Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

K I L L …! యండమూరి విశ్లేషణ- సమీక్ష … భిన్నం – ఆసక్తికరం !

August 24, 2026 by M S R

.

KILL … ఈ సినిమా మీద సోషల్ మీడియాలో ప్రశంసలు కనిపిస్తున్నాయి… వాణిజ్యపరంగా పెద్దగా క్లిక్ అయినట్టు లేదు… ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది కదా, జనం చూస్తున్నారు, ట్రూ రివ్యూస్ కనిపిస్తున్నాయి… ప్రధానంగా ఆసక్తికరంగా, భిన్నంగా అనిపించింది ప్రముఖ రచయిత Veerendranath Yandamoori పోస్టు… ఇలా…

“కిల్” అనే యాక్షన్ సినిమా నుంచి- కొత్త దర్శకులు, కథా రచయితలు నేర్చుకోవలసిన విషయాల గురించి ఈ పోస్టు.
నేను థియేటర్ కి వెళ్లి పది సంవత్సరాలు పైగా అయింది. మరీ ప్రత్యేకత ఉంది అని ఎవరైనా చెప్తే, నెలకి ఒకటో రెండో, సెల్-ఫోన్ లోనే చూస్తాను. అటువంటి వాటిలో ఇటీవల జియో హాట్-స్టార్ లో “Kill” ఒకటి. చూస్తూన్న ప్రతి నిమిషమూ, ‘ఆర్ట్ డైరెక్టర్, దర్శకుడు. డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ ఎంత కష్టపడి ఉంటారా’ అనిపించి, వివరాలు సేకరించాను.

Ads

సినిమాలో దాదాపు 40కి పైగా దుండగులు కనపడతారు. 46 వరకూ killings ఉన్నాయి. విశేషం ఏమిటంటే ప్రతి killing ఒకేలా కాకుండా, వేరే movement లేదా వేరే weapon డిజైన్ చేశారు.
సినిమా అంతా పరుగెత్తుతున్న ట్రైన్‌లోనే జరిగినా, చూస్తున్న మనకు అది స్టూడియో సెట్ అన్న అనుమానమే రాదు; నిజంగా ఒక ట్రైన్‌లో కెమెరాలు పెట్టి తీసినట్టే ఉంటుంది. దీని కోసం వివిధ ట్రైన్ కంపార్ట్‌మెంట్లను ప్రత్యేకంగా సెట్‌గా నిర్మించారు. అవసరమైనప్పుడు తొలగించి కెమెరా పెట్టుకునే విధంగా గోడలను డిజైన్ చేశారు.

ముఖ్యంగా confined ట్రైన్ కంపార్ట్‌మెంట్, passage, berth మధ్య gap, toilet లాంటి చాలా చిన్న ఇరుకైన కంపార్ట్‌మెంట్లలో కెమెరా తిరిగిన తీరు, లైటింగ్, ఎడిటింగ్, శబ్దాలు, ఫైట్స్— అన్నీ అద్భుతం.
ట్రైన్ కంపార్ట్‌మెంట్ మాత్రమే కాదు, టాయిలెట్‌లాంటి కదలడానికి కూడా చోటులేని ప్రదేశంలో ఫైట్‌ను డిజైన్ చేసిన తీరు చూస్తే, యాక్షన్ టీమ్ ఎంత కష్టపడి పనిచేసిందో అర్థమవుతుంది. Action team మొత్తం చిత్ర ప్రారభానికి ముందు 4–6 నెలల preparation/ రిహార్సల్స్ చేశారు. ఇరుకు ప్రదేశాల్లో షూట్ కాబట్టి, ‘body doubles’ వాడటానికి కూడా పెద్దగా అవకాశం లేదు. ఒరిజినల్ నటులే movements నేర్చుకోవాల్సి వచ్చింది.

ఇది కేవలం violence ఉన్న సినిమా కాదు; fights కు కూడా choreography ఉన్న సినిమా. ఇక్కడో ముఖ్య విషయం. సినిమాల్లో డాన్సులకు కొరియోగ్రఫీ ఉన్నట్టే, ఫైట్లకూ ‘కొరియోగ్రఫీ’ ఉంటుంది. దానికీ ఒక లయ, ఒక విన్యాసం, ఒక ప్రత్యేకమైన ఫ్లో ఉండాలి. ఇటీవలి సినిమాల్లో అది కొంత తగ్గిపోయిందనిపిస్తుంది. ఒకే ఫైట్ మాస్టర్ వరుసగా చాలా సినిమాలు చేయాల్సి రావడం, కొత్తగా ఆలోచించడానికి సమయం లేకపోవడం, హీరోల వయసు, శరీర సామర్థ్యం, షూటింగ్ పరిమితులు- ఇవన్నీ కారణాలై ఉండొచ్చు.

