.
నిన్నటిదే వార్త… చదువుతుంటే బాగుంది, కానీ చివరకు వచ్చేసరికి అనేక సందేహాలు… వివరాల్లోకి వెళ్దాం… బీహార్‌లోని బేగుసరాయ్ జిల్లా మనోపూర్ ముషహరి గ్రామంలో ఇటీవల చోటుచేసుకున్న ఓ ఘటన ఇది… ఎనిమిదేళ్ల క్రితం పాముకాటుకు గురై, చనిపోయాడని భావించి గంగానదిలో నిమజ్జనం చేసిన 12 ఏళ్ల బాలుడు ‘రాహుల్’.. ఇప్పుడు సన్యాసి రూపంలో తిరిగి వచ్చాడనేది వార్త… ఇదీ ఆ వార్త సారాంశం…
పాముకాటుకు గురికాగానే ఆ కుటుంబం మొదట అతడిని ఓ మంత్రగాడి వద్దకు తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోవడంతో తర్వాత వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. అయితే అప్పటికే రాహుల్ చనిపోయాడని వైద్యుడు చెప్పడంతో కుటుంబ సభ్యులు అతడి మృతదేహాన్ని గంగానదిలో నిమజ్జనం చేశారు.
Ads
ఎనిమిదేళ్ల తర్వాత ఒక యువ సన్యాసి చేతిలో సారంగి పట్టుకుని గ్రామానికి వచ్చాడు. తానే ఎనిమిదేళ్ల క్రితం చనిపోయాడని భావించిన రాహుల్నని చెప్పడంతో గ్రామస్థులు ఆశ్చర్యపోయారు. అతడు నేరుగా తన తల్లిని గుర్తించడమే కాకుండా తండ్రి, అన్న, బాబాయి, అత్త పేర్లను కూడా చెప్పాడు… చిన్నప్పుడే శరీరంపై ఏర్పడిన గాయం గుర్తును కూడా గ్రామస్థులు గుర్తించి, ఇతడే రాహుల్ అయి ఉండొచ్చు అన్నారు…
ఆ యువకుడు చెప్పిన కథ మరింత ఆసక్తికరంగా ఉంది. గంగలో తనను వదిలేసినప్పుడు తాను పూర్తిగా చనిపోలేదని, ఇంకా శ్వాస తీసుకుంటున్నానని తెలిపాడు. నదిలో కొట్టుకుపోతూ మొకామా ఘాట్‌కు చేరుకున్నానని, అక్కడ ఉన్న ఓ సాధువు తనను రక్షించి గోరఖ్‌పూర్‌కు తీసుకెళ్లాడని చెప్పాడు. అక్కడే ఆధ్యాత్మిక విద్య నేర్పించి, ఎన్నేళ్ల పాటు సన్యాస జీవితం గడిపించిన తర్వాత తన గురువు “నీ తల్లి దగ్గరకు వెళ్లి భిక్ష అడుగు” అని పంపించాడని వివరించాడు.
రాహుల్ గ్రామంలో కొద్దిసేపు గడిపిన తర్వాత తిరిగి గోరఖ్‌పూర్ వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు అతడికి మొబైల్ ఫోన్ కూడా కొనిచ్చారు. అయితే అక్కడికి వెళ్లిన తర్వాత ఫోన్ చేసి, తన గురువుకు చికిత్స, పెంపకం కోసం ఖర్చైన డబ్బుగా రూ.2 లక్షలు ఇవ్వాలని, అప్పుడే శాశ్వతంగా ఇంటికి వస్తానని చెప్పాడు… ఇక్కడే ఏదో తేడా కొడుతోంది…

-
రూ. 2 లక్షల నగదు డిమాండ్: గ్రామానికి వచ్చి వెళ్లిన కొద్ది రోజులకే ఫోన్ చేసి, తన గురువుకు రూ. 2 లక్షలు చెల్లించాలని, అప్పుడే శాశ్వతంగా ఇంటికి వస్తానని చెప్పడం ఈ వ్యవహారంలో అత్యంత అనుమానాస్పద అంశం. పేద కూలీ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని డబ్బులు గుంజడమే ప్రధాన ఉద్దేశమని ఇది స్పష్టం చేస్తోంది.
-
‘కోల్డ్ రీడింగ్’, సమాచార సేకరణ: ఆ యువకుడు కుటుంబ సభ్యుల పేర్లు, చిన్ననాటి గాయం గుర్తు ఆధారంగా నిజమైన కొడుకే అని నమ్మించే ప్రయత్నం చేశాడు. అయితే, గ్రామాల్లోకి ముందే వచ్చి వివరాలు సేకరించడం (Cold Reading) లేదా బంధువులతో మాట్లాడి వివరాలు రాబట్టడం మోసగాళ్లకు చాలా తేలికైన విషయం.
శాస్త్రీయ విశ్లేషణ – డీఎన్ఏ (DNA) పరీక్షే ఏకైక మార్గం… సుదీర్ఘకాలం తర్వాత లభ్యమైన వ్యక్తి నిజమైన కుటుంబ సభ్యుడో కాదో తెలుసుకోవడానికి కేవలం “గుర్తులు, పేర్లు చెప్పడం” ప్రామాణికం కావు. తల్లిదండ్రుల DNA శాంపిల్స్‌తో ఆ యువకుడి DNA శాంపిల్స్ మ్యాచ్ అయితేనే శాస్త్రీయంగా అతడు రాహుల్ అని నిరూపించబడుతుంది… లేదంటే, ఎలాగూ మరణించాడని నదిలో వదిలేశారు కదా, తను బతికిపోయి సన్యాసుల్లో కలిసిపోయాడు కదా, అక్కడైనా సుఖంగా బతుకు బిడ్డా అని వదిలేయడం బెటర్ !!
Share this Article