Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Self Editing … అదే యూట్యూబర్లు అయితే దుమ్మురేపేవారు…

August 9, 2026 by M S R

.

Mohan Goteti …. 
పెళ్లికి ముందు పూజ అందరు ఆడపిల్లలలానే ఎన్నో ఊహించుకుంది.
మంచి భర్త.. అందమైన సంసారం.. ఓహ్.. ఎన్నో కలలుకంది.
ఇందర్ ని ఇష్టపడి చేసుకుంది.. అతనూ ఆమెను ఎంతో ఇష్టపడ్డాడు..
సంసారం సజావుగా సాగిపోతోంది..
అప్పుడే తెలిసింది ఆమెకు.. భర్తకు కవిత అనే అమ్మాయితో సంబంధం వుందని!
ఆమె కలల సౌధం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది..
వెక్కివెక్కి ఏడ్చింది.. చివరకి అనుకున్నంతా జరిగింది..
కవిత మోజులో పడి పూజాని వదిలేశాడు..

అయితే, ఆమె అందరిలాంటిదీ కాదు.. ఆత్మహత్యే శరణ్యం అనుకోలేదు..
గుండె ధైర్యాన్ని తెచ్చుకుంది.. తన వ్యక్తిత్వానికి ఒక ‘అర్థం’ వెతుక్కుంది..
తన కాళ్ల మీద తాను నిలబడాలనుకుంది.. నిలబడింది కూడా..
కొన్నాళ్లకి తన తప్పు తెలుసుకుని ఇందర్ ఆమెను వెతుక్కుంటూ వచ్చాడు..
ఆమె మామూలుగానే మాట్లాడింది.. ఆమె తనను క్షమించేసిందనుకున్నాడు..
‘ఇక నీతోనే వుంటాను’ అన్నాడు.
అప్పుడామె అతన్ని ఒకటే అడిగింది..

Ads

“నేను కూడా నీలాగే వేరొక వ్యక్తితో వెళ్లిపోయి, మళ్లీ వస్తే నువ్వు నన్ను స్వీకరిస్తావా?” అనడిగింది సూటిగా.
అతను షాక్ తిన్నాడు..
“నో..” అన్నాడు తల అడ్డంగా ఊపుతూ.
“నేనూ అంతే.. నిన్ను స్వీకరించను!” అంది సింపుల్ గా.
ఆమె మాట తేలిగ్గానే వున్నా.. మగవాడికి అది ఎక్కడ తగలాలో అక్కడ తగిలింది..
అంతే.. థియేటర్లో ప్రేక్షకులంతా ఒకటే క్లాప్స్.. ఒకటే ఈలలు..
1982లో వచ్చిన ‘అర్థ్’ సినిమాలోని చివరి సన్నివేశం ఇది!
అప్పట్లో ఈ సినిమా ఒక సంచలనం..

వివాహబంధం.. భర్త అక్రమ సంబంధాలు.. భార్య పడే వేదన.. మహిళా సాధికారత.. అనే అంశాలతో రూపొందిన ఈ సినిమా వెండితెరపై ఒక సాహసం!
ఈ సినిమాతో దర్శకుడు మహేశ్ భట్ పేరు మారుమోగిపోయింది..
అవార్డులూ, రివార్డులూ వచ్చిపడ్డాయి..
ఫక్తు యాక్షన్ కమర్షియల్ మాస్ సినిమాలు ముమ్మరంగా వచ్చిపడిపోతున్న ఆ కాలంలో ఈ పారలల్ సినిమా విభిన్న చిత్రంగా ప్రశంసలు అందుకుంది. ఇది మహేశ్ భట్ సొంత కథ..
అప్పట్లో కథానాయిక పర్వీన్ బాబీతో ఆయనకున్న వివాహేతర సంబంధం.. పర్యవసానంగా ఆయన భార్య పడిన మానసిక వేదనకు ఈ చిత్రాన్ని దృశ్యరూపంగా పేర్కొన్నారు.

ఆ తర్వాత ఆయన నుంచి వచ్చిన ‘సారాంశ్’ మరో సంచలనం!
చెట్టంత కొడుకు అర్థాంతరంగా అమెరికాలో చనిపోవడం.. ఇక్కడ వున్న అతని వృద్ధ తల్లిదండ్రులు ఆ పుత్రశోకాన్ని తట్టుకోలేక తాము కూడా తనువు చాలించాలనుకోవడం.. అదే సమయంలో వాళ్లింట్లో అద్దెకు దిగిన ఓ అమ్మాయి కథ విని ఆ తండ్రి ఆమెకు బాసటగా నిలిచి.. జీవిత సారాంశాన్ని తెలుసుకోవడం.. నేపథ్యంలో సాగే ఈ చిత్రం కూడా మహేశ్ భట్ కి ఎనలేని ఖ్యాతిని తెచ్చిపెట్టింది.
‘భారతీయ చిత్ర పరిశ్రమకు దొరికిన ఒక ఆణిముత్యం మహేశ్ భట్’ అంటూ ప్రశంసలు కురుస్తున్న తరుణంలో ఒక్కసారిగా ఆయన తన ట్రెండ్ మార్చేశాడు.

