.
మిత్రుడు మోహన్ రుషి ఒకే మాటలో తేల్చేశాడు… నానా పేర్లన్నీ ఒకవైపు… నానా పేరొకవైపు..! అవును, జాతి విపత్తులో ఉన్నప్పుడు ఏ నటుడికీ నాలుగు ఉత్తేజపూరిత మాటలు మాట్లాడే సోయి ఉండదు, పైగా జాతి ద్రోహులతో కలిసి నడిచి, దేశంలో అశాంతి అని పేలే క్షుద్రులకూ ఇండస్ట్రీలో కొదువ లేదు… అదొక విషాదం… ఈ నేపథ్యంలో నానా పటేకర్ ఖచ్చితంగా వేలవేల రెట్లు బెటర్… ఎందుకంటే..?
తను సినిమాలో సైనికుడిగా చేయడమే కాదు… కార్గిల్ యుద్ధం వేళ నినిజంగానే సైనికుల మధ్యకు వెళ్లాడు! ఫ్రంట్ లైన్ వారియర్‌గా నిలిచాడు… నటుడిగా ఎలాగూ తను విఖ్యాతుడే, కానీ నానా పటేకర్‌కు సంబంధించిన ఈ విషయం తెలుసా?
Ads
సినిమా తెరపై సైనికుడి పాత్ర వేస్తే చప్పట్లు కొట్టడం చాలా మందికి తెలుసు. కానీ తెరపై సైనికుడిగా కనిపించిన ఓ నటుడు.. నిజమైన యుద్ధ సమయంలో సైనికుల మధ్యకు వెళ్లి దాదాపు రెండు నెలలు గడిపాడంటే నమ్మగలరా? అంతేకాదు.. అక్కడికి వెళ్లినప్పుడు 76 కిలోల బరువున్న ఆయన.. తిరిగి వచ్చేసరికి 56 కిలోలకు పడిపోయారు!
అది విలక్షణ నటుడు నానా పటేకర్ కథ. నానా పటేకర్ గురువారం కన్నుమూశాడు. గోవాలోని తన నివాసంలో అస్వస్థతకు గురైన ఆయనను ఆసుపత్రికి తరలించగా.. వైద్యులు కార్డియాక్ అరెస్ట్‌తో మృతి చెందినట్లు తెలిపారు. ఆయన వయసు 75 సంవత్సరాలు.
ఆయన మరణంతో ఇప్పుడు ఆయన జీవితంలోని ఓ ఆసక్తికరమైన అధ్యాయం మరోసారి వెలుగులోకి వచ్చింది. అదే.. 1999 కార్గిల్ యుద్ధ సమయంలో భారత సైనికులతో కలిసి గడిపిన 60 రోజులు…
ఆర్మీలో చేరాలనుకున్న నటుడు….. 1999.. కార్గిల్ యుద్ధం జరుగుతున్న సమయం. సరిహద్దుల్లో భారత సైనికులు పాకిస్థాన్ బలగాలతో పోరాడుతున్నారు. ఆ సమయంలో నానా పటేకర్‌కు కూడా సైనికులతో కలిసి దేశానికి తన వంతు సేవ చేయాలన్న ఆలోచన వచ్చింది. అయితే ఒక సాధారణ పౌరుడు వెళ్లి ఆర్మీలో చేరిపోవడం సాధ్యం కాదు.
అప్పటి రక్షణ మంత్రి జార్జ్ ఫెర్నాండెజ్‌కు నానా పటేకర్ ఫోన్ చేశాడు. తనను కార్గిల్‌కు పంపించాలని కోరాడు. తొలుత ఫెర్నాండెజ్ కూడా అది సాధ్యం కాదని చెప్పాడట. అప్పుడు నానా పటేకర్ తనకు ఉన్న సైనిక శిక్షణ గురించి వివరించాడు.

అంతకుముందే ‘ప్రహార్: ది ఫైనల్ అటాక్’ సినిమా కోసం ఆయన మరాఠా లైట్ ఇన్‌ఫెంట్రీతో సుదీర్ఘమైన శిక్షణ తీసుకున్నాడు. సినిమాలో మేజర్ ప్రతాప్ చౌహాన్ పాత్ర పోషించడమే కాకుండా.. ఆ సినిమాకు దర్శకత్వం కూడా వహించాడు. ఆ సమయంలో ఆయనకు కమాండో శిక్షణ, ఆయుధాల వినియోగంపై అనుభవం వచ్చింది. జాతీయ స్థాయి రైఫిల్ షూటింగ్ పోటీల్లోనూ పాల్గొన్నాడు.
అంతా విన్న జార్జ్ ఫెర్నాండెజ్.. చివరకు నానా పటేకర్‌ను అడిగాడట.. “ఎప్పుడు వెళ్లాలనుకుంటున్నారు?” నానా పటేకర్ సమాధానం.. “ఈరోజే!” అలా అనుమతి రావడంతో నానా పటేకర్ కార్గిల్ ప్రాంతానికి వెళ్లాడు. సుమారు 60 రోజుల పాటు సైనికులతో కలిసి ఉన్నాడు.
ద్రాస్, లేహ్, కుప్వారా, బారాముల్లా, సోపోర్ తదితర ప్రాంతాల్లో సైనికులతో కలిసి తిరిగాడు. అప్పటికే 1999 ఆగస్టులో ఆయన సైనికులతో కలిసి సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న విషయాన్ని అప్పటి మీడియా కూడా రిపోర్ట్ చేసింది. తర్వాత ఆయన క్విక్ రియాక్షన్ టీమ్ (QRT)లోనూ భాగమయ్యాడు. ఆయనకు చివరకు గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదా కూడా లభించింది.
అయితే అక్కడ అసలు ఏం చేశాడు? ఎలాంటి ఆపరేషన్లలో పాల్గొన్నాడు? అనే ప్రశ్నకు మాత్రం నానా పటేకర్ ఎప్పుడూ పూర్తిగా సమాధానం చెప్పలేదు. 2024లో ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఇదే ప్రశ్న ఎదురైంది. ఆయన సింపుల్‌గా… “అది మాత్రం అడగొద్దు.. చెప్పలేను” అన్నట్టుగా సమాధానం ఇచ్చారు.

76 కిలోలతో వెళ్లి.. 56 కిలోలతో తిరిగొచ్చారు! కార్గిల్‌కు వెళ్లినప్పుడు తన బరువు 76 కిలోలు అని నానా పటేకర్ స్వయంగా గుర్తుచేసుకున్నాడు. రెండు నెలల తర్వాత తిరిగి వచ్చేసరికి ఆయన బరువు కేవలం 56 కిలోలు! అంటే దాదాపు 20 కిలోలు తగ్గిపోయారు. యుద్ధ వాతావరణం, కఠినమైన పరిస్థితులు, నిరంతర ప్రయాణాలు.. ఇవన్నీ ఆయనపై ఎంతటి శారీరక ప్రభావం చూపించాయో ఈ ఒక్క విషయం చెబుతుంది.
ఆసుపత్రిలోనూ సేవ…. కార్గిల్ అనుభవంలో మరో విషాదకరమైన అధ్యాయం కూడా ఉంది. శ్రీనగర్‌లోని ఓ సైనిక ఆసుపత్రిలో నానా పటేకర్ కొన్ని రోజులు పనిచేశాడు. యుద్ధంలో గాయపడిన సైనికులతో పాటు.. అమరులైన జవాన్ల మృతదేహాలు కూడా అక్కడికి వచ్చేవని ఆయన తర్వాత గుర్తుచేసుకున్నాడు.
అక్కడ సుమారు ఆరు రోజుల పాటు పనిచేసినట్లు ఆయన వెల్లడించాడు. యుద్ధంలో తీవ్రంగా గాయపడిన ఓ సైనికుడిని చూసిన సంఘటనను కూడా నానా పటేకర్ ఒక సందర్భంలో గుర్తుచేసుకున్నాడు. ఆ జ్ఞాపకాలు తనను తీవ్రంగా కదిలించాయని చెప్పాడు.
తెరపై దేశభక్తిని చూపించిన నటులు చాలామంది ఉంటారు. కానీ దేశం పిలిచినప్పుడు... తెర దిగి నిజమైన సరిహద్దు దగ్గరకు వెళ్లిన నటులు మాత్రం చాలా అరుదు. కాదు, నానా పటేకర్ ఒక్కడే..!! ఆ స్ఫూర్తికి.. శిరసు వంచి నమస్కారం...

నీలకంఠి పటేకర్… నాటకాల రోజుల్లో ఆమెతో పరిచయం నానా పటేకర్‌కు… 1978లో పెళ్లి చేసుకున్నారు… కానీ పలు విషయాల్లో ఇద్దరి తత్వాలు వేరు, శృతి కుదరలేదు… 35 ఏళ్లపాటు విడిగానే బతికారు… విడాకులు తీసుకోలేదు…
Share this Article