.
ఈమధ్య సినిమా సెలబ్రిటీలందరికీ ఓ పాడు అలవాటు మోపైంది కదా… మైక్ కనిపిస్తే చాలు, ఏదో ఒకటి ఒర్రడం… దాంతో సినిమాకు మస్తు ప్రమోషన్ అని ఫీలవడం… సీనియర్ నరేష్ అని పిలవబడే వీకే నరేష్ తక్కువేమీ కాదు… ఓ పిసరంత ఎక్కువే కూడా… తను కూడా రాను రాను రాజేంద్ర ప్రసాద్ అవుతాడేమో బహుశా…
అసలు తనదే ఓ గతి తప్పిన సంసారం… ఇద్దరు భార్యలకు విడాకులు… మూడో భార్యతో విడాకుల లొల్లి- రచ్చ,.. ఆమె ఇజ్జత్ మొత్తం తీసింది… అలవాటేలే అని దులిపేసుకుని నాలుగో సంబంధం ఇప్పుడు… మూడో విడాకులు రాలేదు కాబట్టి, ఇది నాలుగో పెళ్లి దాకా రాలేదు… సహజీవనం చేస్తున్నారు… పెళ్లి ప్రస్తావన వచ్చింది కదా…
Ads
మొన్న క్రేజీ కళ్యాణం అనే సినిమా ఫంక్షన్లో కొన్ని కూతలు… సంక్షిప్తంగా అవేమిటంటే… ఈ రోజుల్లో పెళ్లి చేసుకోవడం లేదా చేసుకోకపోవడం రెండు సరైనవే… సహజీవనం (Living together) కూడా తప్పేమీ కాదు… నేడు పెళ్లిళ్లు ఒక పెద్ద ఈవెంట్‌లా మారిపోయి విపరీతంగా ఖర్చు పెడుతున్నారు… తర్వాత మనస్పర్థలతో విడాకుల కోసం కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోంది… పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా పర్వాలేదు కానీ, పిల్లల్ని మాత్రం కనండి…
~~~~~~~~~~~~~~~
ఇలాంటి అరబుర్రలకూ డొల్ల బుర్రల వీరాభిమానులుంటారు కాబట్టి… కాస్త బాధ్యతగా మాట్లాడాలి… ఆ సోయి లేదు నరేష్‌కు… ఏదో తోచిన సలహా సమాజం మీదకు విసిరేస్తాడు… తన మాటలు తన ‘నాలుగో సంసారం’ సమర్థన… ఒక్క పిల్లల్ని కనండి అనే సలహా తప్ప… ఇదొక మతిమాలిన సలహా…
పిల్లల్ని కనాలా వద్దా అనేది ఆయా పురుషుల, మహిళల వ్యక్తిగత నిర్ణయం… నువ్వు చెబితేనో, చంద్రబాబు చెబితనో అర్జెంటుగా పిల్లలను కనరు నరేషూ… పిల్లల్ని కనడం ఓ లక్ష్యమా..? ఎందుకు..? ఎవరి కోసం..? నీకంటే విజయనిర్మల సంపాదించిన పెట్టిన వేల కోట్ల ఆస్తులున్నాయి… అందరికీ అలా మూలగడం లేదు…
డబుల్ ఇన్కమ్ ఉన్న జంటలే పిల్లలు కనడం మీద ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్న దుర్దినాలు ఇవి… నువ్వు చెప్పావని పిల్లల్ని కంటే ఎవరు పోషించాలి..? ఆ మదర్స్ ఎదుర్కునే సామాజిక వివక్ష మాటేమిటి..? లీగల్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఆ పిల్లలకు జెనెటిక్ తండ్రిగా ప్రకటించుకోవడానికి ఎవరు ముందుకొస్తారు..? సామాజిక గుర్తింపు మాటేమిటి..? తరువాత ఆ పిల్లలు పెరిగి పెద్దయ్యాక అనుభవించే వేదన మాటేమిటి..?
అసలు సింగిల్ పేరెంట్ హుడ్ సమస్యలు ఏమిటో తెలుసా నీకు..? మైక్ దొరకగానే నోటికొచ్చింది మాట్లాడటం కాదు… పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా పిల్లల్ని మాత్రం కనాలనడంలో లాజిక్ ఏమిటో, విజ్ఞత ఏమిటో తనకే అర్థం కాదు మళ్లీ ఆలోచించుకుంటే..! పెళ్లి వ్యక్తిగత నిర్ణయమైనప్పుడు పిల్లల్ని కనడం మాత్రం అందరికీ తప్పనిసరి లక్ష్యం ఎలా అవుతుంది?
