Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఇది మరో తండ్రి శవం కథ..! అనుబంధం- ఆత్మీయత అంతా ఒక బూటకం !!

August 13, 2026 by M S R

.

ఇది మరో కథ… అలాంటి కథే… వృద్ధాశ్రమంలో తండ్రి… పలకరించే పిల్లల్లేరు, ఎవరూ రారు, అనుబంధం – ఆత్మీయత  అంతా ఓ బూటకం… ఎవరి స్వార్థం వాళ్లది, ఎవడి కుటుంబం వాడిది… ఈ తాజా కథేమిటంటే..?

పిల్లల కోసం జీవితమంతా కష్టపడ్డాడు.. చివరికి ఎవరూ కాటికి కూడా రాలేదు! భార్య చనిపోయిన తర్వాత ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు… నలుగురు పిల్లల బాధ్యత మొత్తం ఆయనపైనే పడింది. మళ్లీ పెళ్లి చేసుకుంటే తనకు తోడు దొరుకుతుందేమో కానీ, చిన్న పిల్లలకు తల్లి దూరమవుతుందని భావించాడు. అందుకే ఒంటరిగానే ఉండిపోయాడు.

Ads

ఇండోర్‌కు చెందిన ఈ ఘనశ్యామ్ అనే ‘తండ్రి’ చిన్న సైకిల్ టైర్లు, ట్యూబుల వ్యాపారం చేసేవాడు. వచ్చిన ఆదాయంతో నలుగురు పిల్లలను పెంచాడు. చదివించాడు. పెళ్లిళ్లు చేశాడు. చివరకు తన ఇంటిని కూడా అమ్మి వచ్చిన డబ్బును నలుగురికీ పంచినట్లు సమాచారం.

అంటే… తన జీవితంలో తనకంటూ దాచుకున్నది పెద్దగా ఏమీ లేదు. పిల్లలే అతని ప్రపంచం. కానీ వృద్ధాప్యం వచ్చేసరికి ఆ ప్రపంచంలో ఆయనకే చోటు లేకుండా పోయింది పాపం.

ఘనశ్యామ్ తన జీవితంలోని చివరి నాలుగేళ్లు భోపాల్‌లోని ‘అప్నా ఘర్’ వృద్ధాశ్రమంలో గడిపారు. వృద్ధాశ్రమ నిర్వాహకుల కథనం ప్రకారం.. అనారోగ్యంతో ఉన్న ఆయనను ఒక దశలో భోపాల్ బస్టాండ్‌లో ఒంటరిగా ఉన్నప్పుడు సామాజిక కార్యకర్తలు ఆశ్రమానికి తీసుకొచ్చారు.

ఆగస్టు 4న ఈ 72 ఏళ్ల ఘనశ్యామ్ అక్కడే కన్నుమూశాడు… వృద్ధాశ్రమం నిర్వాహకులు వెంటనే ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. తండ్రి మృతదేహం ఉంది.. వచ్చి చివరి చూపు చూసి అంత్యక్రియలు నిర్వహించాలని పదేపదే కోరారు.

కానీ… ఒక్కరు కూడా రాలేదు. ఒకరు రైలు, బస్సు టికెట్లు దొరకడం లేదన్నారు. మరొకరు ఇంకో కారణం చెప్పారు. చివరకు తండ్రి అంత్యక్రియలు ఆశ్రమం నిర్వాహకులే చేసేయాలని కుటుంబ సభ్యులు చెప్పినట్లు సమాచారం.

రెండు రోజులు గడిచినా, శవం నిరీక్షించినా, తన పిల్లల్లో ఒక్కరూ రాకపోవడంతో వృద్ధాశ్రమ నిర్వాహకులే పోలీసుల సహాయంతో ఘనశ్యామ్ అంత్యక్రియలు నిర్వహించారు. ఇక్కడ మరో విషాదకరమైన విషయం కూడా ఉంది.

ఘనశ్యామ్ తన ఇంటిని అమ్మి పిల్లలకు ఆస్తి పంచినట్లు చెబుతున్నారు. అయినా ఆయన పిల్లల్లో ఒకరు తమ తండ్రి తమ కోసం ఏం చేశారని ప్రశ్నించినట్లు ఆశ్రమ నిర్వాహకులు తెలిపారు.

ఇంకా విచిత్రం ఏమిటంటే… తండ్రి చనిపోయినప్పుడు మాత్రం రాని కుటుంబ సభ్యులు, ఆ తర్వాత ఆయన డెత్ సర్టిఫికెట్ కోసం ఆశ్రమానికి ఫోన్లు చేసినట్లు సమాచారం. జీవితమంతా పిల్లల కోసం… చివరి నాలుగేళ్లు వృద్ధాశ్రమంలో…

చివరి క్షణాల్లో కూడా పిల్లల కోసం ఎదురుచూపే… చివరికి కాటికి కూడా పిల్లలు రాలేదు. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన సమయంలోనే హర్యానాలోని సోనిపట్‌లో జరిగిన మరో ఘటన కూడా గుర్తుకు వస్తోంది.

అక్కడ శివచరణ్ రతన్ గుప్తా అనే వృద్ధుడు వృద్ధాశ్రమంలో మరణించగా, ఆయన ముగ్గురు కుమార్తెలు అంత్యక్రియలకు ప్రత్యక్షంగా రాలేదు. వారిలో ఒకరు రూ.5,100 ఆన్‌లైన్‌లో పంపగా, ఆశ్రమ నిర్వాహకులు స్థానికుల సహకారంతో అంత్యక్రియలు నిర్వహించారు. ముగ్గురు కుమార్తెలు వీడియో కాల్‌లో కార్యక్రమాన్ని చూశారు. ఆ వార్త మనమూ చెప్పుకున్నాం కదా…

ఒక చోట రూ.5,100 పంపి అంత్యక్రియలు ముగించారు… మరోచోట తండ్రి మృతదేహం కోసం రెండురోజులు ఎదురుచూసినా పిల్లల్లో ఒక్కరూ రాలేదు.

కథలు వేరు… కానీ ప్రశ్న ఒక్కటే. పిల్లల కోసం జీవితమంతా ఖర్చు చేసిన తల్లిదండ్రులకు.. చివరి దశలో పిల్లల జీవితాల్లో చోటు ఎందుకు దొరకడం లేదు? ఘనశ్యామ్ కథకు సమాధానం చెప్పాల్సింది మనం కాదు. ఆయనను కాటికి పంపకుండా దూరంగా ఉన్న ఆ నలుగురు పిల్లలే…!!

  • కటువుగా ఉన్నా… కఠినంగా వినిపించినా… నిష్ఠురంగా ధ్వనించినా… నిజం ఏమిటంటే..? మరీ పిల్లల్ని అతిగా ప్రేమించి, సర్వస్వం ధారబోయకండి… తరువాత మీరే ఒంటరిగా, ఓ అనాథ శవంగా, అనామకంగా లోకం వీడిపోవాల్సి వస్తుంది… మనసంతా శూన్యాన్ని నింపుకుని..!!

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఆయన కేరళలోని గంగ… ఈయన ఇక్కడే కిమ్స్… ఏమిటీ తేడా..?!
  • ఇది మరో తండ్రి శవం కథ..! అనుబంధం- ఆత్మీయత అంతా ఒక బూటకం !!
  • FCRA – అసలు ఏమిటి ఈ నియంత్రణ చట్టం ? ఎందుకోసం ?
  • హీరోతో హీరోయిన్ రొమాన్స్ – కెమిస్ట్రీ – ఇదే మీడియా ప్రయారిటీ !!
  • ఢాకాలో ఏదో జరుగుతోంది – మళ్లీ రాజకీయ పరిణామాలు ?!
  • సన్నాసి ? సన్యాసి ? నదిలో వదిలేసిన శవం బతికి తిరిగొచ్చిందా !?
  • Credit Theft Politics … హరీశ్ రావు నీటి రూటే సపరేటు…
  • నాగదుర్గ – అఖిల్ రాజ్ ! రీల్ జంట కమ్ రియల్ జంట !!
  • Great Escape ! వ్యవస్థలన్నీ విఫలమైనవేళ – ఓ అరుదైన ఎయిర్ ఫీట్ !!
  • పోచారం గాచారమా..? పశ్చాత్తాపమా..? ఏమైంది వీళ్లందరికీ !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions