Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఓ ప్రియురాలి వేదన – ఈ ఒక్క పాటతో గుల్జార్ వెనక్కి చూసుకోలేదు ఇక !!

August 18, 2026 by M S R

.

(  అప్పరసు శ్రీనివాసరావు         98499 98010  ) …. ఈ కథను నేను ఎన్నోసార్లు చదివాను. 1960ల నాటి ఓ యువ కవి కథ ఇది. ఆ తర్వాతి కాలంలో ఒక్కసారిగా కీర్తి శిఖరాలను అధిరోహించి, సెలబ్రిటీగా ఎదిగి, సినీ ప్రపంచంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్ అవార్డును సైతం అందుకున్న మహాకవి కథ.

అది 1963వ సంవత్సరం. ఇద్దరు దిగ్గజ సినీ వ్యక్తులు— ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్.డి. బర్మన్, దర్శకుడు బిమల్ రాయ్— తాము రూపొందిస్తున్న Bandini చిత్రంలోని ఓ పాటను ఎలా చిత్రీకరించాలన్న విషయంపై ఆసక్తికరమైన వాదనకు దిగారు. ఇద్దరూ మంచి మిత్రులే. కానీ సృజనాత్మక ఆలోచనల్లో వచ్చిన భేదాభిప్రాయం క్రమంగా పట్టుదలతో కూడిన పేచీగా మారింది. ఇద్దరూ తమ తమ వాదనలపై మొండిగా నిలిచారు.

Ads

పాటను కల్యాణి అనే యువతిపై చిత్రీకరించాలనేది ఆలోచన. ఆమె ఓ స్వాతంత్ర్య సమరయోధుడిని ప్రేమిస్తుంది. బ్రిటిష్ సైన్యం అతడి కోసం వెతుకుతుండటంతో, అతడు ఓ రహస్య ఆశ్రయంలో దాక్కుని ఉంటాడు. సంప్రదాయ కుటుంబంలో పుట్టిన కల్యాణికి ఇంటి గడప దాటి బయటకు రావడంపైనా, తన ప్రియుడిని కలవడంపైనా ఎన్నో ఆంక్షలు ఉంటాయి.

అయితే కథలోని పరిస్థితి ఆమెను కనీసం దూరం నుంచైనా తన ప్రియుడిని చూడటానికి, అతడి దగ్గరకు వెళ్లాల్సిన అవసరాన్ని సృష్టిస్తుంది.

బిమల్ రాయ్ ఏమంటాడంటే… “కల్యాణి ఇంటి నుంచి బయటకు వచ్చి, తన ప్రియుడిని కలవడానికి పాట పాడుకుంటూ వెళ్లడం అసంభవం. ఆ కాలం నాటి సమాజం దాన్ని అంగీకరించదు. ఒక స్త్రీ బహిరంగంగా ఇంటి నుంచి బయటకు రావడమే ఆమోదయోగ్యం కానప్పుడు, ప్రేమికుడిని కలవడానికి వెళ్లడాన్ని ఎలా అంగీకరిస్తుంది?”

అందుకు ఎస్.డి. బర్మన్ వెంటనే అభ్యంతరం వ్యక్తం చేశారు. “ఆమె ఇంట్లో తండ్రి ఎదుట కూర్చుని ప్రేమగీతం ఎలా పాడుతుంది? నేను స్వరపరిచిన ఈ పాటను విస్తారమైన పొలాల్లో, వెన్నెల కురిసే రాత్రి చిత్రీకరించాలనే ఉద్దేశంతోనే స్వరపరిచాను. ఇందులో రాజీ లేదు.”

బిమల్ రాయ్ మరో మార్గాన్ని సూచించారు. “సినిమాలో ఆమె తండ్రి రాధాకృష్ణుల వైష్ణవ కవిత్వాన్ని తన కుమార్తెకు చెబుతాడు. కాబట్టి కుమార్తె కూడా తండ్రి ఎదుట అలాంటి కవిత్వాన్ని పాడవచ్చు.” కానీ బర్మన్ మాత్రం అంగీకరించలేదు.