పిల్లలు లేకపోతే జీవితానికి అర్థం లేనట్టా? పిల్లల్ని కనలేని వాళ్లు, కనకూడదనుకునేవాళ్లు, పిల్లల్ని పెంచే బాధ్యతను స్వీకరించలేని పరిస్థితుల్లో ఉన్నవాళ్లు ఏం చేయాలి? వాళ్ల జీవితాల్లో ఏదో లోటు ఉందని తీర్పు చెప్పాలా?

ఒక బిడ్డకు జన్మనివ్వడం ప్రకృతి ఇచ్చిన అవకాశం కావచ్చు… కానీ ఆ బిడ్డను బాధ్యతగా పెంచడం మాత్రం తల్లిదండ్రుల మీద పడే జీవితకాల బాధ్యత… వాళ్లను పెంచి పెద్ద చేయడం రెండు దశాబ్దాలకు పైగా సాగే ప్రయాణం… చదువు, ఆరోగ్యం, పోషకాహారం, భద్రత, మంచి వాతావరణం, మానసిక వికాసం.. ఇలా ఎన్నో అవసరాలు ఉంటాయి… వీటన్నింటికీ డబ్బుతోపాటు సమయం, ఓపిక, ప్రేమ, బాధ్యత కూడా కావాలి… ఉచిత సలహాలు ఇవ్వడం కాదు…
పిల్లలకు గుర్తింపు అంటే కేవలం పుట్టిన సర్టిఫికెట్లో తండ్రి పేరు ఉండటమే కాదు… తమ కుటుంబం గురించి ఎవరైనా ప్రశ్నించినప్పుడు తలదించుకోకుండా బతికే వాతావరణం ఉండాలి… తల్లిదండ్రుల నిర్ణయాలకు పిల్లలు అనవసరమైన మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి రాకూడదు… సమాజంలో వివక్ష ఎదురైతే వాళ్లకు అండగా నిలిచే వ్యవస్థ ఉండాలి…

సింగిల్ పేరెంట్ హుడ్ వేరు… సింగిల్ పేరెంట్‌గా పిల్లల్ని పెంచే తల్లిదండ్రులెందరో ఉన్నారు. జీవిత భాగస్వామిని కోల్పోయినవాళ్లు, విడాకులు తీసుకున్నవాళ్లు, తమ వ్యక్తిగత పరిస్థితుల కారణంగా ఒంటరిగానే పిల్లల బాధ్యతను స్వీకరించినవాళ్లు ఉన్నారు… వాళ్లలో చాలామంది ఎంతో బాధ్యతగా పిల్లల్ని పెంచుతున్నారు… అలాంటి కుటుంబాలను తక్కువ చేసి చూడాల్సిన అవసరం లేదు…
సింగిల్ పేరెంట్ హుడ్ ఒకరి జీవితంలో అనివార్యమైన పరిస్థితి కావచ్చు… మరొకరు ఆ బాధ్యతను స్వచ్ఛందంగా స్వీకరించవచ్చు… ఇంకొకరు పిల్లలు వద్దని నిర్ణయించుకోవచ్చు… ఈ మూడింటిలోనూ వ్యక్తిగత నిర్ణయానికి గౌరవం ఉండాలి…
పెళ్లి ఖర్చులు పెరిగాయి కాబట్టి పెళ్లి అవసరం లేదు, పిల్లల్ని మాత్రం కనాలి అనడం ఏ రకమైన పరిష్కారం? సమస్య పెళ్లి అనే వ్యవస్థలోనే ఉందా? లేక ఆ వ్యవస్థలోకి ప్రవేశిస్తున్న మనుషుల ఆలోచనల్లోనూ ఉందా? ఆడంబరమైన పెళ్లి చేసుకున్న ప్రతి జంట విడాకులు తీసుకోవడం లేదు… సాధారణంగా పెళ్లి చేసుకున్న ప్రతి జంట సంతోషంగా ఉంటుందని కూడా చెప్పలేం… అసలు విషయం పెళ్లి ఖర్చు కాదు… ఆ బంధాన్ని నిలబెట్టుకునే పరిపక్వత…
దేశంలో ఫర్టిలిటీ రేటు పడిపోవడం ఓ సమస్యే కావచ్చు... కానీ పెళ్లిళ్లు లేకపోయినా యువత పిల్లల్ని కనాల్సినంత ఉద్యమాలు ఇప్పుడు అవసరం లేదు... తమరు కాస్త నోరుమూసుకోవచ్చు...!!
Share this Article