1990లో ‘ఆషికి’ సినిమా వదిలాడు!
మ్యూజికల్ లవ్ స్టోరీ.. సూపర్ హిట్..
ఆయన చేసిన గత సినిమాలతో పోల్చకుండా చూస్తే కనుక.. ఇదొక మంచి లవ్ స్టోరీ.
ఆ లవ్ స్టోరీని లవ్ స్టోరీలానే చూడాలి.. ఆ సీన్స్.. ప్రేమలోని సున్నితత్వం, గాఢత .. ఆ మ్యూజిక్.. బ్యూటిఫుల్ మూవీ..

ఇక ఆ తర్వాత ‘దిల్ హైకీ మాన్తా నహీ’, ‘సడక్’.. వరుసగా లవ్ స్టోరీలు వదిలాడు మహేశ్.
అన్నీ మ్యూజికల్ హిట్స్.. బాక్సాఫీస్ హిట్స్!
1994లో మరో లవ్ స్టోరీ తీశారాయన.. అదే ‘క్రిమినల్’!
నాగార్జున, మనీషా కొయిరాల, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత కె.ఎస్.రామారావు గారు నిర్మించారు.
‘ది ఫ్యుజిటివ్’ అనే ఆంగ్ల చిత్రానికి ఇది రీమేక్ లాంటిది.

ఈ సినిమా షూటింగ్ కోసం మహేశ్ భట్ హైదరాబాదులో చాలా రోజులు వున్నారు. ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా కవరేజీకి వెళ్లాను.
కాస్త దూరంగా సోఫాలో కూర్చుని రిలాక్స్ అవుతున్న మహేశ్ భట్ ని విష్ చేశాను.
బాగా రిసీవ్ చేసుకున్నారు..
ఆర్ట్ ఫిలిమ్స్ నుంచి కమర్షియల్ సినిమాల వైపు ఆయన పయనం గురించీ, ఆయన ఫిలాసఫీ, ఆధ్యాత్మికత గురించీ అడిగాను.
తన ఆధ్యాత్మిక గురువు యు.జి. కృష్ణమూర్తి (ఉప్పలూరి గోపాల కృష్ణమూర్తి) గురించీ చెప్పుకొచ్చారు.

  • అదే సమయంలో రాజకీయ నాయకులపై పలు సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు.
    అత్యున్నత పదవుల్లో వున్న వారిపై కొన్ని అభ్యంతరకరమైన వ్యాఖ్యలు కూడా చేశారు.
    “ఇది రాయచ్చా?” అని అడిగితే..”తప్పకుండా రాసుకోవచ్చు.. ఇది ఆఫ్ ది రికార్డ్ కాదు” అని నొక్కి చెప్పారు.
    ఆ మర్నాడు ‘ఈనాడు’లో ఈయన ఇంటర్వ్యూ రాశాను..
    ఆయన ‘రాసుకోమన్న’ ఒక్క విషయం తప్ప.. ఎందుకో.. రాసే ముందు ఆలోచిస్తే అది నాకే అభ్యంతరకరంగా అనిపించింది.. అందుకే ఆ వ్యాఖ్యల్ని సెల్ఫ్ ఎడిటింగ్ చేశాను.
    మహేశ్ భట్ వ్యక్తిగత జీవితం వివాదాలమయం..
    చుట్టూ వున్న సమాజాన్ని పట్టించుకోడు..
    ఎవరేమనుకున్నా సరే తను చెప్పాలనుకున్నది నదురూ బెదురూ లేకుండా సూటిగా చెప్పేస్తాడు.. తను చేయాలనుకున్నది చేసేస్తాడు.
    అరుదైన వ్యక్తిత్వం!

-మోహన్ గోటేటి
#MaheshBhatt
#criminal
#Nagarjuna

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • GOBARdhan ! పెట్రోల్‌లో ఇథనాల్‌లాగే- గ్యాస్‌లో బయో CNG మిక్స్ !!
  • తొలి సినిమాతోనే మంచి పేరు ! ప్చ్, రిక్షా తోలుకుంటున్నాడు !!
  • Self Editing … అదే యూట్యూబర్లు అయితే దుమ్మురేపేవారు…
  • Peak Detailing – దురంధర్ అంత తేలికగా అద్భుతాన్ని సృష్టించలేదు !!
  • సూర్య ! ఇప్పుడిక తనకు పోటీ లేదు – మరో రేంజుకు ‘మార్కెట్ వాల్యూ’..!!
  • ఎఐ సొంతంగా దొంగ దారులూ వెతుకుతోంది.. మరో ముప్పు !
  • Friendship Recession – స్నేహానికి కూడా మాంద్యం వచ్చేసింది !
  • చీకటికి చెల్లుచీటీ ! అంధత్వంపై పోరుకు మరో అద్భుత సాంకేతికత !
  • న్యూ పల్స్ … మన ఆరోగ్యం విదేశీ ఇన్వెస్టర్ల చేతుల్లోకి !
  • మరో అరుదైన రికార్డు వైపు రాముడి గురి – మరింత హైప్ !

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions