.
కొన్ని ప్రేమలకు లాజిక్కులు, లెక్కలు ఉండవు – ప్యూర్ ఎమోషన్ మాత్రమే… అది ఏ సమీకరణాలకూ అందనంత సంక్లిష్టం, సముద్రంకన్నా లోతు… ఈ కథ అదే… చదవగానే నమ్మబుద్ది కాదు, కానీ నిజం…‘ఐ వాంట్ టు గో హోమ్’… ఆ ఒక్క మెసేజ్ కోసం 15 ఏళ్లుగా సముద్రంలోకి దిగుతున్న భర్త
2011 మార్చి 11… జపాన్‌లోని Onagawa పట్టణంలో ఉదయం మామూలుగానే మొదలైంది. Yasuo Takamatsu తన భార్య Yukoను ఆమె పనిచేసే బ్యాంకు దగ్గర దింపాడు. ఆ తర్వాత అత్తను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు మరో పట్టణానికి బయలుదేరాడు.
Ads
అతనికి తెలియదు… అది తన భార్యను చివరిసారిగా చూసిన రోజు అని. మధ్యాహ్నం 2.46 గంటలకు భూమి కంపించింది. 9.0 తీవ్రతతో వచ్చిన భూకంపం తర్వాత పసిఫిక్ సముద్రం నుంచి సునామీ దూసుకొచ్చింది. తీరప్రాంత పట్టణాలు నీటిలో మునిగిపోయాయి. దాదాపు 20 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది గల్లంతయ్యారు.
Onagawaలోని 77 Bank భవనం వద్ద Yuko కూడా చిక్కుకుపోయింది. సునామీ హెచ్చరిక రావడంతో బ్యాంకు సిబ్బంది భవనం పైకప్పుపైకి వెళ్లారు. కానీ ఊహించిన దానికంటే ఎత్తుగా వచ్చిన అల ఆ భవనాన్నే మింగేసింది. అక్కడున్న 13 మంది ఉద్యోగుల్లో 12 మందిని సముద్రం తనతో తీసుకెళ్లింది. వారిలో Yuko కూడా ఉంది.
ఆ సమయంలో Yasuoకు ఆమె నుంచి ఒక మెసేజ్ వచ్చింది. “Are you okay? I want to go home.” ‘నువ్వు బాగున్నావా? నేను ఇంటికి రావాలనుకుంటున్నాను…’ అది ఆమె పంపిన చివరి మాట. అంతే.
ఆ తర్వాత ఆమె ఫోన్ పనిచేయలేదు. Yasuo పిచ్చివాడిలా వెతకడం మొదలుపెట్టాడు.
రోడ్లపై…
చెత్తాచెదారం మధ్య…
కొండల్లో…
శిబిరాల్లో…
ఆసుపత్రుల్లో…
చివరికి మృతదేహాలున్న మార్చురీల్లో కూడా.
ఎక్కడైనా Yuko కనిపిస్తుందేమో అని.
ఒక నెల తర్వాత ఆమె ఫోన్ దొరికింది. అందులో మరో మెసేజ్ కూడా ఉంది.
“This tsunami is crazy.”
ఆ మెసేజ్ మాత్రం Yasuoకు చేరలేదు. ఆమె బతికి ఉండగా పంపింది. కానీ అతని ఫోన్‌కు చేరేలోపే ఆమె అదృశ్యమైపోయింది. రెండేళ్లు గడిచిపోయాయి. Yuko జాడ మాత్రం దొరకలేదు. అందరూ ఒకటే చెప్పారు.
“ఆమె చనిపోయి ఉంటుంది. సముద్రం ఆమెను ఎక్కడికో తీసుకెళ్లి ఉంటుంది. ఇక మర్చిపో.”
కానీ Yasuo మర్చిపోలేకపోయాడు. అంతకంటే ముఖ్యంగా… ఆమెను ఇంటికి తీసుకురావాలన్న తన బాధ్యతను మర్చిపోలేదు. ఆ ఎమోషన్ సునామీకన్నా క్రేజీ. అప్పుడు అతనికి ఒక ఆలోచన వచ్చింది. భూమిమీద వెతికాను. ఇక సముద్రంలో వెతకాలి.

కానీ Yasuoకు ఈత వచ్చేది కాదు. డైవింగ్ అసలే తెలియదు. అందుకే 2013లో డైవింగ్ నేర్చుకోవడం మొదలుపెట్టాడు. Masayoshi Takahashi అనే వాలంటీర్ డైవర్ అతనికి సహాయం చేశాడు. సునామీ తర్వాత సముద్రంలోకి కొట్టుకుపోయిన వస్తువులు, బాధితుల ఆనవాళ్ల కోసం డైవింగ్ చేసే బృందంలో ఆయన ఉన్నారు. Yasuo కూడా ఆ బృందంతో కలిసి సముద్రంలోకి దిగడం ప్రారంభించాడు.
అప్పటి నుంచి…
సముద్రం అతనికి ఒక శ్మశానం కాదు.
అది Yukoను కలిసే చోటు.
ఒకసారి కాదు.
పది సార్లు కాదు.
వంద సార్లు కాదు.
వందల సార్లు.
2024 నాటికి అతను 600కు పైగా, తర్వాత 650కు పైగా సార్లు సముద్రంలోకి దిగాడు. 2026 మార్చిలో కూడా 69 ఏళ్ల Yasuo ప్రతి రెండు వారాలకు ఒకసారి సముద్రంలోకి వెళ్తున్నానని చెప్పాడు. ఇక 2026 జూలైలో BBC World Service అతని కథపై “Diving for Yuko” అనే ప్రత్యేక కార్యక్రమం ప్రసారం చేసింది. అందులో అతని 763వ డైవ్ను రికార్డు చేసింది.
ఒక్కసారి ఊహించండి.
15 ఏళ్లు.
అదే సముద్రం.
అదే చీకటి.
అదే వెతుకులాట.
సముద్రం అడుగున 25 మీటర్లకు పైగా దిగుతాడు.
చుట్టూ చీకటి.
టార్చ్ వెలుతురులో కనిపించేది కార్ల శిథిలాలు…
ఇళ్ల ముక్కలు…
చేపల వలలు…
సునామీ మిగిల్చిన శిథిలాలు.
ప్రతి కారు కిందా…
ప్రతి గోడ ముక్క కిందా…
ఒక్కసారి అతనికి ఒకటే అనిపిస్తుంది.
“Yuko ఇక్కడ ఉండొచ్చేమో…”
ఆ తర్వాత ఏమీ దొరకదు.
మళ్లీ పైకి వస్తాడు.
మళ్లీ కొన్ని రోజుల తర్వాత సముద్రంలోకి దిగుతాడు.
మళ్లీ అదే వెతుకులాట.
ఇది కేవలం భార్యను వెతకడమే కాదు.
అతనికి ఇప్పుడు అది ఒక రకమైన జీవన విధానంగా మారిపోయింది.
L’Équipeతో మాట్లాడినప్పుడు Yasuo ఒక మాట చెప్పాడు:
“నేను ఎందుకు చేస్తున్నానో నాకు తెలుసు. నా భార్య జ్ఞాపకాల కోసం.”
మరోసారి సముద్రంలోకి దిగినప్పుడు అతనికి బాధ కూడా ఉంటుంది.
Yuko ఆ రోజు ఎంత భయపడి ఉంటుందో ఊహించుకుంటాడు.
ఆమెకు ఏం జరిగి ఉంటుందో ఆలోచిస్తాడు.
అది అతని గుండెను ఇప్పటికీ పిండేస్తుంది.
అయినా… “ఆమె ఇక్కడే ఉందని అనుకుంటాను. సముద్రంలోకి దిగినప్పుడు ఆమెకు దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది” అంటాడు.
ఇది విన్నప్పుడు ఒక ప్రశ్న రావచ్చు.
Yuko నిజంగానే సముద్రంలో ఉందా?
ఎవరికి తెలుసు?
ఆమె శరీరం ఎప్పుడైనా దొరుకుతుందా?
బహుశా దొరకకపోవచ్చు.
15 ఏళ్ల తర్వాత కూడా దొరకకపోవచ్చు.
కానీ Yasuoకు ఈ అన్వేషణలో మరో అర్థం ఉంది.
అతను ఇప్పుడు కేవలం Yuko శరీరం కోసం వెతకడం లేదు.
ఆమె చివరి కోరికను నెరవేర్చడానికి వెతుకుతున్నాడు. “నేను ఇంటికి రావాలనుకుంటున్నాను” అని ఆమె పంపిన ఆ ఒక్క మాటను అతను మరచిపోలేదు. ఆమె ఇంటికి రాలేకపోయింది. కాబట్టి…
ఆమెను ఇంటికి తీసుకెళ్లే ప్రయత్నాన్ని మాత్రం అతను ఆపలేదు.
2011లో ఒక సునామీ వేల కుటుంబాలను విడదీసింది.
15 ఏళ్ల తర్వాత కూడా ఆ సునామీ ముగియని ఒక కథ ఉంది.
ప్రతి రెండు వారాలకు ఒకసారి ఒక వృద్ధుడు సముద్రంలోకి దిగుతున్నాడు.
చేతిలో టార్చ్.
మనసులో ఒక జ్ఞాపకం.
ఒక చివరి మెసేజ్.
ఒకే ఒక ఆశ.
“Yuko… ఎక్కడున్నావో తెలియదు. కానీ నేను ఇంకా నిన్ను వెతుకుతూనే ఉన్నాను.”
బహుశా ఇది ప్రపంచంలోనే సుదీర్ఘమైన వ్యక్తిగత వెతుకులాటల్లో ఒకటి కావచ్చు…
Share this Article