.
నా జీవితంలో నాకెదురై, నా మనసుమీద చెరగని ముద్ర వేసిన నగ్నసత్యాలు: నేను సోషల్ వర్క్ లో డిగ్రీ చేస్తున్న రోజులు. ప్రతీవారం రెండు రోజుల ఫీల్డ్ వర్క్ ఉండేది.
మా కాలేజ్ INDIAN COUNCIL OF SOCIAL WELFARE ఆధ్వర్యంలో నడిచేది. కీ.శే. రోడామిస్త్రీ స్థాపకురాలు.
ఆమె ఒకరోజు మా అందర్నీ హైదరాబాద్ సిటీ కాలేజ్ దగ్గర ఉండే మెహందీకి తీసుకెళ్ళింది. వెళ్ళేముందు
మా లెక్చరర్ అక్కడి కమర్షియల్ సె- వర్కర్లకు హెచ్ఐవీ/ ఎయిడ్స్ గురించి చెప్పాలనీ, కండోమ్‌లు వాడే విధానాన్ని చెప్పి వారికి కండోమ్‌లు ఇవ్వాలని చెప్పారు. కండోమ్ కార్టన్ బాక్సులు ఆటోలో పెట్టారు.
మమ్మల్ని మినీ బస్సులో మెహందీకి తీసుకెళ్ళారు. మా మేడం అక్కడ సందుల గుండా చీకటి చీకటిగా ఉండే ఓ బంగళాలోకి తీసుకెళ్ళింది.
Ads
ఆ వాతావరణం జుగుప్సాకరంగా ఉంది. మా మేడమ్ అక్కడ యాభై ఏళ్ళు దాటిన ఓ స్త్రీతో మా గురించి చెప్తోంది. మా క్లాస్ మేట్ ఆమె సేఠానీ అని మా చెవిలో గొణిగాడు.
నా మనసులో ఓరకమైన విచిత్ర భావన. అదో రకమైన వాసన వస్తున్నట్లుగా అనిపించింది. ఉండలేక శరీరం అక్కడక్కడే కాళ్ళు కదిలిస్తోంది. వచ్చేముందే మేము తలా ఒక కేస్ స్టడీ కూడా చేయాలని మా లెక్చరర్లు మాకు చెప్పారు.
ఇంతలో మాకు మాజా తెచ్చిచ్చారు. మాజా తాగుతుంటే వాంతికొచ్చినట్టనిపించింది. ఆ ఫీలింగ్ ఎప్పటికీ మరువలేను. ఆ ఇల్లు పొడిగానే ఉన్నా తడితడిగా ఉన్నట్టు, ఆ తడి నా ఒంటిని అంటుకుంటున్నట్లు అనిపించింది. అప్పుడు సేఠానీ ఏం మాట్లాడుతుందో, మా మేడమ్ ఏం చెప్తుందో నా చెవులు వినే పరిస్థితి లేదు.
(ప్రతీకాత్మక చిత్రం, గూగుల్ సౌజన్యంతో)
కేస్ స్టడీ ఎలా అనే భయం….ఎలా మాట్లాడాలో అనే ఆందోళన…. కరీంనగర్ విద్యార్థి జీవితంలో ఓడిపోయి, హైదరాబాద్ వెళ్ళిన కాలం. పోరాడాల్సిందే! గమ్యంలేని పోరాటంలో గెలవాల్సిందే! డార్ట్ బోర్డ్ లేకుండానే డార్ట్ లు విసరాల్సిన కాలం! ఇవన్నీ మనసులో గింగిరాలు తిరుగుతున్నాయి.
కొద్దిసేపటికి ఆ ఇంటి వెనుక వైపు దాదాపు ముప్పై, ముప్పై ఐదు మంది కమర్షియల్ సె- వర్కర్లు వచ్చి నిలబడ్డారు. వారిని చూడాలని మాకు ఉత్సాహం కలిగింది.
ఎలా ఉంటారోనని అందర్నీ కలిపి, తర్వాత ఒక్కొక్కర్నీ చూసాను. గమ్మత్తుగా, వింతగా అనిపించింది. అర్థంగాని సందిగ్ధంలో నా మనసు….
మా మేడమ్ హెచ్ఐవీ/ ఎయిడ్స్ గురించి చెప్పడం మొదలుపెట్టారు. మా క్లాస్ మేట్స్ ప్లకార్డులు, కండోమ్‌లు చూపెడుతున్నారు. నేనూ కొన్ని విషయాలు చెప్పాను. వారిలో ఒకరిద్దరు తప్ప అందరూ ధైర్యంగా, నిర్లక్ష్యంగా కనిపించారు. కండోమ్‌లు తీసుకున్నారు. చివరగా మా క్లాస్మేట్లందర్నీ ఇద్దరిద్దరి (ఒక ఆడ, ఒక మగ)గా విడగొట్టారు.
