.
విజయసాయిరెడ్డి… ఒకప్పుడు వైసీపీలో నంబర్ టూ… కానీ ఏమైంది..? ఎక్కడో చెడింది… పార్టీకి దూరం… అసలు రాజకీయాలకే దూరం అని ప్రకటించి, వ్యవసాయం చేసుకుని గడిపేస్తానని ప్రకటన… కానీ మళ్లీ రాజకీయాల్లో చురుకుగా వ్యవహరించబోతున్నట్టు సూచనలు… తనకోసం ఓ మీడియా సంస్థ ఏర్పాటుకు ప్రయత్నాలు… అసలు ఆయన దారి ఎటు..?
కేంద్రంలోని బీజేపీ పెద్దలతో సన్నిహిత సంబంధాలున్న వ్యక్తి… మంచి మేనేజింగ్ ఎబిలిటీ ఉన్న వ్యక్తి… రాజకీయాల్లో పండిన వ్యక్తి… ఖచ్చితంగా తను మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ అయిపోతున్నాడంటే ఖచ్చితంగా జనంలో చర్చ, పొలిటికల్ సర్కిళ్లలో ఆసక్తి తప్పనిసరి…
Ads
ఈనేపథ్యంలో జమీన్ రైతు ఎడిటర్ డోలేంద్ర ప్రసాద్ రాసిన ఓ వ్యాసం ఆలోచనాత్మకంగా కనిపించింది… ఇలా… (సారాంశం)…

ఒకప్పుడు వైకాపా పార్టీ బరువు మొత్తాన్ని తన భుజాల మీద మోసిన అపర వైఎస్ భక్త పరమాణువు విజయసాయిరెడ్డి రాజకీయ భవిష్యత్తు ఏమిటి అనే ప్రశ్న తరచు విన్పిస్తున్నది. ఒక సక్సెస్ఫుల్ ఆడిటర్‌గా ఉన్న తను వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పిలుపు మేరకే జగన్ టీమ్‌లో చేరాడు…
జగన్ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరింప చేయడంలో కీలక పాత్ర. ఎన్నో కంపెనీలు, వందల వేల కోట్ల పెట్టుబడులు, లెక్కలేనన్ని వ్యాపారాలు, దేశంలోనే కాకుండా విదేశాలలో కూడా సామ్రాజ్య విస్తరణ విజయసాయిరెడ్డి అకౌంటింగ్ మేధస్సుతోనే జరిగాయి. దాని ఫలితంగా జగన్‌తోపాటు సహనిందితుడిగా జైలు జీవితం కూడా గడిపాడు. అయినా నిరాశ చెందకుండా, జగన్ ఒంటరిగా మిగిలినప్పుడు తోడుగా నిలిచాడు.
వైకాపా ఆవిర్భావం నుంచి, 2019లో సగర్వంగా అధికార పీఠం అధివసించే వరకు విజయసాయిరెడ్డి చేసిన కష్టం అంతా ఇంతా కాదు. ఢిల్లీలో, సెంట్రల్ హాల్లో మోడీ దర్శనం కోసం ఎన్ని గంటలపాటు వాకిట్లో వేచి వుండినాడో, మోడీ అనుగ్రహం కోసం ఎంత తాపత్రయపడ్డాడో చూసిన వారికి మాత్రమే అర్ధమౌతుంది. ఏదీ తన కోసం కాదు. జగన్ బాగుండాలనే కోరికతోనే తన జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని త్యాగం చేశాడు విజయసాయిరెడ్డి.
కానీ పరిస్థితులు మారాయి. జగన్ అదే విజయసాయిరెడ్డిని బయటకు పంపేశాడు. చేసిన మేలు మొత్తం మరచిపోయాడు. మళ్లీ జ్ఞాపకం చేసుకొనే వుద్దేశ్యం కూడా జగన్‌కు లేదు. జగన్ స్వభావం అందరికంటే విజయసాయికి ఎక్కువ తెలుసు కాబట్టి, జగన్ నుంచి తనకు పిలుపు వస్తుందని, మళ్లీ పార్టీలో చేరుతాడని భావించలేము. పగిలిన అద్దానికి అతుకులు వేయలేరు.
