.
ఒక్క ఫోన్ కాల్ కోసం ఎదురుచూస్తున్న అన్నయ్య… బ్రహ్మానందం ఫోన్ కాల్ కోసం, పలకరింపు కోసం తన సొంత అన్నయ్య ఆవేదనను సోషల్ మీడియా, మీడియా సరిగ్గా అర్థం చేసుకోకుండా… హవ్వ, బ్రహ్మానందం ఇంత కఠినుడా అని తేల్చేయడం అబ్సర్డ్…
బ్రహ్మానందం పేరు చెబితే మనకు నవ్వు గుర్తొస్తుంది.
ఆయన ముఖం కనిపిస్తే ఏ డైలాగ్ లేకపోయినా నవ్వొస్తుంది.
దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకుల జీవితంలో ఒక భాగమైపోయిన హాస్య బ్రహ్మ ఆయన. బ్రాహ్మి అంటే తెలుగు సినిమా నవ్వు… తెలుగు మొహాలపై నవ్వు… ఆ రేంజ్ ఇంకెవరూ సాధించలేరు…
Ads
వెయ్యికి పైగా సినిమాలు. గిన్నిస్ రికార్డు. కోట్లాది అభిమానులు. తెర మీద ఆయన కోసం ఎదురుచూసే ప్రేక్షకులు. సోషల్ మీడియాలో ఇప్పటికీ ఆయన పాత సన్నివేశాలే మీమ్స్‌గా మారి నవ్విస్తుంటాయి.
కానీ… ఆ నవ్వులన్నిటికీ అవతల ఒక ఇంట్లో మాత్రం ఒక వృద్ధుడు మరో రకమైన ఎదురుచూపుతో ఉన్నాడు.
“రేయ్ అన్నయ్యా… ఎలా ఉన్నావు?” అనే ఓ పిలుపు కోసం, పలకరింపు కోసం… అంతే.
డబ్బు వద్దు.
సహాయం వద్దు.
తన ఇంటికి వచ్చి పెద్ద హంగామా చేయాల్సిన అవసరం లేదు.
ఒక్కసారి ఫోన్ చేసి పలకరిస్తే చాలు అంటున్నాడు బ్రహ్మానందం అన్నయ్య శ్రీనివాసరావు. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలోని అసలు విషయం.
కానీ ఆ వీడియోను సగం విని, “బ్రహ్మానందం తన అన్నను పట్టించుకోవడం లేదు” అని తీర్పు చెప్పేయడం చాలా సులభం. పూర్తి ఇంటర్వ్యూ చూస్తే మాత్రం కథ అంత సులభంగా కనిపించదు.
శ్రీనివాసరావు స్వయంగా చెబుతున్న మాటల్లోనే అందుకు సమాధానం ఉంది.
తనకు ఇల్లు కట్టించింది బ్రహ్మానందమే.
తన ముగ్గురు కూతుళ్ల పెళ్లిళ్లు చేసింది కూడా బ్రహ్మానందమే.
కుటుంబంలో ఎవరికి ఇబ్బంది వచ్చినా తన తమ్ముడు ఆదుకునేవాడని కూడా ఆయనే చెబుతున్నారు.
అంతేకాదు… పేదవాడా, ఉన్నవాడా అనే తేడా బ్రహ్మానందంలో కనిపించదని కూడా అంటున్నారు. అయితే మరి ఈ ఆవేదన ఎందుకు? అది డబ్బు కోసం కాదు. అది పాత బంధాన్ని గుర్తు చేసుకోవాలనే వృద్ధాప్యపు కోరిక.
ఆరుగురు అన్నదమ్ములు.
ఇప్పుడు ఆ కుటుంబంలో మిగిలింది ఇద్దరే.
నలుగురు వెళ్లిపోయారు.
ఒక వైపు దేశవ్యాప్తంగా కోట్లమంది గుర్తుపట్టే బ్రహ్మానందం. మరోవైపు తన ఊరిలో సాధారణ జీవితం గడుపుతున్న అన్నయ్య శ్రీనివాసరావు.
జీవితం ఇద్దరినీ ఎంత దూరం తీసుకెళ్లిందో ఈ ఒక్క విషయం చెబుతుంది. ఒకరు తెర మీదకు వెళ్తే జనం చుట్టుముడతారు. మరొకరు దేవుడి గుడిలో పూజలు చేస్తూ, తనకు ఉన్నంతలో హాయిగా జీవిస్తున్నారు.
అన్నకు తమ్ముడి మీద కోపం లేదు. తమ్ముడి మీద అసూయ లేదు.
“వాడు గొప్ప స్థాయిలో ఉన్నాడు… ఏమనుకుంటాడో” అనే ఒక సంకోచం మాత్రమే ఉంది. స్థాయిభేదం పెంచిన దూరం కూడా ఉంది. అందుకే తానే హైదరాబాద్ వెళ్లి తమ్ముడిని కలవలేకపోతున్నాడు.
“నాకు అంతమంది జనంలో ఎలా వెళ్లాలో తెలియదు” అంటున్నాడు. అతని మాటల్లో ఎంత అమాయకత్వం ఉందో అక్కడే తెలుస్తుంది.
ఇక్కడే ఈ కథలో అసలు విషాదం ఉంది. బ్రహ్మానందం తన అన్నను ఆదుకోలేదని చెప్పడానికి ఈ ఇంటర్వ్యూ ఏ మాత్రం ఆధారం ఇవ్వడం లేదు. అదే అన్నయ్య చెబుతున్నాడు కదా…
“ఇల్లు కట్టించింది వాడే… నా ముగ్గురు కూతుళ్ల పెళ్లిళ్లు చేసింది వాడే…” అంటే తమ్ముడి బాధ్యతను బ్రహ్మానందం తనకు చేతనైనంత మేర నిర్వర్తించాడు.
కానీ మనిషి జీవితంలో కొన్ని బంధాలకు డబ్బుతో సంబంధమే ఉండదు.
తమ్ముడు ఒక ఇల్లు కట్టించగలడు.
కూతుళ్ల పెళ్లిళ్లు చేయగలడు.
కుటుంబాన్ని ఆదుకోగలడు.
కానీ వృద్ధాప్యంలో అన్నకు కావాల్సింది మాత్రం ఒక్క చిన్న మాట కావచ్చు.
“అన్నయ్యా… ఎలా ఉన్నావు?”
అది ఎన్ని లక్షల రూపాయలతోనూ కొనలేం.
ఇంకో వైపు బ్రహ్మానందాన్ని కూడా తప్పుపట్టడం అంతే అన్యాయం.
సినిమా జీవితం ఎంత దూరం తీసుకెళ్తుందో మనకు తెలుసు. షూటింగులు, ప్రయాణాలు, కుటుంబం, ఆరోగ్యం, తనదైన ప్రపంచం… ముఖ్యంగా ఒక వ్యక్తి జీవితంలోకి లక్షలాది అభిమానులు వచ్చిన తర్వాత, అతని వ్యక్తిగత సంబంధాల చుట్టూ కూడా ఒక గోడ ఏర్పడుతుంది.
అది ఎప్పుడూ కోపంతో కట్టిన గోడ కాదు. కొన్నిసార్లు పరిస్థితులే కడతాయి. ఇక్కడ బ్రహ్మానందానికి అన్న మీద కోపం ఉందని శ్రీనివాసరావు ఎక్కడా చెప్పడం లేదు. తమ్ముడు తనను ద్వేషిస్తున్నాడని కూడా చెప్పడం లేదు.
తన బాధ ఒక్కటే… “పలకరిస్తే చాలు.” అంతే.
నిజానికి ఇది బ్రహ్మానందం అన్నయ్య కథ మాత్రమే కాదు. చాలా ఇళ్లలో కనిపించని ఒక కథ. చిన్నప్పుడు ఒకే ఇంట్లో పెరిగిన అన్నదమ్ములు పెద్దయ్యాక ఎవరి జీవితాల్లో వాళ్లు వెళ్లిపోతారు.
ఒకరు ఒక నగరంలో. మరొకరు మరో ఊరిలో.
మధ్యలో సంవత్సరాలు గడిచిపోతాయి. ఎవరూ ఎవరినీ ద్వేషించరు.
కానీ ఫోన్ మాత్రం రాదు. కలుసుకోవడం మాత్రం జరగదు.
“వాడికి పని ఉంటుంది.”
“వాళ్లకు ఇబ్బంది కలిగించకూడదు.”
“మనమే ఎందుకు ఫోన్ చేయాలి?”
“ఏం మాట్లాడాలి?”
అంటూ రోజులు… నెలలు… సంవత్సరాలవుతాయి.
చివరికి ఒక రోజు ఎవరో ఒకరు అడుగుతారు…
“ఒక్కసారి ఫోన్ చేసి మాట్లాడితే ఏమవుతుంది?”
అది ఫిర్యాదు కాదు.
అది వృద్ధాప్యంలో అనుబంధాల పలకరింపుల కోసం మనసు పడే తన్లాట…
బ్రహ్మానందం జీవితంలో లక్షలాది మంది నవ్వులు ఉన్నాయి. కానీ ఆ నవ్వుల మధ్య, తన అన్నయ్యకు కావాల్సింది మాత్రం ఒక చిన్న పలకరింపు. అది కూడా దొరకడం లేదని ఆయన అన్నయ్య చెప్పిన మాట ఇప్పుడు వైరల్ అయింది. ఈ కథలో ఎవరు తప్పు, ఎవరు ఒప్పు అని తీర్పు చెప్పాల్సిన అవసరం లేదు.
తమ్ముడు తన బాధ్యత చేశాడు.
అన్న తన ఆవేదన చెప్పుకున్నాడు.
ఇద్దరి మధ్య కోపం కంటే కాలం పెద్దదై ఉండొచ్చు.
ఇప్పుడు ఆరుగురు అన్నదమ్ముల్లో ఇద్దరే మిగిలారు. అందుకే శ్రీనివాసరావు మాటల్లోని చివరి వాక్యం బహుశా ఈ కథ మొత్తానికీ సారాంశం:
“ఎప్పుడు ఏమవుతుందో ఎవరికీ తెలియదు…” అవును. అందుకే కొన్ని ఫోన్ కాల్స్ రేపటికి వాయిదా వేయకపోవడమే మంచిది.
ఎందుకంటే కొన్ని బంధాల్లో చెప్పాల్సిన మాట చాలా చిన్నదే… “అన్నయ్యా… ఎలా ఉన్నావు?”
Share this Article