“మనకు కవిత కాదు, పాట కావాలి. ఇంటి నాలుగు గోడల మధ్య పాడితే ఆ పాట ఊపిరాడక చచ్చిపోతుంది. పాటలోని భావం, ఆ క్షణం— ప్రకృతిని, పచ్చిక బయళ్లను, వెన్నెలను ప్రతిబింబించాలి,” అని ఆయన పంతం.

చివరకు కొంత రాజీకి వచ్చిన బిమల్ రాయ్ మరో సూచన చేశారు. కల్యాణి రాత్రివేళ ఇంటి నుంచి బయటకు రావడం సమాజపరంగా సముచితం కాదు కాబట్టి, ఇంటి వరండాలో నిలబడి పాట పాడేలా, అయితే ఆమె చుట్టూ ఉన్న ప్రకృతి కూడా తెరపై కనిపించేలా చిత్రీకరిద్దామని అన్నారు.

ఇద్దరు దిగ్గజాలు పాట చిత్రీకరణపై ఇలా వాదించుకుంటుండగా, ఆ పాట రాయడానికి పిలిపించిన ఓ యువ గేయ రచయిత నిశ్శబ్దంగా వారిని గమనిస్తున్నాడు.
అతను ఇద్దరి దగ్గరకు వెళ్లి, వారిద్దరికీ ఆమోదయోగ్యంగా అనిపించే ఓ పరిష్కారాన్ని సూచించాడు.

“అవును. ఇంట్లో కూర్చుని ఓ స్త్రీ ప్రేమగీతం పాడటం సరైనదిగా అనిపించదు. అదే సమయంలో, సూర్యాస్తమయం తర్వాత తన ప్రియుడిని కలవడానికి ఓ స్త్రీ బహిరంగంగా బయటకు రావడాన్ని సమాజం అంగీకరించదు. కానీ… ఎవరూ తనను చూడకుండా, రాత్రి చీకటిని ఆసరాగా చేసుకుని ఆమె తన ప్రియుడిని కలవడానికి వెళితే?
తనను ఈ లోకపు కళ్లకు కనిపించకుండా దాచిపెట్టమని ఆమె రాత్రినే వేడుకుంటే ఎలా ఉంటుంది?”
ఆ ఆలోచన అందరికీ నచ్చింది.



అలా పుట్టింది ఆ అద్భుతమైన పాట…

मोर गोरे अंग ले ले, मोहे श्याम रंग दे दे
छुप जाऊँगी रात ही में, मोहे पी का संग दे दे  (మోర్ గోరా అంగ్ లై లే, మోహే శ్యామ్ రంగ్ దై దే – ఛుప్ జావూంగీ రాత్ హీ మేఁ, మోహే పీ కా సంగ్ దే దే )

“నా తెల్లని దేహవర్ణాన్ని తీసేసి, నాకు నల్లని రంగు ప్రసాదించు. ఈ రాత్రి చీకటిలో నేను ఎవరికీ కనిపించకుండా దాగిపోతాను. నన్ను నా ప్రియుడి సాన్నిధ్యంలోకి చేర్చు.”

एक लाज रोके पैयाँ, एक मोह खींचे बैयाँ
जाऊँ किधर न जाऊँ, हमका कोई बताई दे  ( ఏక్ లాజ్ రోకే పైయాఁ, ఏక్ మోహ్ ఖీంచే బైయాఁ -“జాఊఁ కిధర్ న జానూఁ, హమ్‌కా కోయీ బతాయీ దే”)

“ఓ వైపు సిగ్గు నా అడుగులను ఆపుతోంది, మరో వైపు ప్రేమ నా చేతులను పట్టుకుని తనవైపు లాగుతోంది.
వెళ్లాలా? వద్దా? ఏ దారిని ఎంచుకోవాలో ఎవరైనా నాకు చెప్పండి.”