ఆ సందులో ఉన్న ఇళ్ళల్లోకి వెళ్లి కేస్ స్టడీ చేయమన్నారు.
అందరమూ వెళ్ళి పోయాము. నేను, నా తోటి క్లాస్ మేట్ ఒక ఇంటికి వెళ్ళాం.
అక్కడ మేము పరిచయం చేసుకున్నాక, అక్కడి మహిళను అడగడం మొదలు పెట్టాం….
ఏం పేరమ్మా?
ప్రియ అన్నా (అప్పటికే ఆమె పేరు మార్చుకుంది).
ఏ ఊరు?
సిద్దిపేట.
ఎన్ని సంవత్సరాల నుండి నువ్వు ఇక్కడ ఉంటున్నావు?
ఐదు సంవత్సరాలైందన్నా. మధ్యలో రెండేళ్లు పూణా, బొంబాయికి పోయిన.
ఈ వృత్తి ఎంచుకోవడానికి ఏం కారణం ఏంటమ్మా?
నేను ఒకన్ని ప్రేమించిన, పదోతరగతి చదువుతున్న కాలంలో లేచి పోదామా అని అన్నాడు. అమ్మదీ, నాదీ కలిపి మూడు తులాల బంగారం తీసుకుని, బట్టలు సర్దుకొని హైదరాబాద్‌కు అతనితో కలిసి వచ్చిన.
జగద్గిరిగుట్ట తీసుకెళ్లి, అక్కడ పెళ్లి చేసుకున్నాడు. అక్కడే ఒక ఇల్లు కిరాయికి తీసుకొని నెలరోజులు నాతో కాపురం చేశాడు. తర్వాత చార్మినార్ వెళ్దాం గాజులు కొనుక్కోవచ్చు అని చెప్పి తీసుకొచ్చిండు.
ఎవరో ఇద్దరు వ్యక్తులు మధ్యలో కలిశారు. ఇరానీ చాయ్ తాగుతామని చెప్పి ఓ చెట్టు కింద నన్ను నిలబెట్టి వెళ్ళిపోయాడు.
కొద్దిసేపటి తర్వాత ఆ ఇద్దరు వ్యక్తులు నా దగ్గరికి వచ్చి మీ ఆయన మాకు పైసలు బాకీ పడ్డాడు, పైసలు తీసుకువస్తానని చెప్పాడు. అప్పటివరకు నిన్ను మా ఇంటికి తీసుకెళ్ళమని చెప్పాడు అని నన్ను ఈ గల్లీకి తీసుకు వచ్చారు.
నాకిది మెహిందీ అని తర్వాత తెల్సింది.
ఒకరోజు బాగానే అన్నం పెట్టిన్రు. తర్వాత రోజు నుండి ఈ వృత్తిలోకి దిగమని ఒత్తిడి చేయడం మొదలు పెట్టిన్రు.
మా పాత సేఠానీ కొట్టేది.
తర్వాత ఒకరోజు నన్ను తీసుకొచ్చిన ఇద్దరు మానభంగం చేశారు. మూడు, నాలుగు రోజులు అలా చేస్తూనే ఉన్నారు. భోజనం పెట్టడం మానేశారు. కేవలం నీళ్లు… చాయ్. చేతకాకుండా పడిపోయిన. అమ్మానాన్నలు గుర్తుకు వచ్చి ఏడ్చేది. తమ్ముడు గుర్తుకు వచ్చేది. వాళ్ళను మోసం చేసినందుకే ఇట్లైందని అనుకున్నా. చచ్చిపోవాలి అనుకున్న.
వాళ్ళు వెంటనే ఉండటం వల్ల చచ్చిపోవడం కుదరలేదు. పారిపోయే ప్రయత్నం చేసిన. వీలు కాలేదు. తర్వాత అన్నం పెట్టారు. కడుపారా తిన్నా. నా జీవితం పట్ల నాకే అసహ్యం వేసింది. నాకు అర్థం కాలేదు ఏం జరుగుతోందని.
నా వయస్సు అప్పుడు 16 సంవత్సరాలు. మర్నాడు పొద్దున్నే మా సేఠానీ వచ్చింది. అర్థం చేయించింది. మీ ఆయన నిన్ను మాకు అమ్మి 75000 తీసుకెళ్లిండు అని చెప్పింది. వాడికి నేనేం ద్రోహం చేశానని అనుకున్న. నేను వానికి ఏమైనా నష్టం చేశానా? ఎప్పుడైనా తిట్టానా? అని ఆలోచించిన. ఏడుస్తూనే ఉన్న. బక్కగైన.