kill

కానీ Killలో మాత్రం ప్రతి దెబ్బకు, ప్రతి కదలికకు ఒక ప్లాన్ కనిపిస్తుంది. దీనికి భారతీయ ఫైట్ యాక్షన్ టీముతో పాటూ, సౌత్ కొరియా యాక్షన్ కొరియోగ్రాఫర్ Se-yeong Oh పని చేసాడు. ఇతడు Snowpiercer వంటి అంతర్జాతీయ చిత్రాలు; War, Tiger 3 వంటి భారతీయ సినిమాలకు పని చేశాడు.

ఈ సినిమాలో యాక్షన్ అంత సహజంగా, ఒక ప్రత్యేకమైన “రిథమ్”తో కనిపించటం వెనుక చాల అసాధారణమైన ప్రిపరేషన్ ఉంది. సినిమాలో హీరో ‘లక్ష్య లల్వానీ’ NSG కమాండో. ‘మనేసర్‌’లోని NSG క్యాంప్‌కు వెళ్లి, కమాండోలు అసలు ఎలా నడుస్తారు, ఎలా మాట్లాడతారు, ప్రమాదంలో ఎలా స్పందిస్తారు అన్నది పరిశీలించాడు. ఒక్కరోజు కూడా మిస్ కాకుండా మార్షల్ ఆర్ట్స్, ఫైట్ కొరియోగ్రఫీ రోజూ సుమారు 4–5 గంటలు, దాదాపు 8 నెలలు ట్రైనింగ్ తీసుకున్నాడు. అందుకే అతని ఫైటింగ్‌లో “హీరోయిక్ డాన్స్ మూవ్స్” కన్నా ఒక trained soldier efficiency కనిపిస్తుంది.

ఇవన్నీ Kill సినిమా ప్రత్యేకతలు. ఆగండి. ఇది ‘కిల్’ సినిమా / హాట్-స్టార్ ప్రాపగాండా పోస్టు కాదు, కొత్త దర్శకుల కోసం.
ఇంత శ్రమ, ఇంత నైపుణ్యం, ఇంత మంచి యాక్షన్ ఉన్న సినిమా విజయం సాధించిందా? ఫెయిల్ అయిందా? అన్న సందేహం అక్కడే మొదలైంది. సినిమా పూర్తి అయ్యేసరికి, స్క్రీన్ ప్లే రైటర్, దర్శకుల వైఫల్యం కొట్టొచ్చినట్టు కనబడింది. నా అనుమానం తప్పేమో అని బాక్సాఫీస్ రికార్డులు పరిశీలిస్తే కరెక్టే అని తెలిసింది. 40 కోట్లతో తీసిన ఈ సినిమా దాదాపు అంతే కలెక్ట్ చేసింది.

ఇంత కష్టపడి, ఇంత నైపుణ్యంతో తీసిన సినిమా ఎందుకు ఇంకా పెద్ద స్థాయిలో ఆర్థిక విజయాన్ని సాధించలేకపోయింది?
అక్కడి నుంచే స్క్రీన్‌ప్లే కోణంలో ఆలోచించడం మొదలుపెట్టాను. ఆ సినిమాను చూసిన కొందరితో కూడా మాట్లాడాను.

ప్రేక్షకుడికి ఈ సినిమాలోని మనుషులతో పూర్తి అనుబంధం ఏర్పడదు. నేను దానికి belongingness అనే మాట వాడతాను. తెరమీద ఉన్నవాళ్లు మనవాళ్లలా అనిపించాలి. వాళ్లకు ప్రమాదం వస్తే మనం కంగారుపడాలి. వాళ్లు చనిపోతే మనకు బాధ కలగాలి. ఈ సినిమాలో హీరో తన ప్రేయసిని ప్రేమిస్తున్నాడని మనకు తెలుసు. కానీ ప్రేక్షకుడు కూడా ఆమెను ప్రేమించేంత సమయం కథ ఇవ్వదు. ఆమె చనిపోయినప్పుడు హీరో చాలా బాధపడతాడు. మనం మాత్రం హీరో బాధపడుతున్నాడని చూస్తాం తప్ప, అతని బాధ మన బాధగా మారదు.

