Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ప్రభాత ఉదయం ! ఎవరిది ఈ కొత్త పత్రిక ? అంతుచిక్కని గోప్యత !!

August 10, 2026 by M S R

.

ఒక యూట్యూబ్ చానెల్, ఒక శాటిలైట్ టీవీ… కొంత వోకే, కానీ ఓ పత్రిక పెట్టడం ఈరోజుల్లో చాలా పెద్ద టాస్క్, రిస్క్… ఒక పార్టీ, ఒక నాయకుడు, ఒక సంస్థ ప్రయోజనాల కోసం పోషించాల్సిందే తప్ప… ఈరోజుల్లో పత్రిక వ్యాపారాత్మకంగా ఏమాత్రం గిట్టుబాటు కాదు, పెట్టిన పెట్టుబడికి గ్యారంటీ ఉండదు… వేజ్‌బోర్డు జీతాలు ఇస్తే ఇక అంతే సంగతులు…

సిబ్బంది జీతభత్యాలు, ప్రింటింగ్ ఖర్చు, పంపిణీ వ్యయం… ఏది చూసుకున్నా అదొక పెద్ద వ్యయం, పెద్ద ప్రయాస… పైగా తెలుగులో ఆల్రెడీ పాతుకుపోయిన ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి ఉన్నాయి… వాటిని తట్టుకుని, నిలబడి, సక్సెస్ కావడం మరీ మరీ పెద్ద టాస్క్… డబ్బు ఒకటే ముఖ్యం కాదు, ఒక పత్రిక సక్సెస్‌కు చాలా కారణాలు కలిసి రావాలి…

Ads

కేసీయార్ సాధనసంపత్తి అపారం కదా, కానీ నమస్తే తెలంగాణ దుస్థితి ఏమిటి..? ఆ పార్టీ వాళ్లే ఎవరూ చదవరు పెద్దగా..! చాలామంది నాయకులకు డబ్బున్నా పత్రిక స్థాపనకు వెనుకంజ వేసేది కూడా ఇందుకే… సరే, ఇక మిగతా తెలుగు పత్రికల గురించి వదిలేస్తే… ఇప్పుడు కొత్తగా ఓ తెలుగు పత్రిక (బహుశా కేవలం తెలంగాణకు పరిమితమై..) వస్తున్నదంటే అదే ఒక పెద్ద  వార్త… అందుకే మనం చెప్పుకుంటున్నాం ఇక్కడ… ఐతే ఏదీ నిర్ధారణగా చెప్పడం లేదు ఇక్కడ… కొన్ని ప్రశ్నలు, కొన్ని సందేహాలు, కొన్ని ప్రచారాలు… అవును, అదే ఈ కథ…

ఉదయం… ఈ పత్రిక ఒకప్పుడు ఈనాడుకు ముచ్చెమటలు పట్టించింది..,  బ్యాడ్‌‌లక్ మూతపడింది… తరువాత వార్త, ఈనాడును పలు జిల్లాల్లో రెండో స్థానంలోకి నెట్టేసింది… అదీ ఇప్పుడు నామమాత్రపు పత్రికగా మిగిలిపోయింది… అందుకే పత్రిక నిర్వహణ అంత ఈజీ కాదు అని చెప్పేది… ఆ ఉదయం టైటిల్ ఎవరి దగ్గర ఉందో తెలియదు, అందుకే ప్రభాత ఉదయం పేరుతో ఓ పత్రిక వస్తోంది…

ఇది ఎవరిది..? తలలుపండిన సీనియర్ జర్నలిస్టులకూ సమాధానం దొరకడం లేని ఓ చిక్కు ప్రశ్న… గతంలో నమస్తేకు సంపాదకుడిగా చేసిన కట్టా శేఖర్ రెడ్డి దీనికి సంపాదకుడు… ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ సోదరుడి కొడుకు వేమూరి వంశీ ఓనర్ అని చెబుతున్నారు… కానీ తనొక్కడికి అంత స్థోమత లేదు, మరి ఎవరు దీని వెనుక..? (వంశీ జర్నలిజం స్కూల్‌లో శేఖర్ రెడ్డి శిష్యుడు)…