మొహం పీక్కుపోయింది. అద్దంలో నా మొహం చూసుకని ఏడ్చిన. అమ్మ గుర్తుకు వచ్చింది. నాన్న గుర్తుకు వచ్చిండు. నా స్కూలు, దోస్తులు గుర్తుకు వచ్చారు. పక్కన కొంతమంది ఆడవాళ్లు వచ్చి మేము కూడా ఇక్కడికి నీలెక్కనే వచ్చినం. మనకు ఇదే జీవితం అంటూ బాధ పడ్డారు.
కన్నీళ్లు తుడిచారు. ఒకామె కోడిగుడ్డు పెట్టింది. టీ తాగించారు. ఒకామె బాధపడకు అని ఒళ్లోకి తీసుకుంది. వాళ్ళ జీవితాలు నాకు చెప్పారు. నన్ను వృత్తి లోకి దిగమన్నారు. రోజుల తరబడి చెప్పారు. మధ్యమధ్యలో వాళ్ళిద్దరూ వచ్చేది. కొట్టేటోళ్ళు. మా సేఠానీ గిచ్చేది.
తొడలు కమిలిపోయేవి. నాతోటి ఒకామె చెప్పేది… ఇక నువ్వు బైటకు పోలేవు. మన బతుకింతే. నాకూ ఉండబుద్ధి కాదు. కానీ, ఏం చేస్తాం…
మొగోళ్ళు చేసే ఎదవ పనులకు నాకు కూడా చచ్చిపోవాలనిపిస్తది. విరక్తి కలుగుతది, ఏం చెయ్యలేం. మనం పోతే మన అమ్మోళ్ళు మల్ల రానియ్యరు. మన బతుకులు ఇంతే….. నాకొక్కోసారి గలీజనిపించి మోంబత్తి కొరుకుత. సబ్బు కొరుక్కుతింట. లేకపోతే ఏదైనా కర్ర నోట్లో పెట్టుకుని కొరుకుత….
అట్లే బాధపడాలి తప్ప వేరే బతుకు లేదని చెప్పేది. అప్పుడు వాళ్ళను చూసి నాకూ బాధనిపించింది. సాయంత్రం నన్ను పట్టుకొచ్చిన వాళ్ళలో ఒకడు ఓ కొత్త మనిషిని తెచ్చాడు. పనైపోయినంక ఒక వంద రూపాయలు నాకోసమని ఇచ్చిండు.
నా జీవితం అలా ఈ గల్లీలో నాశనమైపోయింది. అవ్వే ఇండ్లు, అవ్వే గోడలు. అటు సూర్యుడు వచ్చినా ఈ ఇండ్లల్ల చీకటే ఉంటుంది. కిటికీలో నుండి అప్పుడప్పడు ఎండ చూస్తాం. పరదాల చాటున మా దరిద్రం ఉంటది. వీడు నా తమ్ముడు అని కొద్ది దూరంగా ఉన్న అబ్బాయిని చూపెట్టింది.
- ఈ విషయం మీ తమ్మునికి తెలుసా? అని అడిగాను.
ఈ విషయం అంటే ఈ విషయం అని తెలవదు. నేను ఏదో జాబ్ చేస్తున్నాను అనుకుంటాడు. అర్థం కాకుండా ఉండదు కదా! నెలకు ఒకసారి వచ్చి డబ్బులు తీసుకుపోతడు. అమ్మ నాన్న కూడా వచ్చి పోయిన్రు. నన్ను ఇంటికి రానియ్యరు. కానీ, నా బాధ్యతగా నేను పైసలు పంపుత. బతికినంత కాలం నా బతుకు ఇంతే!
ఇది ఒక ప్రియ జీవితం.
నేను మరువలేని జీవితాల్లో ఓ త్యాగధనురాలి వ్యథాభరిత జీవితం.
ఆమె ఎక్కడుందో,
ఆమెకు ఖరీదు కట్టిన వారెక్కడున్నారో!!!
సమయం దొరికింది….
మానవత్వం అనే వాట్సప్ పోస్ట్ చూసి నా గతం గుర్తుకు వచ్చింది.
మానవత్వం అంటే, ఆమె గతం విని వెళ్ళిపోయిన మాదా?
మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళిన మా కాలేజీదా?
వారిని తన ఛాయలోకి తీసుకోలేని సమాజానిదా?
మానవత్వం అంటే ఏంటో, దాని పరిధి ఏంటో ఇప్పటికీ అర్థం కాలేదు నాకు…..
- గిరిధర్ రావుల,
అడిషనల్ ఎస్పీ (ఆపరేషన్స్ అండ్ క్రైమ్స్),
మహబూబాబాద్ జిల్లా.
Share this Article