కానీ ఆ చీకటి రాత్రిలో ఒక్కసారిగా మబ్బుల చాటు నుంచి పున్నమి చంద్రుడు బయటకు వస్తే? వెన్నెల ఆమెను వెలుగులోకి తీసుకువస్తే? కల్యాణికి కోపం వస్తుంది. తన రహస్యాన్ని ప్రపంచానికి తెలియజేస్తున్న ఆ చంద్రుడినే ఆమె శపిస్తుంది…

बदरी हटा के चंदा, चुपके से झाँके चंदा
तोहे राहु लागे बैरी, मुस्काए जी जलाई के ( బదరీ హటా కే చందా, చుప్కే సే ఝాంకే చందా – తోహే రాహూ లాగే బైరీ, ముస్కాయే జీ జలయీ కే )

“మబ్బుల చాటునుంచి దొంగచాటుగా తొంగిచూస్తున్నావా, ఓ చంద్రుడా? నా బాధను చూసి వెక్కిరిస్తూ నవ్వుతున్నావా? ఓ దుష్ట చంద్రుడా… నిన్ను ఆ రాహువు గ్రహణం పట్టాలి!”

ఆ కోపం కూడా కాసేపే.
మళ్లీ ఆమె పెదవులపై ప్రేమతో కూడిన చిరునవ్వు మెరుస్తుంది.

कुछ खो दिया है पाई के, कुछ पा लिया गँवाई के
कहाँ ले चला है मनवा, मोहे बावरी बनाई के  ( కుచ్ ఖో దియా హై పాయి కే, కుచ్ పా లియా గఁవాయీ కే – కహాఁ లే చలా హైఁ మన్వా, మోహే బావరీ బనాయీ కే )

“నిన్ను పొందిన తర్వాత నాలోని ఏదో ఒకదాన్ని కోల్పోయాను. నాలోని ఓ భాగాన్ని నీకోసం కోల్పోయిన తర్వాత, నాలోనే కొత్తదేదో కనుగొన్నాను. ఇప్పుడీ ప్రేమలో పిచ్చిదానినైపోయిన నా మనసు నన్నెక్కడికి తీసుకెళ్తుందో…”

 


https://www.youtube.com/watch?v=8ImYJt7N-sQ

ఇది ఆ యువ గేయ రచయితను దేశవ్యాప్తంగా గుర్తింపుతెచ్చిన తొలి పెద్ద సినీ గీతం… కానీ ఆ ఒక్క పాటతోనే ఆయన తనలో దాగి ఉన్న కవితా ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేశాడు.
ఆయనే సంపూరణ్ సింగ్ కల్రా— ప్రపంచం ఇప్పుడు భక్తితో, ప్రేమతో గుల్జార్ అని పిలుచుకునే మహాకవి.

భారతీయ సంస్కృతి, సంప్రదాయం, పురాణాలు, జానపద భావజాలం నుంచి తన పదాలకు జీవం పోశాడు గుల్జార్. ఆ పదాలకు లతా మంగేష్కర్ తన మాయాజాలమైన స్వరాన్ని అద్దారు. ఆ స్వరం, ఆ పదాలు, తెరపై నూతన్ స్వచ్ఛమైన సౌందర్యంతో కలిసినప్పుడు— ఓ అజరామరమైన దృశ్యకావ్యం ఆవిష్కృతమైంది.

కవిత్వంలో అసమాన ప్రతిభ కలిగిన గుల్జార్‌కు అసలు సినీ గేయ రచయిత కావాలనే కోరికే లేదు. ముంబైలోని వర్లీలో ఆయన ఓ కారు మెకానిక్‌గా పనిచేసేవారు. కానీ ఆయన మనసు మాత్రం ఎప్పుడూ అక్షరాల చుట్టూనే తిరుగుతుండేది. అదే సమయంలో సినీ రంగంలో సహాయ దర్శకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

అలాంటి సమయంలోనే దర్శకుడు బిమల్ రాయ్ నుంచి ఆయనకు Bandini చిత్రానికి పాటలు రాయమంటూ పిలుపు వచ్చింది.
ఆ తర్వాత జరిగినది చరిత్ర.
ఈ రోజు గుల్జార్‌కు 92 వ పుట్టినరోజు.

