.
తెలంగాణ కాంగ్రెస్‌లో కొండా సురేఖ, సుస్మితల వ్యవహారం పైకి చూస్తే ఒక మంత్రి కుటుంబానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మధ్య తలెత్తిన రాజకీయ వివాదంలా కనిపించవచ్చు. కానీ, లోతుగా పరిశీలిస్తే ఇది అంతకంటే పెద్ద పరిణామానికి సంకేతం. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ, శాఖల మార్పులు, సామాజిక సమీకరణాలు, పార్టీ క్రమశిక్షణ, అలాగే భవిష్యత్తు ఎన్నికల కోసం కొత్త రాజకీయ జట్టు నిర్మాణం ఇవన్నీ ఒకేసారి తెరపైకి వచ్చే పరిస్థితి ఏర్పడింది.
కొండా సుస్మిత వ్యాఖ్యలు, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల తర్వాత మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై కాంగ్రెస్ నాయకత్వం మరింత వేగంగా ఆలోచిస్తున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగియగానే టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సీనియర్ నేతల మధ్య చర్చలు జరిగే అవకాశం ఉంది. ఈ వివాదాన్ని కేవలం “కొండా సురేఖను తొలగిస్తారా? కొనసాగిస్తారా?” అనే ప్రశ్నకే పరిమితం చేయలేం; తెలంగాణ కాంగ్రెస్‌లో జరుగుతున్న రాజకీయ మార్పును పూర్తిగా అర్థం చేసుకోవాలి.
Ads
సుస్మిత చేసిన వ్యాఖ్యల తర్వాత దాదాపు 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బహిరంగంగా సురేఖపై చర్యకు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలో ఉన్న సమయంలోనే ఎమ్మెల్యేలు సీఎల్పీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించడం ఈ వివాదం తీవ్రతను తెలియజేస్తోంది. అంటే ఇది వ్యక్తిగత విమర్శకు ప్రతిస్పందన మాత్రమే కాదు; ముఖ్యమంత్రి అధికారాన్ని, పార్టీ నిర్ణయాలను బహిరంగంగా సవాలు చేసే రాజకీయ సంస్కృతిని ఎంతవరకు అనుమతించాలి? అన్నది ఇప్పుడు కాంగ్రెస్ ముందున్న అసలు ప్రశ్న.

పరకాల నుంచి ఎవరు పోటీ చేయాలో వ్యక్తులు ముందుగానే ప్రకటించుకోవడం సాధ్యం కాదని, అభ్యర్థుల ఎంపిక పార్టీ నిర్ణయమని పీసీసీ నాయకత్వం స్పష్టం చేసింది. అసమ్మతిని అణచడం కాదు, వ్యవస్థను క్రమబద్ధీకరించడం సీఎం ముందున్న ఛాలెంజ్. కాంగ్రెస్ అంటే సహజంగానే అనేక అధికార కేంద్రాలు, సీనియర్ నేతలు, సామాజిక సమీకరణాలు, వ్యక్తిగత రాజకీయ ఆశయాలు కలిసిన పార్టీ.
ప్రతి అసమ్మతినీ అణచివేస్తే అది కాంగ్రెస్ స్వభావానికే విరుద్ధం. అదే సమయంలో ప్రతి నాయకుడూ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని బహిరంగంగా సవాలు చేస్తుంటే పాలనపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అందుకే తాజా పరిణామాన్ని వ్యక్తులపై ప్రతీకార చర్యగా కాకుండా ప్రభుత్వ, పార్టీ వ్యవస్థను క్రమబద్ధీకరించే అవకాశంగా రేవంత్ ఉపయోగించుకోవలసి ఉన్నది.

సురేఖ తన కుమార్తె వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగత అభిప్రాయాలని, వాటికి తనను బాధ్యురాలిని చేయడం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని క్రమశిక్షణ కమిటీకి వివరణ ఇచ్చారు. అందువల్ల పార్టీ తీసుకునే నిర్ణయం కూడా భావోద్వేగంతో కాకుండా రాజకీయంగా సమతుల్యంగా ఉండవచ్చు. ప్రస్తుతం మంత్రివర్గంలో రెండు స్థానాలు ఖాళీగా ఉన్న నేపథ్యంలో పునర్వ్యవస్థీకరణను కేవలం ఇద్దరిని చేర్చుకోవడానికి పరిమితం చేయకుండా పనితీరు ఆధారిత ప్రక్షాళనగా మార్చే అవకాశం రేవంత్ ముందు ఉంది.
కొంతకాలంగా కేబినెట్ మార్పులపై ఊహాగానాలు కొనసాగుతున్నాయి. కొందరు సీనియర్ మంత్రులకు ఏఐసీసీ స్థాయిలో సంస్థాగత బాధ్యతలు ఇచ్చే ప్రతిపాదనలు ఉన్నట్లు ఆగస్టు మొదట్లోనే కథనాలు వచ్చాయి. అంటే తాజా సురేఖ వివాదం కేబినెట్ మార్పులకు కారణం కాకపోవచ్చు, కానీ ఇప్పటికే సిద్ధమవుతున్న మార్పులకు ఒక ట్రిగ్గర్‌గా మారవచ్చు.

సురేఖ విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా దానికి సామాజిక కోణం ఉంటుంది. ఆమెను తప్పిస్తే మహిళా ప్రాతినిధ్యం, బీసీ ప్రాతినిధ్యం రెండింటినీ పరిగణనలోకి తీసుకోవాల్సి వస్తుంది. రాగమయి వంటి మహిళా ఎమ్మెల్యేల పేర్లతో పాటు మున్నూరు కాపు వర్గానికి చెందిన ఆది శ్రీనివాస్ పేరు కూడా చర్చలో ఉన్నది. యశస్విని రెడ్డి, పర్ణికా రెడ్డి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ప్రాంతం, కులం, లింగం, సీనియారిటీ, పనితీరు, పార్టీ విధేయత అనే ఆరు అంశాల మధ్య సమతుల్యత సాధించవలసి ఉంది.
ఎన్నికలు ఇంకా దూరంలో ఉన్నాయని భావించి చివరి ఏడాదిలో కేబినెట్ మార్చడం కంటే, ఇప్పుడే మార్పులు చేస్తే కొత్త మంత్రులకు పనితీరు నిరూపించుకునేందుకు సమయం ఉంటుంది. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి, జిల్లాల్లో రాజకీయ నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి అవకాశం ఉంటుంది.
యువ ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించి కాంగ్రెస్‌కు కొత్త తరం ముఖచిత్రం ఇవ్వాలనే చర్చ కూడా జూలైలోనే మొదలైంది. అందుకే ఈ పునర్వ్యవస్థీకరణ జరిగితే అది ఎన్నికలకు రెండేళ్ల ముందే జట్టును మైదానంలోకి దింపే వ్యూహం కావచ్చు.

కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి ఒక్కరే కేబినెట్ రాజకీయాలను నిర్ణయించలేరు. సామాజిక సమీకరణాలు, ఏఐసీసీ అవసరాలు, రాష్ట్ర నాయకత్వ అభిప్రాయాలు అన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. తాజా పరిణామాలపై తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ నుంచి అధిష్టానం సమాచారం కోరినట్లు, రేవంత్ ఢిల్లీలో మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ తదితరులతో పునర్వ్యవస్థీకరణపై చర్చించే అవకాశం ఉంది. అందువల్ల తుది నిర్ణయం ఢిల్లీ, హైదరాబాద్ మధ్య రాజకీయ సమన్వయంతోనే వెలువడే అవకాశం ఎక్కువ.
కొండా సుస్మిత వ్యాఖ్యలు కాంగ్రెస్‌కు ఇబ్బందికరమైన పరిణామమే. కానీ రాజకీయ నాయకత్వ సామర్థ్యం సంక్షోభాలు రాకుండా చూడటంలో మాత్రమే ఉండదు; వచ్చిన సంక్షోభాన్ని ఏ దిశగా మలుస్తుందన్నదీ ముఖ్యమే. రేవంత్ రెడ్డి ముందు ఇప్పుడు అదే అవకాశం ఉంది.

సురేఖపై చర్య తీసుకోవడమే లక్ష్యంగా మార్పులు చేస్తే అది ఒకరోజు రాజకీయ వార్తగా ముగిసిపోతుంది. కానీ పనితీరు లేని వారిని మార్చడం, సామాజిక సమతుల్యతను మెరుగుపరచడం, యువతకు అవకాశం ఇవ్వడం, పార్టీ క్రమశిక్షణకు స్పష్టమైన గీత గీయడం, సమర్థమైన జట్టును సిద్ధం చేయడం అనే విస్తృత లక్ష్యంతో ప్రక్షాళన చేయాలి.
అప్పుడు కొండా కుటుంబం రేపిన వివాదం కాంగ్రెస్‌కు సంక్షోభంగా కాకుండా, రేవంత్ రెడ్డి తన ప్రభుత్వంపై పట్టు మరింత బిగించి, రెండో దశ పాలనకు కొత్త రాజకీయ జట్టును నిర్మించుకునేందుకు వచ్చిన అనుకోని అవకాశంగా చరిత్రలో మిగిలిపోవచ్చు…. ఐరెడ్డి శ్రీనివాసరెడ్డి, పొలిటికల్ ఎడిటర్, Indian express
Share this Article