.
నిన్నటి వార్తే ఇది, ఎక్కడో కనిపించింది… ఏదో కార్పొరేట్ హాస్పిటల్ ప్రమోషన్ కోసం ఏమైనా ఎక్కువ చెప్పారేమో తెలియదు… నిజమే అయి ఉంటుందని అనుకుంటున్నాను… 19 నిమిషాల్లో 33 సార్లు గుండె ఆగిపోవడం, ఎప్పటికప్పుడు షాక్‌లు ఇస్తూ, గుండె లయను తిరిగి తీసుకొస్తూ, అంత అర్జెంటుగా స్టంట్ వేశారనే ఉదంతం మాత్రం చదవడానికి ఆసక్తికరంగా ఉంది…
ఆ వార్త ఇదీ… గుండెపోటును గ్యాస్‌గా భ్రమించడం: ప్రాణాల మీదికి తెస్తున్న నిర్లక్ష్యం … ఛాతీలో మంట లేదా నొప్పి రాగానే దాన్ని సాధారణ గ్యాస్ సమస్యగా కొట్టిపారేయడం చాలా మందిలో చూస్తుంటాం. కానీ, ఈ చిన్న పొరపాటు ఎంతటి ప్రాణాంతక ప్రమాదానికి దారితీస్తుందో, సంక్లిష్టతకు కారణమవుతుందో విజయవాడలో జరిగిన ఈ ఘటనే ప్రత్యక్ష నిదర్శనం.
Ads
క్షణాల వ్యవధిలో ముంచుకొచ్చిన ప్రమాదం … విజ్ఞాన్ యూనివర్సిటీ డీన్ డాక్టర్ దిరిశాల విజయ్ రామ్ విషయంలో ఇదే జరిగింది. జూలై 30న ఆయనకు ఛాతీలో మంట, నొప్పి మొదలుకాగా, తొలుత దానిని గ్యాస్ సమస్యగా భావించి స్థానిక వైద్యుడి వద్ద మందులు వాడారు. అయితే నొప్పి తగ్గకపోవడంతో రాత్రి 11 గంటలకు విజయవాడలోని ఏస్టర్ రమేష్ హాస్పిటల్స్‌కు చేరుకున్నారు.
ఆసుపత్రికి వచ్చిన కేవలం రెండు నిమిషాలకే ఆయన గుండె ఆగిపోయింది. వైద్యులు వెంటనే స్పందించి, తీవ్రమైన గుండెపోటు (Anterior Wall MI)గా గుర్తించి క్యాథ్ ల్యాబ్‌కు తరలించారు.
అసాధారణ పోరాటం: 33 సార్లు కార్డియాక్ అరెస్ట్ … ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్టులు డాక్టర్ పొట్లూరి అర్చన రత్న, డాక్టర్ కె. మధుకృష్ణ నేతృత్వంలోని వైద్య బృందం యాంజియోగ్రఫీ నిర్వహించగా, గుండెకు రక్తాన్ని అందించే ప్రధాన రక్తనాళం (LAD ఆర్టరీ) 100 శాతం బ్లాక్ అయినట్లు తేలింది.
-
ఆసుపత్రికి వచ్చిన కేవలం 19 నిమిషాల్లోనే స్టెంట్‌ను విజయవంతంగా అమర్చారు.
-
అయితే, ఈ స్టెంట్ అమర్చే అత్యంత క్లిష్టమైన ప్రక్రియలో విజయ్ రామ్‌కు ఏకంగా 33 సార్లు కార్డియాక్ అరెస్ట్ సంభవించింది.
-
ప్రతిసారీ వైద్యులు అప్రమత్తమై డీసీ షాక్‌ల ద్వారా ఆయన గుండె లయను పునరుద్ధరించడంతో పాటు IABP (ఇంట్రా-ఆర్టిక్ బెలూన్ పంప్) అమర్చారు.
వైద్యుల సమయస్ఫూర్తి, సత్వర స్పందన, ఆధునిక చికిత్స విధానం వల్ల ఆయన ప్రాణాలు నిలబడ్డాయి. చికిత్సకు క్రమంగా స్పందించిన ఆయన, కేవలం నాలుగు రోజుల్లోనే స్వయంగా నడిచే స్థితికి చేరుకోవడం వైద్య రంగంలో అరుదైన విజయంగా చెప్పుకోవచ్చు.
వైద్యుల హెచ్చరిక: “టైమ్ ఈజ్ మసిల్”
ఏస్టర్ రమేష్ హాస్పిటల్స్ చీఫ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పోతినేని రమేష్ బాబు మాట్లాడుతూ గుండెపోటు విషయంలో ప్రతి నిమిషం ఎంతో విలువైనదని (Time is Muscle) స్పష్టం చేశారు. ఛాతీ నొప్పిని ఎప్పుడూ గ్యాస్ సమస్యగా తేలికగా తీసుకోవద్దని హెచ్చరించారు.
-
ప్రధాన లక్షణాలు…: ఛాతీలో నొప్పి, ఒత్తిడి, బరువుగా అనిపించడం, అధికంగా చెమటలు పట్టడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది.
-
ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఈసీజీ (ECG) చేయించుకుని కార్డియాలజిస్టును సంప్రదించాలి…
-
రక్తపోటు, మధుమేహం, కొలెస్ట్రాల్‌లను అదుపులో ఉంచుకోవడం, ధూమపానం మానేయడం, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా గుండె జబ్బుల బారిన పడకుండా జాగ్రత్తపడవచ్చు….
వైద్యులు సత్వరం స్పందించి, ఒక మనిషి ప్రాణాలు రక్షించడానికి విశ్వప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అభినందిద్దాం… రీసెంటుగా వరంగల్ బీఆర్ఎస్ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గుండె ఆగిపోతే, అక్కడ డాక్టర్ మమత (రోహిణి హాస్పిటల్స్) 30 నిమిషాలపాటు 9 సార్లు సీపీఆర్ చేసి, తిరిగి గుండె లయను పునరుద్ధరించిన తీరు మరోసారి గుర్తొచ్చింది…!
Share this Article