప్రభుత్వ తరఫున సంతకాలు చేశాడు… అసలు హెచ్ఎండీఏకు ఈ రేసు నిర్వహణతో ఏం సంబంధం?
-
సీజన్-9 నిర్వహణ కోసం నిబంధనలకు విరుద్ధంగా రూ.20.90 కోట్లను హెచ్ఎండీఏ (HMDA) ఖర్చు చేసింది…
-
ప్రమోటర్ సంస్థ (ఏస్ నెక్స్ట్ జెన్) నష్టాల కారణంగా తప్పుకోవడంతో, సీజన్-10 బాధ్యతలను కూడా హెచ్‌ఎండీఏపైనే మోపాలని చూశారు… దీంతో ప్రభుత్వంపై దాదాపు రూ.600 కోట్ల భారం పడే ప్రమాదం ఏర్పడింది…
-
ఎఫ్ఈవో సంస్థ పంపిన ఇన్వాయిస్ల ఆధారంగా ఎలాంటి చట్టబద్ధత లేకుండా కేటీఆర్ నోట్‌ఫైల్‌ను ఆమోదించాడు… ఫలితంగా హెచ్ఎండీఏ నిధుల నుంచి రూ.45.71 కోట్లతో పాటు విదేశీ చెల్లింపులపై పన్నులు, ఇతర ఫీజుల రూపంలో అదనంగా రూ.8 కోట్లకు పైగా చెల్లించాల్సి వచ్చింది… మొత్తంగా హెచ్ఎండీఏపై రూ.54 కోట్లకు పైగా అదనపు భారం పడింది…
4. నిందితులు ఎవరు?
ఈ కుంభకోణంలో ఏసీబీ ప్రధానంగా ఐదుగురి పాత్రను గుర్తించి ఎఫ్ఐఆర్లో చేర్చింది:
-
కేటీఆర్ (నాటి మున్సిపల్ శాఖ మంత్రి)
-
అర్వింద్ కుమార్ (ప్రభుత్వ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి)
-
బీఎల్ఎన్ రెడ్డి (హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్)
-
గోవాడ కిరణ్ మల్లేశ్వర్ రావు (ప్రైవేట్ వ్యక్తి / సలహాదారు)
-
ఎఫ్ఈవో (FEO) సంస్థ
5. తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు
-
నష్టాలను దాచిపెట్టారు…: మొదటి సీజన్లో రూ.160 కోట్ల భారీ నష్టం వచ్చినా, ఆ విషయాన్ని అధికారిక ఫైళ్లలో వెల్లడించకుండా రేసు విజయవంతమైందని కొత్త ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు…
-
నకిలీ నివేదికలు…: ఈ-రేస్ వల్ల రాష్ట్రానికి పెద్ద ఎత్తున లబ్ధి చేకూరుందని ‘నీల్సన్’ అనే సంస్థ నివేదిక ఇచ్చినట్లు పిటిషన్లలో పేర్కొన్నారు… అయితే ఆ నివేదికను ఎఫ్ఈవో మాత్రమే కోరిందని, దాని ప్రామాణికతపై ఎలాంటి ఆధారాలు లేవని, విచారణకు ఆ సంస్థలు స్పందించలేదని ఏసీబీ తేల్చింది…
Share this Article