సంవత్సరాలు గడిచేకొద్దీ బాలీవుడ్ ఎన్నో అసాధారణ గేయ రచయితలను చూసింది— కైఫీ ఆజ్మీ, షకీల్ బదాయూనీ, సాహిర్ లుధియాన్వీ, మజ్రూహ్ సుల్తాన్‌పురి, శైలేంద్ర, ఖయ్యామ్, జావేద్ అఖ్తర్, ఆనంద్ బక్షీ… ఇలా ఎన్నో కలాలు భారతీయ సినిమా సంగీతానికి చిరస్మరణీయమైన పదాలను అందించాయి.
అయితే వీరందరి మధ్య గుల్జార్‌ది ఒక ప్రత్యేకమైన స్వరం.

ఉర్దూ భాషపై ఆయనకున్న అపారమైన పట్టు, హిందీలోని వివిధ మాండలికాలపై ఉన్న అవగాహన, అవసరమైన చోట జానపద పదాలను అల్లగల నేర్పు, అదే సమయంలో వాణిజ్య సినిమా అవసరాలకు అనుగుణంగా తన కవిత్వాన్ని మలచగల సృజనాత్మకత—ఇవన్నీ కలిసి గుల్జార్‌ను ప్రత్యేకంగా నిలబెట్టాయి.
ఆయన కలం నుంచి జాలువారిన కొన్ని మరపురాని గీతాలు:

“నామ్ గుమ్ జాయేగా…
చెహ్రా యే బదల్ జాయేగా…
మేరీ ఆవాజ్ హీఁ పహచాన్ హైఁ…”

(పేరు చెరిగిపోవచ్చు… ముఖం మారిపోవచ్చు… కానీ నా స్వరమే నా గుర్తింపుగా మిగిలిపోతుంది)

“మైనే తేరే లియే హీఁ సాత్ రంగ్ కే సప్నే చునే…” (నీ కోసమే నేను ఇంద్రధనుస్సులోని ఏడు రంగుల కలలను ఏరుకున్నాను…)

“ఛయ్యా ఛయ్యా… ఛయ్యా…”
“కజ్రా రే… కజ్రా రే…”
“జయ్ హో…”
ఆ గీతానికి గాను గుల్జార్ ప్రపంచ సినీ చరిత్రలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్ అవార్డును అందుకున్నారు. (గుల్జార్ కి 2023 లో జ్ఞానపీఠ్ అవార్డు కూడా వచ్చింది)

ఒకప్పుడు వర్లీలో కారు ఇంజిన్ల మధ్య తన జీవితం గడిపిన ఆ యువకుడు…
ఒక దర్శకుడి పిలుపుతో సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఆ యువ కవి…
ఒక పాట రాయడానికి పిలిపించబడిన ఆ సంపూరణ్ సింగ్ కల్రా…
కాలం గడిచేకొద్దీ భారతీయ సినీ కవిత్వానికి ఒక చిరునామాగా మారిపోయాడు.
ఆ చిరునామా— గుల్జార్.

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఓ ప్రియురాలి వేదన – ఈ ఒక్క పాటతో గుల్జార్ వెనక్కి చూసుకోలేదు ఇక !!
  • తడి తడిమే ఓ ఆర్ద్రగీతం- కర్కశ హృదయుల కళ్లూ చెమర్చాల్సిందే
  • మంత్రి క్షమాపణ ! ఇది స్వీయ అభిశంసన !! అయ్యో, పొంగులేటి !!
  • ధ్రువ… ఆ రీల్ అపరిచితుడి కొడుకేనా ఈ రియల్ అపరిచితుడు..?!
  • ఛిన్న మస్తాదేవి ! ఓ స్టేజ్ షో ప్రదర్శనపై రచ్చ ! అసలేం జరిగిందంటే !!
  • ఫాఫం తెలంగాణ బీజేపీ ! హైకమాండ్ గాలికి వదిలేసినట్టుగా ఉంది !!
  • ఏసేశాడు, రేవంత్ రెడ్డి మళ్లీ ఏసేశాడు..! సెటైర్ భలే పేలింది !!
  • సంస్కార దారిద్య్రం !! మీ దుంపతెగ- ఇదేం భాషరా బాబూ..!!
  • నా లైఫ్ నేను మాత్రమే మార్చుకోవాలి… ఇంకెవరో ఆ పని చేయరు…
  • మహేశ్ బాబూ – ఇక ఈ యాడ్స్ జోలికి వెళ్లకు – అవి శిక్షార్హమే !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions