.
Bhavanarayana Thota …. అప్పట్లో ఆయన… కొత్తా దేవుడండీ…. కల్కి భగవాన్ గా తనకు తాను ప్రకటించుకున్న విజయకుమార్ చనిపోయాడు. ఈ సందర్భంగా చాలా మంది మిత్రులు గతంలో వాళ్ళు రాసిన పాత కథనాలు గుర్తుచేస్తున్నారు. కల్కి భగవాన్ గా ఎదుగుతున్న తొలి నాళ్లలో నేను రాసిన కథనం 1997 మే 25 నాటి వార్త ఆదివారం అనుబంధం కవర్ పేజ్ గా వచ్చింది.
అంటే, 29 ఏళ్ల కిందటి కథనం అది. ఆ రోజుల్లో కల్కి అవతారంగా ప్రకటించుకున్న విజయకుమార్ నాయుడుకు చాలామంది అనుచరులు, శిష్యులు తయారవుతున్నారు. ఇంకా కచ్చితంగా చెప్పాలంటే లక్ష మందిని రిక్రూట్ చేసుకుంటామంటూ బహిరంగంగా ప్రకటించారు.
Ads
సరైన సమయంలో హెచ్చరించాలనిపించి తమిళనాడులో ఉన్న ఆశ్రమానికి వెళ్లాలనుకున్నా. చెన్నై శివార్లలో ఉన్న ఆశ్రమానికి బయలుదేరుతుంటే నా మిత్రుడు మల్లికార్జున్ కూడా వస్తానన్నాడు.
కెమెరా కనిపించకూడదని లాల్చీ పైజామా వేసుకొని జేబులో కెమెరా వేసుకున్నా. అక్కడికి వెళ్ళి చాలామందితో మాట్లాడాం.
కొంతమంది తల్లిదండ్రులే పిల్లల్ని ప్రోత్సహిస్తున్నట్టు చెప్పినవాళ్ళున్నారు. ఇంకొంతమంది పెంపుడు తండ్రి/ తల్లి బాధ పడలేక వచ్చినవాళ్ళు. మరికొంతమంది చదువు వత్తిడి నుంచి బైటపడవచ్చునని వచ్చారు. ఇక్కడ చేరిపోతే రేపటినుంచి చదవనక్కర్లేదన్నది వాళ్ళకో పెద్ద రిలీఫ్.
భోజనం ఉచితం. కాసేపు భజనలు. భజనాల సమయంలో వాళ్ళు ఊగిపోవటం చూసినవాళ్ళు అక్కడ మత్తుమందు కూడా ఇస్తున్నారనే సమాచారం ఉన్నా, తగిన ఆధారాలు దొరకలేదు. అందుకే లోపలికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. భగవాన్ భక్తులమని, ఆశ్రమంలో చేరాలనుకుంటున్నామని చెప్పాం. ముందు సరేనన్నారుగాని జేబులో కెమెరా ఉండటం గమనించి అనుమానించారు. వెనక్కి పంపించారు.
- ఏమైతేనేం అప్పటిదాకా సేకరించిన సమాచారంతో వివరంగా కథనం రాసి పంపించా. ఆదివారం కవర్ స్టోరీగా మార్కెట్లోకి వచ్చిన వెంటనే కల్కి భక్తులు రెచ్చిపోయారు. తిరుపతి, గుంటూరు సహా నాలుగైదు సెంటర్లలో వార్త ఆఫీసుల మీద దాడి చేసి కంప్యూటర్లు ధ్వంసం చేశారు. దాదాపు పది రోజులు అక్కడక్కడా నిరసన ప్రదర్శనలు జరుగుతూనే వచ్చాయి. అప్పట్లో తమిళనాడులో కరుణానిధి ప్రభుత్వం కావటం, మెరీనా బీచ్ లో కల్కి సభకు పర్మిషన్ ఇవ్వక పోవటం లాంటి ప్రతికూల సంకేతాలు ఉండటం వల్ల మద్రాసు ఆఫీస్ మీద మాత్రం అలాంటి దుస్సాహసం చేయలేకపోయారు.
ఆ తరువాత జెమినీ టీవీలో ఉండగా మళ్ళీ ఒకసారి కల్కి ఆశ్రమాల గురించి కథనాలు సిద్ధం చేశాం. కుప్పం దగ్గరలోని శాంతిపురంలో కల్కి తొలి ఆశ్రమం, అక్కడి అక్రమాల మీద మా చిత్తూరు జిల్లా ప్రతినిధి మునిరాజు పంపిన కథనం టెలికాస్ట్ అయింది. సూళ్ళూరుపేట నుంచి మా రిపోర్టర్ హరీష్ ఇంకో కథనం పంపాడు. అది ఇప్పటి తిరుపతి జిల్లా వరదయ్యపాళ్యం దగ్గర బత్తలవల్లం అనే ఊళ్ళో కడుతున్న ‘ఏకం-వన్ నెస్’ ఆశ్రమం గురించి, దానికోసం అక్రమంగా కొంటున్న అసైన్డ్ భూముల గురించి. కానీ ఆ కథనం టెలికాస్ట్ కాలేదు.
మొదటి కథనం రాగానే జెమినీ డైరెక్టర్ కిరణ్ అప్రమత్తమయ్యారు. వాళ్ళ నాన్నగారు కల్కి భక్తుడు. అందుకే కిరణ్ గారు సన్ టీవీ వాళ్ళను రిక్వెస్ట్ చేసి అది టెలికాస్ట్ కాకుండా చూశారు. ఆ రిపోర్ట్ పంపిన హరీష్ ఇప్పటికీ ఆ స్టోరీ గురించి మాట్లాడుతూనే ఉంటారు.

ఆ తరువాత కాలంలో కల్కి భగవాన్ సామ్రాజ్యం విస్తరిస్తూ వచ్చింది. మీడియాలో వ్యతిరేక కథనాలు రాకుండా ఉండాలంటే సొంత మీడియా సంస్థ ఉండాలని అనుకున్న కల్కి కొడుకు కృష్ణ తెలుగులో ఒక న్యూస్ చానల్ కొన్న సంగతి చాలామందికి తెలుసు. హైదరాబాద్ మణికొండలో జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావు నుంచి ‘స్టూడియో ఎన్’ అనే న్యూస్ చానల్ ను భవనంతో సహా కొనేశారు.
కొన్నేళ్ళపాటు చానల్ నడిపారు కూడా. ఆ తరువాత ‘ఏకం’ ఆశ్రమం మీద ఐటీ దాడులు జరిగి కోట్లకొద్దీ నగదు, ఆభరణాలు దొరకటంతో ఆ గొడవలో పడి చానల్ ను వదిలేశారు. ఇప్పుడు చానల్ లైసెన్స్ కూడా రద్దయింది.
ఇప్పుడు కల్కి భగవాన్ చనిపోవటంతో ఆయన కొడుకూ, కోడలూ (మేనకోడలు కూడా) ఆయన వారసత్వం కొనసాగించబోతున్నారు.
ఒక వైపు శ్రీహరికోటలో రాకెట్లతో ఉపగ్రహాలు అంతరిక్షంలోకి పంపుతూ ఉంటే పక్కనే పట్టుమని పాతిక కిలోమీటర్ల లోపు దూరంలోనే విస్తరించిన ఈ వేలకోట్ల ఆధ్యాత్మిక సామ్రాజ్యాన్ని నడపటానికి వారసులు సిద్ధమయ్యారు.
ఇదీ స్థూలంగా కల్కి కథ…. తోట భావనారాయణ
Share this Article