ఒక సాక్షి, జగన్ అధికారిక ఓనర్… ఒక ఈనాడు, రామోజీరావు పత్రిక… ఒక ఆంధ్రజ్యోతి, రాధాకృష్ణ ఓనర్ (పునరుద్దరణ సమయంలో ముగ్గురు నలుగురు పెట్టుబడిదారులున్నారు)… ఒక నమస్తే తెలంగాణ, ఓనర్ కేసీయార్… ఒక వెలుగు, ఓనర్ వివేక్ వెంకటస్వామి… ఇవేకాదు, టీవీ9, ఎన్టీవీ, టీవీ5 నుంచి, స్వతంత్ర, మహాన్యూస్ దాకా ఓనర్లు ఎవరో అందరికీ తెలుసు… సింపుల్, ఓనర్‌ను బట్టి ఆ మీడియా ఏ బాటలో నడుస్తుందో ఇట్టే చెప్పేయగలం, పాఠకులకూ క్లారిటీ ఉంటుంది…

మరెందుకు ప్రభాత ఉదయం ఓనర్‌షిప్‌పై గోప్యత, మిస్టరీ..? శేఖర్ రెడ్డి గతంలో ఆంధ్రజ్యోతి, తరువాత నమస్తే తెలంగాణ… వేర్వేరు క్యాంపులు, వేర్వేరు పార్టీలు… సీపీఐ, టీడీపీ, బీఆర్ఎస్ క్యాంపులతో సాన్నిహిత్యం… సరే, కొన్ని ప్రచారాలు చెప్పుకుందాం…

– శేఖర్ రెడ్డి వియ్యంకుడు జీఎంఆర్ పెట్టుబడి ఉంది… ఇది ఓ గాసిప్… దీన్ని ఇట్టే కొట్టేయవచ్చు… వాళ్లు మీడియాలోకి రారు, వస్తే అది జాతీయ స్థాయిలో భారీగా ఉంటుంది, తెలంగాణకు సంబంధించిన ఓ చిన్న తెలుగు పత్రికను పెట్టరు…

– రాధాకృష్ణ దీని వెనుక ఉన్నాడు, వేమూరి వంశీ తన మనిషే, ప్రభుత్వ కార్యక్రమాల లైవ్ టెలికాస్ట్ వ్యాపారంలో ఉన్న సేవీ మీడియా వ్యవహారాలు తనే చూసేవాడట… ఏపీలో దీనికే కంట్రాక్టులు… కేసీయార్ ప్రభుత్వం కూలిపోయాక, ఇక్కడా దానికే ఆ కంట్రాక్టు అప్పగించారు… అప్పటివరకూ హరీష్ రావు బంధువు జగన్‌కు చెందిన ఏస్ గ్రూపుకి ఈ కంట్రాక్టు ఉండేది… (కొన్నిరోజులు బిగ్‌టీవీ ఈ రంగంలోకి వచ్చినట్టుంది, మానేసినట్టుంది)… (జగన్ అధికారంలో ఉన్నప్పుడు ధాత్రి మీడియా ఈ కంట్రాక్టులో ఉండేది, తన అధికారం పోగానే ధాత్రి మధు మీద ఏదో కేసు పెట్టి చివరకు కటకటాల్లో పెట్టారు..)

– సో, రాధాకృష్ణే ఈ వంశీని ముందుపెట్టి మరో పత్రికను ఎస్టాబ్లిష్ చేస్తున్నాడనేది మరో గాసిప్… తనకు ఆ అవసరం ఏమిటి..? ఆల్రెడీ పేపర్, టీవీ ఉన్నాయి కదా… ఇక్కడ రేవంత్, అక్కడ చంద్రబాబు, ఇద్దరూ తనకు సన్నిహితులే… మరి ఇంకెవరికోసమైనా ఈ డెడికేటెడ్ మీడియా ఏర్పాటు చేసే ప్రయత్నమా..? అది రేవంత్ రెడ్డి కోసమే ఎక్స్‌క్లూజివా..? తన పెట్టుబడి కూడా ఉందా..? ఇవి మరో రెండు ప్రశ్నలు…

– దీన్ని నిర్ధారణగా చెప్పలేం… కాకపోతే ప్రభాత ఉదయం వ్యవహారాలు మాత్రం రేవంత్ రెడ్డికి మొత్తం తెలుసు… ఏమైనా సపోర్ట్ చేస్తానని హామీ ఇచ్చాడా అనేదీ చెప్పలేం… (ఏపీలో ఆంధ్రజ్యోతి పూర్తిగా టీడీపీ వాయిస్, కానీ ఆ కూటమిలోని ప్రధాన భాగస్వామి బీజేపీపై రాధాకృష్ణకు ఈమధ్య కోపం పెరిగింది ఎందుకో, యాంటీ బీజేపీ అయిపోయాడు… ఈ స్థితిలో తెలంగాణలో యాంటీ- బీజేపీ కోసం, ఒకరకంగా కాంగ్రెస్ కోసం ఓ ప్రయత్నమా..?)

– ఎవరో నిజామాబాద్ పెద్ద వ్యాపారి దీనివెనుక ఉన్నారు… ఇదో గాసిప్… (రాధాకృష్ణ నేటివ్ పాత నిజామాబాద్ జిల్లాయే)… కానీ ఎవరైనా పెద్ద వ్యాపారి నిజంగానే పెట్టుబడి పెడితే తనెందుకు గోప్యతను మెయింటెయిన్ చేస్తాడు..? ఇది తన పత్రిక అని చెప్పుకుంటాడు కదా… సో, ఇదీ సందేహాస్పదమే…

రిక్రూట్‌మెంట్ స్టార్టయిన మాట నిజం… త్వరలో డమ్మీలు కూడా వేస్తారు… ఇక్కడ మరొకటీ చెప్పుకోవాలి… ఆంధ్రజ్యోతి నుంచి ఓ సీనియర్ మిత్రుడు బ్యూరో చీఫ్‌గా వెళ్లినట్టున్నాడు… ఇక పెద్దగా ఆ సంస్థ నుంచి ఇందులోకి వెళ్లరు… (రాధాకృష్ణ తన ఒరిజినల్ సంస్థను డిస్టర్బ్ కానివ్వడు కదా)… ఈనాడులో అధిక జీతాలు కాబట్టి అక్కడి నుంచీ రారు (ఏమో, మళ్లీ డిజిటల్ ఈనాడు, న్యూస్‌టుడే పేరిట మళ్లీ తక్కువ జీతాలతో చాకిరీ చేయించుకుంటున్నారు కదా, వాళ్లేమైనా వస్తారేమో)…

ప్రభాత ఉదయం నేరుగా తన యాడ్‌లోనే చెప్పింది, అనుభవమున్న వారికే అవకాశం అని… (ఇదీ ఒక్క ఆంధ్రజ్యోతిలో మాత్రమే వచ్చింది)… సో, సాక్షిపై అందరి దృష్టీ పడింది… చాన్నాళ్లుగా పెద్ద ఇంక్రిమెంట్లు లేవు, జీతాల పెంపుదల లేదు, ఎడిటోరియల్ స్టాఫ్ (డెస్కులు, బ్యూరోలు) లో అసంతృప్తి బాగానే ఉంది…

పైగా కొత్త సంపాదకుడు వచ్చాక తను మీటింగుల్లో చేస్తున్న ‘‘ఫ్యాక్షనిస్టు నేపథ్యం, రాస్కెల్స్, బాగా సంపాదించుకున్నారు, ఒక్కొక్కడి కథ తేలుస్తా’’ వంటి దురుసు వ్యాఖ్యలు సాక్షి యంత్రాంగంలో ఓరకమైన అన్‌రెస్ట్‌ను క్రియేట్ చేశాయి… సో, అన్‌సేఫ్ అని ఫీలయ్యేవారికి ప్రభాత ఉదయం ఓ మార్గంగా కనిపించవచ్చు… ఇతర పత్రికల్లో ‘రత్నాలు’ ఏమీ లేవు పెద్దగా…

ఇప్పటికిప్పుడు ప్రింటింగ్ యూనిట్లు ఎస్టాబ్లిష్ చేయడం కష్టం, వాటి వ్యయం, నిర్వహణ మరో తలనొప్పి… సో, ఈ ఉదయం టీమ్ బహుశా ఔట్ సోర్సింగ్‌కు వెళ్తుందేమో… ఏమో, అదీ ఆంధ్రజ్యోతికే దక్కుతుందా..? ఇదొక ప్రశ్న… సాక్షి వేరే పత్రికలకు ప్రింటింగ్, ట్రాన్స్‌పోర్ట్ సేవలు అందిస్తుంది చాన్నాళ్లుగా… ప్రింటింగ్ సౌకర్యం ఉన్న ఇతర చిన్న పత్రికలూ రెడీ…!!

ముందే చెప్పినట్టు… ఏవీ నిర్ధారణలు కావు… కొన్ని ప్రశ్నలు, కొన్ని సందేహాలు, కొన్ని ప్రచారాలు… అసలు అవే ఓ వార్తాకథనానికి అంశాలు… చివరగా… అవునూ, ఇంతకీ ప్రభాత ఉదయం ఎవరిది..?!

చివరిగా ఒక విషయం… పెట్టుబడిదారులు ఎవరన్నది, ఎందుకీ గోప్యత అనేది పక్కన పెడితే… మళ్లీ తెలుగులో ఒక కొత్త పత్రిక రావడం, ఇంకొందరు జర్నలిస్టులకు అవకాశాలు పెరగడం సంతోషించాల్సిన విషయం….

కొత్తగా రాబోతున్న “ప్రభాత ఉదయం” కు ఇం”ధనం” ఎవరిదైనా అది ప్రజల పక్షం వహిస్తే పెట్టుబడిదారులు ఎవరనే చర్చ- ప్రశ్న తన ప్రాధాన్యం కోల్పోతుంది…. ఒకవేళ ఆ ఇన్వెస్ట్ మెంట్ వెనుక రాజకీయ శక్తి ఉంటే దాని పుట్టుకకు పునాదులు వేసిన సదరు రాజకీయ వ్యవస్థ పల్లకీ మోసే మరో బోయిగానే ఈ పత్రిక కూడా మిగిలిపోతుంది… అది కాలం చెబుతుంది…

ప్రస్తుత పరిస్థితుల్లో ఒక తటస్థ పత్రిక అవసరం ఉంది… కానీ, తటస్థంగా ఉండగలిగే సాహసం సాధ్యమా! అంటే… సదరు కొత్త పత్రిక ప్రజల ముందుకు వచ్చాక దాని రంగు, రుచి, వాసనలను బట్టి అన్నీ ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. చూద్దాం… ఆ రంగు, రుచి, వాసన ఎలా ఉంటుందో…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ప్రభాత ఉదయం ! ఎవరిది ఈ కొత్త పత్రిక ? అంతుచిక్కని గోప్యత !!
  • కనిపించే దృశ్యం రికార్డవుతుంది – మరి పరిమళం, రుచి మాటేమిటి ?
  • ఆర్థిక సంస్కరణలకు అసలు సూత్రధారి… వెంకిట రమణన్ !!
  • జీనత్ అమన్‌కూ ‘తెహెల్కా’ తేజ్‌పాల్‌కూ ఏమిటి సంబంధం?!
  • బొద్దింకలు సజీవంగా, చురుకుగా ఉండాలట – రాజకీయాల్లోకి రావద్దట..!!
  • … అంటే నగరజనం కాలుష్యంలోనే బతకాలా మిస్టర్ కేటీఆర్ ?!
  • GOBARdhan ! పెట్రోల్‌లో ఇథనాల్‌లాగే- గ్యాస్‌లో బయో CNG మిక్స్ !!
  • తొలి సినిమాతోనే మంచి పేరు ! ప్చ్, రిక్షా తోలుకుంటున్నాడు !!
  • Self Editing … అదే యూట్యూబర్లు అయితే దుమ్మురేపేవారు…
  • Peak Detailing – దురంధర్ అంత తేలికగా అద్భుతాన్ని సృష్టించలేదు !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions