.
నిజానికి రెండున్నరేళ్లపాటు కాంగ్రెస్ నేతలు ఉగ్గబట్టుకుని సైలెంటుగా ఉండటమే పెద్ద విశేషం… ఇప్పుడిప్పుడే వాళ్ల ‘రియల్ కల్చర్’ను బయటపెట్టుకుని, ఇక తన్నుకుంటున్నారు, బజారున పడుతున్నారు… హరాకిరీ బ్యాచ్ కదా, కిరికిరి మొదలు పెట్టేశారు… బయటపడిపోతున్నారు…
అవును, తెలంగాణ కాంగ్రెస్‌లోని ఈ పరిణామాలు రాజకీయ విశ్లేషకులకు పెద్ద ఆశ్చర్యం ఏమీ కలిగించడం లేదు కానీ… ఈసారైనా కాస్త జాగ్రత్తగా ఉంటారని ఆశపడిన సగటు కాంగ్రెస్ కార్యకర్త, వోటేసిన వోటరు నమ్మకం మాత్రం గాలికి ఎగిరిపోతోంది…
Ads
నిజానికి ఏ రాష్ట్ర కాంగ్రెస్ అయినా అలాగే ఉంటుంది… కానీ దీంతో జరిగే నష్టం ఏమిటో తెలిసీ, పాత అనుభవాలు ఉండీ, హైకమాండ్ ‘కట్టుదిట్టాలు’ ఆలోచించక, కళ్లు తెరవక, నియంత్రించే అడుగులు వేయక… చోద్యం చూస్తున్న తీరు కూడా సాధారణమే అనుకోవాలా…
ఇదేమీ కుటుంబ పార్టీ కాదు, ఇదేమీ ఏకవ్యక్తి పార్టీ కాదు, ఇదేమీ నియంతృత్వంతో నడిచే పార్టీ కాదు… ఎక్కువ డెమొక్రసీతో అజీర్ణంతో బాధపడే పార్టీ కాంగ్రెస్… బయటపడుతున్నవి ఆ లక్షణాలే… కాకపోతే కొందరిని పార్టీ ఎందుకు ఇంకా ఉపేక్షిస్తోంది అనేదే అసలు ప్రశ్న…

ఉదాహరణకు కొండా సురేఖ… ఫస్ట్ నుంచీ అడిదరిమి వ్యవహారమే… ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎవరితోనూ పడటం లేదు, తోటి మంత్రులతోనూ పొసగదు, పొంగులేటితో మరీనూ… చివరకు సీఎం మీటింగులకూ డుమ్మా… ఏం చేసుకుంటారో చేసుకొండి అనే ధోరణి… ఇప్పుడిక బిడ్డతో ఇష్టారాజ్యం మాటలు అనిపించడం… (సుస్మిత ఇదే మొదటిసారి కాదు, గతంలోనూ సీఎం మీద కామెంట్లు చేసింది…)
మరి ఇప్పటిదాకా పార్టీ ఎందుకు ఉపేక్షించినట్టు..? ఎవరున్నారు ఆమె వెనుక..? అసలు రేవంత్ రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిని చేసిందే వాళ్లట… మురళికి ఎమ్మెల్సీ కావాలట, సురేఖ మంత్రిగా ఉండనే ఉంది, సుస్మితకు పరకాల టికెట్ కావాలట… హేమిటో ఇదంతా… పీసీసీ అధ్యక్షుడు ఇచ్చే క్రమశిక్షణ షోకాజులతో ఒరిగేదేమీ ఉండదు… అవన్నీ తూతూమంత్రాలు, ఆ మంత్రాలకు చింతకాయలు రాలవు…

ఒకాయనకు అర్జెంటుగా మంత్రి పదవి కావాలి, లొల్లి షురూ చేస్తాడు, గాయిగత్తర లేపి, రుమాలు చుట్టి విప్లవం లేవదీస్తా అంటాడు… నో యాక్షన్… వనపర్తిలో చిన్నారెడ్డి, మేఘారెడ్డిలది ఆధిపత్య వైరం… తుంగతుర్తిలోనూ అంతే… జడ్చర్ల, పాలకుర్తి, గజ్వెల్, ఉట్నూరు పంచాయితీల తలనొప్పులు ఉండనే ఉన్నాయి…
ఇక ఎన్నికలు సమీపించేకొద్దీ పంచాయితీలు మరింత ఎక్కువ అవుతాయి… ఇప్పుడే సీఎంకు కొంత స్వేచ్ఛ ఇవ్వడానికి బదులు హైకమాండే బంధనాలు వేస్తోంది… కాళ్లలో కట్టెలు పెడుతోంది… అది పార్టీ నాయకులందరికీ అలుసు అయిపోయింది… అది అసలు సమస్య…
సీఎం ఏదైనా ప్రాంతానికి టూర్ వెళ్లినప్పుడు… అక్కడి నాయకులు, కార్యకర్తల్లో జోష్ నింపడానికి ఫలానా అతనికే టికెట్, కష్టపడి పనిచేయండి అని చెప్పడం రివాజే, వాజీబే… ఒక జగ్గారెడ్డి గురించి కావచ్చు, ఒక రేవూరి ప్రకాష్ రెడ్డి గురించీ కావచ్చు… సరే, ఎన్నికల నాటికి ఎవరికి టికెట్లు వస్తాయనేది చాలా ఈక్వేషన్ల నడుమ తేలే యవ్వారం…
అసలు పార్టీలో సుస్మిత ఎవరు..? నేనే పోటీచేస్తా, లేదంటే ఇండిపెండెంట్‌ను, నీ తాత వచ్చినా సరే, 20 ఏళ్లు నేనే ఎమ్మెల్యే అని చెబుతోంది… మీడియాకు పండుగ… నవ్వే బీఆర్ఎస్ ముందు కూడా మరింత నగుబాటు వ్యవహారం ఇదంతా… ఏదైనా జరగనీ, ఇలాగే జరగనీ, మురళి పీసీసీ అధ్యక్షుడు, సుస్మిత మంత్రి, సురేఖ ముఖ్యమంత్రి అయిపోనీ అని ఓ మిత్రుడి వైరాగ్యపు చెణుకు… కేసీయార్ పాలన నిర్వాకాలతో విసిగి, కాంగ్రెస్‌కు వోటేసిన వాళ్లందరికీ ఇదే విసుగు…
రాజకీయాల్లో హత్యలుండవు… ఆత్మహత్యలే… తెలంగాణ కాంగ్రెస్ పర్‌ఫెక్ట్ ఉదాహరణ కాబోతుందా..? ఏమో, రాహుల్ గాంధీ ఆలోచించుకోవాలి..!!
Share this Article