.
హీరో సూర్య ఎందుకు నచ్చుతాడంటే… సింగం తరహా ఫుల్ యాక్షన్ ప్యాక్డ్, కమర్షియల్ సినిమాలు చేస్తున్నా… మధ్య మధ్య జై భీమ్, ఆకాశం నీ హద్దురా వంటి భిన్నమైన, స్పూర్తిదాయక సినిమాలూ చేస్తాడు… ట్రెండ్‌ను పట్టుకుని వేలాడడు…!
అంటే, ముసలి హీరోలు సైతం రా రస్టిక్ లుక్స్, గ్రాఫిక్స్‌తో వందల మందిని లేపేసే బీభత్సమైన ఫైటింగులు, రోత కామెడీ, స్మగ్లర్లు- డాన్ పాత్రలు ప్రజెంట్ కమర్షియల్ ట్రెండ్ కదా… దానికి భిన్నంగా ఫ్యామిలీ ప్రేక్షకులను కూడా టచ్ చేసేలా ఓ ఫీల్ గుడ్, ఎమోషనల్ మూవీ చేశాడు… అదే విశ్వనాథ్ అండ్ సన్స్… జ్యోతిక కూడా కొన్ని మంచి స్టోరీలున్న సినిమాలు నిర్మించింది కూడా…
Ads
అట్లూరి వెంకీ లక్కీ భాస్కర్ ఓ భిన్నమైన కథాంశంతోనూ మంచి హిట్ కొట్టడంతో ఈ సూర్య సినిమా మీద కూడా మంచి అంచనాలే ఉన్నాయి… సినిమాకు రిలీజుకు ముందే మంచి బిజినెస్ జరిగింది కూడా… మన సౌత్ ముసలి హీరోలు యంగ్ హీరోయిన్లతో రొమాన్స్‌కు ఎగబడుతున్న ఈ రోజుల్లో ‘ఏజ్ గ్యాప్’ కెమిస్ట్రీని కూడా చక్కగా ప్రజెంట్ చేశాడు దర్శకుడు ఇందులో…
(విజయ్ సీఎం అయిపోయాడు.., రజినీ- కమల్ శకం ముగిసిపోయింది… అజిత్ డౌన్ అయ్యాడు… ప్రస్తుతానికి తమిళంలో సూర్య టాప్… ఐనా సరే, రొటీన్ ఫార్ములా కమర్షియల్ చట్రంలో ఇమిడిపోకుండా ఉండటం సూర్య ప్లస్ పాయింట్)…

రొటీన్ కమర్షియల్ మసాలాలు కోరుకునే ప్రేక్షకులకో, సూర్య ఫ్యాన్స్‌కో కొంత అసంతృప్తి ఉండొచ్చునేమో గానీ… రొటీన్ చెత్త దంచుడు సినిమాల నడుమ ఇది ఖచ్చితంగా ఓ ఫీల్ గుడ్ సినిమా… కథాకాకరకాయ డాన్లు, గ్యాంగ్స్టర్లు, స్మగ్లర్ల బాపతు కాదు…
హీరో పిస్టల్ షూటింగులో ఛాంపియన్, గోల్డ్ మెడలిస్ట్… మూడేళ్ల కొడుక్కి అనారోగ్యం, బోన్ మారో మార్పిడి కావాలి… ఆ సమస్యను పరిష్కరించే క్రమంలో హీరో జీవితంలోకి హీరోయిన్ మమితా బైజు ప్రవేశిస్తుంది… ఆ తర్వాత వారి మధ్య వచ్చే వయసు వ్యత్యాసం (ఏజ్-గ్యాప్) ఉన్న రొమాన్స్, కుటుంబ బంధాలు, భావోద్వేగాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది…
సంజయ్ విశ్వనాథ్‌గా (గజిని సినిమాలో సూర్య పాత్ర పేరు సంజయ్ రామస్వామి) సూర్య బాగా నటించాడు. తనకు మంచి పాత్ర దొరకాలే గానీ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాడు… హీరోయిన్ మమితా బైజు తన ఫ్రెష్ లుక్స్, ఎనర్జిటిక్ నటనతో సినిమాకు పెద్ద అసెట్‌గా నిలిచింది. హీరో పాత్రకు దీటైన కథానాయిక పాత్ర దొరికింది ఆమెకు, సద్వినియోగం చేసుకుంది…
సూర్యతో ఆమె కెమిస్ట్రీ బాగా కుదిరింది… అక్కడక్కడా స్లోగా సాగే కథనం కొందరికి నచ్చకపోవచ్చునేమో గానీ, అది పెద్ద మైనస్ మాత్రం కాదు… ఉంది, అక్కడక్కడా కాస్త మెలోడ్రామా ఉంది… ఫన్ ఉంది… దర్శకుడు వెంకీ అట్లూరి రాసుకున్న పలు ఎమోషనల్ సీన్లు, డైలాగ్స్ పండాయి… రాధిక, రవీనా టాండన్ కూడా తమ పాత్రల్లో చక్కగా సెట్ అయ్యారు…
బాక్సులు పగిలిపోయే బీజీఎం గ్రేట్‌నెస్ అనుకుంటున్న నేపథ్యంలో సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ కథను అనువైన నేపథ్యసంగీతాన్ని అందించాడు… మరీ ఇది ‘లక్కీ’భాస్కర్ మార్క్ హిట్ కాకపోవచ్చు… కాకపోతే ప్రస్తుతం మార్కెట్లో మంచి సినిమా వాక్యూమ్ ఉంది… దాన్ని ఈ విశ్వనాథుడి కొడుకు భర్తీ చేస్తాడు..!!
Share this Article