అయితే, బోరుగడ్డ అనిల్ అనే అరాచకవాదిని గత వారంలో వైకాపా కేంద్ర కార్యాలయం నుంచి బయటకు పంపేశారు. అతడు బోరు బోరున ఏడుస్తూ జగన్ ఇంటి ముందు కూర్చున్నాడు. జగన్ అధికారంలో వున్నప్పుడు బోరుగడ్డ అనిల్ ఎంతోమంది తెలుగుదేశం వాదులను బూతులతో బాధ పెట్టాడు. అతడి భాష పరమ నీచంగా వుండేది. సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు స్వయంగా బోరుగడ్డ అనిల్‌ను ప్రోత్సహించే వాడని, ఆ వీడియోలను వైకాపా సామాజిక మాధ్యమాలలో ప్రసారం చేయించేవాడని చెప్తారు.
ఆ పాపాల ఫలితం, ఇప్పుడు కేసుల రూపంలో చుట్టుముట్టింది. కానీ బోరుగడ్డ అనిల్‌కు కనీసం ఒక న్యాయవాదిని నియమించే దిక్కు కూడా లేకుండా పోయింది. దానితో సజ్జలను నిలదీయాలని పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లాడు. కానీ, నీకు పార్టీకి సంబంధం లేదు, బయటకు పొమ్మని పంపేశారు. అంటే, అవసరం తీరిన తర్వాత వదిలేశారన్న మాట. ఆ అరాచకవాదికి పార్టీతో సంబంధం లేకుంటే, అతడి చండాలపు వీడియోలు వైకాపా మాధ్యమాలలో ఎట్లా ప్రసారం అవుతాయి?
సజ్జల రామకృష్ణారెడ్డిని ఇరకాటంలో పెట్టడానికి విజయసాయిరెడ్డి ఒక వ్యూహం ప్రకారం బోరుగడ్డ అనిల్‌ను పార్టీ ఆఫీసుకు పంపాడనే ఆరోపణ విన్పిస్తున్నది. ఇది సజ్జల బృందం చేసే ఆరోపణ. సజ్జలకు, విజయసాయికి ఎప్పుడు కూడా సయోధ్య లేదు. ఇద్దరూ జగన్ విధేయులే; కానీ వారి దారి వేరు. విజయసాయి వలె ఆత్మగౌరవం కోసమో, మరొక కారణంతోనో పార్టీ వదిలే రకం కాదు సజ్జల.
గతంలో ఒకసారి జగన్ మీద అలిగి కొంత కాలం పార్టీ ఆఫీసుకు వెళ్లలేదు. ఎందుకు రావడం లేదని ఎవరూ అడగలేదు; రమ్మని పిలవలేదు. చివరకు తనంతట తానుగానే గుట్టుగా వెళ్లి, ఆఫీసులో కూర్చున్నాడు. అది సజ్జల వ్యక్తిత్వం. విజయసాయి, తన రాజకీయ భవితవ్యాన్ని చీపురు పుల్లతో సమానంగా పక్కనపెట్టి, ఆత్మగౌరవం కాపాడుకొన్నాడు.
విజయసాయి దారి ఎటు అనేది ప్రశ్న. ఆయనలో రాజకీయ ఆశలు, ఆలోచనలు పుష్కలంగా వున్నాయి. సన్యాసం తీసుకోలేదు. వైకాపా పిలవదు; తెలుగుదేశంలో చేరలేడు. ఇక మిగిలింది బిజెపి. ఆ కాషాయ పార్టీలో చాలామంది నాయకులకు విజయసాయి మీద సానుభూతి వుంది. ఆయన వస్తానంటే కలిసి పని చేయడానికి వారు సిద్ధమే. కానీ నిర్ణయం మోడీ స్థాయిలో జరగాలి. అందుకు చంద్రబాబు నాయుడు అనుమతి కావాలి… సో, ఓ అనిశ్చితి ప్రస్తుతానికి !!
Share this Article