ఇంకా చాలామంది ప్రయాణికులు చనిపోతారు. కానీ వాళ్లలో మనకు బాగా పరిచయమైన వాళ్లు ఎంతమంది? అందువల్ల ఒక దశ తర్వాత మరణాలు కూడా మనసును కదిలించడం తగ్గిపోతుంది. సినిమాలో ఫైట్స్ పెరుగుతాయి; కానీ భావోద్వేగం అదే వేగంతో పెరగదు.

  • [ఇక్కడ నాకు నా తులసీదళం గుర్తొస్తుంది. చాలామంది దాన్ని హారర్, చేతబడి, అతీంద్రియ అంశాలున్న నవలగా గుర్తుంచుకుంటారు. కానీ కథను ముందుకు నడిపించిన ముఖ్యమైన అంశాల్లో తులసి అన్న చిన్న పాపతో అన్ని పాత్రలకే ఉన్న అనుబంధంతో… పాఠకులకు కూడా ఆమెపై ప్రేమ ఏర్పడుతుంది. పాఠకుడు భయంతో పాటు ఆ పిల్లపై ఆందోళనతో కూడా కథలో ఉండిపోయాడు. ఇదే అనుబంధం కథకు బలం ఇస్తుంది. ఆ నవలలో కథ గొప్పది కాదు. స్క్రీన్-ప్లే గొప్పది. అది మిస్ అవటం వలన, దాదాపు అదే థీమ్ తో వ్రాసిన ‘ప్రార్ధన, అంకితం’ లాంటి పర్పస్ ఉన్న రచనలు అంతగా ఆకట్టుకోలేక పోయాయి.]

కిల్- సినిమాలో మరో విషయం నన్ను ఆశ్చర్యపరిచింది. ట్రైన్ నిండా ప్రయాణికులు ఉన్నారు. హీరో ఒక్కడే మొదట నుంచి పోరాడుతుంటాడు. కొందరు మహిళలు ధైర్యం చేసి సహాయం చేయడానికి చాలా ఆలస్యంగా వస్తారు. మరి అక్కడున్న మగవాళ్లు? వాళ్లలో ఒక్కరైనా తలుపు మూయలేరా? వెనక నుంచి ఒక విలన్‌ని పట్టుకోలేరా? హీరోకి ఒక వస్తువు అందించలేరా? ఒక చిన్న ప్లాన్ చేయలేరా? యాభై మంది ప్రయాణికులు ఉంటే యాభై రకాల భయాలు, ప్రయత్నాలు, ప్రతిస్పందనలు ఉండాలి. కానీ చాలామంది ప్రయాణికులు కథలో పాత్రలుగా కాకుండా, జరుగుతున్న ఫైట్స్ చూస్తున్న మనుషుల్లా మిగిలిపోతారు.

ఇక్కడ నాకు Extraction గుర్తొచ్చింది. క్రిస్ హేమ్స్‌వర్త్ నటించిన ఆ సినిమాలో ఒక భారతీయ మాఫియా నాయకుడి కొడుకును బంగ్లాదేశ్‌లోని ఢాకా నుంచి రక్షించి తీసుకురావడానికి హీరో వెళ్తాడు. ఇంగ్లీష్ సినిమా కథను బంగ్లాదేశ్‌లో నడపడం కూడా ఒక ప్రత్యేకత. అక్కడ కూడా ఫైట్స్ విపరీతంగా ఉంటాయి. షూటింగ్స్, చేజింగ్స్, గన్‌ఫైట్స్, బ్రిడ్జి మీద క్లైమాక్స్— యాక్షన్ పరంగా ఏమాత్రం తక్కువ కాదు. కానీ మొత్తం సినిమా అంతా ప్రేక్షకుడి మనసులో ఒకే లక్ష్యం ఉంటుంది: “ఆ పిల్లవాడిని ఎలాగైనా కాపాడాలి.”

ఆ సినిమాలో అదే పెద్ద తేడా. హీరో ఎంతమందిని చంపాడన్నది మనకు రెండో విషయం. ఆ కుర్రవాడిని సురక్షితంగా బయటకు తీసుకెళ్లగలడా అన్నదే మొదటి విషయం. అందుకే చివర్లో హీరో ప్రమాదంలో పడినప్పుడు మనం ఫైట్‌ని మాత్రమే చూడం. అతని మిషన్ పూర్తవుతుందా అని చూస్తాం.

Killలో మాత్రం ఒక దశ తర్వాత rescue అనే లక్ష్యం తగ్గిపోయి revenge ప్రధానంగా మారుతుంది. హీరోయిన్ చనిపోగానే హీరో రాక్షసుడై విలన్స్ మీద విజృంభిస్తాడు. అయినా ఇక్కడ “ఎవరిని కాపాడతాడు?” అన్న ప్రశ్నకంటే “ఎవరిని ఎలా చంపుతాడు?” అన్నదే మిగులుతుంది. ఎంత గొప్ప action choreography అయినా భావోద్వేగ లక్ష్యం లేకపోతే ప్రేక్షకుడు కొంత దూరం నుంచి చూస్తాడు. మొదట్లో అద్భుతంగా అనిపించిన ఫైట్, ఇంకొంతసేపటికి మరో ఫైట్‌గా మారుతుంది.

Air Force Oneలో అమెరికా అధ్యక్షుడిని మాత్రమే కాదు, అతని కుటుంబాన్ని కూడా ప్రేక్షకుడు కాపాడాలని కోరుకుంటాడు. హిందీలో Baaghi లాంటి సినిమాల్లో కూడా హీరో ఎందుకు కొడుతున్నాడో ప్రేక్షకుడికి స్పష్టంగా ఉంటుంది. ఎవరో ఒకరిని రక్షించాలి, ఒక నిర్దిష్ట గమ్యం చేరాలి. అందువల్ల ఫైట్ తర్వాత ఫైట్ వచ్చినా అవి ఒక లక్ష్యానికి మెట్లు అవుతాయి. లక్ష్యం లేకుండా వరుస ఫైట్స్ వస్తే అవి కేవలం ప్రదర్శనగా మిగిలిపోతాయి.

ఇంకో ముఖ్యమైన విషయం- హీరో తెలివి. Killలో హీరోకి బలం ఉంది, ధైర్యం ఉంది, శిక్షణ ఉంది. కానీ అతని తెలివి మనల్ని ఆశ్చర్యపరిచే సందర్భాలు తక్కువ. Die Hard, Under Siege మొదలైన సినిమాలలో హీరో కేవలం బలంతో పోరాడడు. హోటల్ లో ఎక్కడ దాగాలి, ఏ సిస్టమ్ ఆపాలి, ఏ వస్తువును ఉపయోగించాలి, విలన్‌ను ఎలా మోసం చేయాలి— అన్నీ ఆలోచిస్తాడు. రెండో సినిమాలో… తనకు తెలిసిన షిప్‌ (ఓడ)ను ఆయుధంగా వాడుకుంటాడు.

అందుకే ప్రేక్షకుడు “ఇంకెవరిని కొడతాడు?” అని కాకుండా, “ఇప్పుడు ఏం చేస్తాడు?” అని ఎదురుచూస్తాడు.
అక్కడే స్క్రీన్‌ప్లే రచయిత పని మొదలవుతుంది. ఉదాహరణకు, మొదట ఒక ప్రయాణికుడికి ఒక చెయ్యి పనిచేయదని చూపించామనుకోండి. సినిమా మొత్తం అతన్ని అసహాయుడిగానే భావిస్తాం. క్లైమాక్స్‌లో హీరో నేలపై పడిపోయి, విలన్ అతన్ని చంపబోతున్నప్పుడు, అదే వ్యక్తి తనకు పనిచేసే మరో చేతితో ఒక్క చిన్న పని చేసి హీరోని రక్షిస్తాడు. అది పెద్ద ఫైట్ కాదు. కానీ థియేటర్‌లో చప్పట్లు వస్తాయి. ఎందుకంటే మొదట చూపించిన చిన్న విషయం చివర్లో ఉపయోగపడింది. దాన్నే planting and payoff అంటాం.

ఇలా ప్రయాణికుల్లో ఒకరికి రైల్వే ఎలక్ట్రికల్ సిస్టమ్ తెలిసి ఉండవచ్చు. ఒక వృద్ధుడు మొదట నుంచి భయపడుతూ ఉండి, చివర్లో ఒక్క ధైర్యమైన పని చేయవచ్చు. ఒక చిన్న పిల్లవాడు ముందుగా చూసిన విషయాన్ని హీరోకి చెప్పి ప్రమాదం నుంచి కాపాడవచ్చు. ఇలా చేస్తే హీరో ఒక్కడే పోరాడటం కాదు; మొత్తం ట్రైన్ కథలో పాల్గొంటుంది. అప్పుడు ప్రేక్షకుడు కూడా వాళ్లతో కలిసి ప్రయాణిస్తాడు.

స్క్రీన్ ప్లే రచయిత పని- లాజిక్‌కి సమాధానం చెప్పడం మాత్రమే కాదు. ఆ సమాధానాన్నే డ్రామాగా మార్చడం. జామర్ పెట్టారని సినిమాలో చూపించారు — ఆ పాయింట్ సరైనదే. కానీ అది ప్రేక్షకుడి మనసులో డ్రామాగా స్థిరపడలేదు అనిపించింది. ఉదాహరణకు, ట్రైన్ బయల్దేరే ముందు ఓ యువతి తల్లికి ఫోన్ చేసి, “నాన్న ఆపరేషన్ ఎలా జరిగిందో ప్రతి గంటకోసారి చెబుతూ ఉండు” అంటుంది.

తర్వాత జామర్ వల్ల ఫోన్ కలవక, ఆమె పదేపదే ప్రయత్నిస్తూ కంగారు పడితే — అదే విషయం ప్రేక్షకుడికి మరింత గాఢంగా తగులుతుంది.
సినిమాలో ఒక కారణం చెప్పడం మాత్రమే కాదు; ఆ కారణం వల్ల కలిగే ఆందోళనను చూపిస్తేనే డ్రామా బలపడుతుంది.
రాఘవేంద్రరావు గారు, కోదండరామిరెడ్డి మానుంచి అదే రాబట్టుకునే వారు.

అందుకే కొత్తగా కథలు రాసేవాళ్లు, సినిమాలు తీయాలనుకునే యువ దర్శకులు కొన్ని ప్రశ్నలు తమను తాము అడిగితే మంచిది. హీరో బలవంతుడా అన్నది మాత్రమే కాదు- తెలివైనవాడా? హీరోయిన్ అందంగా ఉందా అన్నది కాదు— ఆమెకు ఏదైనా జరిగితే ప్రేక్షకుడికి బాధ కలుగుతుందా? విలన్ క్రూరుడా అన్నది కాదు— ప్రేక్షకుడు నిజంగా అతన్ని భయపడుతున్నాడా? ఫైట్ అద్భుతంగా ఉందా అన్నది కాదు— ఆ ఫైట్ జరగాల్సిన అవసరం కథలో ఉందా? క్లైమాక్స్ భారీగా ఉందా అన్నది కాదు— మొదట వేసిన చిన్న విత్తనం చివర్లో మొలిచిందా?

Kill నాకు చాలా నచ్చిన సినిమా. దాని యాక్షన్‌ను ఏమాత్రం తక్కువ చేసి చెప్పలే౦. నిజానికి అలాంటి ఫైట్స్ రూపొందించడం చాలా కష్టం. అందుకే ఈ సినిమా కొత్త రచయితలకు మంచి పాఠం కూడా. గొప్ప ఫైట్స్ ఒక సినిమాను excitingగా చేయగలవు. కానీ పాత్రలతో అనుబంధం, హీరో తెలివి, screenplay payoffs దాన్ని unforgettableగా చేస్తాయి.

చివరికి ప్రేక్షకుడు “హీరో గెలుస్తాడా?” అని చూస్తూ కూర్చుంటే అది మంచి సినిమా కావచ్చు. కానీ “అయ్యో… ఎలాగైనా వీడు గెలవాలి!” అని ప్రేక్షకుడి మనసు కోరుకుంటే —
అక్కడే… మంచి సినిమా గొప్ప సినిమాగా మారుతుంది.

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • తెగ బలిసిన కార్లు పైకి ఎక్కేస్తాయి – మనమే పైలంగా ఉండాలె !!
  • K I L L …! యండమూరి విశ్లేషణ- సమీక్ష … భిన్నం – ఆసక్తికరం !
  • ఎలపరం ! కాలేజీ ప్రాంగణాలు ఇక సినిమా ఫంక్షన్లకు అద్దె వేదికలు !!
  • ప్రతి మెహిందీ కథా ఇంతే ! వెలుతురు ఎరుగని చీకటి తడి అంగడి !
  • నిజం- ఓటీటీ భ్రమలు బద్ధలయ్యాకే… తెలుగు సినిమా బతుకుతోంది !
  • సంక్షోభమూ ఓ అవకాశమే ! రేవంత్ రెడ్డి వాడుకోగలిగితే భలే చాన్స్ !!
  • Save Vijayawada – ముందు బెజవాడను బతికించండి, తరువాతే మెట్రో !!
  • ఇస్రో ఇకపై రాకెట్లు తయారుచేయదట… మరి ఏం చేస్తుంది ? 
  • నిజం ఏదో చెప్పాల్సిన మీడియానే… నిజం కోసం వెతకాల్సి వస్తే ?
  • ఆరబోత – వాన పాట – అదీ ఓ కుర్ర హీరో … అప్పట్లో సౌందర్య సైతం !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions